శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఇరువది మూడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 23)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఇరువది మూడవ సర్గ
రాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా బుద్ధిగా విన్నాడు లక్ష్మణుడు. కాని లక్ష్మణుని మనసులో కోపం అగ్ని వలె మండుతూ ఉంది. నుదురు ముడుతలు పడింది. దీర్ఘంగా శ్వాస తీస్తున్నాడు. అప్పుడు లక్ష్మణుని మొహం కోపంతో ఉన్న సింహంలా ఉంది. రాముని మొహంలోకి సూటిగా చూడలేక క్రీగంటితో చూస్తూ ఇలా అన్నాడు.“అన్నయ్యా! కేవలము తండ్రిమాటను పాటించడం కోసం ఏమైనా చెయ్యాలనో, తండ్రి మాటను ధిక్కరిస్తే లోకము ఏమనుకుంటుందో అనే భయంతోనూ నీవు అరణ్యములకుపోవడం అంత బాగాలేదు. పైగా దైవనిర్ణయము అంటున్నావు. దైవము ఇలా చేస్తుందా. దైవానికి ఒకరి మీద కోపము మరొకరి మీద ద్వేషము ఎందుకుం టుంది. కాబట్టి దీనిని దైవనిర్ణయము అనడానికి వీలులేదు. ఇదంతా కుయుక్తితో కైక, ఆమె మాటలకు తలూపిన దశరథుడు, చేసిన కుతంత్రము. ముందు వారిద్దరినీ అనుమానించాలి.
కైక, దశరథుడు పైకి ధర్మములు బోధిస్తూ, లోలోపల నీకు అపకారము చేస్తున్నారు. 'ఆడిన మాట తప్పకూడదు' అనే ధర్మాన్ని అడ్డుపెట్టుకొని నీ రాజ్యము అపహరిస్తున్నారు. ఇది అధర్మము. ఇది నీకు అర్ధం కావడం లేదు.
నా ఉద్దేశంలో కైక, దశరథుడు కలిసి ఆడిన నాటకము. లేకపోతే ఎన్నడో ఇస్తాను అన్న వరములు ఇప్పుడు కోరడం ఏమిటి? అసలు దశరథుడు వరాలు ఇస్తాను అని కైకకు మాట ఇచ్చాడు అని ఎవరికి తెలుసు. ఒకవేళ వరాలు ఇచ్చిఉంటే ఇన్నాళ్లు ఎందుకు ఊరు కుంటాడు. ఎప్పుడో తీర్చి ఉండేవాడు కదా! కాబట్టి కైక ఈ వరాలు కోరడం, వాటిని ఈ సమయంలో అడగడం, రాజు ఇవ్వడం, అంతా బూటకం. నిన్ను అడ్డు తొలగించుకోడానికి దశరథుడు, కైక కలిసి ఆడుతున్న నాటకము.
నీవు జ్యేష్టుడవు. రాజ్యము జ్యేష్టునికే చెందుతుంది. అది లోక ధర్మము. కాబట్టి నీవు అరణ్యములకు వెళ్లడం నేను సహించను. నన్ను మన్నించు. నీ పెడతోవ పట్టిస్తున్న ఈ ధర్మాచరణమును నేను
ఖండిస్తున్నాను. నీకు శక్తి యుక్తులు ఉండి కూడా, నీ తండ్రి దశరథుడు, నీ తల్లి కైక మాటలకు ఎందుకు తలూపుతున్నావో అర్థం కావడం లేదు. కైక చేస్తున్నది కపటోపాయము అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాని దానిని నీవు కపటము అని గ్రహించలేకపోవడం దురదృష్టము.
ధర్మంగా నడిచే వారిపట్ల మనం కూడా ధర్మంగా ప్రవర్తించాలి. కాని కైక, దశరథుడు లాంటి అధర్మ వర్తనులపట్ల ధర్మాచరణము యోగ్యము కాదు. పైగా అది నిందింపతగినది. రామా! నీ తండ్రి దశరథుడు, నీ తల్లి కైక నీ క్షేమమును కోరేవారు కాదు. వారు నీకు శత్రువులు. అటువంటి వారి కోరికను తీర్చాలని నీవు మనసులో కూడా తలచడం మహాపాపము. నీవు అన్నట్టే వారి చేయు పనులు దైవనిర్ణయములు అని అనుకొందాము. దైవనిర్ణయమైనా, అది అధర్మము అయినపుడు దానిని పాటించకపోవడమే ధర్మము.
చేతకాని వాళ్లు, పిరికివాళ్లు, దైవము మీద ఆధారపడతారు. మన లాంటి వీరులు, దైర్యవంతులు దైవము మీద ఆధారపడరు. దైవనిర్ణయములను లెక్క చెయ్యరు. నీ స్వశక్తితో, వీరత్వముతో నీవు దైవనిర్ణయమును ఎదిరించినా, దైవము నిన్ను ఏమీ చెయ్యదు, చెయ్యలేదు. ఎందుకంటే నీవు ధర్మము ప్రకారము నడుచుకుంటు న్నావు కాబట్టి. అయినా చూద్దాము. మానవునికి ఉండే శక్తి ఎంతో, దైవమునకు ఉండే శక్తి ఎంతో నేడు తేలిపోతుంది. ఎవరు గెలుస్తారో చూద్దాం. నీవు చెప్పినట్టు నీ పట్టాభిషేకమును ఏ దైవమైనా అడ్డు కుంటూ ఉంటే, ఆ దైవమును నేను నా స్వశక్తితో ఎదిరిస్తాను. నీ పట్టాభిషేకమును నేను జరిపిస్తాను. ఏ దైవము అడ్డుకుంటుందో చూస్తాను.
రామా! ఆ దైవమే కాదు, దిక్పాలకులు, ముల్లోకములు ఒకటై వచ్చినా సరే నీ పట్టాభిషేకమును ఆపలేరు. ఇంక ఆ దశరథుడు ఒక లెక్కా! ఎవరైతే రహస్యంగా నీకు పదునాలుగేళ్లు వనవాసము విధించారో, వారినే అరణ్యాలకు పంపుతాను. కైక ఆశలు ఈ జన్మలో నెరవేరకుండా చేస్తాను. నన్ను ఎదిరించిన వాడిని ఆ దైవము కూడా రక్షించలేదు.
రామా! నేను అంటున్నాను. నీవు అయోధ్యను వెయ్యి సంవత్స రాలు పాలిస్తావు. తరువాత నీ కుమారులు పాలిస్తారు. భరతుడు కలలో కూడా రాజు కాడు, కాలేడు. నీ తండ్రి రాజ్యము నీకు సంక్రమించినట్టే, నీ రాజ్యము నీ కుమారులకు సంక్రమిస్తుంది. అదే ధర్మము.
రామా! దశరధుడు కామాతురుడై ఉన్నాడు, ఆయన మనసు సరిగా పనిచెయ్యడంలేదు. అందుకని రాజు మాటలు పాటించనవసరము లేదు. నీవు పట్టాభిషేకము చేసుకోడానికి సిద్ధంగా ఉండు. నీకు రక్షణగా నేను ఉంటాను. ఎవరైనా అడ్డం వస్తే వారి అంతు తేలుస్తాను. రామా! నా చేతులు, నా చేతుల్లో ఉన్న ఈ ధనుర్బాణములు కేవలం అలంకారము కొరకే కాదు. శత్రువులను ఎదిరించడానికి కూడా పనికి వస్తాయి. నాతో శత్రుత్వము వహించి నాకు ఎదురు నిలిచిన వాడిని నేను బతకనివ్వను. ఆ దేవేంద్రుడు వచ్చి నా ఎదుట నిలిచినా సరే వాడి తలతెగి కిందపడటం తథ్యం.
ఓ శ్రీరామచంద్ర మహారాజా! నన్ను ఆజ్ఞాపించండి. ఈ మాదిరి అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుంటున్న దశరథుని మహారాజ పదవి నుండి తొలగించి నిన్ను అయోధ్యకు మహారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను. ఎవరడ్డు వస్తారో చూస్తాను. ఈ దాసుడు తమరి ఆజ్ఞ కోసరము ఎదురుచూస్తున్నాడు." అని ఆవేశంతో అంటున్న లక్ష్మణుని తన సౌమ్యమైన మాటలతో ఓదార్చి
“లక్ష్మణా! నన్ను ఆజ్ఞాపించమన్నావు. అందుకని ఆజ్ఞాపిస్తున్నాను. నీకూ నాకూ తండ్రిమాటను పాటించడమే ధర్మము. ఇదే నా నిర్ణయము." అని స్థిరంగా పలికాడు రాముడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము ఇరువదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment