శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఇరువది తొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 29)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఇరువది తొమ్మిదవ సర్గ
రాముడు తనను వనములకు తీసుకుపోవడానికి సుముఖంగా లేడని తెలిసిన సీత దుఃఖంతో ఇలా అంది.“నాధా! వనవాసములో కష్టములు ఉండక సుఖాలు ఉంటాయా. ఎన్ని కష్టనష్టములు ఉన్నను, ఎన్ని భయానక దృశ్యములు ఉన్నను, అవన్నీ తమరి ప్రేమ ప్రవాహములో కొట్టుకుపోతాయి కాని నాకు కష్టము కలిగించవు. తమరి సన్నిధిలో నేను నిరంతరమూ సుఖసంతోషాలతో ఉంటాను కానీ ఏమాత్రం దు:ఖము చెందను. నాధా! మీరుచెప్పిన క్రూరమృగములు అన్నీ తమరిని చూడగానే అల్లంత దూరముననే పారిపోవును గానీ మనలను ఏమి చేయవు. తమరు పెద్దల ఆదేశము మేరకు అరణ్యములకు వెళు తున్నారు. నేను కూడా తమరి వెంట వస్తాను. లేకపోతే ఇప్పుడే ఇక్కడే ప్రాణత్యాగము చేస్తాను. తమరు నా పక్కనుంటే సాక్షాత్తు ఇంద్రుడు కూడా నా వంక తేరిపారచూడలేడు. అదీ కాకుండా, భార్యకు భర్తతోడిదే జీవితము, భర్త లేనిదే భార్య బతుకజాలదు అని తమరే కదా నాకు బోధించినది.
అదీ కాకుండా, నాధా! నాకు చిన్నప్పుడు జ్యోతిష్కులు నాజాతకము చూచి నాకు వనవాసక్లేశము ఉన్నది అని చెప్పారు. కాబట్టి నేను తప్పక వనవాసము చేయాల్సి ఉంది. ఆ మాటలు విన్నది మొదలు ఎప్పుడెప్పుడు వన వాసమునకు వెళదామా అని నా మనసు ఉత్సాహపడుతూ ఉంది. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరుతూ ఉంది. అదీ మీ వెంట వనవాసము చెయ్యడం నాకు ఎంతో ఆనందదాయకము. కాబట్టి నన్ను కూడా తమరి వెంట అరణ్యములకు తీసుకొని వెళ్లండి.
నాధా! మీరు చెప్పినట్టు అరణ్యవాసములో ఎన్నో దు:ఖములు ఉంటాయి. కాని అవి అన్నీ అధైర్యపరులకు కానీ తమరి వంటి ధీరోదాత్తులకు కాదు కదా!
అవునండోయ్! మరిచి పోయాను. నేను మిథిలలో ఉండగా ఒక రోజు ఒక బిక్షుకి కూడా నా జాతకములో వనవాసము రాసి పెట్టి ఉన్నదని జోస్యము చెప్పినది. అవి అన్నీ ఇప్పుడు నిజము అవుతున్నాయి. నాడు జ్యోతిష్కుడు చెప్పినప్పటి నుండి, భిక్షుకి చెప్పినప్పటి నుండి ఎప్పుడెప్పుడు వనవాసమునకు వెళదామా అని ఉత్సాహంతో ఉన్నాను. కాబట్టి తమరి వెంట నన్నుకూడా వనములకు తీసుకొని వెళ్లండి.
ఏమండీ! ఏమండీ! అక్కడ నేను మిమ్ములను ఎంతో ప్రేమగా చూచుకుంటానండీ. మీరు ఎక్కడికి పోతే అక్కడకు వస్తాను. ఎందుకంటే నా భర్తయే నాకు దైవము. మీరు ఎక్కడ ఉంటే నేనూ అక్కడే కదా! ఒక్క వనవాసమే కాదు, మరణంలో కూడా నేను మిమ్ములను అనుసరించి వస్తాను. ఏనాడైతే తల్లి తండ్రులు తమ కుమార్తెను ఎవరికైతే మంత్రపూర్వకముగా ధారపోసారో ఆ నాటి నుండి ఆమె అతనికి సహధర్మచారిణి అవుతుంది. మరణానంతరము కూడా ఆమె అతనినే అనుసరిస్తుంది అని వేదములు ఘోషిస్తున్నాయి కదా! ఆ వేదవాక్కును అనుసరించి మీరు ఎక్కడకు పోతే అక్కడకు నేను మిమ్ములను ఒక భార్యగా అనుసరిస్తాను. చివరకు మరణంలో కూడా.
అది సరే. అసలు మీరు నన్ను ఎందుకు వద్దంటున్నారు. నేను మంచి దాననుగానా? నేను పతివ్రతనండీ. పైగా మీ భక్తురాలను. సుఖదు:ఖములను సమంగా చూడగలిగిన నేర్పు కల దానను. మీసుఖమే నా సుఖమనీ, మీ కష్టమే నా కష్టమనీ భావించే మనసు కలదానను. ఇవన్నీ మీకు తెలుసు కదా! అటువంటప్పుడు నన్ను వెంట తీసుకొని పోవడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు. కాబట్టి నేను మీ వెంట వస్తాను. లేకపోతే ఇప్పుడు ఇక్కడే ప్రాణములు వదులుతాను.” అని నయానా భయానా బతిమాలింది సీత.
సీత ఎన్ని చెప్పినను అటువంటి సుకుమారిని వనములకు తీసుకొని పోయి ఆమెను కష్టముల పాలు చేయడం ఇష్టం లేని రాముడు, ఆమె తన వెంట రావడానికి సుతరామూ ఒప్పుకోలేదు. సీతకూడా తన పట్టు విడవ లేదు. ఏడుపు మానలేదు. సీత ఏడుపు మానడానికి, ఆమెను ఓదార్చడానికి, ఆమెను తనతో రాకుండా నివారించడానికి రాముడు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment