శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - పంతొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 19)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
పంతొమ్మిదవ సర్గ
తన తల్లి కైక మాటలు విన్న రాముడు ఏ మాత్రం బాధ పడలేదు. “అమ్మా! కైకా! అన్నీ నీవు చెప్పినట్లే జరుగుతాయమ్మా. నేను తండ్రి గారి మాట ప్రకారము జటలు, నార చీరలు ధరించి అరణ్యవాసము చేస్తాను. ఈ చిన్న విషయానికి తండ్రి గారు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. తండ్రిగారి మాట నేను ఎప్పుడు కాదన్నాను. ఆయన మాట నేను కాదు అని అంటే కదా వారు బాధ పడాలి. వారి మాట నాకు శిరోధార్యము.అమ్మా! నాకు జన్మనిచ్చిన వాడు నా తండ్రి. నన్ను పెంచి, పెద్దచేసి, నాకు విద్యాబుద్ధులు చెప్పించాడు. అటువంటి తండ్రి మాటను నేను కాదంటానా అమ్మా! కాని తండ్రిగారు ఈ విషయము నాకు స్వయంగా చెప్పిఉంటే బాగుండేది. తండ్రిగారు “రామా! నేను భరతునికి యౌవరాజ్య పట్టాభిషేకము చేయదలిచాను" అని ఒక్కమాట నాతో అంటే నేను రాజ్యమును భరతునికి అప్పగించి ఉండేవాడిని. ఒక్క రాజ్యమే కాదు తండ్రిగారు కోరితే నా సర్వస్వమును భరతునికి అర్పిస్తాను. ఇందులో సందేహము లేదు.
అమ్మా! నీవు తండ్రి గారిని ఓదార్చు. అమ్మా! అమ్మా! చూడమ్మా. తండ్రి గారు నా మొహం లోకి చూడలేక నేల చూపులు చూస్తూ కన్నీరు కారుస్తున్నారు. నేను తండ్రిగారి మాటలను పాటిస్తాను అని చెప్పమ్మా. వెంటనే నేను భరతుని తీసుకొని వచ్చుటకు దూతలను కేకయ దేశమునకు పంపుతాను.
అమ్మా! నా తండ్రిగారి మాటలు మంచివా, మంచివి కావా అని నేను తర్కించను. తండ్రి గారి నిర్ణయం నాకు అనుకూలమా ప్రతికూలమా అని ఆలోచించను. తండ్రిగారి మాటలను తప్పకుండా పాటిస్తాను. పదునాలుగేళ్లు వనవాసము చేస్తాను. నా మాట నమ్మండి." అని నిశ్చయంగా అన్నాడు రాముడు.
అప్పుడు రాముని మాటలలో నమ్మకం కుదిరింది కైకకు. కైక మనసు సంతోషంతో పరవళ్లు తొక్కింది. కాని పైకి మాత్రం ఆ సంతోషమును బహిర్గతము చేయలేదు. రాముని తొందరపెట్టసాగింది.
“రామా! వెంటనే వేగముగా పరుగెత్తే గుర్రముల మీద దూతలను భరతుని మేనమామ ఇంటికి పంపు. భరతుడు వెంటనే ఇక్కడకు రావాలి. భరతుడు వచ్చువరకు నీవు ఆగనవసరం లేదు. నీవు వెంటనే అరణ్యములకు ప్రయాణమై వెళ్లు. నీ తండ్రి గారు స్వయంగా నీతో చెప్పలేదని సందేహించకు. పాపం మీ తండ్రిగారు నీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని తనలో తనే మధనపడుతున్నాడు. నీవు ఇక్కడ ఉంటే ఆ బాధతో నీ తండ్రి ఆహారము కానీ, నీరు కానీ ముట్టడు. కాబట్టి నీవు తక్షణం వనములకు వెళితేనే ఆయన ఆహారం తీసుకుంటాడు." అని పలికిన కైక వంక అసహ్యంగా చూచాడు దశరథుడు.
రాముని మొహంలోకి చూడలేక మరలా తల దించుకున్నాడు. రామునికి విషయం అర్థం అయింది. తన తల్లి కైకతో ఇలా అన్నాడు.
రాముని మొహంలోకి చూడలేక మరలా తల దించుకున్నాడు. రామునికి విషయం అర్థం అయింది. తన తల్లి కైకతో ఇలా అన్నాడు.
“అమ్మా! నేను ఎల్లప్పుడూ ధర్మమును తప్పను. తండ్రి మాటలను పాటిస్తాను. నా తండ్రి మాట ముందు ఈ రాజ్యము, భోగములు నాకు గడ్డిపరక తో సమానము. అమ్మా! నీకు ఇందాకే చెప్పాను. నా తండ్రి గారి మాటను నెరవేర్చడానికి నేను నా ప్రాణములను కూడా లెక్కచెయ్యను. ఇంక ఈ వనవాసము ఒక లెక్కలోది కాదు.
అమ్మా! తమరికి తెలియనిది ఏమున్నది. పుత్రునికి తండ్రికి సేవ చెయ్యడం, తండ్రి మాటను పాటించడం కన్నా వేరే ధర్మము ఏముంటుంది. తండ్రి గారి నోటివెంట నా వనవాసము గురించి ఒక మాట కూడా రాక పోయినా, నీవు చెప్పావు కాబట్టి ఆ మాటలు నా తండ్రి గారు చెప్పినట్టే భావిస్తాను.
అదికాదమ్మా! నేను నీ పుత్రుడను. నాపై నీకు సర్వాధికారములు ఉన్నాయి. భరతుని రాజ్యాభిషేకము గురించి నాతో ఒక్క మాట చెబితే సరిపోయేది కదా. దీనికి తండ్రి గారిని ఇంత బాధపెట్టవలెనా! అంటే ఈ రాముడి మీద తమరికి నమ్మకం లేదా అమ్మా! నాకు తమరు ఒకటీ, మా తండ్రి ఒకటీ కాదు. మీ ఇద్దరి మాటా ఒకటే. ఇంక నాకు సెలవు ఇప్పించండి. నేను వెళ్లి మా తల్లి కౌసల్య దగ్గర అనుమతి తీసుకొని, నా భార్య సీతను ఊరడించి, తరువాత అరణ్యవాసమునకు
వెళతాను.
అమ్మా! తండ్రిగారిని జాగ్రత్తగా చూచుకొనమని భరతునికి చెప్పమ్మా! ఎందుకంటే తండ్రికి సేవచెయ్యడం మన సనాతన ధర్మం.” అని అన్నాడు రాముడు.
రాముని ఒక్కొక్క మాటా వింటుంటే దశరథునికి దుఃఖము పొర్లుకొని వస్తూ ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నోటమాట రావడం లేదు. శరీరం వశం తప్పుతూ ఉంది. తూలిపోతున్నాడు. అయినా నిలదొక్కు ఉంటున్నాడు. రాముడు తండ్రి పాదములకు, కైక పాదములకు నమస్కరించాడు. తరువాత రాజ మందిరము నుండి బయటకు వచ్చాడు.
ఇదంతా ద్వారము వద్ద వేచి ఉన్న లక్ష్మణుడు వింటూ ఉన్నాడు. కోపంతో రగిలిపోతున్నాడు. కాని అన్నగారి మొహం చూచి కోపాన్ని అణుచుకుంటున్నాడు. రాముడు బయటకు రాగానే రాముని వెనకగా వెళ్లాడు. రాముడు అక్కడ అమర్చిన పట్టాభిషేక ద్రవ్యములకు నమస్కరించాడు. సమస్తము త్యజించిన యోగివలె అక్కడి నుండి వెళుతున్నాడు. ఛత్రమును చామరమును వద్దన్నాడు. తన వెంట వచ్చిన స్నేహితులను వెళ్లిపొమ్మన్నాడు. రథమును కూడా వద్దన్నాడు. పాదచారియై తన తల్లి కౌసల్య మందిరమునకు వెళ్లాడు.
ఇంతజరిగినా రాముని మొహం మీద ఉన్న చిరునవ్వు చెరగలేదు. అందరినీ చిరునవ్వుతూ పలకరిస్తున్నాడు. రాముని వెంట ఉన్న లక్ష్మణుడు మాత్రం కోపంతో రగిలిపోతున్నాడు. కోపం ఆపుకోలేకపోతున్నాడు. లక్ష్మణుని కోపం అతని మొహంలో స్పష్టంగా కనపడుతూ ఉంది.
రాముడు కౌసల్యాభవనములో ప్రవేశించేటప్పటికి ఆమె భవనమంతా ఆనందోత్సాహాలతో నిండి ఉంది. రాముడు తన మొహంలో ఏ మాత్రం వికారము కనపడ్డా ఆ ఆనందం అంతా విషాదంగా మారుతుందని గ్రహించి, తన పెదవుల మీద చిరునవ్వు చెరగనీయకుండా తల్లివద్దకు వెళ్లాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment