శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - యాభై నాలుగవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 54)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

యాభై నాలుగవ సర్గ

వానర నాయకుడు అంగదుని విజృంభణ, రాక్షస సైన్యము అంతకంతకూ తగ్గిపోవడం గమనించాడు వజ్రదంష్ట్రుడు. అతనిలో క్రోధము తారస్థాయికి చేరింది. తన ధనుస్సును ఎక్కుపెట్టి వానర సేనల మీద శరవర్షము కురిపించాడు. వజ్రదంష్ట్రుని అండచూచుకొని
రాక్షసులు కూడా విజృంభించారు. ఇది చూచిన వానరులు చేతికి అందిన పర్వతశిలలను పెకలించి రాక్షసులమీదికి విసిరి, వారిని నుగ్గునుగ్గుచేస్తున్నారు.

రాక్షసులు వివిధ ఆయుధముల తోనూ వానరులు వృక్షములు, పర్వతశిలలతోనూ యుద్ధం చేస్తున్నారు. రాక్షసులు ప్రయోగించిన ఆయుధములను కాచుకుంటూ, పర్వతశిలలనూ, వృక్షములనూ రాక్షసుల మీదకు విసురుతున్నారు వానరులు. ఇరుపక్షములలో ఉన్న సైనికులకు తలలు తెగిపోయాయి. కాళ్లు చేతులు తెగిపోయాయి. వారి శరీరముల నుండి కారిన రక్తము ఏరులైపారుతూ ఉంది. ఆ శరీరములను తినడానికి కాకులు గద్దలు ఆకాశంలో తిరుగుతున్నాయి.

ఆ దృశ్యములను చూచిన పిరికి వారికి గుండె ఆగిపోవడం ఖాయం. అంత ఘోరంగా ఉంది రణరంగము. కాని ఎక్కువగా రాక్షససైన్యమునకే నష్టం జరిగింది. ఇది చూచిన వజ్రదంష్ట్రుడు తానే స్వయంగా వానర సేనను ఎదుర్కొన్నాడు. ఒక్కొక్క బాణానికి ఐదుగురు, పదిమంది, వానరులను చంపుతున్నాడు. వానరుల తలలు బంతుల మాదిరి ఎగురుతున్నాయి. ఇది చూచిన వానరులు అంగదుని వద్దకు పరుగెత్తారు. అంగదుడు విషయం తెలుసుకొని తానే స్వయంగా వజ్రదంష్ట్రుని ఎదుర్కొన్నాడు. ఇద్దరికీ ఘోరంగా యుద్ధం జరిగింది. వజ్రదంష్ట్రుడు తన బాణములతో అంగదుని శరీరం తూట్లు పడేట్టు కొట్టాడు. అంగదుడు కోపించి వజ్రదంష్ట్రుని మీదకు ఒక వృక్షాన్ని విసిరాడు. ఆ వృక్షాన్ని వజ్రదంష్ట్రుడు తన బాణములతో తుత్తునియలు చేసాడు. అంగదుడు ఒక పెద్ద పర్వతమును పెకలించి వజ్రదంష్ట్రుని మీదికి విసిరాడు. అది చూచిన వజ్రదంష్ట్రుడు గద తీసుకొని రథము నుండి కిందికి దుమికాడు. అంగదుడు విసిరిన పర్వతము వజ్రదంష్ట్రుని రథమును నుగ్గునుగ్గు చేసింది.

వజ్రదంష్ట్రుడు తన గదతో అంగదుని గుండెలమీద మోదాడు. తరువాత అంగదుడు, వజ్రదంష్ట్రుడు ఒకరితో ఒకరు ముష్టియుద్ధము చేసారు. అంగదుడు ఒక వృక్షమును పెకలించి చేత ధరించాడు. వజ్రదంష్ట్రుడు ఏమరిపాటుగా ఉన్నప్పుడు అంగదుడు ఆ వృక్షమును వజ్రదంష్ట్రుని మీదకు విసిరాడు. ఆ వృక్షము తగిలి వజ్రదంష్ట్రుడు కిందపడ్డాడు. తరువాత అంగదుడు ఒక కత్తితీసుకొని అతని తల తెగనరికాడు. వజ్రదంష్ట్రుని శరీరం రెండు ముక్కలయింది. అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

తమ నాయకుడు వజ్రదంష్ట్రుడు దారుణంగా మరణించడం చూసిన రాక్షస సైన్యము లంక వైపు పారిపోయారు. వజ్రదంష్ట్రుని చంపిన అంగదుని వానరనాయకులు అంతా ప్రశంసించారు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము యాభై నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)