శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - నలుబది మూడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 43)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
నలుబది మూడవ సర్గ
ఆ ప్రకారంగా వానరులకు రాక్షసులకు ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంది. రాక్షస సేనలో ఉన్న రాక్షసులకు గుర్రములు, ఏనుగులు, రథములు, కవచములు ఉన్నాయి. కాని వానరములకు ఇవేమీ లేవు. వారికి సహజమైన గోళ్లు కోరలు ఉన్నాయి. తరువాత పెద్ద పెద్ద బండరాళ్లు, వృక్షములు, వారి ఆయుధములు. వానరులు రాక్షసులు ముఖాముఖి పోరాడుతున్నారు.ఒకరితో ఒకరు ద్వంద్వయుద్ధము చేస్తున్నారు.అంగదునితో అంధకాసురుడు అనే వాడు ద్వంద్వయుద్ధము చేస్తున్నాడు. సంపాతి అనే వానరుడు ప్రజంఘుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాడు. హనుమంతుడు జంబుమాలితో యుద్ధం చేస్తున్నాడు. విభీషణుడు శత్రుఘ్నుడు అనే రాక్షస వీరునితో యుద్ధము చేస్తున్నాడు. గజుడు అనే వానర వీరుడు తపసుడు అనే రాక్షస వీరునితో యుద్ధం చేస్తున్నాడు. నీలుడు అనే వానర వీరుడు నికుంభుడు అనే రాక్షస వీరునితో యుద్ధం చేస్తున్నాడు. సుగ్రీవునితో ప్రఘసుడు, లక్ష్మణునితో విరూపాక్షుడు అనే రాక్షసుడు యుద్ధం చేస్తున్నాడు. అగ్నికేతువు, రశ్మికేతువు, మిత్రఘ్నుడు, యజ్ఞకోపుడు అనే రాక్షసులు ఒక్కుమ్మడిగా రామునితో యుద్ధానికి తలపడ్డారు. మైందుడు అనే వానర శ్రేష్టునితో వజ్రముష్టి అనే రాక్షసుడు, ద్వివిదుడు అనే వానరునితో అశనిప్రభుడు అనే రాక్షసుడు యుద్ధం చేస్తున్నారు. ప్రతపనుడు అనే రాక్షస వీరుడు నలునితో యుద్ధం చేస్తున్నాడు. సుషేణుడు అనే వానర వీరుడు విద్యున్మాలితో యుద్ధం చేస్తున్నాడు.
వీరు కాకుండా మిగిలిన వానరులు కూడా ఒక్కొక్క రాక్షసునితో ద్వంద్వయుద్ధము చేస్తున్నారు. రాక్షసులు వానరుల మధ్య ఆ విధంగా యుద్ధం జరుగుతూ ఉంది. రాక్షసులు, వానరుల శరీరముల నుండి కారుతున్న రక్తము ఏరులై ప్రవహిస్తుంటే, ఆ రక్తప్రవాహంలో రాక్షసుల, వానరుల శరీరాలు కొట్టుకుపోతున్నాయి.
ఇంద్రజిత్తు తన గదతీసుకొని అంగదుని కొట్టాడు. అంగదుడు ఆ వేటును తప్పుకొని, ఇంద్రజిత్తు రథమును విరిచాడు. రథమునకు కట్టిన గుర్రములను, రథసారథిని చంపాడు. జంబుమాలి తన రథము మీద నిలబడి యుద్ధము చేస్తున్నాడు. జంబుమాలి శక్తి అనే ఆయుధముతో హనుమంతుని వక్షస్థలము పగిలేటట్టు కొట్టాడు. వెంటనే హనుమంతుడు ఒక్క ఎగురు ఎగిరి జంబుమాలి రథము మీద ఎక్కి, రథసారధిని చంపాడు. రథాన్ని విరిచాడు. తన అరిచేత్తో జంబుమాలిని ఒక్క చరుపు చరిచాడు. ఆ దెబ్బకు జంబుమాలి రక్తం కక్కుకొని చచ్చాడు.
రాక్షసవీరుడైన ప్రతపనుడు పెద్దగా గర్జిస్తూ నలుని మీదికి పరుగెత్తాడు. అప్పుడు నలుడు ప్రతపనుడి కళ్లు పొడిచాడు. ప్రఘసుడు అనే రాక్షసవీరుడు వాడి అయిన బాణములతో సుగ్రీవుని శరీరం అంతా కొట్టాడు. సుగ్రీవుడు ఒక వృక్షమును పెకల్చి ఆ రాక్షసుడు మీదికి విసిరాడు. ఆ వృక్షము కిందపడి ప్రఘసుడు మరణించాడు. లక్ష్మణుడు ఒకే ఒక్క బాణంతో విరూపాక్షుడు అనే రాక్షసుని యమపురికి పంపాడు. తమ తమ బాణ పరంపరలతో అగ్నికేతువు, రశ్మికేతువు, మిత్రఘ్నుడు, యజ్ఞకోపుడు అనే రాక్షసులు రాముడిని కొట్టారు. దానికి బదులుగా రాముడు ఆ నలుగురు రాక్షసుల శిరస్సులను నాలుగు శరాఘాతములతో ఛేదించాడు.
మైందుడు అనే వానరుడు తన పిడికిలితో వజ్రముష్టి అనే రాక్షసుని కూలదోసాడు. నికుంభుడు అనే రాక్షసుడు నీలుడు అనే వానర వీరుడిని తన బాణములతో కొట్టాడు. అంతే కాకుండా నీలుడి మీద నూరు బాణములను ప్రయోగించి అట్టహాసంగా అరిచాడు. నీలుడు నికుంభుని రథమును విరిచి, ఆ రథచక్రముతోనే నికుంభుని, అతని రథసారధిని చంపాడు. ద్వివిదుడు అనే వానర ప్రముఖుడు ఒక పెద్ద పర్వత శిఖరముతో అశనిప్రభుడు అనే రాక్షసుని కొట్టాడు. అప్పుడు ఆ రాక్షసుడు తన బాణములతో ద్వివిదుని కొట్టాడు. ద్వివిదుడు ఒక పెద్ద వృక్షమును పెకలించి ఆ వృక్షముతో ద్వివిదుని రథమును విరిచి, రథసారధిని, రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. తరువాత అదే వృక్షముతో అశనిప్రభుణ్ని కూడాచంపాడు.
విద్యున్మాలి అనే రాక్షస వీరుడు తన రథము మీది నుండి సుషేణుడి మీద బాణవర్షము కురిపించాడు. సుషేణుడు ఒక పెద్ద పర్వత శిఖరము తీసుకొని దానితో విద్యున్మాలి రథమును విరిచాడు. అప్పుడు విద్యున్మాలి రథమునుండి కిందికి దూకి, గదాయుధము తీసుకున్నాడు. సుషేణుడు ఒక పెద్ద బండరాయిని తీసుకొని విద్యున్మాలి మీదికి వెళ్లాడు. విద్యున్మాలి తన గదతో సుషేణుడి గుండెల మీద కొట్టాడు. సుషేణుడు ఆ గదాఘాతమును లక్ష్యపెట్టక, తన చేతిలోని బండరాయితో విద్యున్మాలి గుండెల మీద మోదాడు. ఆ బండరాయి మీద పడగానే విద్యున్మాలి కింద పడ్డాడు. ఆ రాతి కిందపడి నలిగిపోయి మరణించాడు.
ఆ ప్రకారంగా వానరులు, రాక్షసులు దేవ దానవుల మాదిరి యుద్ధం చేసుకుంటున్నారు. రణరంగం అంతా వానరులు, రాక్షసుల మృతదేహాలతో నిండి పోయింది. ఆ రణరంగంలో చచ్చి పడిన మృతదేహములను తినడానికి నక్కలు, తోడేళ్లు గుంపులు గుంపులుగా వస్తున్నాయి. ఇంతలో సూర్యాస్తమయము అయింది.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము నలుబది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment