శ్రీమద్రామాయణం - సుందర కాండము - తొమ్మిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 9)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

తొమ్మిదవ సర్గ

హనుమంతుడు రావణుని భవనమును, అందులో ఉన్న పుష్పక విమానమును చూచిన తరువాత, అసలు ఈ భవనము పొడుగు ఎంత, వెడల్పు ఎంత, వైశాల్యము ఎంత, ఇంత పెద్ద భవనమును ఎలా నిర్మించారు అన్న విషయం కనుక్కోడానికి ప్రయత్నం చేసాడు. రావణుని భవనము ఒక యోజనము పొడుగు, (ఎనిమిది మైళ్లు,) అందులో సగం (నాలుగు మైళ్లు) వెడల్పు ఉన్న స్థలంలో నిర్మించబడి ఉంది. అంత పెద్ద స్థలములో నిర్మించబడ్డ ఆ భవనమును సుశిక్షితులైన రాక్షస సైనికులు అనుక్షణం అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు.

రావణాసురుని భవనం అంతా రావణుని భార్యలతోనూ, రావణుడు వివిధ దేశాధిపతులను, రాజులను, జయించి వారి వద్దనుండి బలాత్కారంగా తీసుకురాబడిన స్త్రీలతోనూ, మునులను చంపి వారి వద్దనుండి బలాత్కారంగా తీసుకురాబడిన కన్యలతోనూ నిండి ఉంది. 

అందులో ఉన్న పుష్పక విమానము రావణునిది కాదు. దానిని పూర్వము విశ్వకర్మ బ్రహ్మదేవుని కోసరం స్వర్గంలో నిర్మించాడు. కుబేరుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి ఆ విమానమును బ్రహ్మ వద్దనుండి పొందాడు. కుబేరుని సోదరుడు రావణుడు. రావణుడు కుబేరుని జయించి లంకా నగరాన్ని, దానితో పాటు పుష్పక విమానాన్ని బలవంతంగా తన సొంతం చేసుకున్నాడు.
హనుమంతుడు ఆ పుష్పక విమానము మీదికి ఎక్కాడు. ఆ విమానములో ఉన్న వంటశాలల నుండి ఆహారపదార్ధాల ఘుమ ఘుమలు హనుమంతుని నాసికా పుటాలకు సోకుతున్నాయి. “రా, రా, ఇక్కడకు రా, మమ్ములను ఆరగించు" అని పిలుస్తున్నాయా అన్నట్టు ఆ ఘుమఘుమలు విమానం అంతటా వ్యాపించి ఉన్నాయి.

హనుమంతుడు ఆ విమానంలోకి ప్రవేశించాడు. వెండి బంగారములతో నిర్మించి మణులు, రత్నములు పొదిగిన స్తంభములు కల ఒక విశాలమైన ప్రాంగణమును చూచాడు. అది ఒక చిత్రశాల. ఆ శాలలో నేల కనపడకుండా రత్నములతో కూడిన కంబళి పరిచి ఉంది. ఆ శాలలో రావణుడు సురలోక భోగములు అనుభవిస్తున్నాడు. ఆ శాలను చూస్తుంటేనే మనసుకు ఆహ్లాదం కలుగుతూ ఉంది.

“ఇది స్వర్గలోకమా లేక దేవతల నివాసమా" అని ఆశ్చర్యపోయాడు హనుమంతుడు. అక్కడ వెలుగుతున్న దీపస్తంభములు కూడా బంగారముతో చేయబడి మణులు పొదగబడి ఉండటం
గమనించాడు హనుమంతుడు.

ఆ శాలలో ఎంతో మంది ఉత్తమ స్త్రీలు రకరకాలైన రంగు రంగుల దుస్తులు ధరించి రత్నకంబళముల మీద పడుకొని ఉండటం చూచాడు హనుమంతుడు. వారంతా దాదాపు వేయి మంది ఉన్నారు. వారు రాత్రి అంతా రావణునితో కామక్రీడలు జరిపి, కామభోగములలో తేలియాడి, అలసి, సొలసి ఒళ్లు తెలియ కుండా నిద్రపోతున్నారు. వాళ్లంతా కళ్లుమూసుకొని గాఢనిద్రలో ఉన్నారు. ఆ స్త్రీల మధ్య పడుకొని ఉన్న రావణుడు తారల మధ్య ఉన్న చంద్రుడిలా వెలిగిపోతున్నాడు.

“ఈ స్త్రీల ముఖములను పద్మములని భ్రమసి తుమ్మెదలు మకరందము కొరకు రావు కదా!" అని అనుకొన్నాడు హనుమంతుడు. ఆ స్త్రీలందరూ రాత్రంతా రావణుని తో కూడి మద్యము సేవించి, రతిక్రీడలు సలిపినందున వారు ధరించిన హారములు అన్నీ చెల్లాచెదరు అయ్యాయి. కొంత మంది స్త్రీలకు నుదుటి మీద ఉన్న తిలకము చెదిరిపోయింది. ఆ దృశ్యము ఒక పూలవనములో ఒక మదించిన ఏనుగు ప్రవేశించి ఆ వనమును చెల్లాచెదరు చేసినట్టు ఉంది.

కొందరి శరీరము మీద వస్త్రములు తొలగిపోయాయి. హారములు చెదిరిపోయాయి. వడ్డాణములు ఊడిపోయాయి. ఆ స్త్రీల ఉచ్వాస నిశ్వాసములకు వారు ధరించిన వస్త్రములు, కుండలములు, ఊగుతున్నాయి. గాఢనిద్రలో ఉన్న కొందరు స్త్రీలు, పక్కనున్న స్త్రీలను రావణుడు అని కౌగలించుకుని ముద్దులు పెట్టుకుంటున్నారు. ఆ స్త్రీలు కూడా రావణుడే తమను ముద్దులాడుచున్నదని భ్రమించి, వారు కూడా ప్రతిగా పక్కన ఉన్న స్త్రీలకు ముద్దులు అందిస్తున్నారు. 

అందరికీ సరి అయినా తలగడలు లేకపోవడంతో పక్కనున్న వారి చేతులను తలగడలుగా చేసుకుని నిద్రిస్తున్నారు. మరి కొందరు పక్కన ఉన్న వారి వక్షస్థలమునే తలగడలుగా చేసుకుని నిద్రిస్తున్నారు. మరి కొందరు పక్కనున్న స్త్రీల తొడలను తలగడలుగా చేసుకుని నిద్రిస్తున్నారు. అలా ఒకరి మీద ఒకరు పడిపోయి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారు ఆ స్త్రీలు. ఎవరి చేతులు ఎక్కడ ఉన్నాయో, ఎవరి భుజాలు ఎక్కడ ఉన్నాయో, ఎవరి కాళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు. రావణుడు మేల్కొని ఉండగా కన్నెత్తి కూడా చూడలేని ఆ స్త్రీల వంక కన్నార్పకుండా చేస్తున్నాయా అన్నట్టు ఆ విశాల ప్రాంగణం లో దీపాలు నిశ్చలంగా వెలుగుతున్నాయి. 

ఆ స్త్రీలలో రాజర్షులకు చెందిన వారు, పితృ దేవతలకు చెందిన వారు, దైత్యులకు చెందిన వారు, గాంధర్వ స్త్రీలు, రాక్షస స్త్రీలు ఉన్నారు. రావణుని మోహావేశానికి వశులయి ఆయనతో కామక్రీడలు సలిపారు. రావణుడు ఎందరో రాజులను జయించి తెచ్చిన స్త్రీలలో, కామానికి వశులయిన స్త్రీలు మాత్రమే రావణుని పక్కలో చేరారు. తమ తమ భర్తలను దైవంగా భావించిన స్త్రీ ఒక్కత్తె కూడా అక్కడ లేదు. కులీనయైన ఒక్క స్త్రీ కూడా అక్కడ లేదు. రావణుని చేత బలవంతంగా 
ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా తేబడిన ఒక్క స్త్రీ కూడా అక్కడ లేదు. అందుకే సీత అక్కడ లేదు అని అనుకున్నాడు హనుమంతుడు.

కాని రావణుని ఇష్టపడి వివాహము చేసుకున్న వారందరూ మంచి కులములో పుట్టి, సకల సద్గుణములతో ప్రకాశించేవారే! వారందరినీ చూచి హనుమంతునికి తన సహజమైన చపల స్వభావంతో ఒక అనుమానం క్షణం సేపు అతని మనస్సులో పొడసూపింది.

“వీరందరూ సీత వలె ఉత్తమ జాతి స్త్రీలే. మరి ఇంతమంది ఉత్తమ జాతి స్త్రీలు రావణుని ఐశ్వర్యమునకు బలమునకు పరాక్రమమునకు మోహమునకు లోబడి వశులైనపుడు, సీత కూడా వీరి మాదిరి రావణునికి వశమై ఉండవచ్చును కదా! ఒకవేళ అలా జరిగితే రావణుడు అంత అదృష్టవంతుడు ఉండబోడు. ఒక వేళ అదే జరిగితే, రావణుడు చాలా తప్పుచేసాడు. సరిదిద్దుకోలేని తప్పు చేసాడు. వీడికి రాముని చేతిలో చావు తప్పదు." అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసాడు హనుమంతుడు.

శ్రీమద్రామాయణము
సుందర కాండము తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)