శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - యాభై ఏడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 57)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
యాభై ఏడవ సర్గ
రామలక్ష్మణులను, సుగ్రీవుడిని చంపడానికి పంపబడిన అకంపనుడు హనుమంతుని చేతిలో వధింపబడ్డాడు అన్న విషయం తెలిసిన రావణుడుకి మతిపోయింది. కోపంతో ఊగిపోయాడు. కాని అంతలోనే రావణుని ముఖంలో దైన్యం తొంగి చూచింది. ఎందుకిలా జరుగుతూ ఉంది. ఇంతమంది వీరాధివీరులు ఎందుకు మరణిస్తున్నారు అని అంతర్మధనం చేసుకున్నాడు. కాని పైకి మాత్రం గంభీరంగా ఉన్నాడు. వెంటనే మంత్రి మండలిని పిలిపించాడు. వారితోమంతనాలు జరిపాడు.
సేనలను వారి వ్యూహములను సమీక్షించడానికి రాచమందిరం లో నుండి లంకానగరంలోకి వెళ్లాడు. సర్వసైన్యాధ్యక్షుడు ప్రహస్తుని చూచాడు. అతనితో ఇలా అన్నాడు. "ప్రహస్తా! లంకానగరాన్ని శత్రువులు ముట్టడించారు. మనకు యుద్ధం చేయడం తప్ప మరోమార్గం కనిపించడం లేదు. ఇప్పటి దాకా ఒకరి వెంట ఒకరు యోధానుయోధులు యుద్ధానికి వెళుతున్నారు, అందరూ మరణిస్తున్నారు. ఒక్కరూ విజయులై తిరిగి రావడం లేదు. గెలుపుజాడ కనపడటం లేదు.
సర్వసేనాధిపతి వైన నువ్వు, నికుంభుడు, నా తమ్ముడు కుంభకర్ణుడు, నా కుమారుడు ఇంద్రజిత్తు, ఆఖరున నేను, వీరు మాత్రమే ఈ యుద్ధము అనే మహాసముద్రమును తరించగలము అనిపిస్తూ ఉంది. అందుకని నీవు సర్వసైన్యములతో వెళ్లి వానరులతో యుద్ధము చేసి విజయం సాధించు. నీవు వస్తున్నావని తెలిసి వానర సేన దిక్కులు పట్టి పారిపోగలదు. వానరులకు స్థిరత్వము లేదు. చపలులు, వారికి యుద్ధవిద్యలో శిక్షణ లేదు. ఆటవికులు. చెట్లు బండరాళ్లు వాళ్ల ఆయుధములు. మీరు యుద్ధవిద్యలో సుశిక్షితులు. మీరు వస్తున్నారని తెలిసి వానరులు పారిపోవడం నీవే కళ్లారా చూస్తావు. వానర సైన్యము పారిపోయిన తక్షణం రాముడు, లక్ష్మణుడు నీకు లొంగిపోతారు.
మరొక మాట. యుద్ధములో జయాపజయాలు దైవాధీనాలు. నీవు జయించవచ్చు పరాజయం పొందవచ్చు. కానీ యుద్ధం చేయడం మన ప్రస్తుత కర్తవ్యము. నీవు యుద్ధానికి వెళ్లకపోతే మనకు పరాజయం తప్పదు. నిశ్చిత మైన ఫలితం కన్నా, సందేహాస్పదమైన ఫలితం మేలు కదా! ఉన్న విషయాలు అన్నీ విపులంగా చెప్పాను. ఈ సమయంలో మనకు అనుకూలమైన నిర్ణయం తీసుకో.” అని అన్నాడు రావణుడు.
మరొక మాట. యుద్ధములో జయాపజయాలు దైవాధీనాలు. నీవు జయించవచ్చు పరాజయం పొందవచ్చు. కానీ యుద్ధం చేయడం మన ప్రస్తుత కర్తవ్యము. నీవు యుద్ధానికి వెళ్లకపోతే మనకు పరాజయం తప్పదు. నిశ్చిత మైన ఫలితం కన్నా, సందేహాస్పదమైన ఫలితం మేలు కదా! ఉన్న విషయాలు అన్నీ విపులంగా చెప్పాను. ఈ సమయంలో మనకు అనుకూలమైన నిర్ణయం తీసుకో.” అని అన్నాడు రావణుడు.
ఆ మాటలు విన్న ప్రహస్తుడు ఇలా అన్నాడు. “ఓ రాక్షసేంద్రా! యుద్ధము విషయం గురించి మనం మంత్రి మండలిలో ఎన్నోసార్లు చర్చించాము. దీని గురించి మన మధ్య వాదోపవాదాలు జరిగాయి. మంత్రి మండలి సమావేశాలలో నేను "సీతను రామునికి ఇచ్చి యుద్ధం నివారించడం శ్రేయస్కరము" అని ఎన్నోసార్లు చెప్పాను. సీతను రామునికి ఇవ్వకపోతే యుద్ధం తప్పదని హెచ్చరించాను. కాని నీ ఆగ్రహానికి గురి అయ్యాను.
ఓ రాజా! నేను నీ వద్ద పనిచేస్తున్నాను. నీ వలన ఎన్నో సన్మానాలు, సత్కారాలు, బహుమానాలు పొందాను. అటువంటి నీకు ఆపత్కాలంలో ఆదుకోకుండా ఉంటానా! నీ కొరకు నేను యుద్ధం చేస్తాను. నీ కొరకు ఆత్మార్షణము చేసుకుంటాను. నాకు నా భార్యబిడ్డలు, బంధువులు స్నేహితులు ముఖ్యం కాదు. నా రాజు, నా కర్తవ్య నిర్వహణ, నాకు ముఖ్యం. నీ మాట ప్రకారము నేను యుద్ధానికి వెళుతున్నాను.” అని అన్నాడు ప్రహస్తుడు.
వెంటనే తన సైన్యాధ్యక్షులను సైన్యాలను సిద్ధం చేయమన్నాడు. లంకా నగరంలో ఉన్న సైనికులు అందరూ యుద్ధానికి సిద్ధం అయ్యారు. రావణుని విజయం కొరకు యజ్ఞములు చేసారు.
హోమాలు చేసారు. ఆ హోమాగ్నులలో పునీతమైన మాలలను రాక్షస వీరులు ధరించారు. ప్రహస్తుడు యుద్ధభేరీ మోగించాడు. ప్రహస్తుడు చక్కగా అలంకరింపబడిన రథాన్ని ఎక్కాడు. ఆ రథానికి మంచి జాతి అశ్వాలు కట్టబడి ఉన్నాయి. తన వెంట అశేష సైన్యము రాగా యుద్ధానికి బయలుదేరాడు ప్రహస్తుడు.
భేరీ నినాదాలు, శంఖధ్వనులు మిన్నుముట్టాయి. ప్రహస్తునికి నలువైపులా నరాంతకుడు, కుంభహనువు, మహానాదుడు, సమున్నతుడు, అనే రాక్షసనాయకులు వారి వారి రథాల మీద బయలుదేరారు. ప్రహస్తుడు లంకానగరము తూర్పుద్వారము నుండి బయటకు వచ్చాడు. ఆ ప్రకారంగా ప్రహస్తుడు యుద్ధానికి వెళుతూ ఉంటే, అపశకునాలు ఎన్నో కనపడ్డాయి. కాని ప్రహస్తుడు వాటిని లక్ష్యపెట్టలేదు.
ప్రహస్తుని అతని సైన్యమును చూచారు వానరులు. చేతికి అందిన బండరాళ్లను, చెట్లను ఆయుధములుగా ధరించారు. అటు రాక్షసులు, ఇటు వానరులు భయంకరంగా అరుస్తున్నారు. కేకలు పెడుతున్నారు. తమదే విజయమని ఉత్సాహంగా రంకెలు వేస్తున్నారు. ప్రహస్తుడు తన రథాన్ని సుగ్రీవుడు ఉన్న వంకకు పోనిచ్చాడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము యాభై ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment