శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై నాలుగవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 64)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
అరవై నాలుగవ సర్గ
కుంభకర్ణుడు రావణునితో పలికిన పలుకులు అన్నీ పక్కనే కూర్చుని ఉన్న మహెూదరుడు విన్నాడు. మహోదరుడు కుంభకర్ణునితో ఇలా అన్నాడు. “ఓ కుంభకర్ణా! నీవు ఉన్నత వంశంలో జన్మించావు. కాని ఉన్నతంగా ఆలోచించడం లేదు. గర్వంతో ఎప్పుడు ఏమి చెయ్యాలో తెలియకుండా మాట్లాడుతున్నావు. రావణుడు మహారాజు. ఆయనకు తెలియని నీతి లేదు. నీవు ఇప్పుడు రావణునికి నీతులు చెప్ప పనిలేదు. ఏదో బాల్యచాపల్యంతో మాట్లాడుతున్నావు. రావణుడు లంకాధిపతి. దేశ కాలములను బాగా ఎరిగిన వాడు. ఎప్పుడు ఎక్కడ ఏ పని చెయ్యాలో తెలిసినవాడు. తాను చేయబోయే పని గురించి మంచి చెడ్డలు బాగా తెలిసినవాడు.నీవు ధర్మము అర్థము కామము గురించి మాట్లాడావు. కానీ వాటి లక్షణముల గురించి, స్వరూప స్వభావముల గురించి నీకు తెలుసా! సుఖం కలిగినా దు:ఖము కలిగినా, దానికి ముందు చేసిన కర్మలే కారణము. కానీ ఒక్కోసారి చెడ్డపనులు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ధర్మం కోసరం చేసే పనులూ, అధర్మం కోసం చేసే పనులూ రెండూ శ్రేయస్సును కలుగచేస్తాయి. ఒక్కోసారి ధర్మం కొరకు చేసే పనులు కీడును కలిగిస్తాయి. పురుషులు ఈ లోకానికి పరలోకానికి పనికి వచ్చే కర్మలను కోరికలతో చేస్తూ ఉంటారు. ఆ కర్మలు సత్ఫలితాలను ఇస్తున్నాయి కదా! కాబట్టి మంచి పనులు చేస్తే పుణ్యం, చెడ్డ పనులు చేస్తే పాపం వస్తుంది అన్న మాట సరికాదు. ధర్మంగా కర్మలు చేస్తే శ్రేయస్సు కలుగుతుంది. అధర్మ ప్రవృత్తితో కర్మలు చేస్తే దుఃఖము కలుగుతుంది అని చెప్పడానికి కారణం ఏమీ లేదు. అందుకని రావణుడు తనకు తోచిన పని చేసాడు. మేమంతా దానికి
సమ్మతించాము. దాని వలన యుద్ధం వచ్చింది. యుద్ధం చెయ్యాలి కానీ జరిగిన దానికి చింతించడం అవివేకము.
ఏదో నువ్వు ఒక్కడివే రాముడిని, లక్ష్మణుడిని, వానర సేనలను అందర్నీ చంపుతాను అని అంటున్నావు. కాని జనస్థానములో ఒంటి చేత్తో 14,000 మంది రాక్షసులను చంపిన రాముని నువ్వు ఎలా చంపగలవు. జనస్థానములో రాముడి చేతిలో నుండి చావు తప్పించుకొన్న రాక్షసులు ప్రస్తుతము లంకలో రాముని వలన భయంతో బతుకుతున్నారు. ఆ సంగతి నీకు తెలియదా! రాముడు నిద్రపోతున్న సింహము అని తెలిసికూడా ఆ సింహము జూలుపట్టుకొని లాగడానికి వెళుతున్నావు. రాముడికి కోపం వస్తే అతని ముందు ఎవరూ నిలువలేరు. కాబట్టి నువ్వు ఒక్కడివే యుద్ధం చేసి రాముని చంపుతాను అనడం సరికాదు. నీవు ఒంటరిగా యుద్ధానికి వెళ్లడానికి వీలులేదు. ప్రస్తుతము మన బలము క్షీణదశలో ఉంది. రాముని బలం మెండుగా ఉంది. ఇటువంటి సమయంలో ఎవరైనా రామునితో యుద్ధానికి వెళతారా! రామునితో సమానమైన బలపరాక్రమములు కలవాడు ముల్లోకములలో లేడు. అట్టి రామునితో నీవు ఒంటరిగా ఎలా యుద్ధంచేయాలని అనుకుంటున్నావు?" అని పలికాడు మహోదరుడు.
తరువాత రావణుని చూచి మహోదరుడు ఇలా అన్నాడు. "లంకేశ్వరా! నీవు సీతను అపహరించి తెచ్చావు. సీత లంకలో నీ ఎదురుగా ఉంది. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు. నీవు తలచుకుంటే సీతను అనుభవించడం క్షణంలో పని. సీతను లొంగదీసుకొనే ఉపాయము ఒకటి చెబుతాను విను. రాముని మీదికి యుద్ధమునకు నేను, కుంభకర్ణుడు, మహోదరుడు, ద్విజిహ్వుడు, సంప్రది, వితర్ధనుడు, ఈ ఐదుగురు వెళుతున్నారు అని లంకానగరంలో ప్రచారం చేయించు. మేము రామలక్ష్మణులను, వానరవీరులను జయిస్తే ఇంక ఏ ఉపాయముతో పని లేదు. ఒక వేళ, రాముడు విజయం సాధిస్తే, మేము మా ఒంటి మీద రామ బాణములతో గాయములు చేసుకొని యుద్ధభూమి నుండి వస్తాము. “మేము రామలక్ష్మణులను భక్షించాము" అని నీకు విన్నవించుకుంటాము. నీవు మాకు తగిన పారితోషికములను బహుమానములను ఇస్తావు. తరువాత రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు యుద్ధములో మరణించారు అని లంకానగరంలో ఘోషణ చేయించు. నీవు మహా సంతోషంతో ఉన్నట్టు నటించు. రాక్షస సేనలకు బహుమానాలు పంచిపెట్టు. అందరూ మద్యపానము చేస్తూ ఆనందిస్తారు.
తరువాత నీవు సీతను ఏకాంతంగా కలుసుకో. రామలక్ష్మణుల మరణ వార్త సీతకు చెప్పు. ఆమెకు ధనమును, రత్నమణిమాణిక్యాదులను ఆశచూపించు. దీనంగా బతిమాలుకో. వినకపోతే భయపెట్టు. చంపుతానని బెదిరించు. రాముడు ఎటూ మరణించాడు కాబట్టి సీత తనకు ఇష్టం లేకపోయినా, వేరు గత్యంతరము లేక నిన్ను వరిస్తుంది. ఎందుకంటే జీవితమంతా సుఖాలలో పెరిగిన సీత, 12 ఏళ్లు కష్టాలను అనుభవించింది. తను సుఖపడాలంటే నీకు లొంగాలని తెలుసుకున్న సీత సులభంగా నీకు లొంగిపోతుంది. ఇదంతా నేను బాగా ఆలోచించి వేసిన ప్రణాళిక. మనము రామునితో యుద్ధము చేయకుండానే సీతను దక్కించు కోవచ్చు. ఒక సారి సీత నీకు లొంగితే, రాముడు యుద్ధం విరమిస్తాడు. వెనక్కుతిరిగి వెళ్లిపోతాడు. మనకు సైన్య నష్టం లేకుండా, యుద్ధము చేయకుండా, రాముని జయించ వచ్చును. నీకు సీత దక్కుతుంది. సీతతో పాటు కీర్తియశస్సు కూడా దక్కుతాయి. నీవు మనసు పడ్డ సీతతో సుఖిస్తావు." అని అన్నాడు మహోదరుడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము అరవై నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment