శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - యాభై తొమ్మిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 59)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
యాభై తొమ్మిదవ సర్గ
నీలుడి చేతిలో ప్రహస్తుడు చావడం చూచిన రావణ సేనలు లంకలోకి పారిపోయాయి. అందరూ గబా గబా వెళ్లి నీలుడి చేతిలో ప్రహస్తుడు మరణించాడు అన్న వార్త రావణునితో చెప్పారు. రావణుని మనసులో కోపము, శోకము, బాధ అన్నీ ఒకేసారి కలిగాయి. ఇతర సేనాధి పతులను చూచి రావణుడు ఇలా అన్నాడు."సేనానాయకులారా! నేను ఇప్పటిదాకా ఓర్పు వహించాను. నా సహనం నశించింది. నా ప్రధాన సేనానాయకులను చంపిన వారిని నేను ఇంక ఎంత మాత్రమూ ఉపేక్షించలేను. నేను స్వయంగా యుద్ధరంగమునకు పోవలెనని నిశ్చయించుకున్నాను. అగ్నిగోళముల వంటి నా బాణములతో శత్రువులను నిర్మూలిస్తాను. వానరుల రక్తంతో భూదేవిని తృప్తిపరుస్తాను. రామలక్ష్మణులు నా బాణములకు ఆహుతి కాక తప్పదు." అని పలికాడు వెంటనే తన రథమును ఎక్కాడు.
స్వయంగా రావణుడే యుద్ధరంగానికి బయలు దేరడం చూచిన రాక్షస సైన్యము ఉత్సాహంతో ఉరకలు వేసింది. తన సేనలు వెంటరాగా రావణుడు లంకా ద్వారము నుండి బయటకు వచ్చాడు. వానర సేనను తేరిపార చూచాడు. రాముడు రావణుని అతని సేనలను చూచాడు. విభీషణునితో ఇలా అన్నాడు. “ఇప్పుడు యుద్ధానికి వస్తున్నది ఎవరు? ఈ భయంకర సైన్యము ఎవరిది? ఇందులో ప్రముఖులు ఎవరు? ఇందులో గజబలము ఎక్కువగా ఉంది. సైన్యము అంతా ఖడ్గములు, శూలములు ధరించి ఉన్నారు. వీరిని గురించి వివరంగా చెప్పు.” అని అడిగాడు.
దానికి విభీషణుడు ఇలా బదులు చెప్పాడు. “అదుగో ఏనుగును ఎక్కి వస్తున్నవాడు అకంపనుడు అనే రాక్షస సైన్యాధినేత. సింహమును తన ధ్వజముగా ధరించిన వాడు ఇంద్రజిత్తు. అతడు అజేయుడు. గొప్ప పరాక్రమ వంతుడు. వరగర్వి. ఆ పక్కనే వస్తున్న కొండంత శరీరము కలవాడు అతికాయుడు. ఏనుగును ఎక్కి ఉదయించిన సూర్యుని వలె ఎర్రగా ప్రకాశిస్తున్నవాడు మహోదరుడు. ప్రాసాయుధమును ధరించి, గుర్రము మీద ఠీవిగా వస్తున్నవాడు పిశాచుడు. వాడు పిడుగుతో సమానము. తెల్లటి ఎద్దును ఎక్కి, శూలమును చేతిలో ధరించి, వేగంగా వస్తున్నవాడు త్రిశిరస్కుడు. సర్పాన్ని చిహ్నంగా ధరించి ధనుష్టంకారము చేస్తున్నవాడు కుంభుడు. చేతిలో పరిఘను ధరించి ఉత్సాహంతో ఉరకలు వేస్తూ వస్తున్నవాడు నికుంభుడు. ఆ పక్కనే రథం మీద వస్తున్నవాడు నరాంతకుడు. వీడి ముందు దేవ,దానవ,గంధర్వ, యక్షులు నిలబడి యుద్ధం చేయలేరు. అందుకని వీడు పర్వతములతో యుద్ధం చేస్తుంటాడు.
వారందరి మధ్యలో రౌద్రరూపంతో వెలిగిపోతున్నవాడు రావణుడు. లంకాధి నేత. ఈ యుద్ధానికి కారకుడు. అతని రథము మీద శ్వేతఛత్రము ఎగురుతూ ఉంది. రావణుడు, యముని దేవేంద్రుని గర్వం అణిచినవాడు. అపజయము ఎరుగని వాడు. అతడే నీ శత్రువు రావణుడు." అని పలికాడు విభీషణుడు.
రావణుని వంక అదేపనిగా చూచాడు రాముడు.
“ఆహా! ఏమి తేజస్సు. మధ్యందిన మార్తాండుని ఎలా చూడలేమో అదే తేజస్సుతో ప్రకాశిస్తున్న రావణుడు కూడా చూడశక్యముకాకున్నాడు. కళ్లు మిరిమిట్లుకొలుపుతున్నాడు. దేవదానవులకు కూడా ఇంతటి ప్రకాశము, తేజస్సు ఉండదు. సాక్షాత్తు యమధర్మరాజు నడిచి వస్తున్నాడా అన్నట్టు ఉంది. విధి వశాత్తు ఈ పాపాత్ముడు నా కంటపడ్డాడు. వీడికి చావు తప్పదు." అనుకున్నాడు రాముడు.
రామలక్ష్మణులు తమ ధనుస్సులను సంధించారు.
రావణుడు తన సేనానాయకులను చూచి "మీరందరూ నగర ద్వారములను, భవనములను, ప్రధాన మార్గములను రక్షించండి. నేను రామలక్ష్మణులను నిరోధిస్తాను." అని అన్నాడు. రావణుని ఆజ్ఞ ప్రకారము సేనానాయకులు నగర రక్షణ కొరకు వెళ్లారు. రావణుడు వానర సైన్యములోకి చొచ్చుకుపోయాడు. ఇది చూచిన సుగ్రీవుడు పెద్ద పర్వత శిఖరమును పెకలించి చేత ధరించి రావణుని వంకకు దూసుకుపోయాడు. ఆ పర్వత శిఖరమును రావణుని వంకకు
బలంగా విసిరాడు. రావణుడు ఆ పర్వతశిఖరమును తనబాణములతో ఛేదించాడు.
వెంటనే రావణుడు మహా సర్పము వంటి బాణమును సంధించి సుగ్రీవుని మీదికి ప్రయోగించాడు. ఆ బాణము సుగ్రీవుని శరీరాన్ని చీల్చింది. ఆ శరాఘాతానికి సుగ్రీవుడు పెద్దగా అరిచి స్పృహ తప్పి పడిపోయాడు. అది చూచి రాక్షససేనలు ఆనందంతో కేకలు వేసాయి. ఈ పరిణామాన్ని చూచిన గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, ఋషభుడు, జ్యోతిర్ముఖుడు, నలుడు గబ గబా చేతికి అందిన పర్వతశిఖరములను తీసుకొని రావణుని వైపుకు పరుగెత్తారు. రావణుడు వారి చేతుల్లో ఉన్న పర్వత శిఖరములను తన వాడి అయిన అత్యంత శక్తివంతమైన బాణములతో నుగ్గు నుగ్గు చేసాడు. అంతే కాకుండా వాడి అయిన బాణములతో ఆ వానర వీరుల శరీరాలు తూట్లు పడేట్టు కొట్టాడు రావణుడు. ఆ బాణము దెబ్బలకు తట్టుకోలేక వానర వీరులు కిందపడిపోయారు. “రామా రామా రక్షించు రామా” అంటూ అరుస్తున్నారు.
బలంగా విసిరాడు. రావణుడు ఆ పర్వతశిఖరమును తనబాణములతో ఛేదించాడు.
వెంటనే రావణుడు మహా సర్పము వంటి బాణమును సంధించి సుగ్రీవుని మీదికి ప్రయోగించాడు. ఆ బాణము సుగ్రీవుని శరీరాన్ని చీల్చింది. ఆ శరాఘాతానికి సుగ్రీవుడు పెద్దగా అరిచి స్పృహ తప్పి పడిపోయాడు. అది చూచి రాక్షససేనలు ఆనందంతో కేకలు వేసాయి. ఈ పరిణామాన్ని చూచిన గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, ఋషభుడు, జ్యోతిర్ముఖుడు, నలుడు గబ గబా చేతికి అందిన పర్వతశిఖరములను తీసుకొని రావణుని వైపుకు పరుగెత్తారు. రావణుడు వారి చేతుల్లో ఉన్న పర్వత శిఖరములను తన వాడి అయిన అత్యంత శక్తివంతమైన బాణములతో నుగ్గు నుగ్గు చేసాడు. అంతే కాకుండా వాడి అయిన బాణములతో ఆ వానర వీరుల శరీరాలు తూట్లు పడేట్టు కొట్టాడు రావణుడు. ఆ బాణము దెబ్బలకు తట్టుకోలేక వానర వీరులు కిందపడిపోయారు. “రామా రామా రక్షించు రామా” అంటూ అరుస్తున్నారు.
ఇది చూచి కోపోద్రిక్తుడయ్యాడు రాముడు. వెంటనే తన బాణమును సంధించాడు. అది చూచిన లక్ష్మణుడు రాముడితో ఇలా అన్నాడు. “రామా! ఈ దుష్టుడిని చంపడానికి నీవు బాణం సంధించాలా! నేను లేనూ. నేను ఇతనిని సంహరిస్తాను. నాకు అవకాశం ఇవ్వు." అని అడిగాడు.
"లక్ష్మణా! అలాగే కానీ. కానీ చాలా జాగ్రత్తగా ఉండు. రావణుడు సామాన్యుడు కాడు. అమిత పరాక్రమవంతుడు. శక్తిమంతుడు. అతనికి ఎన్నోవిద్యలు మాయలు తెలుసు. రావణుడు
ఆగ్రహిస్తే మూడులోకాలను భస్మం చేయగలడు. కాబట్టి అతి జాగరూకతతో వ్యవహరించు. లక్ష్మణా! ముందు రావణుని పరిశీలించు. అతనిలో ఉన్న లోపము, బలహీనత గుర్తించు. అదే మాదిరి నీలో ఉన్న లోపాలు, బలహీనతలను కూడా గ్రహించు. తదనుగుణంగా యుద్ధం చేయి. నిన్ను నీవు రక్షించుకోడం మాత్రం మరిచిపోకు. ముందు స్వీయరక్షణ ప్రాధాన్యము. తరువాత శత్రువును చంపడం.” అని అన్నాడు రాముడు.
లక్ష్మణుడు రాముడికి నమస్కరించి రావణునితో యుద్ధానికి వెళ్లాడు.ఆ సమయంలో రావణుడు వానరుల మీద బాణాలను వర్షంలాగా కురిపిస్తున్నాడు. ఆ బాణాల ధాటికి తట్టుకోలేక వానరులు చెల్లాచెదరు అయ్యారు. వానరులను చించి చెండాడుతున్న రావణుని చూచాడు లక్ష్మణుడు. రావణుడు వానరులను చంపడం చూచిన హనుమంతుడు రావణుని బాణధాటిని అడ్డుకోడానికి రావణుని మీదికి వెళ్లాడు. హనుమంతుడు వెళ్లి రావణుని రథం ముందు నిలబడి చేయి పైకెత్తి ఇలా అన్నాడు.
“ఓ రావణా! నీవు దేవ, దానవ, యక్ష, గంధర్వులనుండి చావు లేకుండా వరము పొందావు. కానీ మా వానరులను మరిచావు. వానరులంటే నీకు భయం కదా! నా కుడి చేయి నీ శరీరంలో నుండి జీవాత్మను వేరు చేయడం సత్యం. కాచుకో" అన్నాడు హనుమంతుడు.
ఆ మాటలకు రావణుని కళ్లు కోపంతో ఎర్రబడ్డాయి. “ఓ వానరా! నువ్వు అంత బలవంతుడివి అయితే రా! నన్ను కొట్టు. నీ బలం ఏపాటిదో చూస్తాను. తరువాత నిన్ను చంపుతాను.” అన్నాడు రావణుడు విలాసంగా.
“నువ్వు అంత మొనగాడివా! నేను నీ కుమారుడు అక్షయుని చంపాను గుర్తులేదా! అప్పుడేం చేసావు." అని హేళన చేసాడు హనుమంతుడు. ఆ మాటలకు కోపంతో ఊగిపోయాడు రావణుడు. తన అరిచేతితో హనుమంతుని గుండెలమీద చరిచాడు. ఆ దెబ్బకు ముందుకు తూలాడు హనుమంతుడు. కాసేపు నిలదొక్కుకొని హనుమంతుడు తన అరిచేతితో రావణుని గుండెలమీద చరిచాడు. హనుమంతుని దెబ్బకు రావణుని శరీరం అంతా కంపించింది. పక్కకు తూలాడు. కాసేపు కళ్లు బైర్లు కమ్మాయి. అంతలో స్పృహ తెచ్చుకున్నాడు రావణుడు.
“ఓ వానరా! నీవు నాకు తగ్గ శత్రువు. నీ బలం అమోఘం. నీ పరాక్రమం అద్భుతం." అని అన్నాడు రావణుడు.
“రావణా! ఇదీ ఒక బలమేనా! నేను కొట్టిన దెబ్బకు, దెబ్బ తిన్న వాడు మరుక్షణం మరణించాలి. కాని నీవు ఇంకా జీవించి ఉన్నావంటే నా బలం అంత గొప్పది కాదు. రావణా! మరలా నన్ను ఒకసారి కొట్టు. ఆ కోపంతో తిరిగి నేను నిన్ను కొడతాను. అప్పుడు నీవు యమలోకం చేరుకుంటావు." అని అన్నాడు హనుమంతుడు.
హనుమంతుని మాటలకు రావణుని కోపం తారస్థాయికి చేరుకుంది. తన కుడి చేతి పిడికిలితో హనుమంతుని గుండెల మీద గట్టిగా మోదాడు. రావణుని దెబ్బకు తట్టుకోలేక హనుమంతుడు బాగా తూలిపోయాడు. స్పృహ తప్పాడు. రావణుడు హనుమంతుని వదిలి నీలుడి వంకకు వెళ్లాడు. రావణుడు నీలుడి మీద సర్పములతో సమానమైన శక్తి కల బాణములను సంధించాడు. నీలుడు ఆ బాణధాటికి తప్పించుకుంటూ రావణుని మీద ఒక పర్వత శిఖరమును విసిరాడు. ఇంతలో హనుమంతుడికి స్పృహ వచ్చింది. రావణుని వంక చూచాడు. ఆ సమయంలో రావణుడు నీలుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇతరులతో యుద్ధం చేసేవాడితో తను యుద్ధం చేయడం మంచిది కాదనుకున్నాడు హనుమంతుడు.
రావణుడు, నీలుడు తన మీదకు విసిరిన పర్వత శిఖరమును తన బాణములతో తుత్తునియలు చేసాడు. నీలుడు కోపంతో ఊగి పోయాడు. నీలుడు మద్దిచెట్లను, సాలవృక్షములను రావణుని మీదికి విసురుతున్నాడు. రావణుడు ఆ వృక్షములను చించి చెండాడుతూ, నీలుడి మీద శరవర్షము కురిపిస్తున్నాడు. నీలుడు తన శరీరమును చాలా చిన్నదిగా చేసాడు. ఎగురుకుంటూ వెళ్లి రావణుని ధ్వజము మీద కూర్చున్నాడు. నీలుడు ఎక్కడా కనపడలేదు పైకి
చూచాడు రావణుడు. తన ధ్వజము మీద కూర్చుని పెద్దగా అరుస్తున్న నీలుడిని చూచాడు రావణుడు. చిన్ని వానర రూపంలో ఉన్న నీలుడు రావణుని ధ్వజము మీది నుండి రావణుని ధనుస్సు మీదికి దూకి, ధనుసు చివర కూర్చున్నాడు, తరువాత రావణుని కిరీటము మీద
వాలాడు.
నీలుడి కోతి చేష్టలు చూచి రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఆశ్చర్యపోయారు. అది చూచిన వానరులు ఆనందంతో అరుస్తూ గెంతులు వేస్తున్నారు. నీలుడు అలా తన ఎదురుగా చురుకుగా ఎగరడం చూచి రావణుడు ఆగ్నేయాస్త్రము తీసుకున్నాడు. వానరుల ఆర్భాటము చూచి రావణునికి ఏమి చెయ్యాలో తోచలేదు. రావణుడు ఆగ్నేయాస్త్రమును నీలుడి మీద సంధించాడు. నీలుని చూచి ఇలా అన్నాడు. “ఓ వానరుడా! నీవు నా ముందు నీ చురుకుదనము మాయలు చూపుతున్నావు. రక రకాల రూపాలతో ప్రత్యక్షం అవుతున్నావు. చేతనైతే ఈ అస్త్రమును కాచుకో. నీ ప్రాణాలు కాచుకో. నీవు ఎన్ని వేషాలు వేసినా ఈ అస్త్రము నీ ప్రాణాలు తీయడం తథ్యం." అని అస్త్రమును ప్రయోగించాడు.
రావణుడు సంధించిన ఆగ్నేయాస్త్రము నీలుడి వక్షస్థలము ను తాకింది. నీలుడు కిందపడిపోయూడు. అగ్నిదేవుని కుమారుడు అవడం వలన నీలుడు ప్రాణాలు పోలేదు. కాని నీలుడు మూర్ఛపోయాడు. రావణుడు నీలుని వదిలి లక్ష్మణుని వంకకు వెళ్లాడు. రావణుడు తన రథము మీద లక్ష్మణుని ముందు నిలిచి ధనుష్టంకారము చేసాడు.
రావణుని చూచి లక్ష్మణుడు ఇలా అన్నాడు. “ఓ రాక్షసరాజా! అస్త్రములంటే తెలియని ఈ వానరులతో యుద్ధము కాదు. నాతో యుద్ధానికి రా!" అని అరిచాడు. ఆ మాటలకు కోపించిన రావణుడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. " ఓ లక్ష్మణా! మరణించే ముందు అంతా ఇలాగే అంటారు. నీ మరణము దైవవశాత్తు నాచేతిలో ఉంది. నా శరముల దెబ్బకు ఇప్పుడే యమపురి చేరుకుంటావు." అని అన్నాడు. దానికి లక్ష్మణుడు దీటుగా జవాబు చెప్పాడు. “ఓ రావణా! పాపాత్ములు ఇలాగే మాట్లాడుతారు. నీతి మంతులు, పరాక్రమ వంతులు, ఇలా మాట్లాడరు. నీ వీర్యము, బలము, శౌర్యము ఏపాటిదో నాకు తెలియదా! వృధా ప్రేలాపనలు కట్టిపెట్టి యుద్ధానికి దిగు." అని అన్నాడు లక్ష్మణుడు.
ఇంక రావణుడు బదులు చెప్పలేదు. బాణాలతోనే బదులు చెప్పాడు. లక్ష్మణుని మీద వాడి అయిన ఏడు బాణములు ప్రయోగించాడు. వాటిని మధ్యలోనే తుంచాడు లక్ష్మణుడు. తన బాణములు వృధా కావడం చూచి రావణుడు కోపించాడు. మరి కొన్ని వాడి అయిన బాణములను ప్రయోగించాడు రావణుడు. రావణుని విల్లునుండి బాణములు వెలువడగానే అవి లక్ష్మణుని బాణాలకు బలి అవుతున్నాయి. ఒక్కటీ లక్ష్మణుని చేరడం లేదు. లక్ష్మణుని వేగానికి, నిశితమైన లక్ష్యఛేదనకు రావణుడు ఆశ్చర్యపోయాడు. మరలా మరలా వాడి అయిన బాణములను లక్ష్మణుని మీద ప్రయోగించాడు. లక్ష్మణుడు కూడా అంతకన్నా వాడి అయిన బాణములను రావణుని మీద ప్రయోగించాడు.
రావణుడు తనకు బ్రహ్మదేవుడు ప్రసాదించిన అస్త్రముతో లక్ష్మణుని లలాట భాగంలో కొట్టాడు. ఆ బాణము దెబ్బకు లక్ష్మణుని కళ్లు తిరిగాయి. చేతిలో ధనుస్సు పట్టుజారి పోయింది. అంతలోనే తేరుకున్నాడు లక్ష్మణుడు. వాడి అయిన ఒకే ఒక బాణంతో రావణుని ధనుస్సు ఖండించాడు. వెంటనే మరొక మూడు బాణములతో రావణుని కొట్టాడు లక్ష్మణుడు. లక్ష్మణుని బాణముల ధాటికి రావణుని శరీరం అంతా రక్తసిక్తమయింది. రావణుని కోపము తారస్థాయికి చేరింది. వెంటనే బ్రహ్మదేవుడు ఇచ్చిన శక్తి అనే అస్త్రమును తీసుకున్నాడు. లక్ష్మణుని మీద ప్రయోగించాడు. ఆ శక్తి అస్త్రము,నిప్పులు పొగలు చిమ్ముకుంటూ లక్షణుని మీదికి వెళ్లింది.
లక్ష్మణుడు ఆ అస్త్రమును నిరోధించడానికి శతవిధాలా ప్రయత్నించాడు. కానీ అతని వల్ల కాలేదు. ఆ శక్తి అస్త్రము లక్ష్మణుని వక్షస్థలమును తాకింది. లక్ష్మణుడు నేల మీద పడిపోయాడు. కిందపడిపోయిన లక్ష్మణుని చూచిన రావణుడు తన రథమును దిగాడు. లక్ష్మణుని వద్దకు వచ్చాడు. లక్ష్మణుని తన బాహువులతో ఎత్తడానికి ప్రయత్నించాడు. కాని అతని వల్ల కాలేదు. లక్ష్మణుడు శక్తితో కొట్టబడినా స్పృహ కోల్పోలేదు. లోలోపల విష్ణునామ స్మరణ చేస్తున్నాడు. అందుకని శక్తి అస్త్రము లక్ష్మణుని మీద తన ప్రభావమును పూర్తిగా చూపడం లేదు.
రావణుడు శక్తిని ప్రయోగించడం, లక్ష్మణుడు పడిపోవడం, రావణుడు లక్ష్మణుని ఎత్తడం చూచాడు హనుమంతుడు. వెంటనే అక్కడకు వెళ్లాడు. తన పిడికిలి బిగించి రావణుని గుండెల మీద కొట్టాడు. రావణుడు హనుమంతుని దెబ్బకు చలించిపోయాడు. నేల మీద కూలబడిపోయాడు. రావణుని ముఖం నుండి చెవుల నుండి రక్తం కారుతూ ఉంది. క్రమక్రమంగా రావణుడు మూర్ఛపోయాడు. వెంటనే హనుమంతుడు లక్ష్మణుని తన బుజాల మీద ఎత్తుకొని రాముని వద్దకు తీసుకొని వచ్చాడు.
ఇంతలో రావణునికి తెలివి వచ్చింది. తన ధనుర్బాణములను తీసుకొని మరలా తన రథం ఎక్కాడు. నిరంతరము విష్ణునామ స్మరణ చెయ్యడం వల్ల లక్ష్మణుని శరీరంలో గుచ్చుకున్న శరములు అన్నీ నిర్వీర్యములు అయ్యాయి. వెంటనే రాముడు తన ధనుర్బాణములను తీసుకొని రావణుని వంకకు వెళ్లాడు. అది చూచిన హనుమంతుడు రాముని వద్దకు పోయి “రామా! విష్ణువు గరుడుని మీద ఎక్కినట్టు నువ్వు నా బుజాల మీద ఎక్కు. రావణుని సంహరించు.” అని అన్నాడు. హనుమంతుడు రాముని ముందు మోకరిల్లాడు. రాముడు హనుమంతుని వీపు మీద కూర్చున్నాడు. హనుమంతుడు వాయువేగంతో పైకి ఎగిరాడు. రావణుడు ఉన్న ప్రదేశానికి వెళ్లాడు. రాముడు తన రథంలో కూర్చుని ఉన్న రావణుని చూచాడు. లక్ష్మణుని మీద శక్తిని ప్రయోగించిన రావణుని చూడగానే రామునికి కోపం ఆగలేదు. ధనుస్సును సంధించి రావణుని వంకకు దూసుకుపోయాడు.
రాముడు దిక్కులు పిక్కటిల్లేటట్టు ధనుష్టంకారము చేసాడు. రావణుని చూచి ఇలా అన్నాడు.
“ఓ రావణా! నిలువు. పారిపోకు. నాకు ఇంత అపకారం చేసి నువ్వు నా నుండి తప్పించుకోలేవు. నా ఎదుట పడ్డ వాడిని ఇంద్రాది దేవతలు కూడా కాపాడలేరు. నిన్ను కాపాడటం ఆ త్రిమూర్తులకు కూడా శక్యం కాదు. నా తమ్ముడు లక్ష్మణుని నీ శక్తితో కొట్టి సంబరపడుతున్నావేమో. తొందరలోనే లక్ష్మణుడు లేచి నీ మీదికి రాగలడు. నిన్ను బంధుమిత్రసమేతంగా నాశనం చెయ్యగలడు. నా సంగతి నీకు తెలుసు కదా! జనస్థానములో 14000 మంది రాక్షసులను ఒంటి చేత్తో చంపాను. ఇంక నీవెంత. నీ రాక్షస సేనలు ఎంత. తృటిలో నాశనం చేస్తాను." అని పలికాడు రాముడు.
ఆ మాటలు విన్న రావణుడు కోపంతో మండి పడ్డాడు. తన వాడి అయిన బాణములను రాముని వాహనంగా ఉన్న హనుమంతుని మీద ప్రయోగించాడు. రావణుని బాణముల దెబ్బలు తగిలిన హనుమంతుడు మరింత తేజస్సుతో ప్రకాశించాడు. తనను వదిలి హనుమంతుని మీద రావణుడు బాణములను ప్రయోగించడం చూచి రాముడు కోపం తెచ్చుకున్నాడు. రాముడు తన వాడి అయిన బాణములతో రావణుని రథమును, రథమునకు కట్టిన గుర్రములను, సారథిని కొట్టాడు. తరువాత లెక్కలేని వాడి అయిన బాణములతో రావణుని వక్షస్థలమును ఛేధించాడు. రావణుని చేతిలోని ధనుస్సు కిందపడిపోయింది. పక్కకు తూలాడు రావణుడు. వెంటనే రాముడు ఒక అర్థచంద్రబాణంతో రావణుని కిరీటాన్ని కొట్టాడు. రావణుని కిరీటం కిందపడిపోయింది. రావణుడు తన రథం మీద కూలబడ్డాడు.
అప్పుడు రావణుని చూచి రాముడు ఇలా అన్నాడు.
“ఓ రావణా! నీవు లెక్కలేనన్ని పాపాలు చేసావు. ఎందరో వానర వీరులను చంపావు. ఇప్పుడు నిన్ను చంపగలను. కాని అలసి పోయి ఉన్నావు. అలసిపోయిన వారిని చంపడం ధర్మం కాదు. కాబట్టి నిన్ను చంపడం లేదు. ఈ రోజుకు లంకకు వెళ్లు. సేదదీరు. రేపు రా. మరొక రథం ఎక్కిరా. అప్పుడు నా పరాక్రమం ఎట్టిదో చూద్దువుగాని." అని అన్నాడు రాముడు.
రాముని మాటలతో రావణుని దర్పం అంతా దిగిపోయింది. దీనంగా చూస్తున్నాడు. మారు మాటాడకుండా మరొక రథం ఎక్కి లంకకు వెళ్లిపోయాడు రావణుడు. రావణుడు వెళ్లిన తరువాత, రాముడు లక్ష్మణుని శరీరంలో దిగిన బాణములను, వానరుల దేహములో గుచ్చుకున్న బాణములను అన్నీ తీయించాడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము యాభై తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment