శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ముప్పదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 30)
శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము ముప్పదవ సర్గ రాముడు సీతను వనములకు రావద్దని ఎన్నో విధాలా నచ్చచెప్పబోయాడు. కాని సీత వినలేదు. పైగా సీతకు కోపం వచ్చింది. అప్పటి దాకా నయానా భయానా చెప్పింది. ఆఖరుకు చస్తానని బెదిరించింది. అయినా కాని రాముడు వినలేదు. ఇంక పతి భక్తి పక్కన బెట్టి రాముని దూషించడం మొదలు పెట్టింది. “రామా! నీవు అసలు మగాడివేనా! కాదు. నీవు పురుష రూపంలో ఉన్న స్త్రీవి. పురుష రూపంలో ఉన్న ఒక స్త్రీ ని నా తండ్రి జనక మహారాజు కోరి కోరి అల్లుడుగా ఎలా చేసుకున్నాడో తెలియడం లేదు.” కాని అంతలోనే సర్దుకుంది. “నాధా! నాకు ఒక సందేహము. సూర్యునిలో తేజస్సు లేదు అని అన్నా ఈ లోకం ఒప్పుకుంటుందేమో గానీ, రామునిలో పరాక్రమము లేదు అంటే ఒప్పుకోదు కదా. ఎందుకంటే అది తిరుగులేని సత్యం కాబట్టి. అలాంటి పరాక్రమ వంతుడివి. నన్ను అడవులకు తీసుకొనివెళ్లడానికి ఎందుకు భయపడుతున్నావు? దానికి ఏమైనా బలమైన కారణం ఉందా! ఉంటే అదేమిటి? కట్టుకున్న భార్యను ఒంటరిగా వదిలి అడవులకు వెళ్లడానికి కారణమేమి? భయమా! లేక పరాక్రమము లేకనా! నీ భయమునకు కారణమేమి? మీరు సావిత్రీ సత్యవంతుల కథ వినలేదా! సావిత్రి భర్తను అనుసరించి యమలోకమునకు కూడా వెళ్లింది. న...