శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - యాభై రెండవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 52)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

యాభై రెండవ సర్గ

ధూమ్రాక్షుడు యుద్ధానికి రావడం చూచి వానరులు సంతోషించారు. మరొక రాక్షసుడు బలి కాబోతున్నాడు అని ఆనంద పడ్డారు. వానరులు రాక్షసులు తలపడ్డారు. వానరులు పెద్ద పెద్ద బండరాళ్లను, మహావృక్షములను ఆయుధములుగా ధరించి యుద్ధం చేస్తుంటే, రాక్షసులు పట్టిసములు, శూలములు, ముద్గరలు ధరించారు. ఇరుపక్షముల వారు సమానంగా చస్తున్నారు. కాకపోతే రాక్షసుల చేతిలో బాణాలున్నాయి. వానరుల చేతిలో వృక్షములు బండరాళ్లు ఉన్నాయి. రాక్షసులు తమ వద్ద ఉన్న పట్టిసములు, బల్లెములతో వానరులను చీలుస్తున్నారు. కాని వానరులు ఏ మాత్రం భయపడక ముందుకు చొచ్చుకువస్తున్నారు. వానరులు విసిరే బండరాళ్ల కింద వృక్షముల కింద పడి ఎంతోమంది రాక్షసులు మరణిస్తున్నారు. వానరులు రాక్షసులను తమ పేర్లు చెప్పి మరీ చంపుతున్నారు. బండరాళ్ల కింద, వృక్షముల కింద పడ్డ రాక్షసులు రక్తం కక్కుకొని చస్తున్నారు. వేలకొలది రాక్షసులు మహా వృక్షముల కిందపడి నుగ్గు నుగ్గు అవుతున్నారు. రాక్షసులే కాదు, వానరులు విసిరిన బండరాళ్ల వృక్షముల కిందపడి హయములు, ఏనుగులు కూడా ఛిన్నాభిన్నం అవుతున్నాయి. వాటి మీద ఎక్కిన రాక్షస వీరులు కూడా వాటి కాళ్ల కింపడి నుగ్గు నుగ్గు అవుతున్నారు. ఆ ప్రదేశము అంతా ఏనుగులు, గుర్రములు, రాక్షసులు, వానరుల మృతకళేబరములతో నిండి పోయింది.

వానరులు రాక్షసుల మీదికి ఎగిరి తమ వాడి అయిన గోళ్లతో వారిని రక్కి, చీలుస్తున్నారు. దానికి కోపించిన రాక్షసులు వానరులను తమ అరిచేతులతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రాక్షసులు తమను కొట్టకముందే వానరులు మహావేగంతో ఆ రాక్షసులను పిడికిళ్లతో పొడుస్తూ, పాదముల కింద పడేసి తొక్కుతూ, దంతములతో చీలుస్తున్నారు. వానరుల ధాటికి తట్టుకోలేక రాక్షస సైన్యము పారిపోతూ ఉంది.

ఇది చూచాడు ధూమ్రాక్షుడు. కోపోద్రేకంతో వానరులను ఊచకోత కోస్తున్నాడు. వానరులు ధూమ్రాక్షుడి దెబ్బకు తట్టకోలేక గుట్టలుగా పడి మరణిస్తున్నారు. రాక్షసులు కొట్టిన దెబ్బలకు వానరుల శరీరాలు రక్తసిక్తం అయ్యాయి. రాక్షసులు తాము ధరించిన త్రిశూలములతో చీలుస్తుంటే వానరుల శరీరంలోని పేగులు బయటకు వస్తున్నాయి. వానరులు రాక్షసుల మధ్య ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధంలో ముందు నిలబడ్డ ధూమ్రాక్షుడు నవ్వుతూ తన ధనుస్సు ఎక్కుబెట్టి వానరుల మీద బాణప్రయోగం చేస్తున్నాడు. ధూమ్రాక్షుని పరాక్రమానికి తట్టుకోలేక వానరులు పారిపోసాగారు.

ఇదంతా చూచిన హనుమంతుడు కోపోద్రేకంతో ఒక పెద్ద బండరాయిని తీసుకొని ధూమ్రాక్షుని వంకకు దూకాడు. ఆ రాయిని ధూమాక్షుని రథంమీద బలంగా విసిరాడు. తన మీదికి వస్తున్న పెద్ద బండరాయిని చూచిన ధూమ్రాక్షుడు తన గద తీసుకొని రథము నుండి కిందికి దూకాడు. నేల మీద నిలబడ్డాడు. రథము మీద పడ్డ బండరాయి, ధూమ్రాక్షుని రథమును తుత్తునియలు చేసింది. తరువాత హనుమంతుడు చేతికందిన బండరాళ్లను, చెట్లను రాక్షసుల మీదికి విసురుతూ వారిని చంపుతున్నాడు. ఆ రాళ్ల దెబ్బకు రాక్షసుల తలలు బద్దలవుతున్నాయి. వృక్షముల కిందపడి రాక్షసులు మరణిస్తున్నారు. ఆది చూచి రాక్షస సైన్యము పారిపోతూ ఉంది.

హనుమంతుడు ఒక పెద్ద బండ రాయి తీసుకొని ధూమ్రాక్షుని వంకకు పరుగెత్తాడు. ధూమ్రాక్షుడు కూడా తన గద ఎత్తి పెద్దగా గర్జిస్తూ హనుమంతుని వంకకు పరుగెత్తాడు. ముళ్లతో నిండిన తన గదను ధూమ్రాక్షుడు హనుమంతుని పైకి విసిరాడు. ఆ దెబ్బను తప్పించుకొన్న హనుమంతుడు తాను తెచ్చిన బండశిలతో ధూమ్రాక్షుని తలపై మోదాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక ధూమాక్షుడు నేల మీద వెల్లకిలా పడ్డాడు. రక్తం కక్కుకొని మరణించాడు. ధూమ్రాక్షుని మరణం చూచిన రాక్షస సేనలు లంక వైపుకు పారిపోయారు. వారిని వానరులు తరిమి తరిమి కొట్టి చంపారు. ఆ ప్రకారంగా హనుమంతుని చేతిలో ధూమ్రాక్షుడు దారుణంగా మరణించాడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము యాభై రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)