శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఇరువది ఏడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 27)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఇరువది ఏడవ సర్గ
రాముని మాటలు విన్న సీతకు చిరుకోపం వచ్చింది. “ఏమిటండీ మీరు మాట్లాడేది. నాకు ఏమీ అర్థం కావడం లేదు. కేవలం హాస్యానికి అంటున్నారా. నన్ను ఆట పట్టించడానికి అంటున్నారా. హాస్యానికైనా ఒక హద్దు ఉంటుంది కదా! మీనోటి నుండి రావాల్సిన మాటలేనా ఇవి. ఒకవేళ అరణ్యానికి వెళ్లాల్సివస్తే, మీరు మాత్రమే అరణ్యములకు పోవడం ఏమిటి? ఎందుకంటే తల్లి, తండ్రి, సోదరుడు, సంతానము, కోడళ్లు వారందరూ వారి వారి పూర్వజన్మ కర్మలను మాత్రమే అనుభవిస్తారు. ఎవరు చేసిన పుణ్యఫలములను కానీ పాప ఫలములను కానీ వారే అనుభవిస్తారు. కాని భార్య అలా కాదు. భార్య తన భర్త చేసిన పుణ్యములో కానీ పాపమలో కానీ భాగము పంచుకుంటుంది. భర్త కష్టసుఖములలో పాలు పంచుకుంటుంది. అది భార్య ధర్మము. దానిని ఎవరూ కాదనలేరు.మామగారు తమరిని అడవులకు వెళ్లమంటే నన్నుకూడా వెళ్లమన్నట్టు కాదా! అది వేరుగా చెప్పవలెనా! ఎందుకంటే భార్య భర్తతో పాటు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంటుంది. ఇహలోకంలో కానీ, పరలోకంలో గానీ భర్త ఒక్కడే భార్యకు ఉత్తమ గతులు కల్పించగలడు. కాబట్టి తమరి వెంటే నేను. అది అడవి కానీ, అంతఃపురము కానీ, మీరు అడవులలో నడుస్తూ ఉంటే నేను మీ ముందు నడుస్తూ మీరు వెళ్లే దారిలో ముళ్లు రాళ్లు లేకుండా శుభ్రం చేస్తాను. కాబట్టి నన్ను కూడా తమరి వెంట అరణ్యములకు తీసుకొని వెళ్లండి. నా వల్ల తమరికి ఎలాంటి కష్టము కలగ కుండా నేను చూసుకుంటాను.
ఓ నాధా! నేను అంతఃపురములో ఉన్నను, అరణ్యములలో ఉన్నను, నాకు నా భర్తతోటిదే లోకము. మరే సుఖములు, భోగములు నాకు అక్కరలేదు. ఈ విషయములన్నీ నాకు నా తల్లి తండ్రులు నాకు ఇదివరకే ఉపదేశించారు. ఇప్పుడు నేను ఎలా నడుచుకోవాలో నాకు ఎవరూ వేరుగా చెప్ప పనిలేదు. మీరు వెళ్లే ప్రదేశము క్రూరమృగములతో నిండిన దుర్గమారణ్యము కానీ నేను కూడా మీతో వస్తాను. నేను అడవిలో ఉన్నా నా పుట్టింట్లో ఉన్నట్లు ఉంటాను. ఏ కష్టములను లెక్కచెయ్యను. నేను నిత్యము తమరి సేవ చేసుకుంటూ బ్రహ్మ చర్యమును పాటిస్తూ, అడవులలో స్వేచ్ఛగా విహరిస్తాను. నేను కూడా తమరితో పాటు ఫలములు, కందమూలములు తింటూ బతుకుతాను. మిమ్మల్ని అది తెమ్మని ఇది తెమ్మని ఇబ్బంది పెట్టను.
నాకు కూడా ఎన్నాళ్లనుండో అడవులలో విహరించాలని, అక్కడ ఉన్న హంసలను, నెమళ్లను వాటి సౌందర్యమును చూడాలని, తామర పూల కొలనులో స్నానమాడాలని, ఎంతో కోరికగా ఉంది. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరుతున్నందుకు ఎంతో ఆనందంగాఉంది. ఆ మాదిరిగా మీతో లక్ష సంవత్సరములు కూడా ఆనందంగా గడుపుతాను. ఇంక నా భద్రత అంటారా. మహావీరులు మీరు నా పక్కన ఉండగా నా భద్రత గురించి నాకు భయమెందుకు. కాబట్టి మీరు ఎలా తండ్రిమాటను మన్నించి అడవులకు వెళ్లాలని నిర్ణయించు కున్నారో, నేను కూడా తమరి వెంట రావాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయంలో మార్పులేదు. ఎందుకంటే నాకు తమరు లేకుండా స్వర్గము కూడా తృణప్రాయము. తమరు ఎదురుగా ఉంటే దుర్గమారణ్యము కూడా స్వర్గతుల్యము. కాబట్టి నన్ను తమరి వెంట తీసుకొని వెళ్లండి. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకొని మరణిస్తాను కాని మిమ్ములను విడిచి ఒక్క క్షణం కూడా బతకలేను." అని సీత తన నిర్ణయాన్ని స్పష్టంగా రామునికి తెలిపింది.
సీత చెప్పిన మాటలను ఎంతో ఓపిగ్గా విన్నాడు రాముడు. అరణ్యము అంటే ఏమిటో అది ఎలా ఉంటుందో వివరంగా చెప్పి సీతను తనతో పాటు వనవాసమునకు రావడాన్ని ఆపుదాము అని అనుకొన్నాడు రాముడు. సీతతో ఇలా చెప్పసాగాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువదిఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment