శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - నలుబది ఏడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 47)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
నలుబది ఏడవ సర్గ
వానర వీరులు అందరూ రాముని చుట్టు చేరి రామునికి రక్షణ వలయంగా నిలబడ్డారు. వానర సేనలకు అధిపతులైన హనుమంతుడు, అంగదుడు, నీలుడు, సుషేణుడు, కుముదుడు, నలుడు, గజుడు, గవాక్షుడు, పసనుడు, సానుప్రస్థుడు, జాంబవంతుడు, ఋషభుడు, సుందుడు, రంభుడు, శతబలి, పృథుడు మొదలగు సైన్యాధిపతులు తమ తమ వానర, భల్లూ సేనలను యుద్ధానికి సన్నద్ధం చేసారు. ఏ మాత్రం కదలిక కలిగినా అప్రమత్తంగా ఉన్నారు.అక్కడ లంకలో రావణుడు విజయోత్సాహంతో వచ్చిన ఇంద్రజిత్తును అభినందించి పంపివేసాడు. తరువాత అశోక వనములో సీతకు కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలను పిలిపించాడు. త్రిజట ఆధ్యర్యంలో రాక్షస స్త్రీలు రావణుని వద్దకు వచ్చారు. రావణుడు మహా సంతోషంగా ఉన్నాడు. రాక్షస స్త్రీలతో ఇలా అన్నాడు.
"జాగ్రత్తగా వినండి. రాముడు, నా కుమారుడు ఇంద్రజిత్తు చేతిలో చంపబడ్డాడు. ఈ విషయం సీతకు తెలియజేయండి. సీతను మీరందరూ పుష్పక విమానము ఎక్కించి, రాముని వద్దకు తీసుకొని వెళ్లండి. ఆకాశం నుండి రాముని శవాన్ని ఆమెకు చూపించండి. రాముని శవంతో పాటు లక్ష్మణుని శవం కూడా సీతకు చూపించండి. ఇంత కాలమూ ఎవరు వచ్చి తనను రక్షిస్తారు అని సీత అనుకుంటూ ఉందో, ఆ రాముడు, ఆ లక్ష్మణుడు యుద్ధములో చంపబడ్డారు అని తెలియజెయ్యండి. ఇంక సీతకు నేను తప్ప నాధుడు లేడు. అందుకని సీతను బాగా అలంకరించి నా వద్దకు తీసుకొని రండి. రాముడు చనిపోయిన తరువాత సీత తనంతట తానే నా వద్దకు వస్తుందని నాకు నమ్మకం ఉంది. చనిపోయిన రామలక్ష్మణులను చూచిన సీతకు నేను తప్ప వేరే గత్యంతరము లేదు కాబట్టి నన్ను చేరడం నిజం."అని అన్నాడు రావణుడు. రావణుని మాటలు శ్రద్ధగా విన్న ఆ రాక్షస స్త్రీలు అలాగే చేస్తాము అని చెప్పి బయటకు వచ్చారు.
రావణుని ఆదేశము మేరకు సీతను పుష్పక విమానములో ఎక్కించుకొని, రాముడు పడి ఉన్న చోటికి తీసుకొని వెళ్లారు. అప్పటికే రావణుడు “రాముని ఇంద్రజిత్తు యుద్ధంలో చంపాడు" అన్న రాముని మరణ వార్తను లంకా నగరం అంతా తెలిసేటట్టు ఘోషణ చేయించాడు. ఊరంతా పతాకములతో అలంకరింప చేసాడు. యుద్ధం ముగిసి పోయిందని రాక్షసులు ఉత్సవాలు జరుపుకుంటున్నారు.
ఇదంతా చూస్తూ సీత పుష్పక విమానములో రాముడు పడి ఉన్న ప్రదేశమునకు వెళ్లింది. యుద్ధభూమిలో చచ్చి పడి ఉన్న వానర వీరులను చూచింది. యుద్ధ రంగములో కేరింతలు కొట్టుకుంటూ ఉ త్సవాలు జరుపుకుంటున్న రాక్షసులను, విషాదవదనములతో ఉన్న వానరులను చూచింది. శరీరం అంతా బాణములతో కొట్టబడి నేల మీద పడి ఉన్న రాముని చూచింది సీత.
రామునికి స్పృహ లేదు. నిర్జీవంగా పడి ఉన్నాడు. లక్ష్మణుడు కూడా పక్కనే పడి ఉన్నాడు. వారి ధనుస్సులు దూరంగా పడి ఉన్నాయి. వారి శరీరాలు శరతల్పము మీద ఉన్నాయి.
శరతల్పము మీద పడి ఉన్న రామలక్ష్మణులను చూచి సీత భోరున విలపించింది. ఆమె శోకమునకు అంతులేకుండా పోయింది. రామలక్ష్మణులు మరణించినారు అని తెలుసుకున్న సీత శోకసముద్రంలో మునిగిపోయింది. ఏడుస్తూనే త్రిజటతో ఇలా అంది.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము నలుబది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment