శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఇరువది రెండవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 22)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఇరువది రెండవ సర్గ
రాముడు ధృఢచిత్తంతో ఉన్నాడు. తనకు కావలసిన పట్టాభిషేకము అర్ధాంతరంగా ఆగిపోయినా చలించలేదు. తన లోపల ఉన్న భావాలను బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆవేశంతో ఊగిపోతున్న లక్ష్మణునితో ఇలా అన్నాడు.“తమ్ముడా లక్ష్మణా! నీ కోపాన్ని విడిచిపెట్టు. కోపము ప్రదర్శించడానికి ఇది సమయము కాదు. ధైర్యంగా ఉండు. ఆనందంగా ఉండు. ఈరోజు నాకు పట్టాభిషేకము అన్న విషయము మరిచిపో. నా పట్టాభిషేకమునకు సేకరించిన వస్తువులు అన్నీ పక్కన పెట్టు. పాపము నా తల్లి కైక నాకు పట్టాభిషేకము జరుగబోవుచున్నది అని బాధపడిపోతూ ఉంది. ఆమె బాధను మనము పోగొట్టాలి. పట్టాభిషేకము ఆగిపోయింది అని ఆమెకు తెలియజెయ్యాలి. ఎందుకంటే నా తల్లి కైక మనసులో బాధ, అనుమానము ఉంటే నేను సహించలేను. నేను పుట్టిన తరువాత నా తల్లులకు గానీ నా తండ్రికి గానీ మనసు బాధపెట్టలేదు. నా తండ్రి సత్యమునే పలుకుతాడు. ఆడిన మాట తప్పడు. ఆయన నా తల్లి కైకకు ఇచ్చిన మాట నెరవేర్చడం నా కర్తవ్యము.
మీరు అనుకున్నట్టు నాకు పట్టాభిషేకము జరిగితే నా తండ్రి నా తల్లి కైకకు ఇచ్చిన మాట తప్పిన వాడు అవుతాడు. అది నాకు ఇష్టం లేదు. కాబట్టి, నా పట్టాభిషేక కార్యక్రమమును ఇంతటితో నిలిపివేసి వెంటనే అరణ్యములకు వెళ్లే పనిలో ఉంటాను. అదే నా ప్రస్తుత కర్తవ్యము. నేను అడవులకు వెళితే నా తల్లి కైక మనస్సు శాంతిస్తుంది. ఆమె పరిపూర్ణంగా సంతోషిస్తుంది. తన కుమారుడు భరతునికి నిర్విఘ్నంగా పట్టాభిషేకము జరిపించు కుంటుంది.
లక్ష్మణా! నీకు తెలుసో లేదో. మన తండ్రిగారు కూడా ఈ నిర్ణయాన్ని చాలా బాధతో తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం అమలు పరచడం మన బాధ్యత. మనం ఇంకొక విషయం మరిచిపోకూడదు. నేను కోరుకోకుండానే నా పట్టాభిషేకము నిర్ణయం అయింది. కాని అది అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇది కూడా నా ప్రమేయం లేకుండానే జరిగింది. ఈ విచిత్ర పరిణామాలకు ఎవరూ కారణం కాదు. ఎవరినీ తప్పుపట్టనవసరం లేదు. ఇది అంతా దైవ నిర్ణయం అని సరిపెట్టుకోవాలి.
మన తల్లి కైకకు నా పట్టాభిషేకము ఆపించవలెనని ఆ దైవమే బుద్ధిపుట్టించి ఉంటుంది. లేకపోతే ఇదివరలో ఎప్పుడూ నన్ను పల్లెత్తు మాటకూడా అనని మన తల్లి కైక, నాకు ఎందుకు ఈ రకమైన బాధ, కష్టం కలిగిస్తుంది. నన్ను అడవులకు పొమ్మని శాసిస్తుంది. నేను నా తల్లి కైకకు ఎన్నడూ మనసుకు కష్టం కలిగించి ఎరుగను. అలాగే నా తల్లి కైక నన్ను, తన కుమారుడు భరతుని ఎన్నడూ బేధబుద్ధితో చూడలేదు. మాఇద్దరినీ సమానంగా చూచింది. ఇవన్నీ నీకూ తెలుసు.
కాబట్టి లక్ష్మణా! కైక నా గురించి పరుషంగా మాట్లాడటం గానీ, నా పట్టాభిషేకమును నిలిపివేయడం గానీ, ఆమె స్వతాహాగా చేసినది కాదు. అంతా దైవ నిర్ణయం. లేకపోతే ఉత్తమ రాజవంశము లో పుట్టిన కైక, ఒక సామాన్య స్త్రీ వలె, తన భర్తముందు, పట్టాభిషేకము చేసుకోబోవు తన కుమారుని తూలనాడుతుందా! అతని పట్టాభి షేకమును ఆపిస్తుందా! ఆమె విపరీత ప్రవర్తనకు దైవమే కారణము కానీ వేరుకాదు.
దైవ నిర్ణయములు చాలా కఠినంగా ఉంటాయి. దైవ నిర్ణయాన్ని అడ్డుకోడానికి ఎవరికీ సాధ్యం కాదు. అందుకే నా తల్లి కైక నన్ను అడవులకు వెళ్లమని కోరింది. ఆ దైవనిర్ణయాన్ని అమలు పరచడం నా కర్తవ్యం. దైవము ఎలా నడిపిస్తే అలా నడవడం మన కర్తవ్యం. అలాంటి దైవ నిర్ణయానికి ఎవడు ఎదురీదగలడు?
లక్ష్మణా! మనము ఏదో చేస్తున్నాము ఏదో సాధిస్తున్నాము అని అనుకుంటాము. అది పొరపాటు. మనకు అనుదినమూ కలిగే సుఖదు:ఖాలు, భయము, క్రోధమూ, లాభనష్టాలూ, ఉండటం, లేకపోవడం, ఇవి అన్నీ దైవ నిర్ణయంబట్టి జరుగుతూ ఉంటాయి. మానవుల ప్రమేయము ఏమీ లేదు. పూర్వము ఇంద్రియములను జయించాము అని చెప్పుకొన్న మహాఋషులు కూడా దైవప్రేరితులై, కామ కోరికలకు లోబడి, తమ తపస్సులను నాశనం చేసుకున్నారు. ఏదైనా ఒక పని మనము సంకల్పించినపుడు. ఆ పని పూర్తి కావచ్చే సమయంలో ఏదైనా అడ్డు తగిలితే దానిని దైవనిర్ణయంగానే భావించాలి. కాబట్టి ఇంకొంచెం సేపటిలో జరుగబోవు నా పట్టాభి షేకము, ఏ కారణం చేతనైనా, ఆగిపోయింది అంటే అది దైవ నిర్ణయమే గాని వేరు కాదు. నా పట్టాభిషేకము అగిపోయినందుకు నాకు ఎలాంటి దుఃఖము లేదు. నేను బాధపడటం లేదు. నీవు కూడా నీ మనసులో ఉన్న బాధను తీసి వెయ్యి. వెంటనే పట్టాభిషేకమునకు జరుగుచున్న పనులను నిలిపివెయ్యి.
లక్ష్మణా! నా పట్టాభిషేకము కొరకు సముద్రముల నుండి పవిత్ర పుణ్య నదీనదముల నుండి తెచ్చిన నీటితో నేను రేపటినుండి గడపబోవు తాపసవ్రతమునకు దీక్షా స్నానం చేస్తాను. అయినా వద్దులే. ఎక్కడెక్కడి నుంచో అతి కష్టం మీద తెచ్చిన ఈ పుణ్య నదీజలములు నాకు ఎందుకు. నేను బావిలో నుండి నీరు తోడుకొని స్నానం చేస్తాను. రేపటి నుండి నేను అలా చెయ్యాలి కదా!
తమ్ముడూ! నాకు రాజ్యలక్ష్మి లభించలేదని బాధ పడకు. దానికి బదులు నాకు వనలక్ష్మి లభించిందని సంతోషించు. నా దృష్టిలో రెండూ ఒకటే." అని అని లక్ష్మణుని అనునయించాడు
రాముడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment