శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవయ్యవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 60)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

అరవయ్యవ సర్గ

రాముడి చేతిలో ఓడి పోయిన రావణుడు అవమాన భారంతో లంకకు వెళ్లాడు. ఏమీ చెయ్యడానికి తోచడం లేదు. ఒక మానవుని చేతిలో ఓటమి రావణునికి చాలా బాధాకరంగా, అవమానకరంగా పరిణమించింది. రామ బాణాలను తలచుకుంటేనే రావణునికి కంపరంగా ఉంది.

తన ఆంతరంగీకులను పిలిచి ఇలా అన్నాడు. “ఈ రోజు నేను ఒక మానవుని చేతిలో ఓడిపోయాను. నా బలము, పరాక్రమము, నేను చేసిన తపస్సు అంతా వృధా అయిపోయాయి. నేను బ్రహ్మను వరము కోరునపుడు మానవులను బలహీనులుగా తలంచి వారి వలన కూడా చావు లేనట్టు వరకు కోరలేదు. అప్పుడే బ్రహ్మ నాకు మానవుల వలన కీడు ఉందని చెప్పాడు. ప్రస్తుత పరిణామములు అలాగే జరుగుతూ ఉన్నాయి. దేవ, దానవ, గంధర్వ, యక్ష, రాక్షస, పన్నగుల నుండి మరణము లేకుండా వరము కోరిన నేను మానవులను ఎందుకు విస్మరించాలి! మానవుల వలన కూడా మరణము లేకుండా వరము కోరి ఉంటే బాగుండేది.

ఇక్ష్వాకు వంశములో పుట్టిన అనరణ్యుడు నాతో అన్న మాటలు యదార్థములు అయ్యాయి. “ఓ రాక్షసుడా! నిన్ను, నీ వంశమును, నాశనము చేయగల వాడు నా వంశములో జన్మించగలడు" అని ఆరోజే అన్నాడు. ఆ మానవుడు రాముడే కావచ్చును. అన్నీ ఇప్పుడు జ్ఞప్తికి వచ్చుచున్నవి. పూర్వము నేను వేదవతి అనే యువతిని అవమానించాను. ఆమె సీతగా జనకుని ఇంట
జన్మించినది. అదీ కాకుండా నాకు ఉన్న శాపములు అన్నీ ఇన్నీ కావు. నందీశ్వరుడు, రంభ, పార్వతి, వరుణ పుత్రిక అందరూ నన్ను శపించారు. అవన్నీ ఈ రోజు నిజం అవుతున్నాయి కదా! వారి మాటలు పొల్లుపోతాయా!

కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనము ఇంక ప్రవర్తించాలి. నగరం అంతా కట్టుదిట్టమైన కాపలా పెట్టండి. నా తమ్ముడు కుంభకర్ణుని నిద్రలేపండి. ప్రహస్తుడు మరణించాడు. నేను రాముని చేతిలో ఓటమి పొందాను. తరువాత కుంభకర్ణుడు మాత్రమే రామునితో యుద్ధము చేయుటకు తగినవాడు. అతడొక్కడే యుద్ధములో వానరులను, రామలక్ష్మణులను చంపగలడు. అంత పరాక్రమ వంతుడైన కుంభకర్ణునికి ఈ పాడు నిద్ర ఒకటి దాపురించింది. అవసరానికి అందుబాటులో లేకుండా పోయాడు. ఈ సమయంలో 'యుద్ధం చేయక పోతే ఇంక కుంభకర్ణుని వలన ప్రయోజనం ఏమిటి? ఆపదలో ఉన్నప్పుడు సాయపడ్డవాడే కదా ఆప్తుడు, బంధువు. అందుకని, తొందరగా కుంభకర్ణుని నిద్రలేపండి.” అని ఆజ్ఞాపించాడు. రావణుని ఆదేశముల మేరకు రాక్షసులు కుంభకర్ణుని నిద్రలేపడానికి వెళ్లారు.

కుంభకర్ణుని గృహము చాలా పెద్దది. శరీరాన్ని బట్టి ఇల్లు కదా! కుంభకర్ణుడు పట్టేంత ద్వారములతో, ఒక యోజనము వైశాల్యంతో నిర్మించబడింది. రాక్షసులు అందరూ కుంభకర్ణుని పడుకొని ఉన్న విశాలమైన గృహము లోనికి ప్రవేశించారు. కుంభకర్ణుని
ఉచ్ఛ్వాస నిశ్వాసములకు వారు గడ్డిపోచలవలె ఊగిపోతున్నారు. ఎలాగో నిలదొక్కుకుంటూ కుంభకర్ణుని దగ్గరకు వెళ్లారు. వెల్లకిలా పడుకొని నిద్రపోతున్న కుంభకర్ణుని చూచారు. ఆ కుంభకర్ణుని చూడగానే రాక్షసజాతికి చెందిన వారికి కూడా కడుపులో వికారం కలిగింది. ఒక పెద్ద పర్వతము నేల మీద పడిపోయి ఉందా అన్నట్టు ఉన్నాడు కుంభకర్ణుడు.

రాక్షసులు అందరూ తలొక దిక్కు చేరుకున్నారు. కుంభకర్ణుని నిద్రలేపడానికి పూనుకున్నారు. కుంభకర్ణుని శరీరము మీద ఉన్న వెంట్రుకలు కత్తులవలె నిక్కపొడుచుకొని ఉన్నాయి. కుంభకర్ణుడు ఊపిరి తీస్తుంటే పాములు బుసకొడుతున్నట్టు ఉంది. కుంభకర్ణుడు ఊపిరి విడుస్తుంటే ఆ గాలి తాకిడికి ఆ రాక్షసులు కొట్టుకుపోతున్నారు. కుంభకర్ణుని శరీరము నుండి మదపు వాసన వేస్తూ రాక్షసులకే వెగటు పుట్టిస్తూ ఉంది. కుంభకర్ణుడు లేవగానే తినడానికి చంపి తెచ్చిన లేళ్లు, దున్నపోతులు, వరాహములు మొదలగు మృగములను రాసులుగా పోసారు. వండిన అన్నమును రాసులుగా పోసారు. రకరకాలైన వండిన మాంసము నంజుళ్లను రాసులుగా పోసారు. తాగడానికి రక్తాన్ని కుండలతో నింపి పెట్టారు. కుంభకర్ణుని శరీరానికి చందనము పూసారు. పూలమాలలతో అలంకరించారు. ధూపం వేసారు. స్త్రోత్రపాఠాలు చదివారు. పెద్దగా అరిచారు. కుంభకర్ణుని చెవుల దగ్గరు శంఖములు ఊదారు. చెవుల దగ్గర పెద్దగా అరిచారు. కేకలు పెట్టారు. కుంభకర్ణుని చేతులు కాళ్లు పైకెత్తికిందపడేసారు. కాని కుంభకర్ణుడు లేవలేదు.

కుంభకర్ణుని లేపడానికి చేసిన ధ్వనులతో చుట్టుపక్కల ఉన్న పక్షులు మృగములు భయంతో పారిపోయాయి. కొన్ని గిలా గిలా కొట్టుకొని మరణించాయి. ఇంక ఇలా ధ్వనులు చేసి లాభం లేదనుకొని, రాక్షసులు ముద్గరలు, ముసలములు, గదలతో కుంభకర్ణుని గుండెల మీద, చేతుల మీద, కాళ్ల మీద కొట్టనారంభించారు. గదలు విరిగాయి కొట్టి కొట్టి రాక్షసుల చేతులు విరిగాయి. కాని కుంభకర్ణుడు నిద్ర లేవలేదు. అలా కొట్టేటప్పుడు కుంభకర్ణుడు విడిచే శ్వాసకు రాక్షసులు ఎగిరిపోతున్నారు. అది తట్టుకొని కుంభకర్ణుని కొట్టడం చాలా కష్టంగా ఉంది రాక్షసులకు. అయినా ప్రయత్నిస్తున్నారు. అంతా కలిసి పదివేల మంది రాక్షసులు ఈ బృహత్కార్యంలో పాల్గొంటున్నారు. కాని ఫలితం కనిపించడం లేదు.

ఇలా కాదని, వారు, గుర్రములను, ఏనుగులను, ఒంటెలను తీసుకొని వచ్చి కుంభకర్ణుని శరీరం మీద నడిపించారు. ఒక పక్క భేరీమృదంగములు మోగుతున్నాయి. మరొక పక్క గదలతోనూ ముసలములతోనూ కొడుతున్నారు. మరొక పక్క ఏనుగులు, గుర్రములు, ఒంటెలు కుంభకర్ణుని శరీరం మీద నడుస్తున్నాయి తొక్కుతున్నాయి. కాని కుంభకర్ణుడు నిద్రలేవలేదు. ఈ కోలాహలానికి లంకానగరం అంతా మార్మోగిపోతూ ఉంది. కుంభకర్ణుని చెవుల దగ్గర భేరీలు అమర్చారు. వాటిని పెద్ద పెద్ద కర్రలతో మోగిస్తున్నారు. ఎంత చేసినా శాపగ్రస్తుడైన కుంభకర్ణుడు నిద్రలేవలేదు.
రాక్షసులకు విపరీతమైన కోపం వచ్చింది. పదివేల మంది రాక్షసులు కుంభకర్ణుని మీద పడ్డారు. కొరికారు. రక్కారు. కొట్టారు. గుద్దారు. చితకబాదారు. కుండలతో నీళ్లు తెచ్చి చెవుల్లో పోసారు. అయినా కుంభకర్ణుడు నిద్రలేవలేదు. అయినా వారి ప్రయత్నములు వీడలేదు. మరలా మొదలెట్టారు. శతఘ్నులు తెచ్చి పేల్చారు. ముద్గరలతో ముసలములతో కొట్టారు. ఏనుగులను కుంభకర్ణుని శరీరం మీద అటు ఇటు వేగంగా పరుగెత్తించారు.

అప్పుడు కొంచెం కదిలాడు కుంభకర్ణుడు. ఎవరో తనను లేపుతున్నట్టు స్పర్శద్వారా తెలుసుకున్నాడు. నిద్రమధ్యలో లేపినందుకు కుంభకర్ణుడికి కోపం వచ్చింది. ఆవులిస్తూ లేచి కూర్చున్నాడు. చేతులు రెండూ పైకెత్తి పెద్దగా ఆవులించాడు. కుంభకర్ణుడు ఆవులించినపుడు వెలువడ్డ గాలి రెండు కొండల మధ్యనుండి వీచే ప్రచండ జంఝా మారుతంలా వీచింది. కుంభకర్ణుడు లేవగానే రాక్షసులు అతనికి తాము సేకరించి తెచ్చిన ఆహార పదార్థాలు చూపించారు. కుంభకర్ణుడు వాటిని అవలీలగా భక్షించాడు. రక్తమును, మద్యము తాగాడు. తృప్తిగా తేన్చాడు. హమ్మయ్య అనుకున్నారు రాక్షసులు. కుంభకర్ణునికి నమస్కరించి అతని చుట్టు నిలబడ్డారు.

సగం నిద్రలో లేవడం వలన కుంభకర్ణుడి కళ్లు మూతలు పడుతున్నాయి. తూలుతున్నాడు. తనను అర్ధాంతరంగా నిద్రలేపి నందుకు విసుక్కుంటూ నాలుగు పక్కలా చూచి, తన పక్కనే ఉన్న రాక్షసులతో ఇలా అన్నాడు కుంభకర్ణుడు. 

"నన్ను ఎందుకు బలవంతంగా నిద్ర లేపారు. రావణుడు క్షేమంగా ఉన్నాడా. ఏమీ ఉపద్రవము రాలేదు కదా! ఎవరన్నా శత్రువు మన లంక మీద దండయాత్ర చేసాడా! లేకపోతే నన్ను ఇంత బలవంతంగా ఎందుకు నిద్రలేపుతారు. పదండి విషయం కనుక్కుందాము. ఇంద్రుడు మరలా విజృంభించాడా!. వాడిని అణిచివేస్తాను. అగ్నిని కాలుస్తాను. ఏదో కారణం లేనిదే నన్ను నా అన్న నిద్రలేపమని ఆదేశము ఇవ్వడు. ఏం జరిగిందో త్వరగా చెప్పండి." అని గబా గబా అడిగాడు కుంభకర్ణుడు.

అప్పుడు రావణుని మంత్రి అయిన యూపాక్షుడు అనే రాక్షసుడు చేతులు జోడించి కుంభకర్ణునితో ఇలా అన్నాడు. “రాజా! మాకు దేవ,దానవ, గంధర్వుల వలన ఏలాంటి భయమూ లేదు. ప్రస్తుతము మానవులవల్లనే మాకు భయం పట్టుకుంది. ఈ మానవుల నుండి మేము పొందుతున్న భయము ఇదివరకు ఎవరి వలనా పొందలేదు. అంతగా భయపడుతున్నాము. మానవులకు వానరులు తోడైనారు. ఆ వానరులు సామాన్యులు కారు. ఒక్కొక్కరూ పర్వతముల వంటి శరీరములు కలవారు. కోట్లకొలది ఉన్న వానరులు లంకను ముట్టడించారు. రాముడు అనే రాకుమారుడు ఉన్నాడు. అతని భార్య సీతను రావణుడు అపహరించి తెచ్చి లంకలో ఉంచాడు. సీత కోసరం రాముడు వానరసేనతో లంకను దిగ్బంధం చేసాడు. సీతను వెదుకుతూ వచ్చిన ఒక వానరుడు అక్షకుమారుని చంపాడు. లంకను దహనం చేసాడు. నిన్న సాక్షాత్తు రావణుడే రామునితో యుద్ధానికి దిగాడు. అప్పుడు రాముడు రావణుని ఓడించి, “అలసి పోయిన వానితో నేను యుద్ధం చేయను. నేడు పోయి విశ్రాంతి తీసుకొని రేపురా!" అని చెప్పి పంపాడు రాముడు. రావణుడు ఆ అవమాన భారంతో కుమిలి పోతున్నాడు. రావణునికి ఇటువంటి దుస్థితి దేవ, దానవ, గంధర్వ, యక్ష, నాగుల వలన కలగ లేదు. ఈ నాటికి ఒక మానవుని వలన కలిగింది." అని చెప్పాడు యూపాక్షుడు.

ఆ మాటలు విన్న కుంభకర్ణుడు కోపంతో రెచ్చిపోయాడు. యూపాక్షునితో ఇలా అన్నాడు. “ఇప్పుడు నేను రావణుని వద్దకు రాను. నేరుగా యుద్ధభూమికి వెళ్తాను. వానరులను, మానవులను సంహరించి అప్పుడు రావణుని వద్దకు వస్తాను. మీ రాక్షసులు అంతా ఆ వానరుల రక్తము తాగి వానరుల మాంసము ఆరగించండి. నేను ఆ మానవుల రక్తమాంసములు ఆరగిస్తాను." అని అన్నాడు కుంభకర్ణుడు.

ఆ మాటలు విన్న మహోదరుడు ఇలా అన్నాడు. “నామాట కూడా కొంచెం వినండి. ముందు మనము రావణుని వద్దకు వెళదాము ఆయన ఏమి చెబుతాడో విని తరువాత తగిన విధంగా చేయండి." అని వినయంగా పలికాడు. అది యుక్తియుక్తముగా ఉన్నది అని అనుకున్న కుంభకర్ణుడు ఈ వార్త రావణునికి తెలియజెయ్యమని రాక్షసులను రావణుని వద్దకు పంపాడు. 
ఈ వార్త రావణునికి చెప్పడానికి రాక్షసులు బయలు దేరి రావణుని వద్దకు వెళ్లారు. రావణునితో ఇలా అన్నారు. 

"మహారాజా! తమరి ఆదేశము ప్రకారము మేము కుంభకర్ణుని నిద్రలేపాము. ఆయన అటునుండి అటే యుద్ధ రంగమునకు వెళతాను అని అంటున్నాడు. కుంభకర్ణుడు యుద్ధరంగమునకు వెళ్లవలెనా, ఇక్కడకు రావలెనా తెలుపండి." అని అడిగారు.

కుంభకర్ణుడు నిద్రలేచాడు అని తెలియగానే రావణుడు ఎంతో సంతోషించాడు. ఇంక విజయం తనదే అనుకున్నాడు. “మేము కుంభకర్ణుని మా మందిరములో చూడాలని అనుకుంటున్నాము. ఆయనను తగు మర్యాదలతో ఇక్కడకు తీసుకొని రండి." అని ఆదేశించాడు.ఆ రాక్షసులు వెంటనే కుంభకర్ణుని వద్దకు వెళ్లి ఇలా అన్నారు. 

“మహారాజా! తమరి కొరకు రావణుడు ఎదురుచూస్తున్నాడు.” అని చెప్పారు. కుంభ కర్ణుడు తన ఆసనము మీది నుండి లేచాడు. కాలకృత్యములు తీర్చుకున్నాడు. చక్కగా అలంకరించుకున్నాడు. రెండువేల కుండల మద్యము తాగాడు. దానికి తగ్గట్టు మాంసము ఆరగించాడు. ప్రళయకాలంలో యమధర్మరాజు వలె కుంభకర్ణుడు అన్న రావణుని మందిరమునకు బయలుదేరాడు.

కుంభకర్ణుడు నడుస్తుంటే భూమి కంపిస్తూ ఉంది. కుంభకర్ణుడు రాజమార్గములో నడుస్తుంటే, కోటకు ఆవల ఉన్న వానరులు ఆ మహాకాయాన్ని చూచారు. వానరులకు కుంభకర్ణుని ఆకారం చూచి భయం కలిగింది. వెంటనే రాముని వద్దకు పోయి ఏదో ఒక మహాకాయము లంకలో నడుస్తూ ఉంది అని రామునితో చెప్పారు. కొంతమంది వానరులు వీడితో మనకెందుకు అని పారిపోయారు. ఒక పర్వతము నడిచివస్తున్నట్టు వస్తున్న కుంభకర్ణుని చూచి వానరులు భయంతో వణికిపోయారు.

శ్రీమద్రామాయణము
యుద్ధ కాండము అరవయ్యవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)