శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై రెండవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 62)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

అరవై రెండవ సర్గ

కుంభకర్ణుడు లంకా నగర రాజమార్గములో నడుస్తున్నాడు. రావణుని మందిరము చేరుకున్నాడు. కుంభకర్ణుని దూరం నుండి చూచాడు రావణుడు. సింహాసనము మీది నుండి లేచి కుంభకర్ణునికి ఎదురుపోయి ప్రేమతో కౌగలించుకున్నాడు. కుంభకర్ణుడు రావణునికి పాదాభివందనము చేసాడు.

“అన్నా రావణా! నన్ను ఎందుకునిద్ర లేపారు? నేను ఏమి చెయ్యాలి?" అని సూటిగా అడిగాడు.

అప్పుడు రావణుడు ఇలా అన్నాడు.

"తమ్ముడా కుంభకర్ణా! నీవు చాలా కాలము కిందట నిద్రకు ఉపక్రమించావు. ఈ లోపల చాలా విషయాలు జరిగాయి. ఇటీవల నాకు రాముడు అనే నరుని వలన కలిగిన భయం గురించి నీకు తెలియదు. ఈ రాముడు అయోధ్య రాజైన దశరథుని కుమారుడు. ఇతని స్నేహితుడు సుగ్రీవుడు అనే వానరుడు. రాముడు, సుగ్రీవుని సాయంతో సముద్రమును దాటి లంకలో ప్రవేశించాడు. లంకానగరాన్ని ముట్టడించాడు. లంకను ఆక్రమించాడు. ఎక్కడ చూచినా వానరులే. ఈ వానరయోధులు మన రాక్షస వీరులను ప్రముఖులను ఎంతోమందిని చంపారు. వానరులకు కలిగిన నష్టం కంటే మనకు జరిగిన నష్టం అపారము. ఈ వానరులు ఎప్పుడూ యుద్ధం చేసినట్టు గానీ అందులో ఓడిపోయినట్టు గానీ కనపడదు. ఈ విధంగా నాకు నరులతో, వానరులతో భయం
కలిగింది. నీవు యుద్ధంలో ఈ నరులను వానరులను చంపి నాకు మనశ్శాంతి కలిగించు. ఈ యుద్ధముతో మన కోశాగారము అంతా వ్యయము అయిపోయింది. లంకా నగరంలో స్త్రీలు, బాలురు, వృద్ధులు తప్ప ఎవరూ మిగలలేదు. కాబట్టి నా కోసం ఈ యుద్ధం చెయ్యి. నన్ను, లంకను, రక్షించు. ఇప్పటిదాకా నేను అందరినీ శాసించాను కానీ ఈ ప్రకారంగా ఎవరినీ కోరలేదు. కాబట్టి నా మాటలు మన్నించి యుద్ధం చెయ్యి.

ఓ తమ్ముడా! నీకు యుద్ధము కొత్త కాదు. దేవాసుర యుద్ధంలో నీవు రాక్షసుల పక్షాన పోరాడి వారికి విజయం సంపాదించి పెట్టావు. ఈ సమయంలో కూడా నీ పరాక్రమమును చూపించి నాకు విజయం చేకూర్చు. నీవు ఎలా యుద్ధం చేస్తావో నీ ఇష్టం. కానీ శత్రునాశనం మాత్రం జరగాలి. అదే నా ధ్యేయము.” అని పలికాడు రావణుడు.

శ్రీమద్రామాయణము
అరవై రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)