శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఇరువదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 20)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఇరువదవ సర్గ
(ఇంతకు ముందు సర్గలో వాల్మీకి మహర్షి రాముడు కౌసల్య మందిరము ప్రవేశించాడు అని చెప్పాడు. కాని ఈ సర్గలో కొంచెం వెనక్కు వెళ్లాడు. ఇప్పుడు మనము ఇంకా దశరథుని అంతఃపురము లోనే ఉన్నాము.)కైక మాటలను మన్నించి రాముడు అక్కడనుండి బయటకు వచ్చిన తరువాత కైక అంత:పురములోని స్త్రీలు, దశరథుని ఇతర భార్యలు భోరున ఏడ్చారు. అయ్యో రాముడు అడవులకు వెళ్లిపోతున్నాడా అని దు:ఖించారు. (దశరథునికి కౌసల్య, సుమిత్ర,కైకేయీ కాక ఇంకా మూడువందలయాభై మంది భార్యలు ఉన్నట్టు ప్రతీతి.)
"తండ్రి నోటి నుండి మాట వెలుపలికి వచ్చీ రాకముందే ఆ కార్యములను చక్కబెట్టే రాముడు, అంత:పురములోని వారికి ఏ లోటూరాకుండా అన్ని అమర్చే రాముడు అరణ్యములకు పోతున్నాడు. తన తల్లి పట్ల ఎటువంటి భక్తి, ప్రేమ చూపుతున్నాడో, మన యందు కూడా అలాంటి భక్తి, వినయము, ప్రేమ చూపిన రాముడు అరణ్యము లకు పోతున్నాడు. కోపమంటే ఎరుగని రాముడు, ఎవరైనా తన మీద కోపగించినా వారి మీద కోపించని రాముడు ఇప్పుడు అరణ్యములకు పోతున్నాడు. ఇన్నాళ్లు దశరథుడు ఏదో తెలివిగల రాజు అనుకున్నాము, కాని ఇంత తెలివితక్కువగా కన్నకొడుకును కారడవులకు పంపే మూర్ఖుడు అనేకోలేదు." ఈ ప్రకారంగా అంతఃపుర స్త్రీలందరూ తలొక మాటా అనుకుంటూ దు:ఖిస్తున్నారు.
వారి మాటలు విన్న దశరథునికి శోకము ఇంకా ఎక్కువ అయింది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అంతలోనే స్పృహ తప్పుతున్నాడు. మరలా తేరుకుంటున్నాడు. రాముని కోసం చుట్టు వెర్రి చూపులు చూస్తున్నాడు. రాముడు కనపడక మరలా హతాశుడవుతున్నాడు.
కౌసల్య అంతఃపురము బయట ద్వారముల వద్ద అనేక మంది బ్రాహ్మణులు నిలబడి ఉన్నారు. రాముని చూడగానే వారందరూ లేచి నిలబడ్డారు. అందులో ఒక వృద్ధ బ్రాహ్మణుడు “రామా! నీకు జయమగు గాక" అని ఆశీర్వదించాడు. రాముడు అక్కడ నిలబడి ఉన్న బ్రాహ్మణులకు అందరికీ భక్తితో నమస్కరించాడు.
తరువాత ద్వారము వద్ద బ్రాహ్మణులు, ముత్తయిదువలు నిలబడి ఉన్నారు. రాముని రావడం చూచి వారందరూ లేచి నిలబడ్డారు. వారందరూ జయజయ ధ్వానములతో రాముని కౌసల్యా మందిరమునకు స్వాగతించారు. మరి కొంత మంది లోపలకు పరుగు పరుగున వెళ్లి కౌసల్యకు రాముడు వస్తున్నాడు అన్న వార్తను అందించారు.
కౌసల్య రాత్రి అంతా జాగారము చేసి పొద్దుటే లేచి, స్నానాదికములు ఆచరించి, తెల్లని పట్టుచీర కట్టుకొని రాముని క్షేమం కోరుతూ విష్ణు పూజ చేసింది. తరువాత అగ్నిలో మంగళ ద్రవ్యములు హెూమం చేస్తూ ఉంది. రాముడు అంత:పురములో ప్రవేశించి హెూమము చేస్తూ ఉన్న తల్లిని చూచాడు.
రాముడు రావడం చూచి కౌసల్య లేచి రాముని దగ్గరగా వచ్చింది. రాముడు తల్లి పాదములకు నమస్కరించాడు. కౌసల్య రాముని ఆశీర్వదించింది. తరువాత రాముని రెండు చేతలతో లేపి గట్టిగా కౌగలించుకొని తలమీద ముద్దు పెట్టుకొంది.
“నాయనా రామా! నీవు కూడా నీపూర్వీకుల వలె కీర్తి ప్రతిష్టలు పొందుదువు గాక! నీవు నీ వంశకర్తలు ఆచరించిన ధర్మములను పాటించెదవు గాక! నీ తండ్రి దశరథ మహారాజు నిన్ను ఈ రోజు యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తాను అన్నాడు. నీ తండ్రి మాట తప్పడు. నీకు ఈ రోజే యౌవరాజ్య పట్టాభిషేకము జరగ గలదు. రామా! రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమో. రా నాయనా భోజనము చేద్దువు గానీ." అని ఆప్యాయంగా రాముని భోజనానికి పిలిచింది.
రాముడు మరలా తన తల్లి కౌసల్యకు నమస్కరించి ఇలా అన్నాడు. “అమ్మా! ఇప్పుడు మనకు ఒక అనుకోని ఆపద ఒకటి వచ్చి పడినది. నేను ఇప్పుడు అత్యవసరంగా దండకారణ్యము పోవలెను. దీని వలన నీవు, సీత, లక్ష్మణుడు దుఃఖిస్తారు అని నాకు తెలుసు. కాని ఇది తప్పదు. నేను వెళ్లి తీరాలి. కాబట్టి నాకు నేటి నుండి ఈ రాజభోగములు, రాజ భోజనములు, సింహాసనములు నిషిద్ధములు. నేను కందమూలములు తింటూ, దర్భాసనము మీద పడుకోవాలి. ఈ విధముగా నేను పదునాలుగేళ్లు వనవాసము చెయ్యాలి. నాకు బదులుగా భరతుడు రాజ్యాభిషిక్తుడు అవుతాడు. ఇది తండ్రి గారి నిర్ణయము. నాకు శిరోధార్యము." అని అన్నాడు.
రాముడు ఈ మాటలు అంటూ ఉండగానే కౌసల్య నిట్టనిలువునా కూలిపోయింది. రాముడు వెంటనే తల్లిని పైకి లేపి పక్కనే ఉన్న ఆసనము మీద కూర్చో పెట్టాడు. పరిచారికలు చల్లని నీళ్లు ఆమె మొహం మీద చల్లి సేదదీర్చారు. కౌసల్యకు దుఃఖము ఆగటం లేదు. కళ్లనుండి నీరు ధారాపాతంగా కారిపోతూ ఉంది. నోటమాట పెగలడంలేదు.
“రామా! నువ్వు నా కడుపున ఎందుకు పుట్టావయ్యా! నాకు ఈ వార్త చెప్పడానికేనా! అసలు నాకు పిల్లలు లేకుండా ఉంటేనే బాగుండేది. పిల్లలు లేరు అని ఒకే దిగులు ఉండేది. కాని ఇప్పుడు నువ్వు పుట్టి పెరిగి ప్రయోజకుడవు అయి నాకు ఎనలేని దుఃఖము కలిగిస్తున్నావు. ఇది నీకు న్యాయమా రామా!
రామా! నేను పెళ్లి చేసుకొని ఇక్కడకు వచ్చిన తరువాత సుఖము అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా భర్త రాజుగా ఉన్న రోజుల్లో నాకు ఏనాడూ సుఖము లేదు. కనీసము నువ్వు పట్టాభిషిక్తుడవు అయిన తరువాత అన్నా సుఖపడదామనుకున్నాను. ఆశకూడా అడియాస చేసావు రామా!
రామా! నేను అందరి కంటే పెద్ద భార్యను అయి ఉండి కూడా, నీ వనవాసముతో అందరి ముందూ తలదించుకోవాల్సిన పరిస్థితి, వారి సూటీ పోటీ మాటలు పడాల్సిన దౌర్భాగ్యము నాకు దాపురించింది. ఇంతకు మించి స్త్రీలకు దు:ఖము ఏముంటుంది. రామా! నీవు ఇక్కడ ఉండగానే నా సవతులు నన్ను నిరాదరిస్తున్నారు. ఇంక నీవు లేకపోతే చెప్పవలెనా. నా బతుకు దుర్భరము అవుతుంది. అందుకే నాకు మరణమే శరణ్యము.
రామా! నా భర్త నన్ను ఏనాడూ అందరితో పాటు ఆదరించలేదు. ముఖ్యంగా ఆ కైక, ఆమె దాస దాసీల పాటి కూడా నేను చెయ్యలేదు. నా భర్త వారి కన్నా హీనంగా నన్ను చూచాడు. పేరుకు పెద్దభార్యనే కానీ స్వతంత్రించి ఏ పనీ చెయ్యలేను. నాది ఒక బానిసబతుకు. నువ్వు చెప్పినట్టు రేపు భరతుడు రాజైతే. ఈరోజు నన్ను పలకరించే వాళ్లు కూడా రేపు నా మొహం చూడరు. నాతో
మాట్లాడరు. ఇంక కైక సంగతి చెప్ప పనిలేదు. రేపటి నుండి నన్ను ఒక మనిషిగా కూడా చూడదు. చీటికీ మాటికీ నన్ను నిందిస్తూ ఉంటుంది. అసలు ఆమె మొహం చూడటానికే నాకు భయంగా ఉంటుంది.
రామా! నిన్ను చూచుకొని, ఇన్నాళ్లు ఈ దుర్భరమైన బాధలు భరించాను. నీకు ఉపనయనము అయిన నాటి నుండి దాదాపు పదిహేడు సంవత్సరములు నువ్వు రాజ్యాభిషిక్తుడవు అవుతావనీ, నా కష్టములు తీరుస్తావని ఆశతో ఎదురు చూచాను. నీ మాటలతో ఆ ఆశ నిరాశ అయింది. ఈ వృద్ధాప్యంలో నేను, నా సవతుల సూటీ పోటీ మాటలు, వారు చేయు అవమానములు భరించలేను.
ఇన్నాళ్లు నీ ముద్దులొలికే మొహం చూస్తూ ఈ బాధలన్నీ దిగమింగుకున్నాను. ఇంక నువ్వు నాకు కనపడవు. నేను ఈ బాధలు భరించలేను. నేను ఎంతో దురదృష్టవంతురాలను. లేకపోతే నీ క్షేమం గురించి, నీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలనీ, నీవు రాజ్యాభిషిక్తుడివికావాలనీ ఎన్నో పూజలు వ్రతాలూ ఉపవాసాలు చేసాను. ఏ దేవుడూ నన్ను కరుణించలేదు. నా బాధలను తీర్చలేదు. అవన్నీ వ్యర్ధమైపోయాయి.
రామా! నా గుండె చాలా కఠినమయింది లేకపోతే నీవు చెప్పిన ఈ దుర్వార్త విని నా గుండెలు ఈ పాటికి పగిలిపోవాల్సింది. కాని అలా జరగలేదు. నాగుండెలు రాతి బండలు. అవి పగలవు. నాకు మరణము రాదు.
రామా! నాకు పుత్ర సంతానము కావాలని ఎన్నో పూజలు, ఎన్నెన్నో వ్రతాలూ యజ్ఞాలు యాగాలు చేసాను. నీవు పుట్టావు. కానీ ఏం లాభం. అవి ఫలించలేదు. నీకు వనవాసము ప్రాప్తించింది.
రామా! మానవులకు తమ ఇష్టం వచ్చినప్పుడు మరణించే అవకాశము లేదు కదా! లేకపోతే నీవు ఈ మాట చెప్పగానే హాయిగా మరణించి ఉండేదాన్ని. ఎందుకంటే రామా! ఇంక నేను ఎందుకు బతకాలి. ఎవరి కోసం బతకాలి. ఏం అనుభవించడానికి బతకాలి. వ్యర్ధంగా కలకాలం బతకడం కంటే మరణించడం మేలు కదా!
లేకపోతే రామా! ఒకపని చెయ్యి. నన్నుకూడా నీ వెంట అరణ్యములకు తీసుకొని వెళ్లు. నీ యోగక్షేమాలు చూసుకుంటూ నీ వెంటే ఉంటాను." అని కౌసల్య రాముని చూచి తన మనసులో ఉన్న బాధను ఆవేశాన్ని అంతా వెళ్లగ్రక్కింది.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఇరువదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment