శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - నలుబది ఆరవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 46)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
నలుబది ఆరవ సర్గ
ఒళ్లంతా బాణము దెబ్బలతో పడి ఉన్న రామలక్ష్మణులను చూచిన వానరులకు ఏమి చెయ్యాలో తోచడం లేదు. రామలక్ష్మణులను పడగొట్టి ఇంద్రజిత్తు వెళ్లిపోయిన తరువాత సుగ్రీవుడు, విభీషణుడు అక్కడకు వచ్చారు. వారు రామలక్ష్మణులను చూచి దు:ఖించారు. నీలుడు, ద్వివిదుడు, మైందుడు, సుషేణుడు, కుముదుడు, అంగదుడు, హనుమంతుడు రామలక్ష్మణుల పక్కనే నిలబడి ఉన్నారు. వారి దు:ఖానికి అంతులేదు. రామలక్ష్మణులకు ఊపిరి తీసుకోడం కూడా కష్టంగా ఉంది. శరీరం అంతా బాణములు తగలడం వల్ల వారు అటు ఇటు కదలలేకపోతున్నారు. విభీషణునికి కూడా ఏమి చెయ్యాలో తోచడం లేదు.విభీషణుడు కూడా రాక్షసుడే కాబట్టి ఇంద్రజిత్తు మాయలన్నీ విభీషణునికి తెలుసు. అదే మాయను ప్రయోగించి ఇంద్రజిత్తు కోసం వెదికాడు. ఇంద్రజిత్తు రామలక్ష్మణులను పడగొట్టినందుకు మహదానందంగా ఉన్నాడు. రాక్షసులందరితో ఇలా అంటున్నాడు. “ఓ రాక్షస వీరులారా! నేను రామలక్ష్మణులను వీరశయనం పొందేట్టు చేసాను. ఖరదూషణులను సంహరించిన రాముడు నా చేత చంపబడ్డాడు. దేవతలుకానీ, అసురులుకానీ, ఋషులు కానీ రామలక్ష్మణులను నా శరబంధము నుండి విడిపించలేరు. ఈ రామలక్ష్మణుల వలననే నా తండ్రి రావణుడు నిద్రాహారాలు మాని వీరి గురించి ఆలోచిస్తున్నాడు. ఆ రామలక్ష్మణులను నేను చంపి నా తండ్రిని బాధావిముక్తుడిని చేసాను. ఇంక ఈ రామలక్ష్మణుల పరాక్రములు, వానరవీరుల పరాక్రములు వృధా అయ్యాయి." అని గట్టిగా పలికాడు.
తరువాత ఇంద్రజిత్తు మరలా మాయాయుద్ధము చేయనారంభించాడు. వానర సేనానాయకులను తన వాడి అయిన బాణములతో కొట్టాడు. బాణాలు ఎటునుండి వస్తున్నాయో తెలియని వానర వీరులు కంగారు పడుతున్నారు. బాణాల దెబ్బలకు బలి అవుతున్నారు. ఇంద్రజిత్తు నీలుడిని తొమ్మిది బాణములతోనూ, మైందుడిని, ద్వివిదుడిని, ఒక్కొక్కరిని మూడు బాణములతోనూ కొట్టాడు. జాంబవంతుడి వక్షస్థలాన్ని ఒకే ఒక బాణంతో చీల్చాడు. హనుమంతుని వక్షస్థలమును పదిబాణములతో కొట్టాడు. గవాక్షుడిని, శరభుడిని రెండేసి బాణములతో కొట్టాడు. అంత క్రితం తనను ఓడించిన అంగదుని మీద విరివిగా బాణాలు ప్రయోగించాడు ఇంద్రజిత్తు. ఆ ప్రకారంగా వానరవీరులను తన వాడి అయిన బాణములతో గాయపరిచి సంహనాదము చేసాడు ఇంద్రజిత్తు. వానరుల దుస్థితి చూచి ఇంద్రజిత్తు వికటాట్టహాసం చేసాడు.
"ఓ రాక్షసులారా! చూడండి. రాముడు లక్ష్మణులను నా శరబంధంలో బంధించాను. చూడండి ఎలా స్పృహలేకుండా పడి ఉన్నారో!"అని పెద్దగా అరిచాడు. శరబంధంలో పడి ఉన్న రామలక్ష్మణులను చూచి రాక్షసులు సంతోషించారు వారు కూడా సింహనాదములు చేసారు. రాముడిని ఇంద్రజిత్తు చంపాడు అని తెలుసుకొని అందరూ ఇంద్రజిత్తును ప్రశంసించారు. ఇంద్రజిత్తు రామలక్ష్మణుల వంక చూచాడు. రామలక్ష్మణులు ఊపిరి తీసుకోడం లేదు. వారిద్దరూ మరణించారు అని నిర్ధారణ చేసుకున్నాడు ఇంద్రజిత్తు. విజయ దుందుభులు మోగించుకుంటూ, జయజయధ్వానాలు చేసుకుంటూ లంకానగరంలోకి ప్రవేశించాడు. చలనం లేకుండా పడి ఉన్న రామలక్ష్మణులను చూచిన సుగ్రీవునికి ఒళ్లంతా భయం ఆవహించింది. కళ్లనిండా నీళ్లు కమ్మాయి. దీనంగా రాముని వంక చూస్తున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న సుగ్రీవుని చూచి విభీషణుడు ఇలా అన్నాడు.
“అదేమిటి సుగ్రీవా! ఈ మాత్రం దానికే భయపడితే ఎలా. యుద్ధం అంటే ఇలాగే ఉంటుంది. జయాపజయాలు దైవాధీనాలు కదా! మనం అదృష్టవంతులము అయితే రామలక్ష్మణులకు స్పృహ వస్తుంది. రాముడు సత్యవంతుడు. ధర్మాత్ముడు. అటువంటి రామునికి మృత్యు భయము లేదు. ధైర్యంగా ఉండు." అని తన చేత్తో సుగ్రీవుని కన్నీళ్లు తుడిచాడు విభీషణుడు.
“సుగ్రీవా! ఇది దు:ఖించుటకు సమయము కాదు. దుఃఖము అన్ని కార్యములను నాశనం చేస్తుంది. కాబట్టి దు:ఖాన్ని వదిలిపెట్టు. చేయవలసిన పనులను ఎలాచెయ్యాలో ఆలోచించు. సైన్యములకు తగిన ఆదేశాలు ఇవ్వు. సైన్యములో విశ్వాసాన్ని ఉత్సాహాన్ని రేకెత్తించు. రామలక్ష్మణులకు స్పృహ వచ్చేంత వరకూ వారిని మనము రక్షించాలి. తరువాత రామలక్ష్మణులు మనలను రక్షిస్తారు. అటుచూడు. రాముని ముఖంలో కాంతి ఇంకా అలాగే ఉంది. రాముడికి తప్పకుండా స్పృహ వస్తుంది. మరణము సంభవించిన వారి ముఖంలో ఇటువంటి కాంతి ఉండదు. కాబట్టి రాముడు మరణించలేదు. కాబట్టి ముందు నీవు పోయి రాముడు మరణించలేదు అని చెప్పి సేనలలో విశ్వాసాన్ని ఉత్సాహాన్ని కలిగించు." అని అన్నాడు.
సుగ్రీవుడు విభీషణుడు చెప్పిన మాదిరి "రాముడు మరణించలేదు, బతికే ఉన్నాడు" అని ప్రచారం చేసి, సైనికులలో నూతన ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించాడు.
అక్కడ లంకానగరంలో ఇంద్రజిత్తు జయజయధ్వానాలతో తన తండ్రి రావణుని వద్దకు వెళ్లాడు. రాముడు ఇంద్రజిత్తు చేతిలో మరణించాడు అన్న వార్త విన్న రావణుడు మహదానందభరితుడయ్యాడు. ఇంతలో ఇంద్రజిత్తు తండ్రి వద్దకు పోయియి నమస్కరించి "తండ్రీ! నేను రామ లక్ష్మణులను చంపాను" అని చెప్పాడు. రావణుడు సింహాసనము నుండి ఒక్క ఉదుటున పైకి లేచి కిందికి దిగివచ్చి ఇంద్రజిత్తును గాఢంగా కౌగలించుకున్నాడు.
“కుమారా! నిజమా! రామలక్ష్మణులు మరణించారా! ఎంతటి శుభవార్త చెప్పావు. ఇంతకూ రామలక్ష్మణులను ఎలా చంపావు?" అని అడిగాడు రావణుడు. ఇంద్రజిత్తు తాను రాముని లక్ష్మణులను వాడి అయిన బాణములతో శరీరం అంతా తూట్లుపడేట్టు ఎలా కొట్టిందీ, ఎలా శరబంధనం చేసిందీ వివరంగా చెప్పాడు. ఇంద్రజిత్తు మాటలు విన్న రావణుడు ఎంతో సంతోషించాడు. ఇంద్రజిత్తును మనసారా అభినందించాడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము నలుబది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment