శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై మూడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 63)
శ్రీమద్రామాయణము
యుద్ధ కాండము
అరవై మూడవ సర్గ
ముల్లోకములను గడగడలాడించిన పరాక్రమవంతుడు అయిన రావణుడు తన ముందు అంత దీనంగా మాట్లాడటం చూచి కుంభకర్ణుడు బిగ్గరగా నవ్వాడు. రావణునితో ఇలా అన్నాడు. “అన్నా రావణా! నాకు చూడగా, నీవు నీ మంత్రులతో చర్చించినపుడు, వారు చెప్పిన మంచి మాటలను చెవిని పెట్టినట్టులేదు. అందుకే నీకు ఈ ఆపదకలిగింది. అవునా! ఇది ఎవరో చేసినది కాదు. నీవు చేసుకున్న దుష్కర్మ నీకు ఈ కష్టములను తెచ్చిపెట్టింది. నీవు దుష్కార్యమును చేసావు. అది చేయబోయే ముందు ఎవరితోనన్నా ఆలోచించావా! బాగోగులు విచారించావా! ఆ చేయబోయే పనికి ఫలితం ఎలా ఉంటుందో ఊహించావా! ఇవేమీ ఆలోచించకుండా చేయకూడని పనులు చేసి ఇప్పుడు చింతించి ఏమి ప్రయోజనము.నీకు బలము, దర్ఘము, పరాక్రమము ఉంది కదా అని చేయకూడని పనులు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. ఇంకా దారుణంగా కూడా ఉంటుంది. నీవు లంకాధీశుడవు. నీకు తగ్గపనులు చెయ్యాలి కానీ, నీవు చేయకూడని పనులు చేయడం ధర్మమా! ఒక పని చేసే ముందు దేశ, కాలములు అనుకూలంగా ఉన్నవా లేవా అని చూచుకోవాలి కదా! ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ చేసెయ్యడమేనా!
ఏ పని చేసే ముందు అయినా మంత్రులతో మంచి చెడ్డలు విచారించి ఆయా పనులు చేస్తాడో అతడే నీతివంతుడైన రాజు. నీతి వంతుడైన రాజు తాను చేయబోయే పని గురించి ముందు తాను ఆలోచిస్తాడు. శాస్త్రములు ఏం చెప్పాయో తెలుసుకుంటాడు. తరువాత మంత్రులతో ఆలోచిస్తాడు. తరువాత సరి అయిన నిర్ణయం తీసుకుంటాడు. వాడే ఉత్తముడు నీతి మంతుడు అయిన రాజు.
ధర్మము, అర్ధము, కామము మూడు పురుషార్థములు. వాటిని ఏ యే సమయములందు ఆచరించవలెనే ఆయాసమయములలో ఆచరించు వాడు ఉత్తముడు. అలా చేయని వాడు ఎన్ని శాస్త్రములు చదివినా నిష్ప్రయోజనము. ఉపాయములు మూడు విధములు. సామ, దాన, భేదోపాయములు. ఆఖరుది దండోపాయము. వాటిని మంత్రుల సహకారంతో కాలానుగుణంగా ఉపయోగించాలి. అటువంటి రాజుకు ఎలాంటి ఆపదలు రావు. రాజు తాను చేయబోయే పనుల యొక్క యదార్థస్వరూపమును తెలుసుకొని, మంత్రులతో ఆలోచించి, తగు నిర్ణయం తీసుకోవాలి. తనకు ఏది హితము కలుగచేస్తుందో ఆ పనిని మాత్రమే చెయ్యాలి.
నాకు చూడ నీ మంత్రులు నీకు సరి అయిన ఆలోచనలు హితములు చెప్పినట్టు లేదు. అటువంటి వారి ఆలోచనలు ఇలాగే నిన్ను ఆపదలలోకి నెడుతాయి. బుద్ధిలేని వారితో ఆలోచిస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి. నిన్ను పొగిడే వాళ్లను, నీవు ఏం చెప్పినా ఎద్దులా తల ఊపేవాళ్లను దగ్గరకు చేరనీయవద్దు. అంతే కాకుండా శాస్త్ర జ్ఞానము, అర్థశాస్త్ర జ్ఞానము లేని వారిని దూరంగా ఉంచాలి. అలాంటి వారు నీకు మంచి చేయకపోగా, నిన్ను ఆపదలలోకి నెడుతారు. కొంత మంది మంత్రులు శత్రువులతో చేతులు కలిపి రాజుతో చేయకూడని పనులు చేయించి అతనిని అప్రతిష్టపాలు చేస్తారు. అటువంటి వారిని దూరంగా ఉంచాలి. శత్రురాజుల నుండి కానుకలు పుచ్చుకొని, నీకు అనుకూలంగా ఉన్నట్టు నటిస్తూ నీకు ద్రోహం చేసేవారిని ఒక కంట కనిపెట్టి ఉండాలి. ఎలాంటి ఆలోచనా లేకుండా తొందరపాటుతో పనులు చేసే రాజును, శత్రువులు తొందరగా లొంగదీసుకుంటారు. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటూ తనను తాను నిర్లక్ష్యం చేసుకొనేవాడు, ఆపదలు పొందుతాడు. ఆఖరుగా ఒక్కమాట. మన తమ్ముడు విభీషణుడు నీకు ఏమి చెప్పాడో అది చెయ్యి. లేకపోతే నీ ఇష్టం." అని ఊరుకున్నాడు కుంభకర్ణుడు.
కుంభకర్ణుని మాటలు విని రావణునికి కోపం వచ్చింది. “తమ్ముడా కుంభకర్ణా! ఏమిటి పెద్ద అన్నీ తెలిసిన వాడి మాదిరి మాట్లాడుతున్నావు. గురువు మాదిరి నాకు ఉపదేశిస్తున్నావు. అనవసరంగా మాట్లాడి నీ సమయం నా సమయం వృధా చెయ్యకు. ప్రస్తుతం వచ్చిన సమస్యకు పరిష్కారం ఆలోచించు. తగిన విధంగా ఆచరించు. తెలిసి చేసానో, తెలియక చేసానో, చిత్తభ్రమతో చేసానో, నా బలపరాక్రమముల మీద నమ్మకంతో చేసానో, రాముడి వద్దనుండి సీతను అపహరించి తెచ్చాను. ప్రస్తుతం దానిని గురించి ఆలోచించడం అనవసరము. నీకు నా యందు ప్రేమ ఉంటే, నాకు సాయం చెయ్యాలని నీకు అనిపిస్తే, ఈ కార్యము చేయతగినది అని నీకు అనిపిస్తే కేవలం నా పొరపాటు వలన సంభవించిన ఈ ఆపదనుంచి నన్ను గట్టెక్కించు. అది నీ ఒక్కడి వల్లనే సాధ్యం
అవుతుంది అని నా నమ్మకం. కుంభకర్ణా! నీవు నాకు తమ్ముడివే కాదు. మంచి స్నేహితుడివి కూడా! కష్టములలో ఉన్న వాడిని ఆదుకున్నవాడే స్నేహితుడు. నీతి తప్పి ప్రవర్తించినా, సహృదయంతో సాయం చేసినవాడే బంధువు. ప్రస్తుతము నేను కష్టాలలో ఉన్నాను. నన్ను రక్షించు." అని అన్నాడు.
తన మాటలకు రావణునికి కోపం వచ్చిందని తెలుసుకున్నాడు కుంభకర్ణుడు. అందుకని అన్నతో మృదువుగా మాట్లాడాడు. “అన్నయ్యా! రావణా! నా మాటలకు బాధపడకు. స్థిరచిత్తంతో ఉండు. నేను జీవించి ఉండగా నీకు ఏ ఆపదా రాదు. ధైర్యంగా ఉండు. ఎవరి వలన నీకు ఈ దు:ఖము కలిగిందో ఆ దు:ఖకారకుడిని నేను చంపుతాను. నీవు ఏ పరిస్థితులలో ఉన్నా నీకు హితము చెప్పడం నా ధర్మము. నీకు నాకు ఉన్న బంధుత్వము వలనా సోదర ప్రేమ వలనా. నాకు తోచిన మంచి మాటలు చెప్పాను. నీకు బాధ కలిగించి ఉంటే క్షమించు. ఇప్పుడు నీ సోదరుడిగా నేను నిన్ను ఆదుకుంటాను. నీ కోసరం యుద్ధం చేస్తాను. శత్రువులను సంహరిస్తాను. నేను రామలక్ష్మణులను యుద్ధంలో సంహరిస్తాను. అది చూచి వానరులు పారిపోతారు. నేను రాముని తలను ఖండించి తీసుకొని వస్తాను. నీకు సంతోషము, సీతకు దుఃఖము కలిగిస్తాను. రాముని చేతిలో చంపబడ్డ రాక్షసుల బంధువులు ఈ నాడు రాముని మరణమును కళ్లారా చూస్తారు. రామలక్ష్మణులనే కాదు, ఆ సుగ్రీవుని కూడా కిందపడవేసి నలిపివేస్తాను. నేను రాముని చంపాలని నిర్ణయం తీసుకున్న తరువాత కూడా ఎందుకు బాధపడుతున్నావు. రాముని మరణం కళ్లారా చూడటానికి సిద్ధంగా ఉండు.
అన్నా రావణా! నేను బతికి ఉండగా రాముడు నిన్ను ఏమీ చెయ్యలేడు. నన్ను చంపిన తరువాతనే రాముడు నిన్ను చంపగలడు. నన్ను చంపడం ముల్లోకములలో ఎవరి తరమూ కాదు. ఇంక ఈ నర, వానరులు ఎంత. రాముడి వెంట ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, కుబేరుడు వచ్చినా నేను భయపడను. అందరినీ ఓడిస్తాను. నీకు జయం చేకూరుస్తాను. నేను గట్టిగా గర్జిస్తే ఇంద్రుడు కూడా గడ గడ వణికిపోతాడు. అసలు నేను ఆయుధమును కూడా పట్టుకోపని లేదు. నా ఎదుట నిలిస్తే చాలు. వాడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి. నేను నా చేతులతోనే ఎవరినైనా చంపగలను. అంత శక్తి ఉంది నాకు. కాబట్టి నేను రాముని ఒకే ఒక్క పిడికిలి గుద్దుతో చంపుతాను. నా పిడికిలి గుద్దుకు కూడా రాముడు చావకపోతే, అప్పుడే నేను మారణాయుధములు, అస్త్రములు ఉపయోగించి రాముని చంపుతాను.
అన్నా రావణా! నేను ఇప్పుడే యుద్ధమునకు బయలుదేరుతున్నాను. రాముని గురించి భయం వదిలిపెట్టు. సంతోషంగా ఉండు. ఒక్క రాముని కాదు, వానర నాయకుడు సుగ్రీవుని, లంకను కాల్చిన హనుమంతుని చంపుతాను. వానరులను చుట్ట చుట్టి నోటిలో పెట్టుకొని తినేస్తాను. నాకు కోపం వస్తే ఇంద్రుడు, దేవతలు కూడా గడగడవణికిపోతారు. దేవతలు, అసురులు, గంధర్వులు చాలా కాలం తరువాత కుంభకర్ణుని పరాక్రమాన్ని చూస్తారు. నీవు భయం వదిలిపెట్టు. మద్యం సేవించు. అందమైన స్త్రీలతో క్రీడించు. ఆనందాన్ని అనుభవించు. నేను రాముని చంపిన తరువాత సీత నీపక్కన చేరగలదు." అని అన్నాడు కుంభకర్ణుడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము అరవై మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment