శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - నలుబది ఒకటవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 41)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

నలుబది ఒకటవ సర్గ

రావణునితో బాహాబాహీ యుద్ధము చేసి వచ్చిన సుగ్రీవుని రాముడు కౌగలించుకున్నాడు. "సుగ్రీవా! ఏమిటా సాహసము? నాతో ఒక్కమాట కూడా చెప్పకుండా అలా పోవడమేనా! ఇటువంటి పని చేసి నన్ను లక్ష్మణుని విభీషణుని భయపెట్టావు. నీకు ఏమవుతుందో అని మేమంతా కంగారు పడ్డాము. ఇకమీదట నాకు చెప్పకుండా ఇటువంటి సాహసము చెయ్యకు. నీకు ఏమైనా అయితే నేను లంకను జయించి సీతను పొందినా, నా పక్కన లక్ష్మణుడు, విభీషణుడు ఉన్నా ఏమి
ప్రయోజనము. నీవు తిరిగి వచ్చావు కాబట్టి సరిపోయింది. నీకు ఏదైనా జరగకూడనిది జరిగి ఉంటే నేను ఈ క్షణమే రావణుని, లంకను సర్వనాశనం చేసి ఉండేవాడిని. విభీషణుని లంకకు పట్టాభిషిక్తుని చేసి ఉండేవాడిని. తరువాత భరతునికి అయోధ్యను అప్పగించి, నీ కొరకు నేను నా ప్రాణములు త్యాగము చేసి ఉండేవాడిని. నీ బలపరాక్రమములు నాకు బాగా తెలిసినా నాకు అలా అనిపించింది. అందుకని ఇంక మీదట అటువంటి సాహసములు చెయ్యకు." అని సున్నితంగా మందలించాడు రాముడు.

సుగ్రీవుడు రాముని చూచి ఇలా అన్నాడు. “రామా! నీ భార్యను ఎత్తుకెళ్లిన ఆ రావణుని చూచిన తరువాత నాకు కోపం ఆవేశం ఆగలేదు. అక్కడికక్కడే వాడిని చంపి సీతను తీసుకొని వద్దామనుకున్నాను. కాని నీకు నియమ భంగం అవుతుందని తిరిగి వచ్చాను." అని అన్నాడు సుగ్రీవుడు.

(ఇక్కడి దాకా ఉన్న శ్లోకములు అన్నీ తరువాత చేర్చబడ్డవి అని పండితుల అభిప్రాయము. ఎందుకంటే ఈ శ్లోకములు వాల్మీకి రామాయణం ప్రాచ్యప్రతిలో లేవు.)

సువేల పర్వతము మీద ఉన్న రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. "లక్ష్మణా! మనం లంకా నగరాన్ని చూచాము కదా. ఇంక కిందికి వెళుతాము. లక్ష్మణా! ఇంక మనము యుద్ధమునకు సిద్ధముగా ఉండవలయును. మన వానర సైన్యమును ఫలములు, నీరు సమృద్ధిగా ఉన్న ప్రదేశములో ఉండేట్టు చూడు. లక్ష్మణా! లోక నాశనమును భయాన్ని కలిగించే దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఈ వానర సైన్యము భల్లూక సైన్యము, రాక్షస సైన్యము అంతా సమూలంగా నశించే సూచనలు కనపడుతున్నాయి. గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. భూమి కంపిస్తూ
ఉంది. పర్వతముల మీది నుండి వీచే గాలి తీవ్రంగా ధ్వని చేస్తూ ఉంది. ఆకాశం నుండి రక్త బిందువులు వర్షంలాగా కురుస్తున్నాయి. సూర్య మండలము నుండి ఉల్కాపాతం జరుగుతూ ఉంది. ఆకాశం రక్తవర్ణంలో మెరుస్తూ ఉంది. మృగములు పక్షులు సూర్యుని వంక చూస్తూ వికృతంగా అరుస్తున్నాయి. చల్లని వెన్నెల కురిపించాల్సిన చంద్రుడు రాత్రిళ్లు భయంగొల్పుతున్నాడు. సూర్యుని చుట్టు నల్లని వలయము కనపడుతూ ఉంది. నక్షత్రములు గతులు తప్పుతున్నాయి. ఈ దుశ్శకునములు అన్నీ ప్రళయ కాలాన్ని సూచిస్తున్నాయి. ఈ భూమి అంతా రక్తమయం అయే కాలం సమీపించినట్టుంది. కాని యుద్ధము తప్పదు. ఎలా జరగాలో అలా జరగాలి కదా! వానరసేనలను లంకా నగరాన్ని చుట్టుముట్టమని ఆదేశాలు ఇవ్వు. ఇంక మనము కిందికి దిగుదాము.” అని అన్నాడు రాముడు.

తరువాత రాముడు లక్ష్మణుడు, సుగ్రీవునితో సహా సువేల పర్వతమును దిగాడు. సుగ్రీవునితో వానర సైన్యమును సిద్ధముగా ఉండమని ఆదేశించాడు. రాముడు తన ధనుస్సును అందుకున్నాడు. లంకా నగరం వైపు నడిచాడు. రాముని వెంట లక్ష్మణుడు, విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు వెళ్లారు. వారి వెనక అపారమైన వానర సేన భల్లూక సేన నడిచింది. వానరులు భల్లూకములు తమ చేతికి ఏది అందితే అది, పెద్ద బండరాళ్లు, వృక్షములు, కొమ్మలు, పట్టుకొని ఉత్సాహంగా నడుస్తున్నారు. అందరూ లంకా నగరాన్ని సమీపించారు. వానర సేనలు లంకా నగరాన్ని చుట్టుముట్టారు.

రాముడు లక్ష్మణునితో సహా ఉత్తర ద్వారము వద్ద నిలిచి లోపలి వారు బయటకు రాకుండా అడ్డుకుంటున్నాడు. రాముని వెంట లక్షలాది వానరులు నిలిచి ఉన్నారు. నీలుడు, మైందుడు, ద్వివిదుడు తమతమ సేనలతో తూర్పు ద్వారమును ముట్టడించారు. అంగదుడు, గవాక్షుడు, గజుడు, గవయుడు దక్షిణ ద్వారము చేరుకున్నారు. హనుమంతుడు తన వానర సేనలతో పడమటి ద్వారము వద్ద నిలిచి ఉన్నాడు. సుగ్రీవుడు తన వానర సేనలతో సేనామధ్యంలో నిలిచి ఉన్నాడు. సుగ్రీవుని వెంట ముప్పది ఆరు కోట్ల సైనికులు నిలిచి ఉన్నారు. లక్షణుడు, విభీషణుడు ఒక్కొక్క ద్వారము వద్ద కోటి మంది సైనికులను నిలిపారు. సుషేణుడు, జాంబవంతుడు తమ తమ సైన్యములతో రామునికి పడమటి దిశగా నిలబడి ఉన్నారు. వానరులు అందరూ ఆ అడవిలో ఉన్న పెద్ద పెద్ద వృక్షములను పెకలించి ఆయుధములు గా ధరించి ఉన్నారు. వారికి సహజంగా చేతి వేళ్లు, గోళ్లు, కోరలు ఆయుధములుగా ఉన్నాయి. ఆ వానరులు ఒక్కొక్కరు, పది ఏనుగులు, నూరు ఏనుగులు, వెయ్యి ఏనుగులు బలము కలవారు. ఆ వానర సైన్యమును చేస్తుంటే మిడతల దండు లంకమీద దాడి చేసిందా అన్నట్టు కనపడుతూ ఉంది. అప్పటికి కొంత మంది వానరులు లంక చుట్టు చేరారు. కొంతమంది చేరుతున్నారు. ఒక్కొక్క యూధములో కోటి మంది వానరులు, కోటి మంది భల్లూకములు లంకకు అన్ని వైపులా నిలిచి ఉన్నాయి. వారంతా కట్టలు తెంచుకున్న సముద్రంలా లంక మీద విరుచుకుపడుతున్నారు. ఆ వానరులు అరిచే అరుపులకు, చేసే శబ్దాలకు లంకా నగరం అదిరిపోతూ ఉంది.

తరువాత రాముడు వానర మంత్రులను సేనాధి పతులను సమావేశ పరిచాడు. బాగా ఆలోచించాడు. రాజ ధర్మము ప్రకారము యుద్ధమునకు ఉపక్రమించే ముందు రావణుని వద్దకు ఒక రాయబారిని పంపడానికి నిశ్చయించుకున్నాడు. ఎవరిని రాయబారిగా పంపాలా అని విభీషణుని సలహా అడిగాడు. విభీషణుడు అంగదుని పంపమని సలహా ఇచ్చాడు. రాముడు అంగదుని పిలిచి ఇలా అన్నాడు.

"ఓ అంగదా! నీవు లంకా నగరమునకు పోయి, రావణుని సముఖమున నిలిచి ఏ భయమూ లేకుండా నేను చెప్పిన మాటలను యధాతథంగా రావణునితో చెప్పు.

“ఓరావణా! నీవు లంకా నగరానికి రాజువు. కాని మదంతో కళ్లు మూసుకు పోయి ఋషులను, మునులను, దేవతలను, గంధర్వులను, అప్సరసలను, నాగజాతిని, యక్షులను, భూలోకములో ఉన్న క్షత్రియులను నానా బాధలు పెట్టావు. పాపం మూటగట్టుకున్నావు. ఆ పాపఫలమును ఇప్పుడు అనుభవించబోతున్నావు. బ్రహ్మ దేవుడు నీకు ఇచ్చిన వర గర్వంతో విర్రవీగిన నీకు అదే వరము నీ నాశనానికి కారణం అయింది. అకారణంగా నా భార్యను నీవు అపహరించావు. ఆ తప్పుకు నీకు తగిన దండన విధించాల్సి ఉంది. నిన్ను శిక్షించుటకు నేను లంకకు వచ్చి లంకా నగర ద్వారము వద్ద నిలిచి ఉన్నాను. నీవు ఇప్పటిదాకా చంపిన వారు ఏ మార్గంలో వెళ్లారో అదే మార్గంలో వెళ్లడానికి సిద్ధంగా ఉండు. నువ్వు ఏ బలం ఏ శక్తి ఏ పరాక్రమము చూచుకొని నేను ఇంటలేని సమయంలో నా భార్యను అపహరించావో, ఆ బలపరాక్రమములు ఇప్పుడు చూపించు.

నీకు చివరి అవకాశము ఇస్తున్నాను. నీవు నా వద్దకు వచ్చి నా సీతను నాకు అప్పగించి నా శరణు వేడితే నేను నిన్ను క్షమించి వదిలిపెడతాను. లేకపోతే ఈ లోకంలో రాక్షసుడు అనే జాతి లేకుండా నాశనం చేస్తాను. నీ తమ్ముడు విభీషణుడు నా దగ్గరే ఉన్నాడు. నిన్ను చంపి విభీషణుని లంకా రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేయుటకు నిశ్చయించుకున్నాను. ఇంక మీదట నీవు లంకా రాజ్యమును పాలించే అర్హతను కోల్పోయావు. ఎందుకంటే నీ మంత్రులు నిన్ను సన్మార్గంలో నడపడం లేదు. నీకు ఆత్మనిగ్రహము, మనోనిగ్రహము లేదు. అటువంటి వాడు రాజుగా ఉండతగడు. నీకు నన్ను శరణుకోరడానికి ఇష్టం లేని పక్షంలో నాతో యుద్ధం చేసి వీరస్వర్గము పొందు. నీవు ముల్లోకములు తిరిగినను నా బాణముల బారి నుండి తప్పించుకోలేవు. నీకు మరణము తథ్యము. కాబట్టి నీవు బతికి ఉండగానే నీ శ్రాద్ధకర్మలు జరిపించుకో. నీవు చచ్చిన తరువాత నీకు అపర కర్మలు జరిపించడానికి ఎవరూ ఉండరు. నీ వారందరినీ ఒక్కసారి తనివిదీరా చూచుకో. చావడానికి సిద్ధంగా ఉండు.”

అంగదా ఈ మాటలు నా మాటలుగా రావణునితో చెప్పు.” అని అన్నాడు రాముడు.

అంగదుడు రాముడి మాటలను శిరసావహించాడు. వెంటనే ఎగిరి లంకా నగరంలో రావణుని సభాభవనమునకు చేరుకున్నాడు. సభాభవనంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో రావణుడు తన మంత్రులతో సేనానాయకులతో సభతీర్చి యుద్ధవిషయములను గురించి చర్చిస్తున్నాడు. అంగదుడు వెళ్లి రావణుని దగ్గరగా నిలబడ్డాడు.

“ఓ రావణా! నేను వాలి పుత్రుడను. నా పేరు అంగదుడు. రాముని దూతగా నీ వద్దకు వచ్చాను. రాముని గురించి నీవు విని ఉంటావు. ఆ రాముని భార్యను నీవు దొంగతనంగా అపహరించి తీసుకొని వచ్చావు. ఆ రాముడు ఇప్పుడు లంకకు వచ్చి లంకా నగర ద్వారము వద్ద నిలిచి ఉన్నాడు. ఆ రాముడు నీతో చెప్పమన్న మాటలను చెబుతున్నాను. సావధానంగా ఆలకించు.

“ఓ రావణా! నీవు లంకానగరం బయటకు వచ్చి నాతో యుద్ధం చేయి. నీ పరాక్రమాన్ని చూపించు. నిన్ను బంధు, మిత్ర, సపరివార సమేతంగా యుద్ధంలో చంపుతాను మూడు లోకాలకు రాక్షస బాధ లేకుండా చేస్తాను. నువ్వు ఇప్పటిదాకా, ఋషులకు, దేవ, దానవ, గంధర్వ, నాగ,యక్షులకు ఎన్నో కష్టములు కలుగచేసావు. ఆ పాపాలకు ఫలితం అనుభవించే కాలం వచ్చింది. నీవు వెంటనే సీతను తీసుకొని వచ్చి నాకు అప్పగించకపోతే, నీకు సర్వనాశనం తప్పదు. నీ రాజ్యము విభీషణునికి ఇవ్వక తప్పదు." అని అంగదుడు రాముని చెప్పిన మాటలను రావణునితో చెప్పాడు.
అంగదుడు చెప్పిన ఒక్కొక్క మాటా రావణుని హృదయంలో బాణాల్లా గుచ్చుకున్నాయి. "ఆ కోతిని పట్టుకోండి చంపండి." అని పెద్దగా అరిచాడు రావణుడు. వెంటనే అక్కడ ఉన్న రాక్షసులు అంగదుని గట్టిగా పట్టుకున్నారు. అంగదుడు వారితో గొడవ పడటం ఇష్టం లేక వారికి
లొంగిపోయాడు. రావణుడు అంగదుని చంపమని ఆదేశించాడు.

అంగదునికి కోపం వచ్చింది. తనను పట్టుకున్న రాక్షసులను పురుగులను విదిలించినట్టు విదిలించాడు. ఆకాశంలోకి ఎగిరాడు. అంగదుని పట్టుకున్న రాక్షసులు నేలమీద పడ్డారు. తరువాత అంగదుడు రావణుని సభాభవనము మీద ఉన్న శిఖరము మీదికి ఎక్కాడు. అంగదుని వేగానికి ఆ శిఖరము కూలిపోయింది. అంగదుడు అక్కడినుండి ఆకాశంలోకి ఎగిరాడు. లంకను దాటి రాముని వద్దకు వెళ్లాడు. రాముని ముందు నిలబడ్డాడు.

తన సభాభవన ప్రాసాదము పైన ఉన్న శిఖరము కూలిపోవడం చూచి రావణుడు మనసులో కలత చెందాడు. రావణుని ప్రతి చర్య అంగదుని వల్ల విన్న రాముడు ఇంక యుద్ధము అనివార్యము అనుకున్నాడు. సుగ్రీవుడు లంకా ద్వారములను అన్నింటినీ ముట్టడించమని సుషేణుని ఆదేశించాడు. సుషేణుని ఆజ్ఞప్రకారము, వానరులు లంకకు ఉన్న నాలుగు ద్వారములు బంధించారు. సముద్రములో ఉప్పెనలా కదిలివస్తున్న వానరసేనలను చూచి రాక్షసులు భయంతో వణికిపోయారు. అప్పటి దాకా తమను చూచి భయపడే దేవతలను, గంధర్వులను, యక్షులను చూచారు గానీ, తమమీదికి ఉత్సాహంతో ఉరకలు వేస్తూ వస్తున్న వానరులను చూడ్డం ఇదే వారికి ప్రధమం. ఆ వానరుల గంభీర గర్జనలకు రాక్షసులు హాహాకారాలు చేసారు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము నలుబది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)