శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - యాభై ఐదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 55)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
యాభై ఐదవ సర్గ
తాను పంపిన వజ్రదంష్ట్రుడు అంగదుని చేతిలో మరణించాడు అన్న వార్త రావణునికి తెలిసింది. వాడిని పంపినంత సేపు పట్టలేదు వాడు చచ్చాడు అన్న వార్త వినడానికి. మరొకడిని పంపడం కన్నా వేరే మార్గము కనిపించడం లేదు రావణునికి, రావణుడు వెంటనే అకంపనుడు అనే సేనానాయకుడిని పిలిపించాడు.అకంపనుడు మహాయోధుడు. వాడికి యుద్ధము లేకపోతే నిద్రపట్టదు. రామలక్ష్మణులను, సుగ్రీవుడిని అకంపనుడు చంపగలడు అనే విశ్వాసము రావణునికి ఉంది. అకంపనుడి పరాక్రమం ముందు దేవతలు కూడా నిలువలేరు. అందుకని ఈసారి రామలక్ష్మణులను చంపే బాధ్యతను అకంపనుడికి అప్పగించాడు రావణుడు. రావణుని ఆజ్ఞను శిరసావహించిన అకంపనుడు తన అధీనంలో ఉన్న రాక్షస సైన్యమును యుద్ధమునకు సిద్ధం చేసాడు. వారు రకరకాలైన ఆయుధములు ధరించి అకంపనుడి వెంట యుద్ధమునకు బయలుదేరారు.
అకంపనుడు తన రథమును ఎక్కి సైన్యమును ముందుండి నడిపించాడు. కాని ఎందుకో అకంపనుడి రథమునకు కట్టిన గుర్రములు దీనంగా కదులుతున్నాయి. దానికి తోడు అకంపనుడి ఎడమ కన్ను అదిరింది. ఎన్నో అపశకునములు కనిపించాయి. కాని అకంపనుడు తన పరాక్రమాన్ని నమ్ముకున్నాడు. ఈ అపశకునములను లెక్కచేయలేదు. కదనరంగానికి బయలుదేరాడు.
రాక్షస సేనలు అకంపనుడి నాయకత్వంలో రావడం చూచి వానరులు కొంచెం భయపడ్డారు. కాని అంతలో తేరుకొని రాక్షసులతో తలపడ్డారు. వానరులు రాక్షసులు సమ ఉజ్జీలే. ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. వానరులు రాక్షసులు ఒకరితో ఒకరు యుద్ధం చేస్తుంటే వారి పాదఘట్టనలకు దుమ్ము పైకి లేచింది. ఆ దుమ్ములో ఎదుటి వారు కూడా కనపడటం లేదు. ఆ కారణంగా ఒక్కోసారి రాక్షసులను రాక్షసులు, వానరులను వానరులే చంపుకుంటున్నారు. వారి రక్తంతో తడిసిన యుద్ధభూమి అంతా బురద బురదగా మారింది.
వానరములు వృక్షములతోనూ, పెద్ద పెద్ద శిలలతోనూ, రాక్షసులు గదలు, పరిఘలు, తోమరములతోనూ, వానరులు తమ బాహువులతోనూ తమ శత్రువులను చంపుతున్నారు. రాక్షసులు తమచేతిలో ఉన్న ఆయుధములతో వానరులను కొట్టి చంపుతున్నారు.
అకంపనుడు కూడా వానరులను ఊచకోత కోస్తూ రాక్షస సేనలకు ఆనందం కలిగిస్తున్నాడు.
వానరులు కూడా పెద్ద పెద్ద శిలలను వృక్షములను రాక్షసుల మీదికి విసిరి వారిని నుగ్గు నుగ్గు చేస్తున్నారు. కుముదుడు, నలుడు, మైందుడు మహా వేగంతో కదులుతూ రాక్షసులను తునుమాడుతున్నారు. ఆ ప్రకారంగా వానరులకు రాక్షసులకు ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంది.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము యాభై ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment