శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - పదునారవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 16)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
పదునారవ సర్గ
రాముని అంతఃపురములో ఒక్కొక్క ద్వారమును దాటు కుంటూ వెళుతున్నాడు సుమంత్రుడు. రాముని అంత:పురము బయట కాపలా ఉన్న భటులతో "రాముని దర్శనము కొరకు సుమంత్రుడు వచ్చి ఉన్నాడు" అని చెప్పండి అని చెప్పి పంపించాడు. సీతతో ముచ్చటిస్తున్న రామునితో భటులు సుమంత్రుడు వచ్చాడు అన్న మాటను చెప్పారు.“సుమంత్రుని సాదరంగా లోపలకు తీసుకొని రండి" అని ఆదేశించాడు రాముడు.
సుమంత్రుడు రాముని అంతఃపురములోకి వెళ్లాడు. రాముని చూచాడు. రామునికి నమస్కరించాడు. రాముని చూచి ఇలా అన్నాడు.
" ఓ కౌసల్యా నందనా! రామా! మీ తండ్రిగారు దశరథ మహారాజు గారూ, తమరి తల్లి కైకేయీ మహారాణి గారూ తమరిని చూడవలెనని అనుకుంటున్నారు. తమరు వెంటనే దశరథుల వారి అంత:పురమునకు బయలు దేరండి." అని పలికాడు.
ఆ మాటలు విన్న రాముడు పక్కనే ఉన్న సీతను చూచి ఇలా అన్నాడు. "సీతా! నా తండ్రి దశరథుడు, నా తల్లి కైక నా పట్టాభిషేకము గురించి నాతో చర్చించవలెనని అనుకుంటున్నారు. నన్ను తీసుకొని రమ్మని సుమంత్రుని పంపారు. నేను వెంటనే నా తల్లి తండ్రుల వద్దకు వెళ్లుతున్నాను." అని చెప్పాడు.
ఆ మాటలు విన్న రాముడు పక్కనే ఉన్న సీతను చూచి ఇలా అన్నాడు. "సీతా! నా తండ్రి దశరథుడు, నా తల్లి కైక నా పట్టాభిషేకము గురించి నాతో చర్చించవలెనని అనుకుంటున్నారు. నన్ను తీసుకొని రమ్మని సుమంత్రుని పంపారు. నేను వెంటనే నా తల్లి తండ్రుల వద్దకు వెళ్లుతున్నాను." అని చెప్పాడు.
సీత చిరునవ్వుతో భర్తను సాగనంపింది. ద్వారము దాకా తోడు వచ్చింది. “ఆర్యపుత్రా! మీకు జయమగుగాక! తమరు త్వరలో ఈ అయోధ్యకు పట్టాభిషిక్తులు కాబోతున్నారు. తమరు పట్టాభిషిక్తులు కావడం చూచి నేను ఎంతో ఆనందిస్తాను. దిక్పాలకులైన ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు తమరిని సదా రక్షించు గాక! శుభంగా వెళ్లిరండి." అని భర్తను సాగనంపింది సీత. సీత వద్దనుండి అనుమతి తీసుకున్న రాముడు, సుమంత్రునితో సహా దశరధ మహారాజు మందిరమునకు బయలుదేరాడు.
ద్వారము దగ్గర లక్ష్మణుడు అన్నగారి కోసరము వేచి ఉన్నాడు. లక్ష్మణుని కూడా తనతో రమ్మన్నాడు రాముడు. ముగ్గురూ కలిసి వెళు తున్నారు. దారిలో తన కోసం వేచి ఉన్న తన మిత్రులను చూచి రాముడు వారికి 'తండ్రిగారిని కలుసుకొని ఇప్పుడే వస్తాను' అని చెప్పాడు.
రాముడు లక్ష్మణుడు రథంలోకి ఎక్కారు. సుమంత్రుడు రథం తోలుతున్నాడు. రాముడు ఎక్కిన రథము రాజాంత:పురమునకు బయలుదేరింది. లక్ష్మణుడు రాముని వెనక నిలబడి రాముని అప్రమత్తముగా రక్షిస్తున్నాడు. రాముని రథము వెంట గుర్రములు, ఏనుగులు ఎక్కిన సైనికులు అనుసరించారు. కవచములు, ఆయుధములు ధరించిన భటులు రాముని రథమును అనుసరించి వెళుతున్నారు.
రాముని చూచి మార్గమునకు అటు ఇటు నిలబడ్డ ప్రజలు హర్షధ్వానాలు చేస్తున్నారు. రాముని గుణగణములను స్తుతిస్తున్నారు. మేడల మీద నిలబడ్డ స్త్రీలు రాముని మీద పూలు చల్లుతున్నారు. దారికి అటు ఇటు నిలబడ్డ ప్రజలు రామునికి భక్తితో నమస్కరిస్తున్నారు. అటువంటి రాముని భర్తగా పొందిన సీతను అయోధ్యావాసులు మనసులోనే అభినందించారు.
“పూర్వజన్మలో ఏ తపస్సు చేసిందో ఏమో ఈ జన్మలో రాముని వంటి ఉత్తముని భర్తగా పొందినది” అని సీత అదృష్టాన్ని పొగిడారు.
వారందరి మాటలు చిరునవ్వుతో వింటున్నాడు రాముడు. ఈ నాడే రాముడు మనకందరికీ పాలకుడు కాబోతున్నాడు. ఇంక మనకోరికలు అన్నీ తీరుతాయి. ఇంక అయోధ్యా ప్రజలకు దు:ఖము అనే మాట వినపడదు. అని అయోధ్యావాసులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు.
ఆ ప్రకారంగా రాముడు ముందు వంది మాగధులు కైవారములు చేస్తూ ఉంటే, వెనక ఆశ్విక బలము, గజబలము వెంట వస్తూ ఉంటే, రాజాంతఃపురమునకు వెళ్లాడు.
ఆ ప్రకారంగా రాముడు ముందు వంది మాగధులు కైవారములు చేస్తూ ఉంటే, వెనక ఆశ్విక బలము, గజబలము వెంట వస్తూ ఉంటే, రాజాంతఃపురమునకు వెళ్లాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము పదునారవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment