శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - పన్నెండవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 12)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
పన్నెండవ సర్గ
కైక మాటలు విన్న దశరథుడికి నోటమాట రాలేదు. అలాగే నిశ్చేష్టుడయ్యాడు. ఇది కలా నిజమా అనే భ్రమలో పడ్డాడు. లేక తనకేమన్నా చిత్తభ్రమ కలిగిందా లేక తనకు ఏమన్నా మానసిక వ్యాధి సోకిందా అని అనుమానపడ్డాడు. దశరథుని మనసు, కైక తన మాటలతో కొట్టిన దెబ్బను తట్టుకోలేకపోయింది. క్రమ క్రమంగా స్పృహ కోల్పోయాడు. కైక చల్లని నీరు తెప్పించి మొహాన చిలకరించింది.కొంచెం తేరుకున్నాడు దశరథుడు. కళ్లుతెరిచాడు. కైకను చూచాడు. “ఛీ ఛీ పాపాత్మురాలా నీవా" అంటూ మరలా సృహ తప్పాడు. చాలా సేపటివరకూ అలాగే ఉన్నాడు. కైక తగు ఉపచారములు చేసి స్పృహ తెప్పించింది. మెల్లిగా లేచి కూర్చున్నాడు. జరిగిందంతా కొంచెం కొంచెం గుర్తుకు వస్తూ ఉంది. కైక వరాలు కోరడం వరకూ గుర్తుకు వచ్చింది. కోపంతో ఊగిపోయాడు. కైక వంక చూచి ఇలా అన్నాడు.
"ఓసి దుర్మార్గురాలా! నీవేనా ఈ మాటలు అన్నది. నా రాముడు కానీ, నేను కానీ, నీకు ఏమి అపకారము చేసాము. మాకు ఎందుకు ఇంతటి దారుణమైన శిక్ష విధిస్తున్నావు. తాను పుట్టినప్పటినుండి రాముడు నిన్ను తన కన్నతల్లి కన్నా మిన్నగా భావించాడు కదా. అలాంటి రామునికే నీవు ద్రోహం తలపెడతావా! ఇది నీకు న్యాయమా! నీవు రాచ పుట్టుక పుట్టావని, ఉత్తమ క్షత్రియుని కుమార్తెవని నిన్ను వివాహం చేసుకొని మా కుటుంబంలోకి తీసుకొని వచ్చాను. కాని ఏ ఇంటి గడప తొక్కావో ఆ ఇంటి నాశనమునే కోరుతావు అని అనుకోలేదు. ఒక భయంకర విషనాగును తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు అయింది.
అది సరే. రాముని వనములకు పంపమన్నావు కదా! లోకము అంతా రాముని సకల సద్గుణ సంపన్నుడు అని కీర్తిస్తుంటే, అతనిలో ఏ దోషము చూపి నేను రాముని వనములకు పంపాలి. ఓ కైకా! నీకు తెలుసో లేదో! నేను నా భార్యలైన కౌసల్యను, సుమిత్రను, నిన్ను సైతం వదిలిపెడతానేమో గాని రాముని మాత్రం వదలను తెలుసా! రాముని చూస్తే నాకు పోయిన ప్రాణాలు లేచి వస్తాయి. రాముడు కనపడక పోతే నాకు పై ప్రాణాలు పైకేపోతాయి. ఎందుకంటే సూర్యుడు లేకుండా లోకాలు ఉంటాయేమో కాని, నీరు లేకుండా పంటలు పండుతాయోమే కానీ, రాముడు లేకుండా నేను క్షణకాలం కూడా బతకలేను. ఇది యదార్థము.
కైకా! కోపంలో ఏదేదో అన్నాను. నన్ను క్షమించు. నీ పాదాలంటి వేడుకుంటున్నాను. నీ మంకు పట్టు వదిలిపెట్టు. ఇంకేమన్నా వరాలు కావాలో కోరుకో ఇస్తాను. " అని కైక మొహంలోకి చూచాడు.
కైక మాట్లాడలేదు. మొహం అటు తిప్పుకుంది. మరలా దశరథుని కోపం తారస్థాయికి చేరింది.
"ఓసి దుర్మార్గురాలా! అసలు ఇంతటి పరమదారుణమైన కోరిక కోరాలనే ఆలోచన నీకు ఎలా వచ్చిందే!" అని అరిచాడు.
అంతలోనే తేరుకొని "అలా కాదులే! ఆ! నాకు తెలిసిందిలే! నాకు భరతుని మీద ఎంత ప్రేమ ఉందో పరీక్ష చేద్దామని అలా అన్నావు కదూ! అంతే అయి ఉంటుంది. లేకపోతే అలాంటి వరాలు ఎందుకు కోరతావు! ఎందుకంటే నీవు ఇదివరకు మాట్లాడేటప్పుడు 'రాముడే నా పెద్ద కుమారుడు. భరతుడు నా రెండవ కుమారుడు' అని ఎన్నిసార్లు నువ్వు అనలేదు. ఆ మాటలు మేమందరమూ విని ఎంతో సంతోషించాము కదా! ఇప్పుడు కూడా అలాగే నన్ను పరీక్షించడానికి అలా అంటున్నావు అని నాకు తెలుసు. అలాగే అగుగాక! లేకపోతే నీకు రాముని మీద ద్వేషభావం ఎందుకు ఉంటుంది.
ఏమో! అది సరే! రాముని పట్టాభిషేక వార్త విని రాముడు అంటే పడని వాళ్లు నీకు ఏమన్నా దుర్బోధలు చేసారా! ఆ మాటలు విని నువ్వు కోపగృహంలో పడుకున్నావా! కైకా! నీవు వివేకము కలదానవు. నీతి మంతురాలివి. ఎవరో చెప్పిన మాటలు వినవచ్చునా! కైకా! నీవు ఇదివరకు ఇలాంటి మాటలు మాట్లాడావా! అందుకే నీవు ఇలాంటి కోరికలు కోరావు అంటే నమ్మలేకపోతున్నాను. నా మీద దయయుంచి ఇదంతా నిజం కాదని చెప్పు. నా మనసు కుదుటపడుతుంది.
ఓ కైకా! నీవు చిన్నప్పటినుండి రాముని, భరతుని నీ ఒడిలో కూర్చోపెట్టుకొని ఎన్నో కథలు చెప్పావు కదా! నీ మెత్తటి ఒడిలో కూర్చున్న రాముడు ముళ్లపొదలతో నిండిన అడవులలో ఎలా ఉండగలడు అని అనుకుంటున్నావు. రాముడు మాత్రం తక్కువ వాడా! తన కన్నతల్లి కౌసల్య కన్నా నీకు ఎక్కువ సేవలు చేసాడు కదా! అలాంటి రాముని దూరంగా ఉంచాలని ఎందుకు అనుకుంటున్నావు? నీకు ఎంతో మంది దాసదాసీ జనము ఉన్నా నీకు భక్తితో ఎన్నో సేవలు చేసాడు కదా రాముడు. అసలు రాముడు తప్ప నీకు అత్యధికంగా సేవలు చేసిన వాళ్లు వేరే ఎవరు ఉన్నారో చెప్పు.
పోనీ రాముడు ఏమన్నా అకృత్యాలు చేసాడా అంటే ... అదీ లేదు. రాముడు అయోధ్య ప్రజలందరికీ ప్రియమైన వాడు. తాను చేసిన మంచి కార్యములకు అందరి చేతా మన్ననలు పొందిన వాడు. అతని మీద కొంచెం కూడా అపనింద పడే అవకాశము లేదు. మరి ఎందుకు రాముని అరణ్యవాసము చెయ్యమంటున్నావు. ఏ కారణం లేకుండా అలా ఎందుకు అడిగావు.
ఓ కైకా! రాముడు ఎటువంటి వాడో నీకు తెలుసు. అయినా మరొకసారి చెబుతాను విను. రాముడు తన సత్యసంధతతో లోకాలను, తన దాన ధర్మములతో దీనజనమును, తన శుశ్రూషులతో గురువులను, తన వీరత్వముతో శత్రువులను జయించాడు. సత్యము, దానము, ఏకాగ్రత, త్యాగము, మైత్రి, శౌచము, మంచితనము, విద్య, గురువులకు శుశ్రూష, ఇవన్నీ రామునికి సహజంగా పుట్టుకతో వచ్చిన గుణాలు. కపటము అనేమాటకు రామునికి అర్థం తెలియదు. అటువంటి రామునికి అపకారము చెయ్యవలెనని దుర్బుద్ధి నీకు ఎలా పుట్టింది.
కైకా! రాముడు ఎవ్వరితోనూ పరుషంగా మాట్లాడటం నేను చూడలేదు. అందరితో ఎంతో ప్రియంగా మాట్లాడేవాడు. అలాంటి రామునితో నీ కోసం పరుషంగా ఎలా మాట్లాడమంటావు. అడవులకు పో అని ఎలా చెప్పమంటావు?
ఓ కైకా! మరలా వేడుకుంటున్నాను. నాకా వయసు అయిపోయింది. వృద్ధుడను అయ్యాను. ఇప్పుడు నాకు రాముడే దిక్కు. ఈ వయసులో నాకు రాముని దూరం చెయ్యకు. నువ్వు కావాలంటే నా రాజ్యము యావత్తు నీకు ధారపోస్తాను. రాముని మాత్రం నాకు విడిచిపెట్టు.
ఓ కైకా! నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. ఈ వృద్ధుని మీద కోపం మాను. రాముని విడిచిపెట్టు నా ప్రాణాలు కాపాడు. ఇదే నా కోరిక. నా ఆఖరి కోరిక మన్నించు.” అని కైక పాదాల మీద పడిపోయాడు దశరథుడు.
దశరథుని దీన మైన మాటలు కైకలో ఎలాంటి మార్పును తీసుకురాలేకపోయాయి. స్వార్ధం ఆమె హృదయంలో కరుడు గట్టిపోయింది. అందుకే దశరథుడు ఎంత దీనంగా వేడుకున్నాడో అంత కఠినంగా ములుకుల వంటి మాటలు మాట్లాడింది.
"ఓ దశరథమహారాజా! నీవు వీరుడవు. యుద్ధరంగంలో నిన్ను రెండు సార్లు కాపాడి నీ ప్రాణాలు రక్షించినందుకు నాకు రెండు వరాలు ఇస్తాను అన్నావు. ఆ వరాలు ఇప్పుడు కోరాను. ఏవోవో మాటలు చెప్పి నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నావు. ఇది నీకు ధర్మమా! ఇది ధర్మాత్ములు చేసే పనేనా! ఆడిన మాట తప్పడానికి ప్రయత్నించే నీవు ధర్మాత్ముడివా! ఈ విషయం నీవు భక్తితో పూజించే ఋషులకు, మునులకు చెప్పు.
'అయ్యా! నా భార్య కైక నా ప్రాణాలను రక్షించింది. కైక అనుగ్రహము వలననే నేను బతుకుతున్నాను. అలాంటి కైకకు నేను ఇచ్చిన మాటను తప్పాను.' అని చెప్పు. వాళ్లు నిన్ను ధర్మాత్ముడు అంటారా! లేక మాట తప్పిన వాడంటారా!
ఓ దశరథ మహారాజా! ఆడిన మాట తప్పి నువ్వు నీ వంశమునకు, నీ పూర్వీకులకు కళంకము తీసుకొని వస్తున్నావు. ఆడిన మాట కోసం శిబి చక్రవర్తి తన శరీరమునే కోసి ఇచ్చాడు. అలర్కుడు తన నేత్రములను దానం చేసాడు. వారంతా నీ వంశములోని వారే. సముద్రుడు దేవతలకు ఇచ్చినమాట ప్రకారము చెలియలి కట్ట దాటడం లేదు. వారంతా ఆడిన మాటకు కట్టుబడి ఉన్నారు కదా! నీకేమయింది. ఇచ్చిన వరాలను వెనక్కు తీసుకుంటున్నావు. నీ దుర్బుద్ధి నాకు తెలుసు. రాముని యువరాజుగా చేసి కౌసల్యను పట్టపురాణిగా చేసి. నన్ను నా కుమారుని అనాధలుగా చెయ్యాలని చూస్తున్నావు.
ఇంతెందుకు, ఓ దశరధమహారాజా! నేను అడిగింది ధర్మమ అధర్మమో, సత్యమో అసత్యమో, నాకు అనవసరము. మీరు నాకు రెండు వరాలు ఇస్తాను అన్నారు. ఆ వరాలు నాకు ఇవ్వాలి అంతే. దీనికి తిరుగు లేదు. నా మాటలు లక్ష్యపెట్టకుండా రామునికి పట్టాభిషేకము చేస్తే నేను నీ ఎదుటనే విషం తాగి చస్తాను. తన కుమారుడు యువరాజు అని విర్రవీగుతున్న నా సవతి కౌసల్యకు నమస్కారం చేసే కంటే చావడం మేలు.
ఓ దశరథ మహారాజా! నా మీద నా కొడుకు భరతుని మీద ఒట్టుపెట్టుకొని చెబుతున్నాను. రాముడు అరణ్యములకు వెళ్లాలి. నా కుమారుడు యువరాజు కావాలి. అంతే. ఇంక దేనికీ నేను ఒప్పుకోను. ఆ రెండు తప్ప ఈ లోకంలో ఏవీ నాకు అక్కరలేదు. తరువాత తమరి ఇష్టం.” అని పలికి కైక మౌనంగా ఉండిపోయింది.
కైకేయి మనోనిశ్చయము విని దశరథుడు నోటమాట రాకుండా మౌనంగా ఉండిపోయాడు. భరతుని పట్టాభిషేకము కన్నా రామ వనవాసము దశరథుని మనసు బాగా కలచి వేసింది. అటువంటి దుర్గార్గపు వరములు కోరిన కైక వంక చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. దశరథునికి మతిభ్రమించినట్టు అయింది. పిచ్చివాడి మాదిరి దిక్కులు చూస్తున్నాడు. మూర్ఛరోగి మాదిరి వణుకుతున్నాడు. ఉన్మాదిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఏమి చేస్తున్నాడో తెలియని పరిస్థితి. అమాయకంగా కైక వంక చూచాడు.
“ఓ కైకా! నీకు ఇటువంటి దుర్మార్గపు ఆలోచన ఎవరు చెప్పారు? ఒకవేళ ఎవరైనా నీకు దుర్బోధ చేసారే అనుకో! నువ్వు సిగ్గు లేకుండా నన్ను అడుగుతావా! నీకే మన్నా దయ్యం పట్టిందా. లేక
పిశాచము ఆవహించిందా. ఇంత విపరీతంగా ప్రవర్తిస్తున్నావు. నీకు చిన్నప్పటినుండీ ఇలాంటి విపరీతమైన ఆలోచనలు ఉన్నట్టు మీ వాళ్లు నాకు చెప్పనేలేదు. అయోధ్య వచ్చిన తరువాత కూడా నువ్వు ఇలా విపరీతంగా ప్రవర్తించలేదు. ఈరోజు నీకేం పుట్టింది. ఇలా మాట్లాడుతున్నావు.
ఇంతకూ నీకు ఎవరి వల్ల భయము. రాముని వల్లనా! లేకపోతే భరతునికి పట్టాభిషేకంతో ఊరుకోక రాముని వనవాసము ఎందుకు కోరుతున్నావు. రాముడంటే నీకు ఎందుకు అంత భయం? కైకా! మరలా చెబుతున్నాను. నాకు, నా కుమారుడు రామునికి, నీ కుమారుడు భరతునికి, అయోద్యకు క్షేమం కోరేదానివయితే నీవు కోరిన వరములు ఉపసంహరించుకో. బాగుపడతావు."
అప్పటిదాకా సౌమ్యంగా ఉన్న దశరథుడుఒక్కసారిగా రెచ్చిపోయాడు. తిట్టడం మొదలెట్టాడు.
"ఓసి పాపాత్మురాలా! క్రూరురాలా! క్షుద్రురాలా! దుర్మార్గురాలా! నాలో నా రామునిలో నీకు ఏం దోషాలు కనపడ్డాయే! మేము నీకు ఏం ద్రోహం చేసామే! నీకు తెలుసో లేదో. భరతుని హృదయం నాకు బాగా తెలుసు. రాముని కాదని భరతుడు రాజ్యాభిషేకమునకు ఎంతమాత్రమూ అంగీకరించడు. నీ కొడుకు సంగతి నీకు బాగా తెలియదు. రాముని కన్నా భరతునికి ధర్మములు ఎక్కువ తెలుసు. ధర్మాచరణములో రాముని కన్నా భరతుడే మిన్న.”
దశరథుడు వెంటనే దీనంగా మారిపోయాడు.
"కైకా! కైకా! నేను రాముని వద్దకు పోయి 'రామా! నీవు అరణ్యములకు పోవాలి' అని ఎలా చెప్పగలను. అలా చెప్పిన తరువాత రాముని మొహం ఎలా చూడగలను. అది అటుండనీ. నేను రామ పట్టాభిషేక నిర్ణయాన్ని అందరితో చర్చించి వారి ఆమోదము పొందిన తరువాతనే తీసుకున్నాను. సామంత రాజులందరినీ ఆహ్వానించాను. ఇప్పుడు నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటే వాళ్లందరూ ఏమంటారు? ఈ ప్రకారంగా క్షణక్షణమూ నిర్ణయాలు మార్చుకొనేవాడు ఇన్నాళ్లు అయోధ్యను ఎలా పరిపాలించాడు అని హేళన చేయరా! అది నీకు ఇష్టమా! ఇప్పుడు రాముడు వనవాసమునకు వెళితే, రేపు పురప్రముఖులు అంతా వచ్చి “మా రాముడు ఏడీ!" అని అడిగితే నేను వారికి ఏమని సమాధానము చెప్పగలను.
“అయ్యా! నా భార్య కైక మాట విని రాముని అరణ్యములకు పంపాను" అని చెబితే ఎవరూ నా మాట వినరు. దశరథుడు అబద్ధం చెబుతున్నాడు అని అనుకుంటారు. అది నీకు సమ్మతమా! కౌసల్య వచ్చి నా కుమారుడు రాముని అరణ్యములకు ఎందుకు పంపావు? కారణం ఏమిటి? అన్ని నన్ను నిలదీస్తే ఆమెకు నేను ఏమని సమాధానం చెప్పగలను. నా మూడోభార్య మాటవిని రాముని అరణ్యములకు పంపాను అని చెబితే నాగురించి కౌసల్య ఎంత నీచంగా అనుకుంటుంది. అది నీకు సమ్మతమా!
కైకా! నీకుమారునికి పట్టాభిషేకము అంటే ఏదో నీ కుమారునికి మేలు చేస్తున్నావు అనుకోవచ్చు. కాని రాముని అరణ్యములకు పంపే హక్కు నీకూ నాకూ ఎక్కడిది! ఆలోచించు. నా కుమారుని అడవులకు పంపే అధికారము మీకు ఎక్కడిది అని కౌసల్య నన్ను నిలదీస్తే, నేను ఏమని సమాధానము చెప్పను?
కైకా! నీకు ప్రీతి కలిగించడం కోసరం నేను కౌసల్యను ఎంతగా నిరాదరించానో నీకు తెలుసు కదా! ఆమె నాకు సేవలు చెయ్యడానికి వస్తే నీ మీద ఉన్న వల్లమాలిన ప్రేమతో ఆమెను నిరాకరించాను. ఎవరి కోసం? నీ కోసమే కదా! కనీసం ఆ కృతజ్ఞత కూడా నీకు లేదా! అవునులే! చేసిన మేలు మర్చిపోయే వాళ్లకు ఎంత చేసి మాత్రం ఏమి లాభం! రోగంతో బాధపడేవాడికి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినట్టు అయింది.
కౌసల్య సంగతి అటుంచు. నీ మాటలు విని నేను రాముని అడవులకు పంపితే, సుమిత్ర నా గురించి ఏమనుకుంటుంది! ఇంక నన్ను నమ్ముతుందా! తనకుమారుడు లక్ష్మణునికి కూడా ఇదే గతి పడుతుంది అని అనుకోదూ!
వీళ్లు సరే కన్న తల్లులు. మరి రాముని నమ్ముకొని పుట్టింటి నుండి అయోధ్యకు వచ్చిన రాముని అర్థాంగి సీత. ఆమె గతేం కావాలి. భర్త అరణ్యవాసము, మామగారి దుర్మరణ వార్తలు సీత వినడం అవసరమా! ఎందుకంటే రాముడు అడవులకు పోతుంటే ఆ సన్నివేశము చూసి సీత రోదిస్తుంటే నా గుండెలు బ్రద్దలవుతాయి. నేను మరణించడం తథ్యం. అప్పుడు నీవు, హాయిగా విధవరాలుగా, కొడుకుతో సహా రాజ్యము ఏలుకుంటావు. ఇదేగా నీవు కోరుకొనేది. అదే నీ కోరికల ఫలితం.
కైకా! నీ అందచందాలు చూసి నీవు మంచిదానవు అనుకున్నాను కానీ నీ కడుపులో ఇంత విషం ఉందనుకోలేదు. కడుపులో ఇంత విషం దాచుకొని నాతో ఇన్నాళ్లు ఎన్నో ప్రీతికరమైన మాటలు మాట్లాడావన్నమాట! ఎంత మోసం? అవునులే. నిన్ను అనుకోని ఏం లాభం. నా ఖర్మ ఇలా కాలింది.
'రాజ్యము ఇస్తాననని ఆశపెట్టి తుదకు కొడుకును అడవులకు పంపిన దుర్మార్గుడైన తండ్రి ఈ దశరథుడు' అని లోకులందరూ నన్ను ఆడిపోసుకుంటుంటే, వారి మాటలు పడాల్సిన దౌర్భాగ్యము నాకు పట్టింది. నీమాటలు విన్నందుకు కదా నాకు ఇన్ని కష్టాలు దాపురించాయి. ఏ జన్మలో ఏం పాపం చేసానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను. లేకపోతే ఎక్కడో కేకయ దేశంలో ఉన్న నిన్ను పెళ్లి చేసుకొని నా మెడకు నేను ఉరితాడు బిగించుకున్నాను. నువ్వే నా మృత్యు దేవతవు అని తెలుసుకోలేకపోయాను. ఇన్నాళ్లు భయంకరమైన విషనాగును పక్కలో పెట్టుకున్నాను.
కన్నకొడుకును అడవులకు పంపిన పాపాత్ముడు వీడూ ఒక తండ్రేనా! ఒక ఆడదాని కోరికలు తీర్చడం కోసం కన్నకొడుకును అరణ్యవాసమునకు పంపిన మూర్ఖుడు' అని అయోధ్యావాసులు అందరూ నన్ను దూషిస్తారు.
కన్నకొడుకును అడవులకు పంపిన పాపాత్ముడు వీడూ ఒక తండ్రేనా! ఒక ఆడదాని కోరికలు తీర్చడం కోసం కన్నకొడుకును అరణ్యవాసమునకు పంపిన మూర్ఖుడు' అని అయోధ్యావాసులు అందరూ నన్ను దూషిస్తారు.
పాపం రాముడు. వాడికి చిన్నప్పటి నుండీ అన్నీ కష్టాలే. చిన్నపుడే ఉపనయనం చేసి గురుకులానికి పంపాను. గురువుల వద్ద చదువు, బ్రహ్మచర్యము, కఠోర నియమాలు, వీటితోనే గడిచిపోయింది. ఏదో రాజ్యాభిషిక్తుడై సుఖపడతాడు అనుకుంటే మరలా అరణ్యవాసం సంప్రాప్తమయింది. అడవులలో అన్నీ కష్టాలే. రాముని జీవితంలో సుఖపడే రాత లేదేమో!
పోనీ రాముడైనా “నేను అరణ్యాలకు పోను" అంటే అదొకదారి. కాని నేను రాముడిని పిలిచి “రామా! నీవు పధ్నాలుగేళ్లు అరణ్యములకు వెళ్లాలి అంటే చాలు" మరుక్షణం వెళ్లిపోతాడు. నా మాటంటే రామునికి వేదవాక్కు.
పితృవాక్య పరిపాలనను పక్కన పెట్టి “నేనెందుకు అరణ్యాలు పోవాలి. నేను వెళ్లను" అని రాముడు అంటే ఎంత బాగుంటుంది. కాని అనడు. ఎందుకంటే రామునికి కపటం తెలియదు. నిర్మలహృదయుడు. నా మాట ధిక్కరించడం, అతిక్రమించడం నాకు ఎంతో ఇష్టం అని రామునికి ఎలా తెలిసేది! నేనా చెప్ప లేను. రామునికి ఎవరు చెబుతారు!
రాముడు అరణ్యములకు పోయిన తరువాత మరణించే బదులు ఇప్పుడే నాకు మరణం సంభవిస్తే అని సమస్యలు తీరిపోతాయి. జీవితంలో ఇంకా ఇటువంటి దుర్మార్గాలు చెయ్యకుండా శాశ్వత విముక్తి లభిస్తుంది. నేను కాదు, కొడుకు అరణ్యాలకు పోయి, భర్త మరణిస్తే కౌసల్య ఎలా జీవించి ఉంటుంది. తాను కూడా నాతోపాటు స్వర్గం చేరుకుంటుంది.
ఓ కైకా! మేమందరమూ పోయిన తరువాత హాయిగా సుఖంగా నువ్వు నీ కొడుకూ రాజ్యం ఏలుకోండి. ఇప్పటిదాకా ఇక్ష్వాకు వంశము మచ్చలేకుండా నడిచింది. ఈనాటికి నీ వలన మా వంశము మీద మాయని మచ్చ పడింది. ఇదిగో కైకా! ఇప్పుడే చెబుతున్నాను. రాముని వనవాసము, నా మరణము, ఒకేసారి సంభవిస్తాయి. భరతుని నాకు పితృకార్యాలు చెయ్యవద్దని చెప్పు. రాముని కాదని రాజ్యమేలే వాడు నా కొడుకు కాదు.
ఓసి దుర్మార్గురాలా! ఇన్ని మాటలు అంటున్నా నీ మనసు కరగలేదా! నీది మనసా లేక బండరాయా! నా కొడుకు అరణ్యములకు పోయి నేను మరణిస్తే విధవరాలిగా సుఖాలు అనుభవిద్దాము అనుకుంటున్నావా! నీ వలన మా వంశం అంతా సర్వ నాశనము అయింది కదే దుర్మార్గురాలా!
ఇంతకాలమూ ఒక రాజకుమారుడిగా, రథములమీద, హయముల మీదా తిరిగిన రాముడు ఇప్పుడు కారడవులలో, కటిక రాళ్ల మీద ఒట్టి కాళ్లతో తిరగాలా! ఇన్నాళ్లు రాచభవనంలో షడ్రసోపేతమైన విందుభోజనము చేసిన వాడు అడవులలో కంద మూలములు తినాలా! అనుక్షణమూ పీతాంబరములు, పట్టువస్త్ర ములు తప్ప వేరు వస్త్రములు ధరించని రాముడు అడవులలో నారబట్టలు ఎలా ధరించగలడు. రాముడు అరణ్యములకు వెళ్లాలి అన్న దురాలోచన నీ మస్తిష్కములో ఎవరు జొప్పించారు కైకా!
నీ ప్రవర్తన చూస్తుంటే మీ ఆడవాళ్లందరూ పైకి ప్రేమ నటిస్తూ లోలోపల గొంతులు కోస్తారని తెలుస్తూ ఉంది. కాని అందరు స్త్రీలు నీ మాదిరి ఉండరులే. మహాపతివ్రతలు కూడా ఉంటారు. ఓ కైకా! ఓ స్వార్థపరురాలా! ఓ దుర్మార్గురాలా! ఓ క్రూరురాలా! ఈరోజు కేవలం నన్ను అష్టకష్టాల పాలు చెయ్యాలని కంకణం కట్టుకున్నావా. ఇలా మాట్లాడుతున్నావు. రాముడు అడవులలో కష్టాలు పడుతున్నాడు అని తెలిసి ఈ జగత్తు అంతా నిన్ను దూషించక మానదు. పురుషులంతా నీ లాంటి భార్యలను వదిలివేస్తారు.
ఓ కైకా! నామాట వినవే. ఒక్కసారి ఆ కల్యాణ రాముని చూడవే! రాముడిని చూస్తుంటే నయనానందం కలగడం లేదా నీకు. కైకా! ఈ ప్రపంచంలో సూర్యుడు ఉదయించకపోయినా బతకవచ్చు. ఇంద్రుడు వానలు కురిపించకపోయినా బతకవచ్చు కానీ రాముడు లేనిది ఎవరూ బతకలేరు. అలాంటిది నేను ఎలా జీవించి ఉండగలను. నీ వరాలు అనే పాము కాటుతో నాకు మరణం తథ్యం. ఇన్నాళ్లు పాములాంటి నిన్ను పక్కనపెట్టుకొని ఈ నాడు నీ చేత కాటు వేయించుకున్నాను.
ఓ కైకా! మూర్ఖురాలా! నా రాముని అరణ్యములకు పంపి, నన్ను చంపి, నువ్వు నీ కొడుకు నా శత్రువులకు ఆనందం కలగించదలచుకున్నారా! ఇలాంటి మాటలు మాట్లాడినందుకూ ఇటువంటి కోరికలు కోరినందుకూ నీ తల ఎందుకు వెయ్యివక్కలు కాలేదా అని అనుమానంగా ఉంది. ఎందుకంటే ఎవరితోనూ పరుషంగా మాట్లాడటం తెలియని రామునికి అపకారం చెయ్యడం, అడవులకు పంపాలి అని కోరడం లాంటి మహాపాపం చేసిన తరువాత నువ్వు ఇంకా బతికి ఉండటమా!
ఓ కైకా! నా నిర్ణయం విను. నువ్వు ఎంత ఏడ్చినా మొత్తుకున్నా ఆఖరుకు చచ్చినా నువ్వు కోరిన కోరికలు తీర్చను. నీ మాట నెరవేర్చను. నాకు అసత్యదోషం అంటినా సరే. లెక్క చేయను. ఎందుకంటే మంచి వాళ్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోడం ధర్మం కానీ, నీ లాంటి దుర్మార్గులకు, అబద్ధాలు ఆడేవాళ్లకు, దుష్టురాలకు, కులనాశకులకు, నా మనసుకు కష్టము కలిగించిన దానికి, ఆఖరుకు నా హృదయంలో చిచ్చుపెట్టిన పాషండురాలికి ఇస్తానన్న వరాలు ఇవ్వక పోవడమే ధర్మం.
ఓ కైకా! మరలా మరలా చెబుతున్నాను. రాముని విడిచి నేను ఉండలేను. రాముడు లేనిదే బతుకలేను. ఇంక నాకు సుఖసంతోషాలు ఎక్కడ ఉంటాయి. కాబట్టి నన్ను కరుణించు. నీ పాదాలు పట్టుకుంటాను. నీ వరాలు ఉపసంహరించుకో. నన్ను, లోకాన్ని రక్షించు." అని కైక పాదాలమీద పడబోయాడు దశరథుడు.
అప్పటి దాకా మౌనంగా అన్నీ వింటూ ఉంది కైక. సహజంగా ఉ త్తమురాలైన కైక మనసు ద్రవించి పోయింది. దీనంగా రోదిస్తున్న భర్త ఎక్కడ తన కాళ్లు పట్టుకుంటాడో, తనపాతివ్రత్యానికి ఎక్కడ భంగం కలుగుతుందో అని దూరంగా జరిగింది. కైక కాళ్లు పట్టుకోకుండానే దశరథుడు కిందపడిపోయాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పన్నెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment