శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - పదునెనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 18)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
పదునెనిమిదవ సర్గ
రాముడు తండ్రిగారైన దశరథ మహారాజు అంతఃపురములో ప్రవేశించాడు. లక్ష్మణుడు ద్వారము బయట నిలబడ్డాడు. ఉన్నతాసనముమీద కూర్చొని ఉన్న తండ్రి గారిని చూచాడు రాముడు. తండ్రి మొహములో ఆనందము కనపడటం లేదు. ఏదో చింత తండ్రిమొహంలో కనపడటం చూచాడు రాముడు.రాముడు ముందుగా తన తండ్రి దశరథునకు పాదాభి వందనము చేసాడు. తరువాత పక్కనే నిలబడిఉన్న తన తల్లి కైకకు పాదాభివందనము చేసాడు.
దశరథుడు రాముని వంక దీనంగా చూచాడు. “రామా!" అని ఒక్కమాట అతికష్టం మీద అన్నాడు. దుఃఖము పొంగుకొని రాగా తల వంచుకొని తలను చేత్తో పట్టుకొని కూర్చున్నాడు.
తండ్రిగారి పరిస్థితి చూచి రాముడు ఆశ్చర్యపోయాడు. ఇంతకు ముందు తండ్రిని ఇలాంటి పరిస్థితిలో ఎన్నడూ చూడలేదు రాముడు. ఎంతటి క్లిష్టమైన రాచకార్యములలో మునిగి ఉన్నా, తనను చూడగానే దశరథుడు “నాయనా! రామా! నా దగ్గరకు రా!" అని ఆప్యాయంగా పిలిచి తన పక్కనే కూర్చోపెట్టుకొనే వాడు. అలాంటిది ఇప్పుడు, తన పట్టాభిషేక సమయములో, ఇంతటి సంతోష సమయంలో, తండ్రిగారు ఇలా చింతా క్రాంతమైన ముఖంతో ఉండటం రామునికి ఆశ్చర్యం కలిగించింది. తనను ఎప్పుడూ సంతో షంగా పలకరించే తండ్రి ఇలా ముభావంగా ఉండటానికి కారణం తెలియక తల్లడిల్లిపోతున్నాడు రాముడు.
కైక వంక చూచాడు. “అమ్మా! తండ్రిగారికి నా వలన ఏమైనా అపరాథము జరిగిందా! నేను ఏమన్నా పొరపాటు చేసానా! నా మీద కోపంగా ఉండటానికి కారణమేమి? అమ్మా! నీవైనా తండ్రి గారికి నా మీద అనుగ్రహం కలిగేట్టు చెయ్యమ్మా! లేకపోతే ఎప్పుడూ నేనంటే ప్రసన్నంగా ఉండే తండ్రిగారు ఈరోజు నా మీద కోపంగా ఉ న్నారెందుకు?
అమ్మా! తండ్రిగారికి శరీరంలో బాగా లేదా! రాజవైద్యులను సంప్రదించారా అమ్మా! లేక మానసికంగా ఏమైనా బాధపడుతున్నారా! చెప్పమ్మా! అమ్మా! మానవులకు సుఖదు:ఖాలు సహజం కదమ్మా!
అమ్మా! వారి మేనమామ గారింట్లో భరతుడు, శత్రుఘ్నుడు క్షేమంగా ఉన్నారు కదా! వారి కేమీ కాలేదు కదా! అమ్మా! మీకు గానీ, మా తల్లి కౌసల్యకు గానీ సుమిత్రకు గానీ అసౌకర్యము ఏమీ కలగలేదు కదా!
అమ్మా! నాన్నగారి దు:ఖము పోగొట్టడానికి ఏమైనా చేస్తాను అమ్మా! తండ్రిగారు దుఃఖపడుతుంటే నేను క్షణకాలం కూడా జీవించలేనమ్మా! ఎందుకంటే నాకు ఈ జన్మను, ఈ శరీరాన్ని ఇచ్చింది
నా తండ్రి. ఈ శరీరం ఆయన అధీనము. ఆయన కోసం, ఆయన సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను.
అమ్మా! నాకు ఒక సందేహము. తమరికీ మా తండ్రి గారికీ ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా! మీరేమన్నా తండ్రిగారిని అనకూడని మాటలు అన్నారా! అమ్మా! నిజం చెప్పమ్మా! ఎందుకంటే నాకు ఊహ తెలిసిన తరువాత నా తండ్రిని నేను ఎప్పుడూ ఇటువంటి దీనస్థితిలో చూడలేదు." అని కైకను బతిమాలాడు రాముడు.
రాముని ఆవేదన చూచి ఇదే సమయము అని అనుకొంది కైక. తన మనసులో మాట బయట పెట్టింది.
“రామా! మీ తండ్రిగారికి శరీరంలో ఎలాంటి జబ్బూలేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. కాని తన మనసులో ఉన్న విషయం నీతో ఎలా చెప్పాలా అని మధనపడుతున్నారు. ఆ విషయం నీతో చెప్పడానికి భయపడుతున్నాడు కూడా." అని ఒక క్షణం ఆగింది కైక.
“చెప్పమ్మా! తండ్రిగారు నాతో చెప్పడానికి సంకోచిస్తున్న విషయం ఏమిటి? త్వరగా చెప్పమ్మా!" అని తొందర పెట్టాడు రాముడు.
“ఏమీ లేదు రామా! చాలా స్వల్పమైన విషయం. పూర్వము దేవాసుర యుద్ధంలో మీ తండ్రిగారు నాకు రెండు వరములు ప్రసాదించారు. ఆ వరములు ఇప్పుడు నేను కోరుకున్నాను. ఆ వరముల గురించి నీతో చెప్పడానికి భయపడుతున్నారు మీ తండ్రిగారు.
రామా! ధర్మము నీకు తెలుసుకదా! సత్యము పలకడం, ఆడినమాట తప్పక పోవడం ఉత్తములకు పరమ ధర్మము కదా! మీ తండ్రి నీ కోసరం ఆడినమాట తప్పుతాను అని అంటున్నాడు. ఇదేమి న్యాయం?" అని పలికింది కైక.
రామా! ధర్మము నీకు తెలుసుకదా! సత్యము పలకడం, ఆడినమాట తప్పక పోవడం ఉత్తములకు పరమ ధర్మము కదా! మీ తండ్రి నీ కోసరం ఆడినమాట తప్పుతాను అని అంటున్నాడు. ఇదేమి న్యాయం?" అని పలికింది కైక.
రాముడు “అమ్మా! ఆ వరాలు ఏమిటమ్మా.నాతో చెప్పమ్మా!" అని అడిగాడు.
"అవి నీకు దు:ఖము కలిగించేవి రామా! నీవు ఏమీ అనుకోనంటే చెబుతాను. విన్న తరువాత నన్ను దూషించకూడదు. అసలు ఈ వరాల సంగతి మీ తండ్రిగారే నీకు చెప్పాలి. కానీ నీకు చెప్పడానికి నీతండ్రి సంకోచిస్తున్నాడు." అని మరలా ఆగింది కైక.
ఈ సందిగ్ధము భరించలేకపోతున్నాడు రాముడు. “అమ్మా! నా సంగతి తెలిసికూడా నీవు ఇలా మాట్లాడటం తగునా అమ్మా! నా తండ్రిగారు చెబితే నేను నా ప్రాణములు కూడా గడ్డిపోచలాగా విడిచిపెడతాను. అగ్నిలో దూకమన్నా దూకుతాను. విషం తాగమన్నా తాగుతాను. సముద్రంలో దూకమన్నా దూకుతాను.
అమ్మా! నా తండ్రి ఏది చెబితే అది చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అమ్మా! నేను రెండు మాటలు మాట్లాడను. నాది ఒకే మాట. చెప్పమ్మా! నేనేం చెయ్యాలి? నా తండ్రి దు:ఖము ఎలా పోగొట్టాలి?" అని అడిగాడు రాముడు.
కైకకు లోలోపల ఎంతో సంతోషంగా ఉంది. రాముడు దారిలోకి వచ్చాడు అనుకొంది. తన కోరికలు తీరే సమయం ఎంతోదూరం లేదు అనుకొంది. మెల్ల మెల్లగా తన మనసులో ఉన్న కోరికలు బయటపెట్టింది.
“పూర్వము జరిగిన దేవాసుర యుద్ధములో నేను నీ తండ్రి దశరథుని పాణములు కాపాడినపుడు ఆయన నాకు రెండు వరములు ఇచ్చాడు. అవి ఇప్పుడు నేను కోరాను. అందులో మొదటిది భరతుని అయోధ్యకు పట్టాభిషిక్తుని చేయడం. రెండవది నీవు పదునాలుగు సంవత్సరములు నారచీరలు ధరించి,కందమూలములు తింటూ దండకారణ్యములో వనవాసము చెయ్యడం.
నీ తండ్రి మాటను నిలబెట్టాలన్నా, నీవు పలికిన మాటలు, చేసిన ప్రతిజ్ఞ, నిలుపుకోవాలన్నా నేను చెప్పినట్టు చేయాలి. మీ తండ్రి గారి ఆజ్ఞ పాలించడం నీ ధర్మం. అందుకని నీవు పదునాలుగు సంవత్సరములు వనవాసము చెయ్యాలి. నీ పట్టాభిషేకము కొరకు జరిగిన ఏర్పాట్లతోనే నీకు బదులు భరతునికి పట్టాభిషేకము జరగాలి. భరతుడు రాజ్యము చేస్తుంటే, అతనికి నీవు అడ్డు కాకుండా వనములలో ఉండాలి.
ఈ విషయములను నీతో చెప్పడానికి నీ తండ్రి సంకోచి స్తున్నాడు. బాధపడుతున్నాడు. అందుకని ఆయన మాటలుగా నేను నీకు చెబుతున్నాను. నీ తండ్రి మాటను నిలబెట్టి, ఆయన కీర్తిని ముల్లోకాలలో వ్యాపింపజెయ్యి. కుమారుడుగా అదే నీ కర్తవ్యము కదా! నీ సత్యవాక్పరిపాలన వలన నీ తండ్రి తరిస్తాడు." అని పలికింది కైక.
కైక ఆ మాదిరి చెబుతూ ఉంటే దశరథుడు కోపంతో రగిలిపోతున్నాడు. బాధతో కుమిలిపోతున్నాడు. రాముని మొహం చూడలేక సిగ్గుతో తలదించుకున్నాడు.
కాని రాముడు మాత్రము చిరునవ్వుతో తల్లి కైక మాటలు విన్నాడు. ఆయన మొహంలో ఏ మాత్రం బాధ కనిపించలేదు.
కాని రాముడు మాత్రము చిరునవ్వుతో తల్లి కైక మాటలు విన్నాడు. ఆయన మొహంలో ఏ మాత్రం బాధ కనిపించలేదు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదునెనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment