శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఇరువది ఒకటవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 21)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఇరువది ఒకటవ సర్గ
రాముడు అరణ్యములకు పోతాను అని చెప్పడం, ఆ మాటలు విని కౌసల్య భోరున ఏడవడం అంతా చూస్తున్నాడు లక్ష్మణుడు. వారిని చూచి ఇలా అన్నాడు.“అమ్మా కౌసల్యా! అన్నా రామా! ఒక స్త్రీ కోరిన కోరికలు నెరవేర్చడం కోసరం రాముడు అడవులకు వెళ్లడం నాకు అసలే ఇష్టం లేదు. మన తండ్రి దశరథుడు కామపీడితుడు, భోగలాలసుడు. విషయ వాంఛలకు లోబడ్డవాడు. అలాంటి రాజు, కైక మాటలకు లోబడి ఏమైనా మాట్లాడవచ్చును. కాని అది ఆచరణయోగ్యము కాదు. ఎందుకంటే రాముడు అయోధ్యనుండి వెడలగొట్టబడవలసిన తప్పు ఏమీ చేయలేదు. చేయడు కూడా. అటువంటప్పుడు రాముడు అడవులకు ఎందుకు వెళ్లాలి.
రామునికి పరమ శత్రువు కూడా రాముని గురించి చెడ్డగా మాట్లాడడు. ధర్మాచరణము చేయు వాడు ఎవరూ గుణవంతుడు, ఋజువర్తనుడు అయిన కుమారుని అడవులకు పంపడు. రాజధర్మము తెలిసిన వాడు ఎవడూ దశరథ మహారాజు మాటలను ధర్మ సమ్మతము గా అంగీకరింపడు. ధర్మసమ్మతము కాని రాజు ఆదేశములను మనము పాటించ నవసరము లేదు. రాజ్యం వీరభోజ్యము. నాకు అనుమతి ఇవ్వండి బలప్రయోగంతో రాజ్యము స్వాధీనము చేసుకుంటాను. ఎవరు అడ్డు వస్తారో చూస్తాను.
రామునికి పరమ శత్రువు కూడా రాముని గురించి చెడ్డగా మాట్లాడడు. ధర్మాచరణము చేయు వాడు ఎవరూ గుణవంతుడు, ఋజువర్తనుడు అయిన కుమారుని అడవులకు పంపడు. రాజధర్మము తెలిసిన వాడు ఎవడూ దశరథ మహారాజు మాటలను ధర్మ సమ్మతము గా అంగీకరింపడు. ధర్మసమ్మతము కాని రాజు ఆదేశములను మనము పాటించ నవసరము లేదు. రాజ్యం వీరభోజ్యము. నాకు అనుమతి ఇవ్వండి బలప్రయోగంతో రాజ్యము స్వాధీనము చేసుకుంటాను. ఎవరు అడ్డు వస్తారో చూస్తాను.
రామా! నేను నీ పక్క ధనుస్సు పట్టుకొని నిలబడి ఉండగా నీ నీడను కూడా ఎవరూ తాకలేరు.
రామా! ఈ అయోధ్యా నగరము నీది. ఈ అయోధ్యలో నీకు ఎవరైనా అపకారము చేయడానికి సాహసిస్తే, ఈ అయోధ్యానగరాన్నే నేలమట్టం చేస్తాను.
రామా! ఈ లోకం తీరే అంత. మెతకగా ఉంటే నెత్తికెక్కుతారు. భరతునికి పట్టాభిషేకము చెయ్యాలి అనే వాడు ఎవడినైనాసరే భరతుని పక్షానమాట్లాడే ఎవడి నైనా సరే వాడిని వధిస్తాను. కైక పక్షము వహించి, కైక మీది ప్రేమతో నిన్ను అడవులకు పంపుతున్న మన తండ్రి దుర్మార్గుడు. దుర్మార్గుడు బంధింపతగినవాడు. అందుకని దశరథుని బంధించెదను. అవసరమైతే వధిస్తానుకూడా. గురువు అయినా సరే, దుర్మార్గుడు అయితే అతడు శిక్షార్హుడు.
రామా! మన తండ్రి ఎవరి అండచూచుకొని, పెద్దవాడైన నిన్ను కాదని రాజ్యమును భరతునికి ఇవ్వదలచుకున్నాడో అర్థం కావడం లేదు. నీతో నాతో విరోధము పెట్టుకొని భరతునికి రాజ్యాభిషేకము చేసే ధైర్యము దశరధునికి ఎక్కడిది?
అమ్మా! కౌసల్యాదేవీ! నాకు రాముడు అంటే ప్రాణము. నా ధనుస్సు మీద నేను చేసిన యజ్ఞయాగముల మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. రాముడు సామాన్యుడు కాడు. రాముడు అరణ్యములలోనూ అగ్నిలోనూ ప్రవేశింపగలడు. కానీ, దేనికైనా సరే, రాముని కన్నా ముందు నేను ఉంటాను. నేను ఉండగా మీకు ఎలాంటి భయము లేదు. నిశ్చింతగా ఉండండి." అని ఆవేశంతో పలికాడు అక్ష్మణుడు.
ఆవేశంతో పలికిన లక్ష్మణుని మాటలు విన్న కౌసల్య రాముని తో దు:ఖిస్తూ ఇలాఅంది. “రామా! నీ తమ్ముడు లక్ష్మణుని మాటలు విన్నావు కదా! నీకు ఇష్టం అయితే ఆ ప్రకారము చెయ్యి. అధర్మపరురాలు అయిన నా సవతి కైకేయీ మాటలు మనము పాటించ నవసరము లేదు. నీవు అరణ్యములకు వెళ్లనవసరము లేదు.
రామా! నీకు అన్ని ధర్మములు తెలుసు. మాతృసేవ చెయ్యడం పరమ ధర్మము. కాబట్టి నీవు అయోధ్యలో ఉండి ఈ వృద్యాప్యంలో నా దగ్గర ఉండి నాకు సేవలు చెయ్యి. నీ ధర్మమును ఆచరించు. రామా! పూర్వము కాశ్యపుడు తన తల్లికి సేవలు చేసి తరించాడు. రామా! నీకు నీ తండ్రి ఎంతటి పూజనీయుడో, నేనూ అంతటి పూజనీయురాలనే కదా. కాబట్టి నేను చెబుతున్నాను. నీవు అరణ్యములకు వెళ్ల నవసరము లేదు. అరణ్యములకు వెళ్లుటకు నేను అనుమతి ఇవ్వను. నీవు నా దగ్గర ఉండి నాకు సేవలు చేసుకో.
నీవు అరణ్యములలో ఉంటే నేను ఇక్కడ మృష్టాన్నములు ఎలా భుజించగలను. నీతోపాటు ఉంటూ ఆకులు అలములు తినడం నాకు ఎంతో ఇష్టం. అలా కాకుండా నీవు అరణ్యములకు వెళితే నేను అన్నపానీయములను తీసుకోకుండా ప్రాయోపవేశము చేస్తాను. క్రుంగి, కృశించి మరణిస్తాను. నీ కోసరం నిన్ను తల్చుకుంటూ నేను మరణిస్తే నీకు దుర్గతులు కలుగుతాయి. తర్వాత నీ ఇష్టం." అని పలికింది కౌసల్య.
తమ్ముడు లక్ష్మణుని మాటలూ, తల్లి కౌసల్య మాటలూ సావధానంగా విన్నాడు రాముడు. వారితో ఇలా అన్నాడు.
“అమ్మా! నాకు నా తండ్రి దైవసమానుడు. ఆయన ఆజ్ఞను ధిక్కరించే శక్తి నాకు లేదు. కాబట్టి నిన్ను వేడుకుంటున్నాను. నన్ను అరణ్యములకు వెళ్లనీ. పూర్వము పితృవాక్య పరిపాలన కొరకు కండు మహర్షి గోవును కూడా చంపాడు. మన వంశములోని సగర కుమారులు తండ్రి ఆజ్ఞ మేరకు భూమి నంతా తవ్వారు. ఆ ప్రయత్నంలో తమ ప్రాణాలు కోల్పోయారు. అంతెందుకు, తన తండ్రి జమదగ్ని ఆజ్ఞమేరకు, పరశు రాముడు, తన తల్లి రేణుకను గొడ్డలితో నరికి చంపాడు. అమ్మా! మన పూర్వీకులందరూ పితృవాక్పరిపాలనకు తమ ప్రాణాలుకూడా అర్పించారు. నేను నా తండ్రి మాట మేరకు కేవలం అరణ్యములకు పోతున్నాను. నా పూర్వీకులు ఆచరించిన ధర్మమునే నేనూ ఆచరిస్తున్నాను.
ఈనాడు నేను నా స్వార్థము కొరకు, పితృవాక్యమును పాటించకుండా, కొత్త ధర్మమును సృష్టించలేను. తండ్రి మాటను పాటించిన వాడికి దోషము అంటదు. తండ్రిమాటను ధిక్కరించి నేను నా పూర్వీకులముందు దోషిగా నిలబడలేను." అని తల్లితో పలికిన రాముడు తమ్ముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
“తమ్ముడా లక్ష్మణా! నీకు నా మీద ఎంత ప్రేమ, వాత్సల్యము గౌరవము ఉన్నాయో నాకు తెలుసు. నా తల్లికి ధర్మసూక్ష్మములు వేదాంత రహస్యములు తెలియక పోవడం వలన, పామరత్వం చేత దు:ఖము పొందుతూ ఉంది.
లక్ష్మణా! ఈ లోకంలో ధర్మాచరణ ఎంతో ముఖ్యము. ధర్మము నందే సత్యము ప్రతిష్ఠితమై ఉన్నది. తండ్రిగారు తన ధర్మమును తాను పాటించారు. తల్లికి వరాలు ఇస్తాను అన్నారు. ఆమె కోరుకొన్నది ఇవ్వడం రాజు ధర్మము. ఆ ధర్మమును ఆయన నిర్వర్తించాడు. పితృవాక్పరిపాలన నా ధర్మము. కాబట్టి నా ధర్మమును నేను నిర్వర్తించాలి కదా! ధర్మమును ఆశ్రయించిన వాడు తండ్రికి, తల్లికి, గురువుకు ఇచ్చిన మాటను తప్పకూడదు. నా తండ్రి మాటలను నా తల్లి కైకేయీ నాకు చెప్పింది. ఇందులో ఆమె తప్పేముంది. తండ్రి మాటలను ఆచరించడం నా ధర్మము.
కాని క్షత్రియ ధర్మము వేరుగా ఉంటుంది. బలవంతంగా రాజ్యము ఆక్రమించుకోడం క్షత్రియ ధర్మము. ప్రస్తుతము మనకు కులధర్మమే ముఖ్యము. క్షత్రియ ధర్మము కాదు. నీవు కూడా క్షత్రియ ధర్మమును పక్కనపెట్టి ధర్మాచరణము చెయ్యి. నీ కోపము వదిలి పెట్టు. నేను చెప్పిన మాటలను ఆచరించు." అని అన్నాడు రాముడు.
తరువాత తల్లి కౌసల్యను చూచి చేతులు జోడించి ఇలా అన్నాడు. “అమ్మా! నేను అరణ్యములకు పోవడానికి నాకు అనుమతి ఇవ్వు. దీనికి మారు పలికితే నా మీద ఒట్టు. నా ప్రయాణమునకు కావలసిన వస్తువులను సేకరించు. అమ్మా! పదునాలుగు సంవత్స రములు ఎంతలో అయిపోతాయి. ఇలా వెళ్లి అలాతిరిగి వస్తాను. నామాట నమ్ము. అమ్మా! నీ మనసులో నా గురించి దుఃఖించకు. తండ్రిమాటప్రకారము వెళుతున్నాను. నీ మాట ప్రకారము తిరిగి వస్తాను.
అమ్మా! మనకందరకూ పెద్ద తండ్రి గారు. నీవు, నేను, సీత లక్ష్మణుడు, అందరమూ తండ్రిగారి మాటను గౌరవించాలి కదా! అదియే కదా సనాతనధర్మము. అమ్మా! ఇంక నా పట్టాభిషేకమునకు ఏర్పాట్లు చేయడం ఆపి, నా వనవాసమునకు ఏర్పాట్లు చెయ్యి." అని అన్నాడు రాముడు.
రాముడు అలా మాట్లాడుతుంటే కౌసల్యకు ఏమనాలో తోచలేదు. రాముని చూచి ఇలా అంది. “రామా! నీవు సనాతన ధర్మము గురించి చెప్పావు. సనాతన ధర్మములో తండ్రి మాటకు ఎంత విలువ ఇవ్వాలో తల్లి మాటకూ అంతే విలువ ఇవ్వాలి కదా. కాబట్టి నేను చెబుతున్నాను. నీ తల్లి మాట ప్రకారము నీ తల్లిని విడిచి నీవు వెళ్లవద్దు. నన్ను దు:ఖముల పాలు చెయ్యవద్దు. నేను నీకు తల్లిని, గురువును. నేను నీకు వనములకు పోవడానికి అనుజ్ఞ ఇవ్వను. నీవు వెళ్లడానికి వీలు లేదు.
రామా! నీవు లేని ఈ బ్రతుకు నిరర్థకము. నేను చచ్చి స్వర్గానికి వెళ్లినా, అక్కడ లభించే అమృతము కూడా నీకుసాటి రాదు. నీవు ముహూర్తకాలము నా ఎదుట ఉంటేచాలు, ఏ స్వర్గసుఖములు దానికి సమానం కావు. రామా! నన్ను విడిచి వెళ్లకు.” అంటూ దీనంగా ఏడుస్తున్న తల్లిని చూచి రాముని మనస్సు ద్రవించి పోయింది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియలేదు రామునికి. అందుకని లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
“లక్ష్మణా! నీవు కూడా తల్లిగారితో చేరి నన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇది ధర్మమా! తల్లిగారు చూడు ఎలా పరితపిస్తూ ఉందో. ఆమెను ఊరడించాల్సింది పోయి, ఆమెను, నన్ను, నీ మాటలతో బాధపెట్టావు.
లక్ష్మణా! అర్థకామములు ధర్మ సమ్మతము లైనపుడే అవి మంచి ఫలములను ఇస్తాయి. అందుకని అర్థకామముల కంటే ధర్మమునకే ప్రాధాన్యము. ధర్మాచరణము అత్యంత ఆవశ్యకము. మనము ఎల్లప్పుడూ ధర్మసమ్మతములైన పనులను చేయడంలోనే ఆసక్తి కలిగి ఉండాలి. కేవలము అర్థము, కామము తో కూడిన పనులను చేయడం వలన రాగ ద్వేషములు ప్రబలుతాయి. అవి ధర్మపరులకు మంచివి కావు. మన తండ్రి వృద్ధుడు. మనకు పూజ్యుడు. ఆయన కామ ప్రకోపంతో గానీ, కోపంతో గానీ మనలను ఒక పనిచెయ్యమని చెప్పినప్పుడు, అది ధర్మంకాదు అని మనం నిరాకరించడం, ధర్మాచరణము అనిపించుకోదు. కేవలము దుష్టులు మాత్రమే అలా చేస్తారు.
లక్ష్మణా! మన తండ్రిగారు నీకు, నాకు తండ్రి, గురువు, దైవము. అలాగే మన తల్లి గారికి ఆయన భర్త. భర్త మాట భార్యకు శిరోధార్యము. కాబట్టి మనందరికీ దశరథ మహారాజు ఆజ్ఞను పాటించడం తప్ప మరోమార్గము లేదు. పైగా, తన భర్త అయిన దశరథమహారాజు గారు జీవించిఉండగా, భర్తను వదిలిపెట్టి, తల్లిగారు నా వెంట అడవులకు ఎలా రాగలరు. అది ధర్మము కాదు."అని తల్లి వంక తిరిగి “అమ్మా! నాకు అరణ్యములకు వెళ్లుటకు అనుమతి ఇవ్వు. పదునాలుగు సంవత్సరముల తరువాత నేను క్షేమంగా అయోధ్యకు తిరిగి రావాలని నన్ను ఆశీర్వదించు. నా తండ్రి మాటను పాటించడం, నాపూర్వీకులు నడిచిన బాటలో నడవడం--వీటితో పోలిస్తే, ఈ తుచ్ఛమైన రాజ్యభోగములు నాకు తృణప్రాయములు. కేవలం రాజ్యం కోసరం శాశ్వత కీర్తి ప్రతిష్టలను వదులుకోలేను.
అమ్మా! ఈ జీవితము నీటి బుడగ వంటిది. నాలుగు రోజులు రాజ్యం పాలించడం కోసరం, ధర్మము తప్పి, అధర్మంగా రాజ్యమును కైవసం చేసుకోవడం మంచిది కాదు." అని తన మనస్సులో ఉన్న మాటను అమ్మకు, తమ్ముడికి స్పష్టం చేసాడు. తల్లికి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారముచేసాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment