శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - పదమూడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 13)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

పదమూడవ సర్గ

దశరథుడు ఎన్నడూ అంతటి దీనస్థితికి లోను కాలేదు. ఒకరిని శాసించడమే కానీ ఒకరి ముందు దేహీ అని నిలబడలేదు. ఈనాడు రాముని కోసరం కైక ముందు చేతులు జోడించి మోకరిల్లాడు. ప్రాధేయపడ్డాడు. భంగపడ్డాడు. కానీ కైక మనసు కరిగినట్టు లేదు. తాను కోరిన వరాలను ఉపసంహరించుకోలేదు. పైగా పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడింది.

"ఓ దశరథమహారాజా! నీవేదో సత్యవాక్పరిపాలకుడవు అనీ, ఆడినమాట తప్పవనీ, అడిగినవి అన్నీ ఇస్తావనీ, లోకమంతా గొప్పగా చెప్పుకుంటారుకదా! ఇదేనా తమరి సత్యవాక్పరిపాలన! ఇదేనా తమరి సత్యసంధత! నీవు ఆడిన మాట తప్పని వాడివే అయితే నేను కోరిన వరములు ఎందుకు ఇవ్వవు? ఇన్ని కుంటి సాకులు ఎందుకు చెబుతావు. కల్లబొల్లి ఏడుపులు ఎందుకు ఏడుస్తావు? ఏది ఏమైనా, మిన్ను విరిగి మీద పడ్డా, రాముడు వనవాసానికి వెళ్లాలి. భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. ఇది తప్పదు." అని ఖరాఖండిగా చెప్పింది కైక.

తాను ఇంత బతిమాలినా కైక మనసు కరగనందుకు దశరథునికి కోపమూ దుఃఖము ముంచుకొచ్చాయి. తట్టుకోలేక కిందపడిపోయాడు. తల పైకెత్తి కైకను చూస్తూ
" ఓసి దుర్మార్గురాలా! నువ్వు నాకు భార్యవా! శత్రువువా! నా చావు కోరుకుంటావా! రాముడు అరణ్యాలకు వెళ్లిన తరువాత నేను బతికి ఉండటం కలలోని మాట! నా చావు కోరే నీవు, నేను చచ్చిన తరువాత సుఖపడాలని కోరుకొనే నీవు, నాకు భార్యవు ఎలా అవుతావు? నేను చచ్చి స్వర్గానికి పోతే అక్కడ దేవతలు 'ఓ దశరథమహారాజా! భూలోకములో రాముడు క్షేమముగా ఉన్నాడా' అని అడిగితే వారికి ఏమని బదులు చెప్పాలి. ఒక ఆడుదాని మాటకు కట్టుబడి నా కన్నకొడుకును అరణ్యాలకు పంపానని చెప్పనా! నా వంటి వాడు అలా చేసాడు అంటే ఎవరన్నా నమ్ముతారా! ఎంతకాలముగానో సంతానము లేకుండా అలమటించిన నేను, ఈ నాడు నాకు పుత్రులు కలిగితే. వారిని అడవుల పాలు ఎలా చెయ్యను. ఓ కైకా! నన్ను చంపెయ్యి. రామునికి దు:ఖం కలిగించే బదులు నీ చేతిలో చావడమే మేలు. చంపు నన్ను చంపు" అని ఆవేశంతో అంటూ కూలబడిపోయాడు దశరథుడు.

కైక ఏమీ బదులు చెప్పలేదు. మౌనంగా ఉండిపోయింది. దశరథుడు అలా పడి ఉండగానే రాత్రి అయింది. చంద్రుడు ఉదయించాడు. కైకను బతిమాలి లాభం లేదనుకొని ప్రకృతిని ప్రార్థిస్తున్నాడు దశరథుడు.

“ ఓ చంద్రా! ఈ రాత్రి కాళరాత్రి కానీకు. రేపు తెల్లవారనీయకు. తెల్లవారితే రాముడు అడవులకు పోతాడు. ఈ రాత్రి ఇలాగే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సూర్యుని వెలుగులో ఆ నీచురాలు కైక ముఖం చూడటం నాకు ఎంతమాత్రం ఇష్టంలేదు." అని మనసులోనే అనుకున్నాడు.

కాని దశరథునికి ఆశ చావలేదు. “ఏమో ఇంకోసారి బతిమాలితే కైక మనసు మార్చుకుంటుందేమో! మరొక సారి అడిగి చూద్దాం." అని అనుకున్నాడు దశరథుడు. 

మరలా కైకను చూచి ఇలా అన్నాడు. " ఓ నా ముద్దుల భార్య కైకా! నువ్వు చాలా మంచిదానివి కదూ! అది తెలియక ఏదేదో అన్నానులే! పట్టించుకోకు. అయినా నా లాంటి వృద్ధునితో పరాచికాలేమిటి చెప్పు. అయినా అయోధ్యకు రాజును కదా! నన్ను ఇలా ఇబ్బంది పెట్టవచ్చా! నీలాంటి మంచి వాళ్లు ఇలా చెయ్యవచ్చా! నా మీద కాస్త కరుణ చూపు. నీ దయ నామీద ప్రసరింపచెయ్యి. అయినా నేను రామునికి పట్టాభిషేకం చెయ్యడం ఏమిటి? ఈ రాజ్యం నీది. నువ్వే రామునికి ఈ రాజ్యాన్ని ఇవ్వు. నీవే రాముని పట్టాభిషిక్తుని చెయ్యి. ఆ కీర్తి ప్రతిష్టలు నువ్వే పొందు. నేను కాదన్నానా! నువ్వు ఆ పని చేసావనుకో నేను, అయోధ్యప్రజలు, సమస్తలోకాలు, గురువులు అంతరూ నిన్ను మెచ్చుకుంటారు. నీ కుమారుడు భరతుడు కూడా రామ పట్టాభిషేకము చేసినందుకు ఎంతగానో శ్లాఘిస్తాడు. ఇంతమంది మెప్పు పొందడం సామాన్యమా చెప్పు. కాబట్టి రామ పట్టాభిషేకము నీ చేతులమీదుగా జరిపించు.” అని దీనంగా ప్రార్థించాడు.

కాని కైక మనసు ఇసుమంత కూడా మారలేదు. ఏమీ మాట్లాడకుండా మిన్నకుంది. దశరథునికి ఆఖరి ఆశకూడా వమ్ము అయి పోయింది. మనసు ఆ దు:ఖాన్ని తట్టుకోలేకపోయింది. కళ్లు బైర్లుకమ్మాయి. అలాగే సొమ్మసిల్లిపోయాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము పదమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)