శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఆరవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 6)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
ఆరవ సర్గ
సీత కోసరం లంకా నగరంలో వెదికి వెదికి విసిగిపోయి దుఃఖిస్తున్న హనుమంతుడు, ఈ సారి రావణుని అంతఃపురంలో వెదకాలని అనుకున్నాడు. రావణుని గృహం దగ్గరకు వచ్చాడు. రావణుని భవనానికి కాపలా చాలా కట్టుదిట్టంగా ఉంది. రావణుని భవనమునకు అమర్చిన ముఖద్వారము బంగారముతో చేయబడి ఉంది. ఆ భవనములో ఉన్న సింహాసనములు, వస్తువులు బంగారంతో తయారు చేయబడి, రత్నాలు, మణులు పొదగబడి ఉన్నాయి. బంగారు ఆభరణములతో అలంకరింపబడిన రథములు అక్కడక్కడా నిలిచి ఉన్నాయి. రావణ భవనంలో అనేక రకములైన మృగములు, పక్షులు సంచరిస్తున్నాయి. రావణుని భవనము నిండా ఉత్తమ జాతి స్త్రీలు అక్కడక్కడా అటు ఇటు తిరుగుతున్నారు. రావణుని భవనము నిండా రాజ లాంఛనములు అయిన ఛత్రములు, చామరములు కనపడు తున్నాయి. భవనమంతా అగరు, చందనముల సువాసనలతో గుబాళిస్తూ ఉంది.ఒక పక్క భేరీ మృదంగ నాదములు వినిపిస్తుంటే, మరొక పక్క శివార్చనలు, హోమములు జరుగుతున్నాయి. రావణుని భవనమంతా పరిశీలనగా చూస్తున్నాడు హనుమంతుడు. హనుమంతుడు రావణుని భవనములో ఒక గృహము నుండి మరొక గృహమునకు తిరుగుతూ సీత కోసరం వెతుకుతున్నాడు. తరువాత ప్రముఖుల భవనముల వద్దకు వచ్చాడు హనుమంతుడు.
ముందుగా ప్రహస్తుని గృహమును చూచాడు. అక్కడి నుండి మహాపార్శ్వుని గృహము మీదికి దుమికాడు. తరువాత కుంభకర్ణుని గృహము, అక్కడి నుండి విభీషణుని గృహము పరిశీలించాడు. ఎక్కడా సీత కనిపించలేదు. తరువాత హనుమంతుడు వరుసగా మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజ్జిహ్వుడు, విద్యున్మాలి, వజ్రదంష్ట్రుడు, అనే రాక్షస వీరుల భవనముల మీదికి దూకి వారి భవనములను కూడా వెదికాడు. శుకుడు, సారణుడు, ఇంద్రజిత్తు గృహములు కూడా వెదికాడు. అంతటితో ఆగకుండా జంబుమాలి, సుమాలి, రశ్మికేతువు, సూర్యకేతువు, వజ్రకాయుడు, అనే రాక్షస వీరుల గృహములను కూడా గాలించాడు. ఎక్కడా సీత కనపడలేదు.
ప్రముఖుల గృహములు అయిన తరువాత, రెండవ శ్రేణి రాక్షసులు అయిన ధూమ్రాక్షుడు, సంపాతి, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు, శుకనాసుడు, వక్రుడు, శఠుడు, వికటుడు, బ్రహ్మకర్ణుడు, దంష్ట్రుడు, రోమశుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహ్వుడు, ఇంద్రజిహ్వుడు, హస్తిముఖుడు, కరాళుడు, శోణితాక్షుడు మొదలగు రాక్షసుల గృహములను కూడా క్షుణ్ణంగా వెదికాడు. హనుమంతుడికి వారి వారి ఐశ్వర్యములు, వైభవములు కనపడ్డాయి గానీ, సీత మాత్రం కనిపించలేదు.
ఆఖరున రావణుడు నివసించే గృహము చేరుకున్నాడు. ఆసమయంలో రావణుడు నిద్రపోతున్నాడు. రావణునికి రక్షణగా భయంకరాకారము కల రాక్షస స్త్రీలు ఆయుధ ధారులై కాపలా కాస్తున్నారు. రావణుని భవనము చాలా విశాలంగా ఉంది. రావణుని భవనములోనే దాదాపు వెయ్యి వాహినుల సైనిక సమూహములు ఉ న్నాయి. గుర్రాలు ఉన్నాయి. ఏనుగులు ఉన్నాయి.
రావణుని గృహములో రకరకాల పల్లకీలు, విహార గృహములు, లతా గృహములు, క్రీడా గృహములు, చిత్రశాలలు ఉన్నాయి. అనేక పడక గదులు ఉన్నాయి. ఆ గదులలో ఉన్న ఆసనములు, మంచములు అన్నీ బంగారముతో చేయబడి రత్నములు, మణులు పొదగబడి ఉన్నాయి. మణులు, రత్నములు పొదగబడిన పాత్రలలో వివిధము లైన మధుర పానీయములు సిద్ధంగా ఉన్నాయి. రావణుని భవనములో వందలకొద్దీ స్త్రీలు ఉన్నారు. రావణ భవనము అంతర్భాగము లోనే ఎన్నో ప్రాసాదములు ఉన్నాయి. వాటితో వేరు వేరు శాలలు, గదులు ఉన్నాయి. ఆ భవన నిర్మాణ శైలికి ఆశ్చర్యపోయాడు హనుమంతుడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము ఆరవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment