శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఇరువది ఐదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 25)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఇరువది ఐదవ సర్గ
మనసు దిటవు పరచుకొన్న కౌసల్య కళ్లు తుడుచుకొని, ముఖం కడుక్కొని, పాదప్రక్షాళనము చేసుకొని ఆచమనము చేసి, రామునికి మంగళకరమైన పనులు చేయుటకు ఉపక్రమించింది.“రామా! నిన్ను అడవులకు వెళ్లకుండా ఆపుటకు సర్వవిధాలా ప్రయత్నించాను. కాని నీ పట్టు విడవకున్నావు. నాయనా రామా! ధర్మం తప్పకుండా, మంచి మార్గములో నడుస్తూ, వనవాసము పూర్తి చేసుకొని త్వరగా ఈ తల్లి వద్దకు చేరుకో! నీకు సదా శుభం కలుగుతుంది.
రామా! నీవు ఏ ధర్మ పరిరక్షణ కొరకు అరణ్యములకు వెళు తున్నావో, ఆ ధర్మమే నిన్ను సదా రక్షిస్తూ ఉండును గాక!
రామా! నీవు దేవాలయములకు వెళ్లి సమస్త దేవతలకు ప్రణామం చెయ్యి. దేవతలే నిన్ను సదా కాపాడుదురు గాక!
నీకు విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన అస్త్రములు, శస్త్రములు నిన్ను సదా కాపాడుగాక!
రామా! నీవు నమ్ముకున్న సత్యము, నీవు ఇప్పటి వరకూ చేసిన మాతృ సేవ, పితృ సేవ నిన్ను రక్షించును గాక!
ఓ రామా! మంగళ కరములైన సమిధలు, దర్భలు, అగ్నిహోత్రము, దైవ సన్నిది నిన్ను అనునిత్యమూ రక్షించు గాక!
ఈ ప్రకృతి లోని వృక్షములు, నదులు, పక్షులు, క్రూరమృగములు, సరీసృపములు నీకు ఎలాంటి హానీ చెయ్యకుండా, నిన్ను సదా కాపాడుగాక!
ఓ రామా! సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, విశ్వేదేవతలు, మరుత్తులు, మహర్షులు, బ్రహ్మదేవుడు, విధి, సూర్యుడు, దేవేంద్రుడు, లోకపాలకులు నీకు సదా మేలు చేయుదురు గాక!
ఓ రామా! నీకు కాలము, ఋతువులు, పక్షములు, మాసములు, సంవత్సరములు, రాత్రింబగళ్లు, సుముహూర్తములు నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుగాక!
ఓ రామా! స్మృతులు, శ్రుతులు, బృహస్పతి, సప్తఋషులు, నారదుడు, చంద్రుడు, కుమారస్వామి నిన్ను దయతో కాపాడుడుదురు గాక!
నీ అరణ్యవాస కాలములో దిక్కులు నిన్ను సదా కాపాడుగాక! అరణ్యములలో ఉన్న పర్వతములు, కొండలు, గుహలు, భూమి, ఆకాశము, స్వర్గము, నక్షత్రములు, గృహములు, వాటి అధిష్టాన దేవతలు నిన్ను రాత్రింబగళ్లు, రెండు సంధ్యవేళల్లో కాపాడుదురు గాక! నీవు అరణ్యములలో ఉన్న ప్రతిదినము, మాసము, సంవత్సరము, నీకు సదా సుఖము నిచ్చు గాక! నీ అరణ్య వాస కాలములో సమస్త దేవతలు, దైత్యులు, నిన్ను కాపాడుదురు గాక!
నీ వనవాస కాలములో నీకు రాక్షసుల నుండి, రుద్రులు, పిశాచముల నుండి క్రూరమృగముల నుండి నీకు భయము లేకుండు గాక! అరణ్యములో ఉన్న కోతులు, తేళ్లు, పాములు, ఇతర కీటకములు, అలాగే సింహములు, పులులు, ఏనుగులు ఇతర మాంసాహార జంతువులు నిన్ను బాధించకుండా ఉండు గాక!
ఆకాశంలోనూ, భూమి మీదా ఉందే సమస్త దేవతలు నీకు శుభం కలిగించు గాక! నీకు శత్రుభయం లేకుండు గాక!
రామా! అనునిత్యము నేను పూజించే విష్ణువు, మహేశ్వరుడు, పంచ భూతములు, నవగ్రహములు, నా పూజలకు సంతసించి నిన్ను సదా రక్షింతురు గాక!" అని కౌసల్య సమస్త దేవతల రక్షలను రామునికి అందించింది.
సమస్త దేవతలకు పూజలు చేసింది. బ్రాహ్మణుల చేత హెూమములు చేయించింది. మంగళాచరణము చేయించింది.
హెూమము చేసిన బ్రాహ్మణులకు సంతృప్తిగా దక్షిణలు ఇచ్చింది. కౌసల్యకు ఇంకా తృప్తి కలగ లేదు. తాను స్వయంగా మంగళా చరణము చేయసాగింది.
“ఓ రామా! వృత్రాసుర సంహార సమయంలో ఆ దేవేంద్రునికి కలిగిన మంగళము నీకు కలుగుగాక! పూర్వము అమృతము తీసుకు రావడానికి వెళుతున్నప్పుడు గరుత్మంతునికి అతని తల్లి వినత చేసిన మంగళాశాసనము నీకు కలుగుగాక! వామనావతారములో విష్ణువు మూడు అడుగులు కొలిచినప్పుడు విష్ణువునకు కలిగిన మంగళము నీకు కలుగు గాక!" అని రాముని తలమీద అక్షతలు వేసి ఆశీర్వదించింది కౌసల్య.
విశల్యకరణి అనే ఓషధిని రామునికి రక్షగా కట్టింది. కౌసల్య ఇవన్నీ చేస్తూ ఉంది కానీ లోపల దుఃఖము పొర్లుకొస్తూ ఉంది. బలవంతాన అణుచుకుంటూ ఉంది.
“రామా! నీవు వనవాసకాలమును అతి త్వరగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చి రాజ్యాధికారమును చేపట్టు. నన్ను, నీ భార్య సీతను సంతోషపెట్టు. రామా! శుభంగా వెళ్లిరా. నేను నిత్యమూ పూజించే శివుడు, విష్ణువు, మహర్షులు, సమస్త దేవతలు నిన్ను సదా రక్షించుదురు గాక! " అని కళ్ల నిండా నీళ్లు నిండగా కౌసల్య రామునికి వీడ్కోలు పలికింది.
రాముడు కూడా తల్లి కౌసల్యకు భక్తితో ప్రదక్షిణము చేసి పాదాభివందనము చేసి, ఆమె దగ్గర సెలవు తీసుకొని సీత ఉన్న మందిరమునకు వెళ్లాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము ఇరువది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment