శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై ఎనిమిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 68)
శ్రీమద్రామాయణము యుద్ధకాండము అరవై ఎనిమిదవ సర్గ కుంభకర్ణుడు మరణించడం కళ్లారా చూచిన రాక్షసులు పరుగు పరుగున లంకా నగరం వైపు పరుగెత్తారు. రావణునికి ఈ వార్త చెప్పారు. “లంకేశ్వరా! మహావీరుడు కుంభకర్ణుడు ఎంతో మంది వానరులను చంపి, భక్షించి, కాలవశమున వీరగతి పొందాడు. కుంభకర్ణుడు తన పరాక్రమమును ప్రదర్శించి, తుదకు రాముని బాణములకు హతమైనాడు. చేతులు, కాళ్లు తెగి పడి, ముక్కు చెవులు కొరకబడి, శిరస్సు తెగి, మాంసపు ముద్ద వలె పడి ఉన్నాడు. ” అని వివరించారు. కుంభకర్ణుని మరణ వార్త విని రావణుడు నిర్ఘాంత పోయాడు. నేల మీద పడి మూర్ఛపోయాడు. తమ పినతండ్రి మరణించిన వార్త విన్న త్రిశిరుడు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు రోదించారు. మహోదరుడు, మహాపార్శ్వుడు చింతించారు. రావణునికి తెలివి వచ్చింది. కుంభకర్ణుని తలచుకుంటూ రోదిస్తున్నాడు. "తమ్ముడా కుంభకర్ణా! నీవు శత్రువులను చంపి నాకు సంతోషము కలిగిస్తావు అని అనుకున్నాను కానీ నన్ను విడిచి యముడిని కలుసుకోడానికి పోతావని అనుకోలేదు. నాకు శత్రువులనుండి విముక్తి కలిగించ కుండానే నన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్లిపోయావు. నీ మరణంతో నా కుడిభుజము పడిపోయి నట్టు అయింది. దేవతలను, దానవ...