శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ముప్పదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 30)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ముప్పదవ సర్గ
రాముడు సీతను వనములకు రావద్దని ఎన్నో విధాలా నచ్చచెప్పబోయాడు. కాని సీత వినలేదు. పైగా సీతకు కోపం వచ్చింది. అప్పటి దాకా నయానా భయానా చెప్పింది. ఆఖరుకు చస్తానని బెదిరించింది. అయినా కాని రాముడు వినలేదు. ఇంక పతి భక్తి పక్కన బెట్టి రాముని దూషించడం మొదలు పెట్టింది.“రామా! నీవు అసలు మగాడివేనా! కాదు. నీవు పురుష రూపంలో ఉన్న స్త్రీవి. పురుష రూపంలో ఉన్న ఒక స్త్రీ ని నా తండ్రి జనక మహారాజు కోరి కోరి అల్లుడుగా ఎలా చేసుకున్నాడో తెలియడం లేదు.” కాని అంతలోనే సర్దుకుంది.
“నాధా! నాకు ఒక సందేహము. సూర్యునిలో తేజస్సు లేదు అని అన్నా ఈ లోకం ఒప్పుకుంటుందేమో గానీ, రామునిలో పరాక్రమము లేదు అంటే ఒప్పుకోదు కదా. ఎందుకంటే అది తిరుగులేని సత్యం కాబట్టి. అలాంటి పరాక్రమ వంతుడివి. నన్ను అడవులకు తీసుకొనివెళ్లడానికి ఎందుకు భయపడుతున్నావు? దానికి ఏమైనా బలమైన కారణం ఉందా! ఉంటే అదేమిటి? కట్టుకున్న భార్యను ఒంటరిగా వదిలి అడవులకు వెళ్లడానికి కారణమేమి? భయమా! లేక పరాక్రమము లేకనా! నీ భయమునకు కారణమేమి?
మీరు సావిత్రీ సత్యవంతుల కథ వినలేదా! సావిత్రి భర్తను అనుసరించి యమలోకమునకు కూడా వెళ్లింది. నేను కేవలం అడవులకు మాత్రం వస్తాను అంటున్నాను. అంతే కదా!
నాధా! నేనుసామాన్య స్త్రీల వంటి దానను కాను. పరపురుషుని కన్నెత్తి కూడా చూడను. నేను ఇక్కడ ఒకరి పంచన బతకలేను. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను. నేను స్వయంగా నీ భార్యను. యవ్వనంలో ఉన్నాను. నీతో కొంతకాలము కాపురము చేసాను. అటువంటి నన్ను దిక్కులేని దాని మాదిరి పరాయి వాళ్ల ఇంట ఉంచడం ఉచితమా! నీవేమో తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళుతున్నావు. నన్నేమో ఇక్కడ నీ తండ్రిని, తల్లిని, నీ తమ్ముడు భరతునికి విధేయురాలిగా ఉండమంటున్నావు. రామా! నీకు నీ వారు ఎక్కువ కానీ నాకు కాదు కదా! నాకు నా భర్త ఎక్కువ. ఎవరి కోసరమో నేను నిన్ను విడిచి ఒంటరిగా అయోధ్యలో ఉండలేను.
మీకు అన్నీ తెలుసు. అలాంటప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లడం ఉచితము కాదు. మీ సన్నిధిలో నాకు అరణ్యమైనా స్వర్గమైనా సమానమే! మీరు ఎక్కడ ఉంటే అదే నాకు రాజభవనము. నేను రాజభవనములో ఎలాఉంటానో అరణ్యములో కూడా అలాగే ఉంటాను. మీతో కలిసి ప్రయాణము చేస్తుంటే నాకు ముళ్లు కూడా పూల మాదిరి ఉంటాయి. అడవులలో ఉన్న దుమ్ముకూడా చందనముతో సమానమే. హాయిగా, ఆకాశమే పందిరిగా పచ్చికబయళ్లే పూల పానుపుగా మీతో పాటు శయనించడం కన్నా, రాజభవనములలో ఉన్న హంసతూలికా తల్పములు ఎక్కువ సుఖాన్ని ఇవ్వవు. మీరు తీసుకొని వచ్చిన కందమూలములు, ఫలములే నాకు పంచభక్ష్య పరమాన్నములు. నేను అడవులలో ఉన్నప్పుడు మా పుట్టింటికానీ నా తల్లితండ్రులను గానీ తలచుకొని బెంగపెట్టుకోను. నా వలన మీకు ఎలాంటి కష్టము కలగనీయను. నాకు అది కావాలి ఇది కావాలి అని అడగను. దొరికిన దానితో తృప్తిపడతాను.
నాధా! మరలాచెబుతున్నాను. నాకు నీతోటిదే స్వర్గము. నీవు లేనిచోట నరకమే. కాబట్టి నన్ను తమరి వెంట తీసుకొని వెళ్లండి. ఇన్ని చెప్పినా వినకపోతే నాకు మరణమే శరణ్యము. అంతే గాని, అయోధ్యలో మీ శత్రువుల మధ్య ఉండలేను. ఎందుకంటే, మీ వియోగముతో నేను కొంతకాలము తరువాత అయినా కృంగి కృశించి చచ్చిపోతాను. అలాంటిది నీ ఎదుటనే చావడం మేలు కదా! ఒక్కక్షణమైనా మిమ్ములను విడిచి బతకలేని నేను పదునాలుగు సంవత్సరములు మిమ్ములను విడిచి పరాయి పంచన ఎలా ఉంటాను అని అనుకుంటున్నారు.” అంటూ సీత రాముని కౌగలించుకొని పెద్దగా ఏడవసాగింది.
సీత కళ్లనుండి కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. శరీరం వశం తప్పుతూ ఉంది. అలాగే రాముని చేతులలో నుండి కిందికి జారిపోయింది. రాముడు సీతను గట్టిగా పట్టుకున్నాడు. ఓదారుస్తున్నాడు.
"ఓ సీతా! ఎందుకీ ఏడుపు. నీవు ఇలా దుఃఖిస్తూ ఉంటే నాకు స్వర్గములో కూడా సుఖము లభించదు. నేను ఎవరికీ భయపడను. తుదకు ఆ బ్రహ్మదేవునికికూడా! నేను నిన్ను సర్వవేళలా రక్షించు కొనుటకు సమర్థుడను. కానీ నీ అభిప్రాయము తెలుసుకొనడానికి అలా అన్నాను. అలా కాకుండా, నిన్ను నా వెంట అరణ్యములకు రమ్మంటే, పురుషాహంకారముతో నేను నిన్ను శాసిస్తున్నాను అని నీవు నన్ను అపార్థము చేసుకొనే అవకాశము ఉంది కదా!
ఓ సీతా! నేను మాత్రము నిన్ను విడిచి క్షణమైనా బతుక గలనా! ఆ బ్రహ్మ మన ఇద్దరికీ వనవాసము చెయ్యమని రాసి పెట్టినట్టున్నాడు. అందుకే ఈ విపరీత పరిణామము.
సీతా! ఇంక నేను వనవాసమునకు ఎందుకు వెళుతున్నానో వివరిస్తాను. పితృవాక్యపరిపాలన మా కులధర్మము. దానిని నేను పాటించి తీరవలెను. కారణములు ఏవైనా, నా తండ్రి వాక్యము నాకు వేదవాక్కు. ఆయన మాటలు అనుసరించి నేను అడవులకు వెళు తున్నాను. ఒక కుమారుడిగా తల్లి తండ్రుల ఎడల నా ధర్మమును అతిక్రమించుటకు నేను ఇష్టపడను. నాకు నా తల్లి, తండ్రి, గురువు మూడు లోకములతో సమానము. వీరి తరువాతే నాకు దేవుడు. నా తల్లి తండ్రుల సేవ కన్నా యజ్ఞయాగములు ముఖ్యము కావు. నా తండ్రి ఆజ్ఞను పాలించడంతోనే, నాకు స్వర్గము, ధనము, ధాన్యము, విద్య, సంతానము, రాజభోగములు లభించినట్టు భావిస్తాను. తండ్రి ఆజ్ఞను ధిక్కరించిన నాడు, నాకు ఇవేవీ దొరకవు. మాతాపితరుల సేవతో నేను ఉత్తమ లోకములు పొందుతాను. ఎందుకంటే పితృవాక్య పరిపాలన మన సనాతన ధర్మము.
నిన్ను నాతో పాటు అరణ్యములకు తీసుకొని పోయి కష్టముల పాటు చేయడం నాకు ఇష్టం లేదు. కానీ నీ ధృఢనిశ్చయము విని నిన్ను నాతో అరణ్యములకు రావడానికి అనుమతిస్తున్నాను. నా సహధర్మ చారిణిగా నా వెంట అడవులకు రా. నీవు నాతో వస్తాను అని అనడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇటువంటి నిర్ణయం తీసుకొని మన వంశగౌరవము కాపాడావు.
కాబట్టి సీతా! మనకు వనవాసమునకు అవసరమైన ఏర్పాట్లు చెయ్యి. నిన్ను విడిచి నేనుకూడా ఒక క్షణము కూడా ఉండలేను కదా! బ్రాహ్మణులకు దానధర్మములుచెయ్యి. వారికి భోజనము పెట్టి సంతృప్తి పరుచు. నీవు ధరించు ఆభరణములు, విలువైన వస్త్రములు, వస్తువులు అన్నీ నీ పరిచారికలకు బ్రాహ్మణులకు దానంగా ఇవ్వు." అని అన్నాడు రాముడు.
రాముని మాటలు విని సీత సంతోషంతో పొంగి పోయింది. రాముడు చెప్పినట్టు తనది అన్న ప్రతి వస్తువు అందరికీ దానంగా ఇచ్చివేసింది. విలువైన బంగారు ఆభరణములు, రత్నములు, మణులు, పట్టు వస్త్రములు తన పరిచారికలకు ఇచ్చింది.
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము ముప్పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment