శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - యాభై ఎనిమిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 58)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
యాభై ఎనిమిదవ సర్గ
అట్టహాసంగా యుద్ధానికి వస్తున్న ప్రహస్తుని చూచాడు రాముడు. చిరునవ్వు నవ్వాడు. విభీషణునితో ఇలా అన్నాడు. “విభీషణా! ఈ రాక్షస వీరుడు, సైన్యాధిపతి ఎవరు? ఇతని పేరు ఏమిటి? ఇతని బలపరాక్రమములు ఎట్టివి? ఇతనిని గురించి సవిస్తరంగా చెప్పు." అని అని అడిగాడు రాముడు.'ఇతని పేరు ప్రహస్తుడు. రావణుని రాక్షస సేనలకు అధిపతి. లంకలో ఉన్న మూడు వంతుల సేనలకు అధిపతి ఇతడే. ఇతడు మహా శూరుడు, పరాక్రమవంతుడు. అస్త్రవిద్యానిపుణుడు." అని అన్నాడు విభీషణుడు.
ఇంతలో ప్రహస్తుడు తన రాక్షస సేనలను వానర సేనల మీదికి పురికొల్పాడు. వానరులు పర్వతములను, బండరాళ్లను, వృక్షములను చేత ధరించి రాక్షసుల మీదికి పరుగెత్తారు. వానరులు రాక్షసులు ఒకరి మీద ఒకరు బండరాళ్లను, వృక్షములను, అస్త్రశస్త్రములను విసురుతున్నారు. వానరులకు రాక్షసులకు గొప్పయుద్ధము జరిగింది.
ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. ఇరు పక్కలా సైన్యం నష్టపోతున్నారు. రక్తం ఏరులైపారుతూ ఉంది. కొంతమంది శరీరాల్లో శూలాలు గుచ్చుకుంటున్నాయి. కొంతమంది పరిఘలతో కొట్టబడ్డారు. మరి కొంతమంది పర్వతశిఖరముల కిందపడి నలిగిపోతున్నారు. రాక్షసులు వానరులను తమ వద్ద ఉన్న కత్తులతో రెండుగా చీలుస్తున్నారు. వానరులు చెట్ల తోనూ కొండలతోనూ రాక్షసులను పిండి పిండి చేస్తున్నారు. వానరులు చేతులతోనూ కాళ్లతోనూ మర్దిస్తుంటే రాక్షసులు మాంసపు ముద్దలుగా మారిపోతున్నారు. ఒక పక్క దీనాలాపాలు మరొక పక్క సింహనాదాలు, విజయలక్ష్మి అటు ఇటు దోబూచులాడుతూ ఉంది.
ప్రహస్తుని మంత్రులు అయిన నరాంతకుడు, కుంభహనువు, మహానాదుడు, సమున్నతుడు కలిసి కట్టుగా వానరులను ఊతకోత కోస్తున్నారు. ఇంతలో ద్వివిదుడు ఒక పర్వత శిఖరముతో నరాంతకుడిని తుదముట్టించాడు. దుర్ముఖుడు ఒక చెట్టును సమున్నతుడు అనే రాక్షసుని మీదికి విసిరి వాడిని చంపాడు. జాంబవంతుడు ఒక పెద్ద బండరాయిని మహానాదుని గుండెల మీద పడేసాడు. దాని కింద పడి మహానాదుడు గుండెలు పగిలి చచ్చాడు. తారుడు ఒక పెద్ద చెట్టును పెకలించి దానిని కుంభహనువు మీదికి విసిరాడు. ఆ చెట్టు కిందపడి నలిగిపోయిన కుంభహనువు కుంభాన్ని తన్నేసాడు.
తన అనుచరులు అంతా అంతం కాగా ప్రహస్తుడు చలించిపోయాడు. వానరుల మీద పట్టరాని కోపంతో శరవర్షం కురిపించాడు. ప్రహస్తుని వీరవిహారానికి వానరులు తట్టుకోలేక పోయారు. కుప్పలు కుప్పలుగా చచ్చి పడిపోతున్నారు. ప్రళయకాల రుద్రునిలా చెలరేగిపోతున్నాడు ప్రహస్తుడు. అతని బాణధాటికి వానరులు నిలువలేకపోయారు. వానర వీరులు కూడా రాక్షసులను అసంఖ్యాకంగా నేలకూలుస్తున్నారు. వానరుల, రాక్షసుల, మృత కళేబరాలతో యుద్ధభూమిలో భూమి కనపడటం లేదు. శవాల కుప్పలు పరిచినట్టు ఉంది. యుద్ధభూమి అంతా రక్తంతో బురద బురద గా తయారయింది. సైనికులు తిరగడానికి కూడా కష్టంగా ఉంది.
కాని ప్రహస్తుడు తన బాణవర్షము కురిపించడం మానలేదు. అది చూచాడు నీలుడు. ప్రహస్తుని నిలువరించకపోతే ఆ రాత్రే యుద్ధం అంతం అయేట్టు ఉందని అనుకున్నాడు. తెగించి ప్రహస్తుని రథం మీదికి దూసుకు వెళ్లాడు. ప్రహస్తుడు కూడా నీలుని లక్ష్యంగా చేసుకొని బాణప్రయోగం చేస్తున్నాడు. ప్రహస్తుడు ప్రయోగించిన బాణములు నీలుని శరీరాన్ని తాకి నేలమీద పడుతున్నాయి. నీలుడు ఒక పెద్ద వృక్షాన్ని పెకలించాడు. ఆ వృక్షంతో ప్రహస్తుని మోదాడు. ఆ దెబ్బ తప్పించుకున్న ప్రహస్తుడు నీలుని మీద శరవర్షము కురిపించాడు. చేసేది లేక ఆ బాణ వర్షంలో తడుస్తున్నాడు నీలుడు.
అవకాశం కోసం ఎదురుచూస్తున్న నీలుడు పెద్ద సాలవృక్షములు పెకలించి దానితో ముందు ప్రహస్తుని రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. అదే సాలవృక్షంతో మరొక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు ప్రహస్తుని విల్లు విరిగింది. నీలుడు పెద్దగా సింహనాదం చేసాడు. విల్లు విరగ గానే ప్రహస్తుడు ఒక ముసలమును ఆయుధంగా తీసుకొని రథం దిగాడు. అటు నీలుడు ఇటు ప్రహస్తుడు ఇరువురి శరీరముల నిండా రక్తం కారుతూ ఉంది. ఒకరి ఎదురుగా ఒకరు రెండు కొండలవలె నిలబడి ఉన్నారు. మదం కారుతున్న ఏనుగుల వలె ఉన్నారు. ఒకరితో ఒకరు తలపడ్డారు. పులులు సింహాలు కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్నారు. ఇద్దరూ వీరులే. ఒకరికి ఒకరు తీసిపోరు.
ప్రహస్తుడు నీలుడి లలాటభాగం మీద ముసలంతో కొట్టాడు. నీలుడు ఒక వృక్షం తీసుకొని ప్రహస్తుని గుండెల మీద కొట్టాడు. ఆ దెబ్బను తప్పించుకొన్న ప్రహస్తుడు తన ముసలంతో నీలుని మీదికి ఉరికాడు. తన మీదికి వస్తున్న ప్రహస్తుని చూచి నీలుడు ఒక పెద్ద బండరాయి తీసుకున్నాడు. ఆ బండరాయితో ప్రహస్తుని తలమీద గట్టిగా మోదాడు. ఆ దెబ్బకు ప్రహస్తుని తల పగిలింది. ముక్కలు ముక్కలు అయింది. మొదలు నరికిన వృక్షం వలె ప్రహస్తుడు నేలకూలాడు. ప్రాణాలు వదిలాడు.
తమ సేనానాయకుడు నేలకూలడంతో రాక్షస సేనలకు ధైర్యం సడలిపోయింది. లంక వైపుకు పారిపోయారు. గట్టు తెగిన ఏరు మాదిరి రాక్షస సేనలు పారిపోతున్నారు. వారిని లంకాద్వారం దాకా తరిమారు వానరులు. రాక్షసులు అందరూ రావణుని వద్దకు వెళ్లారు. కాని వాళ్ల నోట మాట రాలేదు. రావణుని వంక అలా చూస్తూ నిలబడ్డారు. ఇక్కడ ప్రహస్తుని చంపిన నీలుని మీద ప్రశంసల జల్లు కురుస్తూ ఉంది. రామలక్ష్మణులు నీలుని మనసారా అభినందించారు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఏబది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment