శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - నలుబది రెండవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 42)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
నలుబది రెండవ సర్గ
లంకా నగర ద్వారములను రక్షిస్తున్న సైనికులు పరుగుపరుగున రావణుని వద్దకు వెళ్లి వానర సేనలు లంకను ముట్టడించినవని తెలియజేసారు. వెంటనే రావణుడు నగర రక్షణకు తగిన ఏర్పాట్లు చేసాడు. ప్రాకారము మీదికి ఎక్కి వానరసైన్యమును చూచాడు. లంకా నగరమును చుట్టుముట్టిన వానర సేనలను చూచాడు రావణుడు. ఈ వానర సైన్యమును ఎలా జయించడమా అని ఆలోచనలో పడ్డాడు రావణుడు. అంతలోనే ధైర్యము తెచ్చుకున్నాడు. సకల ఆయుధములతో సుశిక్షుతులైన రాక్షసుల ముందర కేవలము రాళ్లు, కొమ్మలతో యుద్ధము చేసే వానరులు నిలబడలేరు అని ధీమాతో ఉన్నాడు రావణుడు.వానర సైన్యమునకు సూచనలు ఇస్తున్న రాముని చూచాడు రావణుడు. రాముడు కూడా రాక్షస సైన్యములతో రక్షింపబడుతున్న లంకను తేరిపార చూచాడు. లంకను చూడగానే అందులో ఉన్న సీత గుర్తుకు వచ్చింది రామునికి. నా కొరకు కదా సీత కటిక నేల మీద నిద్రిస్తూ రాక్షసుల చెరలో ఉన్నది అని దు:ఖపడసాగాడు రాముడు. అంతలోనే తేరుకున్నాడు రాముడు. కర్తవ్యమును స్మరించుకున్నాడు. వానరులకు యుద్ధము గురించి సూచనలు అందజేస్తున్నాడు.
రాముని అనుజ్ఞ కాగానే వానరులందరూ దిక్కులు పిక్కటిల్లేటట్టు సింహనాదము చేసారు. లంకానగరమును నేలమట్టం చేస్తాము అని రంకెలు వేయసాగారు. వానరులందరూ చేతికి అందిన పెద్ద పెద్ద వృక్షములు, బండలు, శిఖరములు పెకలించి ఆయుధములుగా చేత ధరించి ఉన్నారు. వానరు లందరూ లంక వైపు దూసుకుపోతున్నారు. ప్రాకారములను, నగర ముఖద్వారములను చేతులతోనూ వృక్షములతోనూ బండరాళ్లతోనూ పగలగొడుతున్నారు. ప్రాకారము చుట్టు ఉన్న కందకము లను చెట్లతోనూ బండలతోనూ మట్టితోనూ పూడ్చారు. వానరులు అందరూ లంకా నగరంలోకి చొచ్చుకుపోసాగారు. లంకలోని బంగారు ముఖ ద్వారములను పగులగొడుతున్నారు. ప్రాసాదములను, వాటి మీద ఉన్న శిఖరములను, గోపురములను నేలమట్టం చేస్తున్నారు. ఆ వానరులు ఎగురుతూ దుముకుతూ అరుస్తూ నగరములోకి ప్రవేశిస్తున్నారు.
వానర వీరులలో వీరబాహుడు, సుబాహుడు, నలుడు, పనసుడు అనే నలుగురు సైన్యాధిపతులు లంకా నగర ప్రాకారమును ఆక్రమించారు. కుముదుడు అనే సేనానాయకుడు తన సైన్యముతో లంకా నగరమునకు ఆగ్నేయభాగమున ఉన్న ప్రాకారమును ఆక్రమించాడు. కుముదునికి సాయంగా ప్రసభుడు, పసనుడు తమ తమ సేనలతో నిలబడ్డారు. మహావీరుడైన శతబలి ఇరువది కోట్ల వానరులతో దక్షిణ ద్వారమును, నైరుతి దిక్కున ఉన్న ప్రాకారమును అడ్డుకున్నాడు. తార తండ్రి సుషేణుడు నైరుతి ద్వారమును కోటి కోట్ల వానరములతో ఆక్రమించాడు. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు ఉత్తర ద్వారమును ఆక్రమించారు. మహాపరాక్రమ శాలి అయిన ధూమ్రుడు రామునికి సాయంగా రాముని పక్కనే కోటి భల్లూక సేనతో నిలిచి ఉన్నాడు. గదాధారి అయిన విభీషణుడు కూడా రామునికి అండగా ఉత్తర ద్వారము వద్ద నిలబడి ఉన్నాడు. వానర శ్రేష్టులైన గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు నలువైపులా తిరుగుతూ సేనలను పర్యవేక్షిస్తున్నారు.
వానర సైన్యము లంకను నలువైపుల నుండి ముట్టడించడం చూచి రావణుడు కోపంతో ఊగి పోయాడు. తనసేనలకు వానరులను అడ్డుకొమ్మని ఆదేశాలు ఇచ్చాడు. రావణుని ఆదేశములను విన్న రాక్షసులు భయంకరంగా అరుస్తున్నారు. కేకలు వేసారు. రణభేరులను దిక్కులు మార్మోగేట్టు మోగించారు. వేల కొలది శంఖములను ఒక్కసారి పూరించారు. రాక్షస సేనలు వానరులతో యుద్ధమునకు బయలుదేరాయి. లంకా నగరము బయట వానర సేనలు లంకా నగరము లోపల రాక్షస సేనలు చేస్తున్న సింహనాదములతో మలయ పర్వతము మార్మోగిపోయింది.
భేరీనినాదాలు, శంఖధ్వనులు, గజసేనలఘీంకారాలు, అశ్వముల సకిలింపులు, రధచక్రములు చేయు ధ్వనులు పదాతి దళములు అరిచే అరుపులతో లంకానగరము హోరెత్తిపోయింది.
వానర రాక్షస యుద్ధము దేవాసుర యుద్ధమును తలపిస్తూ ఉంది. రాక్షసులు వానరులను గొడ్డళ్లతోనూ, కత్తులతోనూ శూలముల తోనూ, గదలతోనూ శక్తిఆయుధముల తోనూ కొడుతున్నారు. దానికి ప్రతిగా వానరులు రాక్షసుల మీద పెద్ద పెద్ద బండ రాళ్లవర్షము కురిపిస్తున్నారు. ఒక్కొక్కక వానరుడు పర్వత శిఖరములను పెద్ద పెద్ద వృక్షములను పెళ్లగించి తెచ్చి రాక్షసుల మీద పడవేస్తున్నారు. ప్రాకారము మీద నిలబడ్డ రాక్షస వీరులు రావణునికి జయజయధ్వానాలు పలుకుతూ వానరులను చించి చెండాడుతున్నారు. దానికి కోపించిన వానరులు ప్రాకారముల మీదికి ఎగిరి అక్కడ నిలబడి ఉన్న రాక్షసులను తమ వాడి గోళ్లతో చీలుస్తున్నారు. ఆ విధంగా జరుగుతున్న యుద్ధములో రాక్షసుల, వానరుల రక్తముతో తడిసి నేల అంతా బురద బురద అయింది.
వానర రాక్షస యుద్ధము దేవాసుర యుద్ధమును తలపిస్తూ ఉంది. రాక్షసులు వానరులను గొడ్డళ్లతోనూ, కత్తులతోనూ శూలముల తోనూ, గదలతోనూ శక్తిఆయుధముల తోనూ కొడుతున్నారు. దానికి ప్రతిగా వానరులు రాక్షసుల మీద పెద్ద పెద్ద బండ రాళ్లవర్షము కురిపిస్తున్నారు. ఒక్కొక్కక వానరుడు పర్వత శిఖరములను పెద్ద పెద్ద వృక్షములను పెళ్లగించి తెచ్చి రాక్షసుల మీద పడవేస్తున్నారు. ప్రాకారము మీద నిలబడ్డ రాక్షస వీరులు రావణునికి జయజయధ్వానాలు పలుకుతూ వానరులను చించి చెండాడుతున్నారు. దానికి కోపించిన వానరులు ప్రాకారముల మీదికి ఎగిరి అక్కడ నిలబడి ఉన్న రాక్షసులను తమ వాడి గోళ్లతో చీలుస్తున్నారు. ఆ విధంగా జరుగుతున్న యుద్ధములో రాక్షసుల, వానరుల రక్తముతో తడిసి నేల అంతా బురద బురద అయింది.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము నలుబది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment