శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై ఒకటవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 61)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

అరవై ఒకటవ సర్గ

రాముడు కూడా ఆకాశం అంత ఎత్తున ఉన్న కుంభకర్ణుని చూచాడు. ఆ అనూహ్యమైన ఆకారమును చూచి పారిపోతున్న వానరములను చూచాడు. ఆశ్చర్యపోయాడు. విభీషణుని చూచి ఇలా అన్నాడు. “విభీషణా! ఆకాశమంత ఎత్తున ఉన్న ఈ ఆకారము ఎవరు? ఇంత పెద్ద దేహము కలవాడు ఈ భూమి మీద వీడు ఒక్కడే ఉన్నట్టు ఉంది. వీడు ఎవరు? వీడి పేరేమి? వీడు అసురుడా, రాక్షసుడా, లేక వేరే జాతి ప్రాణియా. ఎందుకంటే నేను ఇంతవరకూ ఇటువంటి ప్రాణిని భూమి మీద చూడలేదు." అని అన్నాడు.

అప్పుడు విభీషణుడు ఇలా అన్నాడు. “ఓ రామా! ఇతని పేరు కుంభకర్ణుడు. రావణుని సోదరుడు. ఇతడు విశ్రవసుని కుమారుడు. యుద్ధములో ఇంద్రుని, యముడిని ఓడించాడు. రాక్షస జాతిలో ఇంత దేహము కల రాక్షసుడు ఎవరూ లేరు. ఇతడు దేవతలను, గంధర్వులను, పన్నగులను, దానవులను, యక్షులను, విద్యాధరులను ఓడించాడు. ఇతడు శూలం ధరించి యుద్ధభూమిలో తిరుగుతుంటే సాక్షాత్తు యముడు తిరిగినట్టు ఉంటుంది. ఇతడు సహజ బలసంపన్నుడు. ఈ కుంభకర్ణుడు పుట్టీ పుట్ట గానే వేలకొలది ప్రాణులను భక్షించాడు. వీడికి ఆకలి ఎక్కువ. దొరికిన దానిని దొరికినట్టు తినేసేవాడు. వాడు అలా తినడం మొదలెడితే భూమి మీద కొంతకాలానికి ప్రాణి అనేది మిగలదు అని తలచి ప్రజలందరూ ఇంద్రుని శరణు వేడారు. ఇంద్రుడు తన వజ్రాయుధముతో కుంభకర్ణుని కొట్టాడు. అప్పుడు కుంభకర్ణుడు బిగ్గరగా అరిచాడు. ఆ అరుపులకు సగం జనం చచ్చారు. తరువాత కుంభకర్ణుడు ఇంద్రుడు ఎక్కిన ఐరావతము అనే ఏనుగు దంతమును ఊడపెరికి దానితో ఇంద్రుని వక్షస్థలము మీద పొడిచాడు. ఆ దెబ్బకు ఇంద్రుడు తల్లడిల్లిపోయాడు.

ఇంక ఇంద్రునితో లాభం లేదని దేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. కుంభకర్ణుడు ముల్లోకములనూ పీడిస్తున్నాడనీ, దేవతలను ఎదిరిస్తున్నాడనీ, ఋషులను యజ్ఞ యాగములను చేసుకోనివ్వడం లేదనీ, ఆశ్రమములను నాశనం చేస్తున్నాడనీ, ఇతరుల భార్యలను అపహరిస్తున్నాడనీ, బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ఈ ప్రకారంగా కుంభకర్ణుడు ప్రాణులను తింటూ ఉంటే కొంత కాలానికి ఈ లోకంలో ప్రాణికోటి లేకుండా పోతారు అని కూడా విన్నవించుకున్నారు. వెంటనే బ్రహ్మ రావణుని, కుంభకర్ణుని, ఇతర రాక్షసులను తన దగ్గరకు పిలిపించుకున్నాడు.

కుంభకర్ణుని చూచి బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. భయపడ్డాడు. 'ఆ విశ్రవసుడు నిన్ను ముల్లోకాలను నాశనం చెయ్యడానికే పుట్టించాడు రా!' అని మనసులో అనుకున్నాడు. కుంభకర్ణునికి ఘోర శాపం ఇచ్చాడు. "ఈ రోజు నుండి నీవు అచేనంగా పడి ఉండు" అని శపించాడు. బ్రహ్మదేవుని శాప మహిమ వలన వెంటనే కుంభకర్ణుడు నేలమీద పడిపోయాడు. చచ్చినవాడి మాదిరి పడిఉన్న కుంభకర్ణుని చూచి రావణుడు శోకించాడు. బ్రహ్మదేవుని చూచి ఇలా అన్నాడు. 

"ఓ బ్రహ్మదేవా! వీడు నీ ముని మనుమడు. నీ మునిమనుమని ఇలా శపించడం ధర్మమా! కాని నీ శాపం అమోఘము. వీడు ఇలా నిద్రావస్థలో ఉండవలసినదే కానీ కొంచెం నీ శాపమునకు విరామము
ఇవ్వమని నా ప్రార్థన. వీడు జీవితాంతము నిద్రపోకుండా అప్పుడ్పుడు మేల్కొని ఉండేట్టు వరం ప్రసాదించు." అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కరుణించి ఇలా అన్నాడు. "వీడు ఆరునెలలపాటు నిద్రలో ఉంటాడు. ఒక రోజు మాత్రం మెలుకువగా ఉంటాడు. ఆరోజున ఆహారం తీసుకుంటాడు. మరలా ఆరునెలలు నిద్రపోతాడు." అని అన్నాడు. 

ఇదీ వీడి చరిత్ర. ప్రస్తుతము వీడు నిద్రపోవలసిన సమయము. కానీ నీ మీద భయంతో రావణుడు వీడిని నిద్రలేపాడు. ఇప్పుడు వీడు నిద్రలేచి రావణుని వద్దకు వెళుతున్నాడు. అపర మృత్యుదేవతలా ఉన్న వీడిని చూచి వానరులు భయంతో పారిపోతున్నారు. మరి వీడితో వానరులు ఎలా యుద్ధం చేస్తారో ఏమో తెలియకుండా ఉంది" అని అన్నాడు విభీషణుడు.

అప్పుడు రాముడు విభీషణునితో ఇలా అన్నాడు. “ఇతడు రాక్షసుడు అని చెప్పకండి. వీడు యుద్ధములో శవములను తీయుటకు అమర్చబడిన యంత్రము అని ప్రచారం చెయ్యండి. వానరులలో ఉన్న భయాన్ని పోగొట్టండి." అని అన్నాడు. రాముడు నీలుని చూచి ఇలా అన్నాడు. 

“నీలుడా! నీవు వానరసైన్యమును యుద్ధమునకు సమాయత్తం చెయ్యి. లంక అన్ని ద్వారముల వద్ద సైన్యమును అప్రమత్తం చెయ్యి. వానరములకు ఆయుధములైన పర్వత శిఖరములను, వృక్షములను, బండరాళ్లను ఒక చోట చేర్చండి. వానరులందరూ బండరాళ్లను, పర్వతములను, వృక్షములను ధరించి యుద్ధమునకు సన్నద్ధము అవుతారు." అని అన్నాడు రాముడు. నీలుడు రాముడు చెప్పిన ప్రకారము వానరులకు ధైర్యము చెప్పి వారిని యుద్ధోన్ముఖులను చేసాడు.
వానరులందరూ కుంభకర్ణుని వల్ల కలిగిన భయమును వదిలిపెట్టి ఆయుధములు చేతబట్టారు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము అరవై ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)