శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - యాభై మూడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 53)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
యాభై మూడవ సర్గ
రాక్షసరాజు రావణునికి ధూమ్రాక్షుని దారుణ మరణం గురించి తెలిసింది. నిర్ఘాంత పోయాడు. కోపం వచ్చింది. బుసలు కొట్టాడు. వజ్రదంష్ట్రుడు అనే రాక్షసుని పిలిపించాడు."నీవు మహావీరుడవు. ఎన్నో యుద్ధములలో పాల్గొన్నావు. నీవు కావలసినంత సైన్యమును తీసుకొని వెళ్లి, రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని చంపి తిరిగిరా." అని అన్నాడు రావణుడు.
రావణుని ఆదేశము ప్రకారము కోట్లకొలది రాక్షస సైన్యముతో వజ్రదంష్ట్రుడు వానరుల మీదికి యుద్ధానికి బయలు దేరాడు. అతని సేనలో గజములు, అశ్వములు, గాడిదలు, ఒంటెలు, రథములు ఉన్నాయి. వాటిని ఎక్కిన రాక్షసులు మహా బలవంతులు పరాక్రమవంతులు. వజ్రదంష్ట్రుడు కూడా ఒక మహాధనుస్సును చేత ధరించి యుద్ధానికి బయలుదేరాడు. ఆయన వెంట అశేష రాక్షస సైన్యము బయలుదేరింది.
వారందరూ దక్షిణ ద్వారము నుండి బయటకు వచ్చారు. అక్కడ అంగదుడు తన సేనతో ఉన్నాడు. రాక్షసులకు దుశ్శకునములు గోచరించాయి. ఈ దుశ్శకునములను చూచి వజ్రదంష్ట్రుడు కలవర పడ్డాడు. అయినా ధైర్యంతో ముందుకు నడిచాడు. దక్షిణ ద్వారము
నుండి బయటకు వచ్చిన రాక్షస సైన్యమును వానరులు చుట్టు ముట్టారు. రాక్షసులకు వానరులకు ఘోరయుద్ధము జరిగింది. రాక్షసుల సైన్యములు, వానర సైన్యములు సమానంగా నశించాయి. వారి శరీరముల నుండి కారిన రక్తంతో రణభూమి అంతా రక్తసిక్తమయింది. ఒకరిని మించి ఒకరు యుద్ధం చేస్తున్నారు.
వానరులు వృక్షములు పర్వత శిలలను ప్రయోగిస్తుంటే, రాక్షసులు ధనుర్బాణములు వాడుతున్నారు. కొంత మంది రాక్షసులు తన ధనుస్సులను కిందపడవేసి వానరులతో ముష్టియుద్ధానికి తలపడ్డారు. వానరులు మాత్రము రాళ్లతోనూ వృక్షములతోనూ రాక్షసులను హతమారుస్తున్నారు. వజ్రదంష్ట్రుడు ధనుర్బాణములను ధరించి అపర యముని వలె యుద్ధంచేస్తున్నాడు. రాక్షససేనలు కూడా అధిక సంఖ్యలో వానరులను సంహరిస్తున్నారు.
అది చూచిన అంగదుడు కోపంతో ఊగిపోయాడు. రాక్షసులను అందరినీ ఊచకోత కోసాడు. దొరికిన వాడిని దొరికినట్టు చంపాడు అంగదుడు. అంగదుని చేతిలో చిక్కిన రాక్షసులు ప్రాణాలతో తప్పించుకోవడం లేదు. మొదలు నరికిన చెట్లమాదిరి కూలి పోతున్నారు. అంగదుని ధాటికి రాక్షస సేనలు తట్టుకోలేకపోతున్నాయి.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము యాభై మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment