శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఏబదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 50)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

ఏబదవ సర్గ

అది చూచిన సుగ్రీవుడు ఇలా అన్నాడు. “ఇదేమిటి. ఈ వానరులకు పిచ్చి పట్టిందా. లేక రావణుని భయం పట్టుకుందా. ” అని అన్నాడు. దానికి అంగదుడు ఇలా అన్నాడు. మనకు నాయకులైన దశరథ కుమారులు రామలక్ష్మణులు శరతల్పగతులై ఉన్నారని తమరికి తెలియదా! మరి వానరులు భయపడరా!' అని అన్నాడు.

“ఆ విషయం అందరికీ తెలుసు కదా! వానరుల భయమునకు ఏదో వేరు కారణము ఉండి ఉంటుంది. అధిక బలవంతులైన వానరులు ఇలా పారిపోతున్నారంటే వారి భయానికి తగిన కారణం ఉండి ఉండాలి. లేకపోతే ఈ వానరులు సిగ్గు లేకుండా భయంతో పారిపోతున్నారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ పరుగెడుతున్నారు. ఎవరైనా కిందపడి పోతే వారిని తొక్కుకుంటూ వారి మీదినుండి పరుగెడుతున్నారు. ముందు వారిలో భయాన్ని పోగొట్టాలి." అని అన్నాడు.

ఇంతలో చేతిలో గద ధరించిన విభీషణుడు అక్కడికి వచ్చాడు. జయజయధ్వానాలు పలుకుతూ రాముడికి అభివాదము చేసాడు. సుగ్రీవునికి అప్పటికి అర్థం అయింది వానరుల భయకారణము. అపర రావణుని మాదిరి గదతో నడిచి వస్తున్న విభీషణుని చూచి అతడే రావణుడు అనుకొని వానరులు పారిపోతున్నారు అని తెలుసుకున్నాడు సుగ్రీవుడు. పక్కనే ఉన్న జాంబవంతుని చూచి ఇలా అన్నాడు. “జాంబవంతా! విభీషణుని చూచిన వానరులు అతడే రావణుడు అని కానీ, ఇంద్రజిత్తు అని కానీ అనుకొని పారిపోతున్నారు. మీరు వెళ్లి వారికి ధైర్యము చెప్పండి. వచ్చినవాడు విభీషణుడు అనీ, రావణుడు కానీ, ఇంద్రజిత్తు కానీ కాదు అని వారికి తెలియజెప్పండి." అని అన్నాడు.

సుగ్రీవుని ఆదేశము ప్రకారము జాంబవంతుడు వానరులకు ధైర్యము చెప్పడానికి వెళ్లాడు. వానరుల మధ్యకు వెళ్లి వారికి ధైర్యవచనాలు పలికాడు. అందరిలోకీ పెద్ద వాడైన జాంబవంతుని మాటలు విన్న వానరులు, నిజం తెలుసుకొని అందరూ వెనకకువచ్చారు.

విభీషణుడు రాముని, లక్ష్మణుని ఆ స్థితిలో చూచి చాలా ఆ బాధపడ్డాడు. తను కూడా వారి బాధలో పాలుపంచుకున్నాడు. విభీషణుడు సుగ్రీవునితో ఇలా అన్నాడు. “ఇంద్రజిత్తు రాక్షసుడు. మాయావి. మాయాయుద్ధంలో ఆరితేరినవాడు. కుటిలయుద్ధంలో మేటి. రామ లక్ష్మణులకు నేరుగా యుద్ధం చేయడం తెలుసు కానీ మాయాయుద్ధం తెలియదు. అందుకని ఇంద్రజిత్తు వీరిని జయించగలిగాడు. ఇంద్రజిత్తు వీరి శరీరం అంతా తూట్లుపడేట్టు కొట్టాడు. రామలక్ష్మణుల శరీరం అంతా రక్తసిక్తమయింది. అవసాన దశలో ఉన్నారు. నా అన్న నా శత్రువు అయిన రావణుడు గెలిచాడు. వాడి కోరిక తీరింది. సీత వాడి వశం అయింది." అని భోరున విలపించాడు విభీషణుడు.

సుగ్రీవుడు విభీషణుని చూచి ఇలా అన్నాడు. "విభీషణా! రామలక్ష్మణులు మరణించలేదు. కేవలము స్పృహ తప్పిఉన్నారు. వీరికి స్పృహ వచ్చిన తరువాత వీరు ఇద్దరూ రావణుని చంపగలరు. నిన్ను లంకాధీశునిగా అభిషేకించగలరు. ఊరట చెందుము." అని అన్నాడు. సుగ్రీవుడు తన పక్కనే ఉన్న తన మామగారు సుషేణుని చూచి ఇలా అన్నాడు. "ఈ పరిస్థితిలో రామలక్ష్మణులు ఇక్కడ ఉండటం మంచిది కాదు. నీవు వీరిని తీసుకొని కిష్కింధకు వెళ్లు. నేను నా సేనలతో ఇక్కడే ఉండి రావణుని బంధు పుత్ర మిత్ర సమేతంగా సంహరిస్తాను. సీతను తీసుకొని
వస్తాను."అని అన్నాడు.

అప్పుడు సుషేణుడు ఇలా అన్నాడు. "సుగ్రీవా! నాకు మాయా యుద్ధము కొత్త కాదు. దేవాసుర యుద్ధము గురించి నాకు బాగా తెలుసు ఆ రోజుల్లో దానవులు బాణప్రయోగంలో ప్రవీణులు. దేవతలు కేవలం అస్త్రములు మాత్రము వాడేవారు. దానవులు తమ మాయాశక్తితో మాయం అయిపోయి, దేవతల మీద బాణవర్షము కురిపించి వారిని ఓడించారు. అసురుల దెబ్బకు దేవతలకు బాగా దెబ్బలు తగిలి స్పృహ తప్పారు. కొంత మంది చనిపోయారు. అప్పుడు బృహస్పతి తనమంత్రశక్తిచేత, తనకు తెలిసిన ఓషధుల చేత చికిత్స చేసి వారిని బతికించాడు. ఆ ఔషధముల గురించి సంపాతికి పనసునికి బాగా తెలుసు. వారికి సంజీవకరణి, దేవతలు ఉపయోగించిన విశల్యకరణి అనే దివ్య ఔషధముల గురించి బాగా తెలుసు. వారిని పంపి ఆ ఓషధులు తెప్పించు. అలాగే దేవ దానవులు మధించిన క్షీరసముద్రములో చంద్రము, ద్రోణము అనే పర్వతములు ఉన్నాయి ఆ పర్వతములను దేవతలు క్షీరసముద్రములో ఉంచారు. వాయుపుత్రుడైన హనుమంతుని అక్కడకు పంపు. ఆయనకు కూడా ఈ ఓషధుల గురించి బాగా తెలుసు." అని అన్నాడు సుషేణుడు.

ఇంతలో తీవ్రంగా గాలి వీచింది. మేఘములు దట్టంగా అలముకున్నాయి. కొన్ని కొన్ని మహావృక్షములు కూకటి వేళ్లతోసహా పెకలింపబడి సముద్రములో పడిపోతున్నాయి. సముద్రములో ఉన్న జంతువులు సర్పములు అల్లకల్లోలం అయ్యాయి. దీని కంతటికీ కారణము గరుడుని రాక. అతని రెక్కల వేగము వలన అంతటి జంఝామారుతము వీచింది. ఆకాశంలో ఎగురుతూ వస్తున్న గరుడుడు వానరులకు కనపడ్డాడు. ఇంద్రజిత్తు రాముని మీద లక్ష్మణుని మీద నాగసర్పములు ఆవాహన చేసిన బాణములను ప్రయోగించాడు. ఆ సర్పబంధనంలో చిక్కుకున్న రామలక్ష్మణులు వాటి ప్రభావం వలన మృతప్రాయులయ్యారు. ఆ సంగతి వానరులకు తెలియదు. గరుడుని రాక చూచి రామలక్ష్మణులను బందించిన సర్పములు భయపడిపోయాయి. వెంటనే ఆ సర్పములు అన్నీ చెల్లాచెదరయ్యాయి. తలా ఒక దిక్కుకు పారిపోయాయి. రాముని లక్ష్మణుని పట్టి ఉంచిన నాగ బంధములు విడిపోయాయి. రామలక్ష్మణులకు శరబంధమునుండి విముక్తి కలిగింది.

గరుడుడు కిందికి దిగి రామ లక్ష్మణుల వద్దకు వచ్చాడు. రామ లక్ష్మణుల శరీరములను తన చేతితో నిమిరాడు. వారి ముఖములను ప్రేమతో నిమిరాడు. గరుడుని స్పర్శతో రామలక్ష్మణుల శరీరము మీద సర్పముల వంటి బాణములతో కలిగిన గాయములు అన్నీ మాయం అయ్యాయి. వారి శరీరం అంతకు ముందు కంటే కాంతి వంతంగా మెరిసిపోతూ ఉంది. రామ లక్ష్మణులకు పూర్వపు తేజస్సు పరాక్రమము, వీర్యము బలము ఉత్సాహము మొదలైన గుణములు అన్నీ మరలా సంక్రమించాయి. గరుడుడు రామ లక్ష్మణులను లేవదీసి కౌగలించుకున్నాడు. గరుడుని చూచి రాముడు ఇలా అన్నాడు.

"నీ ప్రసాదం చేత మేము ఇంద్రజిత్తు వలన కలిగిన ఆపద నుండి బయటపడగలిగాము. మా పూర్వపు బలపరాక్రమములు మాకు వచ్చాయి. నిన్ను చూస్తుంటే నా తండ్రి దశరథుడు, పితామహుడు అజమహారాజును చూచినట్టు ఉంది. ఇంతకూ నీవు ఎవరు? ఎక్కడి నుండి వచ్చావు?" అని అడిగాడు రాముడు.

అప్పుడు గరుడుడు రాముని చూచి ఇలా అన్నాడు. "రామా! నేను నీకు మిత్రుడను. నా పేరు గరుడుడు. మీకు సాయం చేద్దామని వచ్చాను. రావణుని కుమారుడైన ఇంద్రజిత్తు తన మాయతో మీ ఇద్దరినీ శరబంధం చేసాడు. ఈ శరబంధం నుండి విడిపించుకోవడం దేవతలకు కానీ, అసురులకు, గంధర్వులకు కానీ సాధ్యం కాదు. నీ మీద ఇంద్రజిత్తు ప్రయోగించినవి మామూలు బాణములు కావు. అవి కద్రువ కుమారులు అయిన నాగములు. అవి భయంకర విషసర్పాలు. ఇంద్రజిత్తు మాయా ప్రభావంతో ఆ విషసర్పములు బాణముల రూపంలో నిన్ను చుట్టుముట్టాయి. మీ ఇద్దరికీ స్పృహపోయేట్టు చేసాయి. అంతే కానీ మీ ప్రాణాలకు ఏమీ ప్రమాదం లేదు. మీ ఇద్దరూ అజేయులు. మీ ఇద్దరూ ఈ ప్రకారము సర్పములతో ఆవహింపబడిన శరతల్పగతులైనారని తెలిసి వెంటనే వచ్చాను. నన్ను చూచి నా గర్భశత్రువులైన ఆ సర్పాలు పారిపోయాయి. మీకు సృహవచ్చింది. చాలా సంతోషము. ఇంక మీదట మీరు ఈ రాక్షస మాయలను తెలుసుకొని ప్రవర్తించండి.

కుటిల యుద్ధము, కపట యుద్ధము చేయడం రాక్షసుల స్వభావము. మీకు ఆ కుటిలత్వము కపటము తెలియవు. మీరు పరాక్రమాన్ని బలాన్ని నమ్ముకున్నారు. అదే మీకు బలము. రాక్షసులు ఎల్లప్పుడూ కుటిల స్వభావులు. ఇంద్రజిత్తు చేసిన యుద్ధమే దానికి తార్కాణము. యుద్ధము సమానమైన బలముకలవారి మధ్యజరగాలి అది యుద్ధధర్మము. కాని వారు మీకు తెలియని మాయాయుద్ధం చేసారు. కాబట్టి మీరు ఎప్పుడూ రాక్షసులను నమ్మకండి. ఇదే నా హితవు. ఇంక నాకు వెళ్లడానికి అనుజ్ఞ ఇవ్వండి. మన ఇద్దరికీ ఎలా స్నేహం ఏర్పడింది అని ఇప్పుడు మీరు నన్ను అడగ వద్దు. రామరావణ యుద్ధము ముగిసిన పిమ్మట ఆవిషయం మీకు తెలియగలదు." అని రామునితో అన్నాడు గరుడుడు.

"నేను భవిష్యత్తును చెప్పుచున్నాను. నీవు ఈ యుద్ధములో లంకలో ఉన్న స్త్రీలు, బాలురు, వృద్ధులు తప్ప మిగిలిన రాక్షసులు అందరినీ సంహరించి, సీతను పొందగలవు." అని పలికాడు గరుడుడు. తరువాత రాముని అనుజ్ఞ పొంది, రామునికి ప్రదక్షిణము చేసి నమస్కరించి,
ఆకాశంలోకి ఎగిరిపోయాడు గరుడుడు.

రాముడు, లక్ష్మణుడు తమ పూర్వ ఆకారములతో తమ ముందు నిలిచేటప్పటికి వానరనాయకుల ఆనందానికి అవధులు లేవు. అందరూ జయజయధ్వానాలు చేసారు. భేరీలు మ్రోగించారు. మృదంగములు వాయించారు. శంఖములు పూరించారు. తోకలు ఊపుతూ సింహ నాదాలు చేసారు. ఆనందంతో గంతులు వేసారు. రెట్టించిన ఉత్సాహంతో చేతికి దొరికిన వృక్షములను పెకలించి వాటిని ఆయుధములుగా ధరించి యుద్ధానికి సిద్ధం అయ్యారు ఆ వానరులు. రాక్షసుల గుండెల్లో భయం పుట్టేటట్టు అరుస్తూ అందరూ లంకానగర ద్వారముల వైపు పరుగెత్తారు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము యాభయ్యవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)