శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - యాభై ఆరవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 56)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
యాభై ఆరవ సర్గ
వానర వీరులు రాక్షస సేనలను ఊచకోత కోస్తూ ఉండడంతో అకంపనుడికి కోపం వచ్చింది. దనుష్టంకారము కావించి తన సారధితో ఇలా అన్నాడు. “ఓ సారధీ! అక్కడ ఆ వానర వీరులు మన రాక్షస సేనలను చంపుతున్నారు. కేవలము ఏ ఆయుధమూ లేకుండా చెట్టను, బండరాళ్లను ఉపయోగించి మన వాళ్లను నుగ్గు నుగ్గు చేస్తున్నారు. మన రథమును అక్కడకు పోనివ్వు." అని అన్నాడు. వెంటనే అకంపనుడి సారథి రథమును వారి వంకకు పోనిచ్చాడు.అకంపనుడు తన ధనుస్సునుండి బాణములను వానరుల మీద వర్షము వలె కురిపిస్తున్నాడు. అకంపనుడి శరముల ధాటికి తట్టుకోలేక వానరులు పారిపోతున్నారు. దూరంనుండి ఇదంతా చూచాడు హనుమంతుడు. వెంటనే అకంపనుడు యుద్ధం చేసే చోటికి వెళ్లాడు హనుమంతుడు. హనుమంతుడు రావడం చూచిన వానరులు, ధైర్యం తెచ్చుకొని హనుమంతుడి చుట్టు చేరారు. హనుమంతుని చూడగానే వారి బలం రెట్టింపు అయింది. ఇది చూచిన అకంపనుడు హనుమంతుని మీద శరవర్షము కురిపించాడు. కాని హనుమంతుడు తన శరీరములో గుచ్చుకుంటున్న బాణములను లెక్కచేయడం లేదు. అకంపనుడిని ఎలా చంపడమా అని ఆలోచిస్తున్నాడు.
హనుమంతుడు పెద్దగా అరుస్తూ వికటాట్టహాసం చేస్తూ అకంపనుడి మీదికి వెళ్లాడు. అకంపనుడి మీదికి దూకుతున్న హనుమంతుడు అగ్నిగోళము మాదిరి ఉన్నాడు. పక్కనే ఉన్న ఒక కొండను పెకలించాడు. దానిని గిరా గిరా తిప్పుతూ అకంపనుడి మీదికి వెళ్లాడు. ఇది చూచిన అకంపనుడు అర్ధచంద్రాకృతిలో ఉన్న బాణములతో ఆ కొండను చీల్చాడు. అది చూచిన హనుమంతునికి కోపం వచ్చింది. అటు ఇటు చూచి ఒక పెద్ద మద్దిచెట్టును కూకటి వేళ్లతో సహా పెకలించాడు. దానిని తన చేతులతో గిరా గిరా తిప్పాడు. మద్దిచెట్టుతో హనుమంతుడు రాక్షసులను, వారి రధములను, సారధులను, ఏనుగులను, హయములను చావగొడుతున్నాడు. చేతిలో గద పట్టుకొని ఉన్న యముని మాదిరి హనుమంతుడు తన చేతిలోని మద్దిచెట్టుతో రాక్షసులను సంహరిస్తున్నాడు. ఏ రాక్షసుడు కూడా హనుమంతుడి ఎదుట పడటానికి సాహసించడం లేదు. పక్కకు తిరిగి పారిపోతున్నారు.
అది చూచిన అకంపనుడు బిగ్గరగా కేకలు పెట్టాడు. హనుమంతుడి మీద పదునాలుగు వాడి అయిన బాణములను ప్రయోగించాడు. ఆ బాణములు హనుమంతుని శరీరాన్ని చీల్చాయి. నారాచ బాణములు హనుమంతుని శరీరం నిండా గుచ్చుకున్నాయి. హనుమంతుడు మరొక వృక్షమును పెకలించి చేతిలో ధరించి, దానితో అకంపనుడి తలమీద బలంగా మోదాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక అకంపనుడు నేల మీద పడి గిలా గిలా కొట్టుకుంటూ మరణించాడు.
తమ నాయకుడు అకంపనుడు మరణించడం చూచిన రాక్షస వీరులు భయంతో వణికిపోయారు. పారి పోయారు. పారి పోతున్న రాక్షసులను వానరులు తరిమి తరిమి కొట్టారు. నేల మీద పడేసి ఈడ్చారు. కాళ్లతో మర్దించారు. రాక్షసులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని, మాటి మాటికీ వెనక్కు తిరిగి చూస్తూ, తమను వెంబడిస్తున్న వానరులను తప్పించుకుంటూ పరుగెడుతున్నారు. రాక్షసులందరూ లంకానగరంలోకి ప్రవేశించారు. అకంపనుడిని చంపిన హనుమంతుడిని వానర నాయకులు అందరూ వేనోళ్ల ప్రశంసించారు. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు హనుమంతుని అభినందించారు. ప్రశంసలను, అభినందనలను వినయంగా స్వీకరించాడు
హనుమంతుడు.
హనుమంతుడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము యాభై ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment