శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - నలుబది ఐదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 45)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
నలుబది ఐదవ సర్గ
తనతో యుద్ధము చేసి పారిపోయిన ఇంద్రజిత్తును జాడ తెలుసుకొని రమ్మని పదిమంది వానరులను పంపాడు రాముడు. రాముని ఆజ్ఞ మేరకు సుషేణుని కుమారులు ఇద్దరు, నీలుడు, అంగదుడు, శరభుడు, ద్వివిదుడు, హనుమంతుడు, సానుప్రస్థుడు, ఋషభుడు, ఋషభస్కంధుడు ఇంద్రజిత్తును వెదుకడానికి వెళ్లారు. వారు పెద్ద పెద్ద వృక్షములను ఆయుధములుగా ధరించి నలుదిక్కులు వెదుకుతూ ఆకాశంలోకి ప్రవేశించారు. కాని వారికి ఇంద్రజిత్తు కనపడలేదు. కాని ఇంద్రజిత్తు ప్రయోగించిన నారాచబాణములు ఆ వానరులను గాయపరచసాగాయి. అసలే చీకటి. అందులో ఇంద్రజిత్తు మాయావి. మాయా యుద్ధము చేస్తున్నాడు.తరువాత ఇంద్రజిత్తు ఈ వానరులను వదిలి తన బాణములను రాముని మీద లక్ష్మణుని మీద ప్రయోగించాడు. రామలక్ష్మణుల శరీరములలో గుచ్చుకొనేటట్టు సర్పరూపబాణములు ప్రయోగించాడు ఇంద్రజిత్తు. రామలక్ష్మణుల శరీరాలు ఇంద్రజిత్తు కొట్టిన బాణములతో నిండిపోయాయి. ఇంద్రజిత్తు రామలక్ష్మణులతో వారికి కనపడకుండా ఇలా అన్నాడు. "ఓ నరులారా! నేను మాయాయుద్ధము చేస్తుంటే సాక్షాత్తు దేవేంద్రుడు కూడా తట్టుకోలేడు. ఇంక మానవులు మీరెంత? మీరు నా ముందు నిలువలేరు. ఇప్పుడే మీ ఇద్దరినీ నా బాణములతో కొట్టి యమపురికి పంపుతాను." అని పలికిన ఇంద్రజిత్తు వాడి అయిన బాణములతో రామలక్ష్మణులతో మర్మస్థానములలో కొట్టాడు. రామ లక్ష్మణులను శరబంధనము చేసాడు ఇంద్రజిత్తు. తరువాత సింహనాదము చేసాడు.
రామలక్ష్మణుల దేహములు ఇంద్రజిత్తు ప్రయోగించిన సర్ప బాణములతో కప్పబడి పోయాయి. రామలక్ష్మణులు నేల మీదికి ఒరిగిపోయారు. రామలక్ష్మణుల శరీరంలో బాణములు గుచ్చుకోని ప్రదేశము అంగుళము మాత్రము కూడా లేదు. ఇంద్రజిత్తు రామలక్ష్మణుల శరీరాలు తూట్లుపడేటట్టు కొట్టాడు. రామలక్ష్మణుల శరీరములలో నుండి రక్తము ధారగా ప్రవహిస్తూ ఉంది. రాముడు కింద పడి పోయిన తరువాత కూడా ఇంద్రజిత్తు రాముని నారాచములు, అర్ధనారాచములు, భల్లములు, అంజలికములు, వత్సదంతములు, సింహదంష్ట్రములు, క్షురములు అనే బాణములతో కొట్టాడు. ఆ బాణముల దెబ్బలకు రాముడు కిందపడపడగానే రాముని చేతిలోని విల్లు కూడా ఎగిరి అల్లంతదూరంలో పడింది. రాముడు వీరశయనము అలంకరించాడు.
రాముడు పడిపోవడం చూచి లక్ష్మణుడు దుఃఖించాడు. రామలక్ష్మణులకు పట్టిన దుస్థితి చూచి వానర సేనానాయకులు శోకించ సాగారు. అందరూ పెద్దగా ఏడుస్తున్నారు. హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు మొదలగు వానరవీరులు రామలక్ష్మణుల చుట్టు నిలబడి శోకిస్తున్నారు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము నలుబది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment