శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఇరువది ఆరవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 26)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఇరువది ఆరవ సర్గ
తల్లి కౌసల్య నుండి ఆశీర్వాదములు పొందిన రాముడు అక్కడనుండి బయలు దేరాడు. ఇంక వనవాసమునకు వెళ్లడానికి మనస్సును సిద్ధం చేసుకుంటున్నాడు. కౌసల్య మందిరమునుండి బయటకు వచ్చాడు.రాత్రి అంతా ఉపవాసము చేసి జాగరణ చేసిన సీత ఉదయము రాముని రాకకై ఎదురు చూస్తూ ఉంది. "పట్టాభిషేక ముహూర్తము సమీపిస్తూ ఉంది. కాని రాముడు ఇంకా రాలేదు. కారణం ఏమయి ఉంటుంది" అని తనలో తాను తర్కించుకుంటూ ఉంది.
ఇంతలో రాముడు సీత ఉన్న మందిరములోకి ప్రవేశించాడు. రాముని ముఖంలో కనపడుతున్న బాధను, వ్యధను చూచి సీత మనస్సు కలత చెందింది. అప్పటిదాకా తనలో ఉన్న బాధను అతి కష్టం మీద అణిచి పెట్టుకున్న రాముడు సీతను చూడగానే ఇంక తట్టుకోలేక పోయాడు.
రాముని ముఖంలో కనిపిస్తున్న బాధను చూచి సీత "ప్రభూ! ఏమి జరిగింది. ఎందుకు మీరు మనసులో బాధపడుతున్నారు. ఈరోజు పుష్యమీ నక్షత్రము. తమరి పట్టాభిషేకము జరుగు రోజు. వసిష్ఠుల వారు సుముహూర్తము నిశ్చయించినారు కదా! ఆనందము గా ఉండక ఎందుకు మీరు బాధతో విలవిలలాడిపోతున్నారు. ఎంతటి విపత్కర సమయంలో కూడా తమరి ముఖంలో మాయని చిరునవ్వు ఈ సంతోష సమయంలో మాయమగుటకు కారణమేమి? కాబోయే యువరాజును స్తుతించుటకు నియమింప బడ్డ వంది మాగధులు కనపడటం లేదు. ఏమి కారణము?
ఇంకనూ పట్టాభి షేకము జరగలేదా! తమరి తల మీద మంగళకరమైన తేనె, పెరుగు బ్రాహ్మణులు అభిషేకించలేదా! తమరి వెంట అమాత్యులు, జానపదులు ఎందుకు అనుసరించి రాలేదు. తమరు కాలి నడకన వచ్చారు. పట్టాభిషేక చిహ్నముగా అలంకరించిన రథము ఏమయినది? మీరు వస్తూ ఉంటే మీ ముందు నడవ వలసిన మదగజము కనపడటం లేదు. అసలు తమరి ముఖంలో
పట్టాభిషేకము చేసుకొనబోవు రాకుమారుడి సంతోషము ఆనందము కనబడటం లేదు. కారణమేమి?" అని పరి పరి విధాల ప్రశ్నల వర్షం కురిపించింది సీత.
దానికిరాముడు ఇలా బదులు చెప్పాడు. “ఓ సీతా! నా తండ్రి నన్ను అరణ్యవాసమునకు వెళ్లమన్నాడు. నీకు ధర్మములు అన్నీ తెలుసు కదా! ఈ విపరీత పరిణామము ఎందు వల్ల సంభవించినదో వివరంగా చెబుతాను విను.
నా తండ్రి దశరథమహారాజు నిత్యసత్యవ్రతుడు. ఎన్నడూ ఆడిన మాట తప్పడు. నా తండ్రి నా తల్లి కైకకు పూర్వము రెండువరములు ఇచ్చాడట. నా పట్టాభిషేక వార్త విన్న కైక, నా తండ్రిని ఆ రెండు వరములు ఇవ్వమని కోరింది. అందులో మొదటి వరము నేను పదునాలుగు సంవత్సరములఱు అరణ్యవాసము చెయ్యాలి. రెండవ వరము నాకు మారుగా భరతునికి యౌవరాజ్య పట్టాభిషేకము జరగాలి. దానికి నా తండ్రి సమ్మతించాడు. నా తండ్రి ఆజ్ఞ మేరకు నేను వనవాసమునకు పోవుచున్నాను. ఈ మాట నీతో చెప్పిపోదామని వచ్చాను.
నేను లేని సమయములో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. యువరాజు భరతుని ముందు నా గురించి గానీ, నా గుణగణముల గురించి గానీ నీవు మాట్లాడకూడదు. ఎందుకంటే రాజులు తమ ముందు ఇతరులను పొగడటం సహించలేరు. ఇంకొకమాట. నిన్ను పోషించవలసిన బాధ్యత భరతునికి లేదు. నీవు భరతునికి అనుకూలంగా ఉన్నంత కాలమే నీవు ఇక్కడ క్షేమంగా, నిశ్చింతగా ఉండగలవు.
నా తండ్రి దశరథుడు వంశపారంపర్యముగా జ్యేష్టునికి చెందవలసిన రాజ్యమును, భరతునికి ఇచ్చాడు. కాబట్టి నీవు నీ మామగారు దశరథునికి, యువరాజు భరతునికి అనుకూలంగా నడచుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను వనవాసము వెళు తున్నాను. నీవు ధైర్యంగా ఉండు. నేను లేని సమయములో నీవు వ్రతములు, ఉపవాసవ్రతములు చేస్తూ ఉండు.
నీవు పొద్దుటే లేచి, పూజాదికములు అయిన తరువాత, నా తండ్రి దశరథునికి నమస్కరించడం మరిచిపోవద్దు. నా తల్లి, నీ అత్తగారు, వృద్ధురాలు అయిన కౌసల్య నేను అడవులకు వెళుతున్నాను అని కృంగి, కృశించి పోవుచున్నది. ఆమె యోగక్షేమములు చూడటం నీ ధర్మము. ఆమెను గౌరవించు. నా తల్లి కౌసల్య ఒకతేకాదు. నా తల్లులందరూ నీకు పూజనీయులే. వారి నందరినీ గౌరవించు.
నా తమ్ములు భరతుడు, శత్రుఘ్నుడు నీకు సోదర సమానులు మరియు పుత్రసమానులు. వారిని తగురీతిగా ఆదరించు. పైగా భరతుడు ఇక్ష్వాకుకులమునకు, అయోధ్యకు రాజు. అతని మీద పగ ద్వేషము పెంచుకోకు. సాధారణంగా రాజులు తమను సేవించేవారిని ఆదరిస్తారు. లేకపోతే ద్వేషిస్తారు. కాబట్టి భరతుని నువ్వు ఒక రాజుగా ఆదరించు. నీ ధర్మమును నువ్వు నిర్వర్తించు. ఈ పదునాలుగు సంవత్సరములు నువ్వు అయోధ్యలోనే ఉండు. నేను వనవాసమునకు పోతున్నాను అని మనసు కష్టపెట్టుకోకు. ధైర్యంగా ఉండు. నన్ను సంతోషంగా అరణ్యములకు సాగనంపు." అని అన్నాడు రాముడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment