శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - నలుబది తొమ్మిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 49)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
నలుబది తొమ్మిదవ సర్గ
రాముడు లక్ష్మణుని శరీరముల చుట్టు చేరిన వానర వీరులు దీనంగా చూస్తున్నారు. వారికి ఏం చెయ్యడానికీ తోచడం లేదు. ఆ శరబంధనం ఎలా వీడుతుందో తెలియడంలేదు. లక్షణుని కన్నా రామునికి మానసిక స్థైర్యము ఎక్కువ. అందువలన రాముడు తొందరలోనే స్పృహలోకి వచ్చాడు. రక్తసిక్తమైనశరీరంతో నేలమీద పడి ఉన్న లక్ష్మణుని చూచాడు రాముడు. రాముడికి దు:ఖము ముంచుకొచ్చింది. లక్ష్మణుని చూచి భోరున విలపించాడు.“నా లక్ష్మణుడు లేని నాకు ఈ జీవితము, నా సీత ఎందుకు వృధా. భూలోకములో పట్టుబట్టి వెతికితే సీత లాంటి భార్య కనపడవచ్చేమో కానీ లక్ష్మణుడి వంటి తమ్ముడు దొరకడం చాలా కష్టం. ఏ కారణం చేతనైనా లక్ష్మణుడు మరణిస్తే, ఈ వానరుల అందరి ముందరా నేను కూడా ప్రాణత్యాగం చేసుకుంటాను. నన్ను నమ్మి లక్ష్మణుని తల్లి సుమిత్ర లక్ష్మణుని నా వెంట పంపింది. ఇప్పుడు నేను ఒంటరిగా అయోధ్యకు వెళితే, సుమిత్ర నన్ను నిందిస్తుంది. ఆ నింద నేను భరించలేను. హాయిగా అయోధ్యలో ఉండక నా వెంట వచ్చి ఈ శరశయ్యమీద పడుకొని ఉన్నాడు. శరబంధనంలో బంధింపబడ్డాడు లక్ష్మణుడు. ఎంత దురదృష్టము.
ఓ లక్ష్మణా! నేను సీత గురించి శోకించినప్పుడు నువ్వు నన్ను ఓదార్చి నాకు ధైర్యము చెప్పేవాడివి ఇప్పుడు నీకోసం నేను ఏడుస్తున్నాను. లేచి నన్ను ఓదార్చు! ఈ రోజు యుద్ధములో నీవు ఎంతో మంది రాక్షసులను చంపావు. కానీ ఆ ఇంద్రజిత్తు చేతిలో మరణించావు.
లక్ష్మణా! నీ ముఖంలో కళ తగ్గలేదు. సంధ్యాసమయంలో సూర్యుడిలా ప్రకాశిస్తున్నావు. నీవు చావలేదు. నీ కళ్లలో కాంతి ఇంకా మెరుస్తూ ఉంది. నీవే కనుక యమపురికి వెళ్లవలసి వస్తే నేను కూడా నీ వెంట వస్తాను కానీ నిన్ను ఒంటరిగా వెళ్లనివ్వను. ఎందుకంటే నేను ఒంటరిగా అడవులకు వెళుతున్నాను అని నీవు నా వెంట వచ్చావుకదా! అందుకే నేను కూడా నీ వెంట వస్తాను.
లక్ష్మణా! నీ దురవస్థకు నేను కారణము. నా వలన నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. అందరికీ దూరంగా నా వెంట అడవులలో తిరుగుతున్నావు. తుదకు ప్రాణాల మీదికి తెచ్చుకున్నావు. కాని నీకు నా మీద కించిత్ కూడా కోపం రాలేదు. నాతో ఒక్క చెడ్డ మాటకూడా మాట్లాడలేదు.
లక్ష్మణా! నీ పరాక్రమము నాకు తెలియనిదా! నీవు కార్తవీర్యార్జునుని కంటే పరాక్రమవంతుడవు. కానీ కాలం కలిసిరాక ఇంద్రజిత్తు చేతిలో ఓడిపోయావు.
లక్ష్మణా! అయోధ్యలో పట్టుపరుపుల మీద పరుండవలసిన వాడివి ఇక్కడ ఈ శరతల్పము మీద పడుకున్నావా! ఇంద్రునే జయించగలవాడివి ఇంద్రజిత్తుచేతిలో ఓడిపోయావా!
ఓ సుగ్రీవా! నన్ను లక్ష్మణుని వదిలి వెళ్లిపొండి. రావణుడు మిమ్ములను ఏమీ చేయడు. రావణుని కోపం నా మీదనే కదా. మీరందరూ సముద్రము దాటి కిష్కింధకు వెళ్లిపొండి. నా కోసరము మీ ప్రాణాలు ఎందుకు బలిపెడతారు. ఇప్పటిదాకా మీరు నాకు చేసిన సాయమునకు కృతజ్ఞుడను. నువ్వు జాంబవంతుడు, అంగదుడు, మైందుడు, ద్వివిదుడు, కేసరి,సంపాతి, గవయుడు, గవాక్షుడు, శరభుడు, గజుడు, నా కోసరము రాక్షసులతో ఘోర యుద్ధము చేసారు. నా కొరకు మీ ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా రాక్షసులతో యుద్ధం చేసారు. కాని మనము దైవ నిర్ణయమును అతిక్రమించలేము కదా!
సుగ్రీవా! ఒక స్నేహితుడుగా నీవు నాకు చేయగలిగినది అంతా చేసావు.
ఓ వానర ప్రముఖులారా! మీరందరూ నా కోసరం ఎంతో చేసారు. మీ అందరికీ కృతజ్ఞుడిని. నేను మీకు అనుమతి ఇస్తున్నాను. మీ మీ ప్రదేశములకు తిరిగి పొండు. ఇదే నా విన్నపము" అని కళ్ల వెంట నీరు కారుతుండగా రాముడు అందరికీ వీడ్కోలు పలికాడు.
రాముడి మాటలు విన్న ఏ వానరుడూ కన్నీరు పెట్టకుండా ఉండలేకపోయాడు. ఇంతలో విభీషణుడు చేతిలో గద ధరించి సైన్యములకు ధైర్యం చెబుతూ రాముడు ఉన్న చోటికి వచ్చాడు. రావణుడు, అతని తమ్ముడు విభీషణుడు ఒకే పోలికతో ఉండటం వలన, విభీషణుని అంతా రావణుడు అనుకొన్నారు. వారిలో భయం ప్రవేశించింది. ఇంద్రజిత్తు రామలక్ష్మణులను చంపాడు. రావణుడు మనలను చంపడానికి వచ్చాడు అని అరుస్తూ వానరులు తలొకదిక్కుగా పారిపోయారు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము నలుబది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment