శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - నలుబది నాలుగవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 44)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

నలుబది నాలుగవ సర్గ

ఆ ప్రకారంగా వానరులకు రాక్షసులకు ఘోరంగా యుద్ధం జరుగుతున్న సమయంలో సూర్యుడు అస్తమించాడు. సాధారణంగా మానవులు రాత్రిళ్లు యుద్ధం చేయరు. కానీ, వానరులు రాక్షసులు రాత్రియుద్ధానికి సంసిద్ధం అయ్యారు. రాత్రి సమయంలో గాఢంగా చీకటి అలుముకుంది. ఆ చీకట్లో ఎవరెవరో కనిపించడం లేదు. అందుకని రాక్షసులు ఎదుటి వాడు వానరుడని " నువ్వు వానరుడవు చావు” అంటూ చంపుతున్నారు. అలాగే వానరులు కూడా “నువ్వు రాక్షసుడవు చావు" అంటూ చంపుతున్నారు. కాని, చీకట్లో ఎవరెవరో గుర్తు తెలియక, రాక్షసులు రాక్షసులను, వానరులు వానరులను, వారిని వారే చంపుకుంటున్నారు అన్న సంగతి వారికి తెలియదు. ఎంత సేపటికీ చంపు, కొట్టు, పారిపోకు, నిలువు అంటూ అరుపులు కేకలు వినబడుతున్నాయి. రాక్షసులు నల్లగా ఉండి చీకట్లో కలిసిపోతున్నారు. వారు ధరించిన బంగారు కవచములు మాత్రం తళా తళా మెరుస్తున్నాయి.

కవచాలు అటు ఇటు తిరుగుతున్నాయా అన్నట్టు ఉంది ఆ యుద్ధభూమిలో. ఇంతలో కొంతమంది రాక్షసులు వానరులపై బడి వారిని చంపి తినసాగారు. ఇది చూచిన వానరులు రాక్షనులపైబడి వారిని చీలుస్తున్నారు, వారు ఎక్కిన గుర్రములను ఏనుగులను చంపుతున్నారు. ఆ దెబ్బకు రాక్షస సైన్యము కకావికలైంది. ఏనుగులను హయములను వానరులు తమ గోళ్లతో చీలుస్తూ, పళ్లతో కొరుకుతుంటే అవి కుయ్యోమని అరుస్తూ ఇష్టం వచ్చినట్టు పరుగెడుతున్నాయి. రాముడు లక్ష్మణుడు తమ బాణములతో రాక్షసులను విచక్షణా రహితంగా చంపుతున్నారు. అటు రాక్షసులు, ఇటు వానరులు యుద్ధములో మరణించగా వారి శరీరముల నుండి కారిన రక్తము వరదగా ప్రవహిస్తూ ఉంది. ఎవరికి వారు తాము గెలిచామని భేరీలు, మృదంగములు, పణవములు వాయిస్తున్నారు. శంఖములు ఊదుతున్నారు. ఆ రాత్రి అంతా వానరులు రాక్షసులు ఒకరిని ఒకరు, తమలో తాము, తమవారిని తామే చంపుకుంటున్నారు.

అంతటి చీకట్లో కూడా కొంత మంది రాక్షసులు తమ బాణములను రాముని మీద ప్రయోగించారు. రాముడు కోపించి వాడి అయిన ఆరు బాణములతో ఆ రాక్షసులను కొట్టాడు. యజ్ఞశత్రువు, మహాపార్శ్వుడు, మహోదరుడు, వజ్రదంష్ట్రుడు, శుకుడు, సారణులు అనే ఆ రాక్షసులు రాముని బాణముల దెబ్బలు తిని బతకాలని ఆశతో యుద్ధరంగము నుండి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. రాముడు అంతటితో ఊరుకోకుండా అగ్నిజ్వాలల వంటి తన బాణములతో రాక్షససేనలను సర్వనాశనం చేసాడు. రాముడికి ఎదురుగా వచ్చిన ఏ రాక్షసుడూ ప్రాణాలతో బయటపడలేదు. ఆ చీకట్లో రామ బాణములు ఎగురుతూ వచ్చి రాక్షసులను చంపుతుంటే, కాళరాత్రిలో మిణుగురు పురుగులు ఎగురుతున్నట్టు ఉంది.

మహా పరాక్రమ వంతుడైన రావణ కుమారుడు ఇంద్రజిత్తును అంగదుడు ఎదిరించాడు. అంగదుడు ఇంద్రజిత్తు ఎక్కిన రథమును విరుగగొట్టాడు, రథ సారథిని, అశ్వములను చంపాడు. చేసేది లేక ఇంద్రజిత్తు తనమాయచే అంతర్ధానము చెంది యుద్ధభూమి నుండి పారిపోయాడు. ఇంద్రజిత్తును చిత్తు చేసిన అంగదుని రామలక్ష్మణులు, విభీషణుడు ప్రశంసించారు. ఇంద్రజిత్తు లాంటి వాడిని ఓడించిన అంగదుని వానరవీరులందరూ పొగిడారు.

ఒక వానరుని చేతిలో ఓడిపోయిన ఇంద్రజిత్తు కోపంతో ఊగిపోయాడు. అతడు మాయా యుద్ధం చేయడం మొదలెట్టాడు. ఎవరికీ కనపడకుండూ వానరుల మీద బాణ వర్షము కురిపిస్తున్నాడు. ఘోరమైన విషసర్పములు ఆవాహనము చేయబడిన ఇంద్రజిత్తు బాణములు వానరులను, రామలక్ష్మణులను బాధించాయి. వారి చర్మాన్ని చీల్చాయి. ఇంద్రజిత్తు ఎవరికీ కనపడకపోవడం వల్ల అతని మీద బాణములు వదలడం వీలు కావడం లేదు. ఈ లోపల ఇంద్రజిత్తు తన సర్వశరములతో రామలక్ష్మణులను బంధించాడు. రామలక్ష్మణులకు ఎదురుగా నిలబడి యుద్ధం చేసే శక్తి లేక, ఇంద్రజిత్తు, మాయా యుద్ధంలో రామలక్ష్మణులను తన సర్పశరములతో బంధించాడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము నలుబది నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)