శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఏడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 7)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
ఏడవ సర్గ
రావణుని అంత:పురములోని ప్రాసాదములు అన్నీ ఒకటి వెంబడి ఒకటిగా గాలిస్తున్నాడు హనుమంతుడు. ఆ గృహము లన్నీ ధన, ధాన్యములతో నిండి ఉన్నాయి. ఆ గృహ నిర్మాణంలో ఏ మాత్రం దోషం లేకుండా నిర్మించబడి ఉన్నాయి. సాక్షాత్తు మయుడే ఆ గృహాలు నిర్మించాడా అన్నట్టు ఉన్నాయి ఆ గృహములు. అన్నిటి లోకీ రావణుడు నివసించే గృహము అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంది.ఆ రావణుని అంత:పురము లోనే ఒక విమానమును చూచాడు హనుమంతుడు. దాని పేరు పుష్పకము. ఈ విమానము ఆకాశం నుండి భూమి మీదికి జారిపడిన స్వర్గధామం లాగా ఉంది. ఆ విమానము భూమి మీద నిలబడ కుండా గాలిలో తేలుతున్నట్టు ఉంది. ఆ పుష్పక విమానంలో భవనాలు నిర్మింపబడి ఉన్నాయి. సరస్సులు ఉన్నాయి. ఉద్యాన వనములు ఉన్నాయి. ఆ పుష్పక విమానాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు హనుమంతుడు. ఆ విమానాన్ని బంగారము తోనూ మణులు, మరకతములు, వైడూర్యములతోనూ అలంకరించారు. ఆ విమానము రెక్కలను కూడా పగడములు, బంగారు పుష్పములతో అలంకరించారు. ఆ విమానములో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించారు. చేతిలో పద్మములను ధరించి, పద్మములు ఉన్న సరస్సులో పద్మము మీద కూర్చుని ఉన్న లక్ష్మీదేవి అత్యంత మనోహరంగా ఉంది.
పర్వతము మాదిరి నిలబడి ఉన్న ఆ విమానమును ఆసక్తితో చూచాడు హనుమంతుడు. ఆ విమానంలో కూడా సీత కోసరం వెదుకుతున్నాడు. కాని సీత ఎక్కడా కనపడలేదు. హనుమంతుడు నిరాశ చెందాడు. అయినా వెదుకుతూనే ఉన్నాడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment