శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఇరువది ఎనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 28)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఇరువది ఎనిమిదవ సర్గ
సీత తనతో కూడా వస్తే అరణ్యములలో ఆమె పడే అవస్థల గూర్చీ కష్ట నష్టములగూర్చీ ఆలోచిస్తున్నాడు రాముడు. ఆమెను ఎలాగైనాఆపాలని అనుకున్నాడు. సీతతో ఇలా అన్నాడు.ఓసీతా! నీవు ఉత్తమ కులములో పుట్టావు. సుకుమారంగా పెరిగావు. పుట్టింట్లో గానీ అత్తగారి ఇంట్లో గానీ ధర్మం తప్పకుండా సంచరిస్తున్నావు. ఇప్పుడు కూడా నామాట విని ఇక్కడే ఉండు. భర్త మాట వినడం భార్య ధర్మం కదా. అది నీకూ నాకూ సుఖప్రదము. అరణ్యములలో ఉండే బాధలు నీకు తెలియవు. నీమేలుకోరి చెబుతున్నాను. నా మాట విని నువ్వు ఇక్కడే ఉండు. నీకు ఏలోటూ రాదు.
చిన్నప్పటి నుండి సుఖములలో పెరిగిన దానవు. ఆ అడవులలో కలిగే కష్టములను తట్టుకోలేవు. అడవులలో సుఖము అనే మాట వినపడదు. అన్నీ కష్టాలే. ఎత్తైన కొండల మీది నుండి దుమికే సెల ఏళ్ల ధ్వనులు, పులుల గాండ్రింపులు, సింహగర్జనలు, అడవి ఏనుగుల ఘీంకారములు, భయంకరంగా ఉంటాయి. అడవులలో సంచరించు కూరమృగములు మానవులను చూడగానే మీద పడతాయి. వాటి బారి నుండి తప్పించుకోడం చాలా కష్టం.
పైగా నగరములలో ఉన్నట్టు అడవులలో రాచ మార్గములు ఉండవు. అన్నీ ముళ్లు రాళ్లతో నిండిన కాలి మార్గములే. పైగా తాగడానికి మంచి నీరు కూడా దొరకదు. తినడానికి తిండి దొరకదు. రాలి పడిన పండ్లు తినాలి. లేకపోతే దొరికినవాటితో కడుపు నింపు కోవాలి. ఒక్కోసారి అవీ దొరక్కపోతే ఉపవాసములు చెయ్యాల్సి ఉంటుంది. పగలంతా నడక. రాత్రి నేలమీద పడక. నిద్రపట్టదు. జీవితం దుర్భరంగా ఉంటుంది. కట్టుకోడానికి బట్టలు ఉండవు. నారచీరలు, ఆకులు కట్టుకోవాలి.
వనవాసవ్రతములో ఉన్నవారు నిత్యమూ దేవతలను, పితరులను, అతిధులను పూజించాలి. మూడుపూట్లాస్నానం చెయ్యాలి. స్వయంగా పూలు పండ్లు కోసుకొని రావాలి. ఋషులకు, మునులకు పెట్టాలి. మిగిలింది మనం తినాలి. అదీ మితంగా తినాలి. దొరికింది తినాలి. అది కావాలి ఇది కావాలి అంటే దొరకదు. అందుకే వనవాసము అత్యంత దుర్భరము. నీవు చేయలేవు.
ఇంకా సీతా! వనవాస సమయములో మనము ప్రకృతి వైపరీత్యములను తట్టుకోవాల్సి ఉంటుంది. పెనుగాలులు, వర్షాలు, గాడాంధకారమైన చీకటి, ఆ చీకట్లో సంచరించే వివిధ రకాలైన విషము చిమ్మే పాములు, దీనికి తోడు భయంకరమైన ఆకలి దప్పులు, సకాలమునకు దొరకని ఆహారము, ఇవన్నీ అంతులేని బాధలు...... వనవాసములో కలుగుతాయి. వాటిని నీవు తట్టుకోలేవు.
వీటికి తోడు వ్యాధులు కలిగించు కీటకములు, దోమలు, భయంకరమైన విషపూరితములైన తేళ్లు, స్వేచ్ఛగా సంచరించు అరణ్యములలో నీవు ఒక్క క్షణమైనా ఉండలేవు. అరణ్యములలో నివసించు వారు కామ, క్రోధములను విడిచి పెట్టి మనసును తపస్సుమీదనే లగ్నం చేయాలి. భయము అనే మాటను మనసులోకి రానీయకూడదు. అది నీ బోటి దానికి సాధ్యం కాదు. కాబట్టి నీ వంటి సుకుమారికి అరణ్యవాసము యోగ్యము కాదు. నీవు ఇచ్చటనే వ్రతములు, ఉపవాసములు చేస్తూ నా క్షేమమును కోరుతూ ఉండు. నేను క్షణములో వనవాసమును పూర్తి చేసుకొని నీ చెంత వాలుతాను.” అని వనవాసములోని కష్టనష్టముల గురించి వివరంగా చెప్పాడు రాముడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment