శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - యాభై ఒకటవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 51)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
యాభై ఒకటవ సర్గ
వానరులు చేసే సింహానాదాలు, విజయ దుందుభుల మోతలు రాక్షసుల చెవిన బడ్డాయి. రావణుడి చెవులకు కూడా సోకాయి. వెంటనే రావణుడు మంత్రులను పిలిపించాడు. అత్యవసర సమావేశము నిర్వహించాడు. "విన్నారుగా ఆ వానరుల జయజయధ్వానాలు. వారికేదో గొప్ప సంతోషము కలిగే సంఘటన జరిగినట్టు ఉంది. సందేహము లేదు. ఆ వానరుల కేకలకు సముద్రము కూడా దద్దరిల్లుతూ ఉంది. మన ఇంద్రజిత్తు రామలక్ష్మణులను సర్పబాణములతో శరబంధనము చేసినాడు కదా! దీనవదనములతో శోకించక ఈ వానరులు చేసే జయజయధ్వానాలు నాలో ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి."అని పలికిన రావణుడు పక్కనే నిలబడి ఉన్న రాక్షస వీరులను చూచి ఇలా అన్నాడు."రామలక్ష్మణుల మృతికి శోకించవలసిన సమయములో వానరులు ఈ ప్రకారంగా సంతోషంగా కేరింతలు కొట్టడానికి గల కారణం తెలుసుకొని రండు." అని ఆదేశించాడు. వెంటనే ఆ రాక్షస వీరులు లంకా నగర ప్రాకారముల మీదికి ఎక్కారు. వానర సైన్యమును జాగ్రత్తగా పరిశీలించారు. శరబంధనంతో నిర్జీవులుగా ఉండవలసిన రాముడు లక్ష్మణుడు సలక్షణంగా ఉండటం చూచారు. రామలక్ష్మణులు ద్విగుణీకృత ఉత్సాహంతో ప్రకాశిస్తున్నారు. రాక్షసుల గుండెల్లో గుబులు రేగింది. వారందరూ పాకారములు దిగి వడి వడిగా రావణుని వద్దకు వెళ్లారు. దిగాలు పడిన మొహాలతో రావణుని ముందు నిలబడ్డారు. తాము చూచింది చూచినట్టు రావణునికి విన్నవించుకున్నారు.
"రాక్షసేంద్రా! జయము జయము. ఇంద్రజిత్తులవారి చేతిలో సర్పబాణబంధీకృతులై మరణించిన రామలక్ష్మణులు తమ బంధనాలు వీడి పునర్జీవితులై ఉదయభానుడి వలె ప్రకాశిస్తున్నారు. కట్లు తెంచుకున్న ఏనుగుల వలె ఉత్సాహంగా ఉన్నారు. ఆ మాటలు విన్న రావణుడికి కోపము భయము ఒకేసారి ముంచుకొచ్చాయి. రావణుడు వివర్ణవదనుడయ్యాడు.
"ఏమిటీ! ఇది నిజమా! యుద్ధములో ఇంద్రజిత్తు రామ లక్ష్మణులను ఓడించాడు కదా! తన సర్పబాణములతో బంధించాడు కదా! వారు మృతప్రాయులయ్యారని నాకు చెప్పాడు కదా! మరలా ఇదేమి? అస్త్రబంధములో చిక్కుకున్న రామలక్ష్మణులు బంధవిముక్తులు కావడాన్ని బట్టి చూస్తే మన రాక్షస బలగముల బలపరాక్రమములు సందేహాస్పదములుగా ఉన్నాయి. మేము పూర్వము చేసిన యుద్ధములలో ఏ అస్త్రశస్త్రములు మాకు విజయాన్ని సంపాదించి పెట్టాయో అవే అస్త్ర శస్త్రములు ఇప్పుడు రామలక్ష్మణుల ముందు వ్యర్థమైపోయాయి. " అని పలికి ధూమ్రాక్షుడు అనే రాక్షసవీరుని పిలిచాడు.
"ధూమాక్షా! నీవు నీ సైన్యముతో యుద్ధరంగమునకు వెళ్లు. రాముడిని లక్ష్మణుని వానర సేనలను సర్వనాశనం చెయ్యి." అని ఆదేశించాడు.
వెంటనే ధూమాక్షుడు రాక్షస సైన్యాధ్యక్షుడిని చూచి "నేను రామలక్ష్మణుల మీదికి యుద్ధానికి వెళ్లాలి. సేనలను సిద్ధం చేయండి" అని అన్నాడు. సైన్యాధ్యక్షుడు ధూమాక్షుడికి సేనలను సమకూర్చాడు. తన అపార సేనావాహినితో వానరుల మీదికి యుద్ధానికి బయలుదేరాడు ధూమ్రాక్షుడు. నల్లని మేఘాల వలె ఉన్న రాక్షస వీరులు, పెద్దగా గర్జిస్తూ, శూలములు, ముద్గరములు, గదలు, పట్టిసములు, ఇనుప ఆయుధములు, పరిఘలు, బల్లెములు, గొడ్డళ్లు తీసుకొని ధూమాక్షుని వెంటయుద్ధానికి బయలు దేరారు. మరి కొందరు రాక్షస వీరులు గాడిదలు లాగుతున్న రథముల మీద యుద్ధానికి బయలుదేరారు. మరికొందరు రాక్షస వీరులు వాయు వేగముతో పరుగెత్తే గుర్రముల మీద, ఏనుగుల మీద బయలుదేరారు. ధూమ్రాక్షుడు కూడా గాడిదలు కట్టిన రథము మీద బయలుదేరాడు. వారందరూ పశ్చిమ ద్వారము వద్దకు చేరుకున్నారు.
అక్కడ హనుమంతుడు వానరసేనలతో మోహరించి ఉన్నాడు. గాడిదలుకట్టిన రథము మీద వెళుతున్న ధూమ్రాక్షునికి అనేక అపశకునములు గోచరించాయి. ఒక భయంకరమైన గ్రద్ద ధూమ్రాక్షుని రథమునకు కట్టిన ధ్వజము మీద వాలింది. తలలేని మొండెము ఒకటి ధూమ్రాక్షుని రథము ముందు పడింది. వాయువు ప్రతికూల దిశలో వీచింది. ఈ దుశ్శకునములు చూచి ధూమ్రాక్షుని మనను కలత చెందింది. అయినా ధైర్యంతో ముందుకు సాగాడు. వానర సేనను అంతా ఒక్కసారి పరిశీలించి చూచాడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము యాభై ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment