శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - నలుబది ఎనిమిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 48)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
నలుబది ఎనిమిదవ సర్గ
రాముడు, లక్ష్మణుడు అచేతనంగా పడి ఉండడం చూచిన సీత వారు మృతి చెందారని భ్రమించింది. దీనంగా ఏడ్చింది.“అయ్యో భగవంతుడా! నా చిన్నతనంలో నా జాతకము చూచిన జ్యోతిష్కులు నాకు పుత్ర సంతానము కలుగుననియూ, నాకు వైధవ్యము లేదనియూ చెప్పి ఉన్నారు కదా! మరలా ఇదేమి ఘోరము. నా రాముడు నన్ను విడిచి వెళ్లిపోయాడు. ఆ పండితులు జ్యోతిష్యులు చెప్పిన మాటలు అన్నీ అసత్యములు అయినట్టే కదా! అదే జ్యోతిష్కులు నేను గొప్ప గొప్ప యజ్ఞములు యాగములు చేసిన మహారాజు కు భార్యను అవుతాను అని చెప్పారు. కాని నా రాముడు అకాల మరణం చెందడంతో అవన్నీ అబద్ధాలు అయినట్టే కదా! వీరుల భార్యలందరిలోనూ నేను అత్యంత గౌరవానికి పాత్రురాలను అగుదును అని పండితులు చెప్పారు కదా. మరి ఆ మాటలన్నీ వమ్ము అయ్యాయా! వారు అసత్యం చెప్పారా! నేను నమస్కరించిన పండితులు దైవజ్ఞులు అందరూ అఖండ సౌభాగ్యవతి అని నన్ను దీవించారు కదా! మరి ఆ దీవెనలన్నీ వృధా అయినట్టేనా! రాముని మరణంతో నా సౌభాగ్యము మంటగలిసినట్టేనా! నా పాదములలో పద్మములు ఉన్నాయనీ, నన్ను వివాహమాడిన వారు చక్రవర్తి అవుతారనీ సాముద్రిక వేత్తలు చెప్పారు కదా! మరి ఆ శుభలక్షణములు అన్నీ నా నుండి మాయం అయి పోయాయా! లోకములో వైధవ్యమును పొంద దగిన స్త్రీలకు ఉండవలసిన లక్షణములు ఏ ఒక్కటి కూడా నాలో మచ్చుకైనా కనిపించవు కదా! మరి నాకు ఈ అకాల వైధవ్యము ఎందుకు ప్రాప్తించినది! మరి నా శరీరములో అఖండ సౌభాగ్యవతికి ఉండవలసిన సాముద్రిక లక్షణములు అన్ని ఎక్కడ ఉండవలసినవి అక్కడ ఉన్నాయి కదా! మరి అవి అన్నీ వృధా అయిపోయినట్టేనా! నా కేశములు, నా శరీర భాగములు, నా నేత్రములు, చేతులు, కాళ్లు, మడిమలు, అన్నీ శుభలక్షణములతో కూడి ఉన్నవి కదా! మరి ఆ శుభలక్షణములు అన్నీ ఎక్కడకు పోయాయి. నాకు ఈ వైధవ్యము ఎందుకు వచ్చింది. నేను నా భర్తతో కలిసి చక్రవర్తి పీఠమును అలంకరిస్తాను అని జ్యోతిష్కులు చెప్పారు కదా! మరి వారి మాటలన్నీ వమ్మయిపోయాయా!
నా కొరకు జనస్థానము నుండి వెదుకుతూ వచ్చి, సముద్రమును దాటిన రాముడు, సాగరమును దాటి ఆవు పాదమంత గుంటలో పడ్జట్టు ఈ దుష్టుడి చేతిలో మరణించాడు కదా! రామలక్ష్మణుల వద్ద వారుణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, ఇంద్ర అస్త్రము, వాయవ్యాస్త్రము, బ్రహ్మశిరోనామకాస్త్రము ఇంకా ఎన్నో దివ్యాస్త్రములు ఉన్నాయి కదా. మరి ఆ అస్త్రములు అన్నీ ఏమయిపోయాయి. అవునులే కనపడ్డ వారి మీద అస్త్రములు ప్రయోగించవచ్చు కానీ, కనపడకుండా యుద్ధము చేసే మాయావుల మీద ఏ అస్త్రములు ప్రయోగించిన ఏమి ప్రయోజనము. యుద్ధములో రాముని ఎదుట నిలిచిన శత్రువు ప్రాణాలతో తిరిగి వెళ్లడు. కానీ ఈ మాయావి రాముని కంటపడకుండా రాముని చంపాడు.
రామలక్ష్మణులు అకాల మరణం చెందడం దైవఘటన కాక మరేమున్నది. రాముని మరణ వార్త విని కౌసల్య ఎంతగా శోకిస్తుందో కదా! అరణ్యవాసము పూర్తి చేసుకొని అయోధ్యకు రామలక్ష్మణులు ఎప్పుడు తిరిగి వస్తారో అని ఎదురుచూస్తున్న కౌసల్యకు రామలక్ష్మణుల మరణ వార్త అశనిపాతంగా పరిణమిస్తుంది. ఆమెను ఎవరు ఓదారుస్తారు!" అని పరి పరి విధములుగా శోకిస్తున్న సీతను చూచి త్రిజట ఇలా అంది.
“ఎందుకమ్మా ఏడుస్తావు. నీ భర్త రాముడు చనిపోలేదు. బతికే ఉన్నాడు. ఒకసారి అటు చూడు. వానర నాయకులు అందరూ రామ లక్ష్మణుల దేహములను జాగ్రత్తగా రక్షిస్తున్నారు. వారి ముఖములలో దైన్యము శోకము కనపడుట లేదు. వారు అంతా రాముడు ఎప్పుడు స్పృహలోకి వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి నీ భర్త మరణించలేదు. నా మాట నమ్ము. నీవు అఖండ సౌభాగ్యవతివి అని నాకు నమ్మకం ఉంది. నా నోట అబద్ధము రాదు. నీ పాతివ్రత్యమే నిన్ను రక్షిస్తుంటుంది. నీ పాతివ్రత్యమే నన్ను నీ పట్ల ఆకర్షితురాలిగా చేసింది. అందుకే నీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఇంద్రాదులు వచ్చినా రామలక్ష్మణులను జయించలేరు. ఇది నిక్కువము. మరొక్కసారి రామలక్ష్మణుల ముఖములు చూడు. వారి ముఖములలో సహజమైన కాంతీ తేజస్సు తగ్గలేదు. రామలక్ష్మణులు కేవలం స్పృహ తప్పారే కానీ మరణించలేదు. ఈ మూర్ఖరాక్షసులకు సృహ తప్పడానికీ, మరణించడానికీ తేడా తెలియదు. మరణించిన వారి
ముఖములు వికృతంగా మారుతాయి. కానీ రామలక్ష్మణుల ముఖములు కాంతితో ప్రకాశిస్తున్నాయి. ముఖములు అలా ప్రకాశిస్తున్న వారు మరణించి నట్టు కాదు. కాబట్టి రామలక్ష్మణులు జీవించి ఉన్నారు. నీ శోకమును వదిలిపెట్టు. రామలక్ష్మణులు జీవించాలనీ ఆ దైవమును ప్రార్థించు." అని పలికింది త్రిజట.
త్రిజట మాటలు విన్న సీత ఆమెకు రెండు చేతులు జోడించి నమస్కరించింది. “త్రిజటా! నీ మాటలు యదార్థములు కావాలి." అని మనసులో అనుకొంది సీత. వెంటనే త్రిజట పుష్పకవిమానమును వెనక్కు తిప్పి లంకకు పోనిచ్చింది. అశోక వనములో సీత, త్రిజట పుష్పకమును దిగారు. తరువాత పుష్పకము రావణుని నివాసమునకు వెళ్లిపోయింది. తిరిగి శింశుపావృక్షము కింద కూర్చున్న సీత రామలక్ష్మణులు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని దైవమును ప్రార్థిస్తూ దీనంగా కూర్చుంది.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము నలభై ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment