శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - పదునైదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 15)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

పదునైదవ సర్గ

వేదపారంగతులైన బ్రాహ్మణులు పొద్దుటే పట్టాభిషేక మండపమునకు చేరుకున్నారు. అయోధ్యా నగర మంత్రులు, సేనాధిపతులు, పురప్రముఖులు అందరూ పట్టాభిషేక మంటపము వద్దకు వచ్చారు. అందరి ముఖంలో ఆనందం వెల్లివిరుస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు రామ పట్టాభిషేకము చూద్దామా అని ఉవ్విళ్లూరు తున్నారు.

రాముని జన్మ లగ్నము కర్కాటకము. అదే లగ్నంలో పుష్యమీ నక్షత్రంలో రాముని పట్టాభిషిక్తుని చేయవలెనని వేద పండితులు నిశ్చయం చేసారు. పట్టాభిషేక మంటపం చుట్టు పూర్ణకుంభాలు పెట్టబడి ఉన్నాయి. రాముడు ఎక్కడానికి స్వర్ణ రథం ఏర్పాటు చేసారు. రాముడు కూర్చోడానికి పులి చర్మము పరిచారు. అక్కడ ఉన్న బంగారు కలశములలో, గంగానదీ, యమునా నదీ, సరస్వతీ నదీ కలిసే చోట (త్రివేణీ సంగమము....ప్రస్తుతము అలహాబాద్) నుండి సేకరించిన జలము, ఇతర పుణ్యనదుల నుండీ, సరస్సులనుండీ, నదీనదముల నుండి, నాలుగు సముద్రముల నుండీ తెచ్చిన జలములను నింపి ఉంచారు.

పట్టాభిషేకమునకు కావలసిన లాజలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పూలు, దర్భలు అన్నీ మండపము దగ్గర బంగారు పాత్రలలో అమర్చి ఉన్నాయి. సర్వాభరణ భూషితలైన వేశ్యలు అటూ ఇటూ తిరుగుతూ అన్ని పనులలో పాలుపంచుకుంటున్నారు. రాముడు పట్టాభిషిక్తుడు కాగానే, సింహాసనము మీద కూర్చోగానే ఆయనకు అటు ఇటు వింజామరలు వేయుటకు రత్నఖచితమైన వింజామరలు సిద్ధంగా ఉంచారు. అయోధ్య సామ్రాజ్యమునకు కాబోయే చక్రవర్తి అయిన రామునికి పట్టుటకు పాలనురగలాగా తెల్లగా స్వచ్ఛంగా మెరిసిపోయే పట్టు గొడుగు సిద్ధంగా ఉంచారు.

యువరాజు రాముని సేవించుటకు తెల్లని ఎద్దు, తెల్లటి గుర్రము, మదము కారే ఏనుగు రాజద్వారము బయట కట్టివేయబడి ఉన్నాయి. పట్టాభిషేక సమయంలో రాముని పక్కన ఉండటానికి ఎనిమందిమంది కన్యముత్తయిదువలు సకలమైన అలంకారములు చేసుకొని పట్టాభిషేక మంటపము దగ్గర నిలబడి ఉన్నారు. పట్టాభిషేక సమయములో మ్రోగించుటకు రకరకాల వాద్యములు, వాద్యకారులు సిద్ధంగా ఉన్నారు. రాముడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కాగానే రాముని, రాముని వంశములో మూల పురుషులను కీర్తించుటకు వందులు, మాగధులు ఒక పక్కగా నిలబడి ఉన్నారు.

పట్టాభిషేకమునకు కావలసిన సంభారాలు అన్నీ, అన్నివిధాలా అమర్చి ఉన్నాయి కానీ పట్టాభిషేకము నిర్వహించే దశరథ మహారాజు, పట్టాభిషేకము జరిపించుకొనే రాముడు అక్కడలేరు. వారి రాక కోసం అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వారిలో వారు
గుసగుసలాడుకుంటున్నారు.

“సుముహూర్తము సమీపిస్తూ ఉంది. ఇంకా దశరథుడు, రాముడు, రాజమాతలు రాలేదు. ఏమయి ఉంటుంది. అసలు పట్టాభిషేకము జరుగుతుందా! లేదా!" అని వారిలో వారే అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది “మనమంతా పట్టాభిషేకము కొరకు అన్ని సంభారములు సమకూర్చుకొని సిద్ధంగా ఉన్నాము. దశరథమహారాజు ఇంకా రాలేదు. మనమంతా సిద్ధముగా ఉన్నట్టు దశరథమహారాజుకు ఎవరిద్వారా తెలియపరచాలి." అని తమలో తాము అనుకుంటున్నారు.

ఇంతలో సుమంత్రుడు అక్కడకు చేరుకున్నాడు. అక్కడ వేచి ఉన్న సామంతులను, పురప్రముఖులు సుమంత్రుని చూచి ఇలా అన్నారు.
“సుమంత్రా! ఏమి ఆలస్యము. రామ పట్టాభిషేకమునకు సుముహూ రము మించిపోడతున్నది. ఇంకా మహారాజు గారు రాలేదు. కారణం తెలియడం లేదు. నీ కేమైనా తెలుసునా!" అని అడిగారు. దానికి సుమంత్రుడు ఇలా అన్నాడు.

“దశరథమహారాజుగారి ఆజ్ఞ ప్రకారము నేను రాముని వద్దకు వెళుతున్నాను. మీరు అన్నట్టుగా సుముహూర్తము సమీపిస్తూ ఉంది. మీరందరూ సర్వ సంభారములతో ఎదురుచూస్తున్నారు. దశరథ మహారాజుగారు ఇంకా ఇక్కడకు రాలేదు. రాజుగారు పట్టాభిషేకమునకు సుముఖంగా ఉన్నాడా లేదా అన్న విషయం, రాజుగారు ఇంకా ఇక్కడకు రాకపోవ డానికి కారణము నాకూ తెలియదు. ఇప్పుడే నేను మహారాజు గారి వద్దకు వెళ్లి మీ మాటగా నేను మహారాజుగారిని అడుగు తాను. మీరందరూ దయతో ఓపికతో వేచిఉండండి.” అని పలికాడు.

వెంటనే సుమంత్రుడు రాజాంతః పురమునకు వెళ్లాడు. దశరథుని శయన మందిరములోకి ప్రవేశించాడు. బయట నిలబడి దశరథుని, ఆయన వంశమును స్తుతించాడు.
" ఓ దశరథమహారాజా! తమకు జయమగుగాక! ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, శివుడు, కుబేరుడు వారి కృపను తమ మీద ప్రసరింతురు గాక! రాజేంద్రా! పట్టాభిషేక ముహూర్తము సమీపించుచున్నది. బ్రాహ్మణులు, సామంతులు, పురప్రముఖులు పట్టాభిషేకమంటపము వద్ద తమరి రాక కోసరము వేచి ఉన్నారు. తమరు వెంటనే అక్కడకు రావలసినది..” అని పలికాడు.

అప్పుడు దశరథుడు బయటకు వచ్చి సుమంత్రుని చూచి “రాముని ఇక్కడకు తీసుకొని రమ్మని ఈమె నీకు చెప్పింది కదా! నీవు రాముని ఇక్కడకు ఎందుకు తీసుకొని రాలేదు. నా ఆజ్ఞ ఎందుకు పాటించలేదు. నేను చెబితే ఒకటీ కైక చెబితే ఒకటీనా. నేను నిద్రించుటలేదు. మేలుకొనే ఉన్నాను. నన్ను ఎవరూ మేలుకొలుపనవసరము లేదు. నీవు వెంటనే రాముని ఇక్కడకు తీసుకొని రా. వెళ్లు.” అని ఆజ్ఞాపించాడు దశరథుడు.

ఇంక చేసేది లేక సుమంత్రుడు రాజాజ్ఞ పాలించుటకు రాజాంత:పురము నుండి బయటకు వచ్చాడు. రాముని రాజభవనము వద్దకు వచ్చాడు.

రాముని మందిరమును కూడా శోభాయమానంగా అలంక రించారు. రాముని భవనము ఎదుట కూడా ప్రజలు గుమి గూడి రాముని చూడటానికి వేచి ఉన్నారు. సుమంత్రుని రథము వారిని దాటుకుంటూ రామ మందిరము వద్దకు సమీపించింది. అయోధ్యా పౌరులు, జానపదులు, రాముని మిత్రులు అప్పటికే అక్కడకు చేరుకున్నారు. రాముని పట్టాభిషేక మంటపమునకు తీసుకొని పోవుటకు ఏర్పాటు చేయబడిన సుందరంగా అలంకరించిన మద గజము (మదించిన ఏనుగు) ద్వారము వద్ద వేచి ఉన్నది. వీరందరినీ దాటుకుంటా సుమంతుడు రాముని అంతఃపురములోకి ప్రవేశించాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదునైదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)