శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఇరువది నాల్గవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 24)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఇరువది నాల్గవ సర్గ
రాముని నిశ్చయమును విని కౌసల్య తల్లడిల్లి పోయింది. ఆమెకు నోట మాట రాలేదు. రాబోవు చీకటి రోజులను తలచు కొని తల్లడిల్లి పోయింది.“రామా! ప్రతిదినము మృష్టాన్నములు భుజించుటకు అలవాటు పడ్డవాడికి అడవులలో మున్యాశ్రమములలో వారు ఇచ్చు ఆకులు, దుంపలు, పండ్లతో ఎలా జీవిస్తావయ్యా? ఎందుకంటే అయోధ్యలో నీ సేవకులు కూడా నీ కన్నా మెరుగైన భోజనము చేస్తుంటారు కదా! నీవు అడవులలో కందమూలములు ఎలా తిని బతుకుతావు. రామా! నీవంటి సద్గుణములు కలవాడిని, ప్రీతి పాత్రుడిని, నిర్దయగా రాజు అరణ్యము లకు పంపుతున్నాడే ఇంక మాలాంటి వారిగతి ఏమిటి?
రామా! నీవు వెళ్లిన తరువాత అయోధ్యలో ఉండటానికి మాకు భయంగా ఉంది. రామా! నీవు చెప్పినది సత్యము. నీ లాంటి వాడినే అరణ్యము లకు పంపడానికి అనుకూలించిన విధి ఎంత బలమైనదో ఇప్పుడు తెలుస్తూ ఉంది. నీవు వెళ్లిన తరువాత నాకు ఇంక శోకమే మిగిలింది.
శోకాగ్నిలో నేను దగ్ధం అవడం తథ్యం.
శోకాగ్నిలో నేను దగ్ధం అవడం తథ్యం.
అందుకే రామా! నన్ను కూడా నీ వెంట తీసుకొని పో. నీవు ఎక్కడ ఉంటే అదే నాకు రాజమందిరము. పద పోదాము." అని రాముని వెంట వెళ్లడానికి కౌసల్య ఉద్యుక్తురాలయింది. తన కోసం శోకిస్తున్న తల్లి కౌసల్యను చూచి రాముడు ఇలా అన్నాడు.
“అమ్మా! అన్నీ తెలిసిన నీవే ఇలా మాట్లాడితే నేనేమి అనగలను. నీకు తెలుసు గదా! కైక తండ్రి గారిని తన చెప్పుచేతల్లో ఉంచుకొని తన ఇష్టం వచ్చి నట్టు ఆడిస్తూ ఉంది. ఇంక నువ్వు కూడా ఇక్కడ లేక పోతే తండ్రి గారి పరిస్థితి ఏమిటి? ఆయన బాగోగులు ఎవరు చూచుకుంటారు. నీవు కూడా తండ్రిగారిని విడిచి పెట్టి నాతో అరణ్యములకు వస్తే, తండ్రిగారు జీవించడం కల్ల. కాబట్టి నీవు తండ్రి గారిని చూచుకుంటూ ఇక్కడే ఉండాలి. పైగా, నీ వంటి పతివ్రత భర్తను వదిలిపెట్టి అరణ్యములకు పోవడం అత్యంత క్రూరమైన పని. అది నీ వంటి సౌశీల్యవతులకు తగని పని. ఒక భార్యగా జీవితాంతము భర్తకు సేవ చెయ్యడం నీ కర్తవ్యము. ధర్మము. కాబట్టి నీవు ఇక్కడే ఉండి నీ ధర్మమును పాటించమని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను." అన్నాడు రాముడు.
రాముని మాటలకు కౌసల్య బదులు చెప్పలేక పోయింది. “రామా! నీవు చెప్పినట్టే చేస్తాను." అని మాత్రం అనగలిగింది. తల్లి మాటలకు రాముడు సంతోషించాడు.
“అమ్మా! నా తండ్రి దశరథుడు మహారాజు, మనకందరికీ పూజనీయుడు. మనల నందరినీ ఆజ్ఞాపించగల సమర్థుడు. ఆయన ఆజ్ఞలను పాటించడం మన అందరి కర్తవ్యము. నీవు అలా చూస్తూ ఉండగానే పదునాలుగేళ్ల వనవాసము పూర్తి చేసుకొని వచ్చి నీ కళ్లముందు నిలబడతాను. నీవు ఏమి చెబితే అది చేస్తాను.” అని అన్నాడు రాముడు. కుమారుని మాటలకు కౌసల్యకు ఒక పక్క
దు:ఖము, మరొక పక్క సంతోషమూ కలిగాయి. కాని రాముడు వెళ్లిన తరువాత సవతుల మధ్య తన పరిస్థితి ఏమిటి అని తలచుకొనే సరికి ఆమెకు శరీరం వణికిపోయింది.
“రామా! నీవు లేని అయోధ్యలో నేను ఉండలేను. ఈ సవతులు నన్ను బతుకనీయరు. నన్ను నీ వెంట తీసుకొని పో" అని భోరున ఏడవసాగింది.
వ్యవహారం మరలా మొదటికి వచ్చింది అనుకున్నాడు రాముడు. తల్లి ఏడుపు చూచి రామునికి కూడా దు:ఖము పొర్లుకొచ్చింది. తల్లిని ఎలా ఓదార్చాలో ఆమె నిర్ణయాన్ని ఎలా మార్చాలో తెలియలేదు రామునికి. ఏమైనా సరే మరలా మరొక సారి చెప్పి చూద్దాము అని అనుకున్నాడు రాముడు. తల్లి కౌసల్యతో ఇలా అన్నాడు.
“అమ్మా! అదేంటమ్మా అలా అంటావు. నీవు అయోధ్యకు పట్టమహిషివి. దశరథునికి పట్టపురాణివి. నిన్ను ఎవరేమంటారు. అందరూ నీ కనుసన్నలలో మెలగవలసిన వారే కదా! పైగా మహారాజు గారు నేవెంటనే ఉంటారు. నీకు అన్యాయం ఎందుకు జరుగుతుంది. రాజు ఉన్నంతకాలము నీవు అనాధవు ఎలా అవుతావు? పైగా నా తరువాత యువరాజు భరతుడు ఉంటాడు. భరతునికి నీవు అంటే పంచప్రాణాలు. పైగా భరతుడు ధర్మనిరతి ఎక్కువగా కలవాడు. ఎవరి మాటా విని అధర్మమునకు తలవంచడు. ఇంక నీకేం భయం. కాబట్టి ఆ భయాలు, అనుమానాలు నీ మనసులో నుండి తొలగించు.
వృద్ధుడైన మహారాజును కనిపెట్టుకొని ఉండు. ఒక భార్యగా అది నీ ధర్మము, కర్తవ్యము.
అమ్మా! స్త్రీలు ఎన్ని వ్రతములు, ఉప వాసములు, పుణ్య కార్యములు చేసినను, భర్తను నిర్లక్ష్యము చేసిన భార్యకు నరక ప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రము చెబుతుంది కదా! అలాగే ఏ దేవతలకూ పూజలు చేయకున్నా ఏ వ్రతములు ఆచరించకున్నా, కేవలం భర్తను దైవంగా పూజించే భార్యకు ఉత్తమ లోకాలు కలుగుతాయి అని కూడా చెబుతారు కదా! భర్తకు అనుకూలవతిగా, ఆయనను జీవితాంతం విడిచిపెట్టకుండా ఉండటం భార్యకు పరమధర్మము అని వేదములు, శాస్త్రములు, శ్రుతులు, స్మృతులలో చెప్పబడింది కదా!
అమ్మా! నీవు అయోధ్యలో ఉండి తండ్రి గారిని సేవించు కుంటూ, నా క్షేమం కోసం వ్రతాలూ, పూజలూ చేస్తూ బ్రాహ్మణులను పూజిస్తూ ఉంటే నేను అరణ్యాలలో ఏ బాధా లేకుండా క్షేమంగా ఉంటానమ్మా! నీవు చేసే పూజలూ, వ్రతాలూ నన్ను సదా ఆపదలనుండి రక్షిస్తూ ఉంటయమ్మా! నీవు ఇలా చేసావనుకో ఈ పదునాలుగేళ్లు ఇట్టే గడిచిపోతాయి. నేను ఇక్కడ లేని లోటు నీకు తెలియదు. నేను వచ్చిన తరువాత నీవు ఎలా చెబితే అలా చేస్తాను.” అని తల్లిని బుజ్జగించాడు రాముడు.
కౌసల్య కొడుకు మాటలకు మారు మాటాడలేకపోయింది. కళ్లు తుడుచుకొంది.
“రామా! విధి బలీయమయింది. అంతకన్నా నీ నిశ్చయము బలమైంది. దానిని ఎవరూ మార్చలేరు. నీవు అరణ్యములకు క్షేమంగా వెళ్లిరా. నీకు నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. నీకు సదా క్షేమము కలుగు గాక! నీవు వచ్చిన తరువాత నా దుఃఖములు అన్నీ తొలగి పోతాయి అనే ఆశతో నీ రాక కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తూ ఉంటాను. కాని రామా! మా అందరి మాటను కాదని నిన్ను అరణ్యములకు వెళ్లమని ప్రేరేపించు చున్న ఆ దైవము యొక్క లీలలను ఎవరూ అర్ధం చేసుకోలేరు. రామా! నీ పద్నాలుగేళ్ల వనవాసము ఒక్కరోజులో గడిచిపోయి ఈరోజే నీవు వనములనుండి తిరిగి వచ్చే రోజు అయితే ఎంత బాగుంటుంది!' అని ఆశాభావంతో పలికింది కౌసల్య.
తనకు నమస్కరించిన రామునికి సదా మంగళం కలగాలని మనసారా ఆశీర్వదించింది.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment