శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై ఐదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 65)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
అరవై ఐదవ సర్గ
మహోదరుని మాటలు విన్న కుంభకర్ణునికి మిక్కుటంగా కోపం వచ్చింది. మహోదరుని ఒక్కసారిగా విదిలించి కొట్టాడు. తన అన్న రావణుని చూచి ఇలా అన్నాడు. “రాక్షసేంద్రా! నీవు నిశ్చింతగా ఉండు. నేను యుద్ధభూమికి పోయి ఆ రామలక్ష్మణులను చంపి నీ భయాన్ని పోగొడతాను. నావంటి శూరులు నీరులేని మేఘముల వలె ఊరికే గర్జించరు. నేను నా పరాక్రమము యుద్ధభూమిలో చూపిస్తాను కానీ మాటలలో చూపించను. నా వంటి శూరుడు తనను తాను పొగుడుకోడు. తనకు శక్యము కాని పనులను కూడా చేసి చూపిస్తాడు.ఓ మహోదరా! నీ వంటి వారు పలికే మాటలు తమను తాము గొప్పవారము అనుకొనే రాజులు వింటారు కానీ రావణుడు కాదు. మీరు పిరికి పందలు. మీకు యుద్ధము అంటే భయము. కుయుక్తులు, కుతంత్రములతో పని కానిద్దామంటారు. రాజు దగ్గర ప్రగల్భాలు పలుకుతూ రాజు మెప్పు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రాజును అపకీర్తిపాలు చేస్తుంటారు. రావణుని హితం కోరేవారు, రావణునికి మంచి సలహాలు చెప్పేవారు ఈ లంకలో లేనట్టుంది. పాపము రావణుడు ఒంటరివాడయ్యాడు. ఇప్పటి దాకా మీరు చేసిన తప్పులను నేను సరిదిద్దుతాను. ఇప్పుడే యుద్ధమునకు బయలుదేరుతున్నాను." అని అన్నాడు కుంభకర్ణుడు.
కుంభకర్ణుని మాటలు విని రావణుడు నవ్వాడు.
“సహోదరా కుంభకర్ణా! నీవు చెప్పినది సత్యము. ఈ మహోదరుడు రామునికి భయపడుతున్నాడు. అందుకే రామునితో యుద్ధమునకు ఇష్టపడుటలేదు. రామునితో యుద్ధము చేయుటకు నీవే సమర్థుడివి. శత్రువులను సంహరించి విజయుడవై తిరిగిరా! నాకు వేరు గత్యంతరము లేకనే కదా నిన్ను అర్ధాంతరంగా నిద్రలేపాను. ఆ రాజకుమారులను, వానరులను తనివితీరా భక్షించు. నీవు యుద్ధము చేయనక్కరలేదు. యుద్ధభూమిలో నిన్ను చూడగానే వానరులంతా పారిపోతారు. రామలక్ష్మణులకు గుండెలు పగులుతాయి. సునాయాసంగా యుద్ధము ముగిసిపోతుంది. నీకు విజయం సిద్ధిస్తుంది." అని పలికాడు రావణుడు.
తన అన్న రావణుడు పలికిన పలుకులకు కుంభకర్ణుడు మహదానందభరితుడయ్యాడు. యుద్ధమునకు పోవడానికి సన్నద్ధుడయ్యాడు. ఇనుముతో చేయబడిన తన ఆయుధము అయిన శూలమును తీసుకున్నాడు. రావణునితో ఇలా అన్నాడు. “రాక్షసేంద్రా! నాకు ఎవరి సాయమూ అక్కరలేదు. ఎలాంటి సైన్యసాయమూ అవసరము లేదు. నేను ఒంటరిగానే యుద్ధము చేయగలను. వానరులనందరినీ భక్షిస్తాను." అని అన్నాడు.
దానికి రావణుడు ఇలా అన్నాడు. "అలాకాదు. యుద్ధమునకు పోవడానికి సైనిక బలము అత్యావశ్యకము. నీ వెంట శూలములు, ముద్గరలు ధరించిన సైనికులు వస్తారు. వారు వానరులను కొరికి చంపుతారు. నీకు సాయంగా ఉంటారు. కాబట్టి నీవు రాక్షస సైన్యముతో కలిసి వెళ్లి రామలక్ష్మణులతో యుద్ధము చెయ్యి” అని అన్నాడు రావణుడు.
తరువాత రావణుడు తన ఆసనము నుండి లేచాడు. మణులతో తయారు చేయబడిన ఒక కంకణమును కుంభకర్ణుని చేతికి కట్టాడు. కుంభకర్ణుడికి సకల అలంకారములు చేయించాడు. నిలబడి ఉన్న కుంభకర్ణుడు పాలసముద్రములో నిలబెట్టబడిన మంథర పర్వతము మాదిరి ఉన్నాడు. సర్వాలంకార భూషితుడైన కుంభకర్ణుడు అన్న రావణునికి ప్రదక్షిణము చేసి నమస్కరించాడు. రావణుడు కుంభకర్ణుని విజయోస్తు అని దీవించాడు. రణదుందుభులు, భేరీలు మోగుతుండగా, శంఖధ్వానములు మిన్నుముట్టగా, గజబలము, ఆశ్వికబలము, కాల్బలములతో కుంభకర్ణుడు యుద్ధమునకు బయలుదేరాడు.
చేత శూలము ధరించిన కుంభకర్ణుడు సేనలకు ముందు నడుస్తున్నాడు. ఆ రాక్షసుల చేతుల్లో శూలములు, కత్తులు, గండ్ర గొడ్డళ్లు, పరిఘలు, గదలు, ముసలములు, పెద్ద పెద్ద తాటి చెట్లు ఆయుధములుగా ఉన్నాయి. కుంభకర్ణుడు చూచేవారికి భయం కలిగించే ఆకారంలో ప్రకాశిస్తున్నాడు. కుంభకర్ణుని శరీరము చుట్టుకొలత నూరు ధనుస్సుల పొడుగు అనగా రెండువందల గజాల పొడుగు, ఆరువందల ధనుస్సుల ఎత్తు, 1200 గజాల ఎత్తు, కలిగి మహాపర్వతము మాదిరి ఉంది. అటువంటి భయంకరాకారము కలిగిన కుంభకర్ణుడు రాక్షసులతో ఇలా అన్నాడు.
“ఇప్పుడు మనము వానరులతో యుద్ధం చేయబోతున్నాము. నేను వానరులను చిన్న చిన్న భాగములుగా చేసి కాల్చి తింటాను. ఈ వానరులు అడవులలో, ఉద్యానవనములతో తిరిగేవారు. నిజానికి వారు నాకు ఏ అపకారమూ చేయలేదు. ఆ వానరులను చంపడం వృధా. దీని కంతటికీ రాముడు మూలము. కాబట్టి ముందు రాముని చంపుతాను. రాముని చంపితే అందరినీ చంపినట్టే. అందుకని మన దృష్టి అంతా రాముని మీద ఉండాలి." అని పలికాడు కుంభకర్ణుడు. ఆమాటలకు రాక్షసులు పెద్దగా హర్షధ్వానాలు చేసారు.
కుంభకర్ణుడు యుద్ధమునకు బయలుదేరగానే, ఇదివరకు మాదిరిగానే ఎన్నో దుశ్శకునములు గోచరించాయి. ఉల్కాపాతం జరిగింది. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. తీవ్రమైన గాలులు వీచాయి. పిడుగులు పడ్డాయి. నక్కలు వికృతంగా అరుస్తున్నాయి. ఆకాశంలో పక్షులు అపసవ్యంగా తిరుగుతున్నాయి. కుంభకర్ణుని శూలము మీద ఒక గద్ద వాలింది. అతని ఎడమ కన్ను ఎడమ భుజము అదిరింది. సూర్యుడు మబ్బులచాటుకు పోయాడు. అమిత బలపరాక్రమములు కలిగిన కుంభకర్ణుడు ఈ దుర్నిమిత్తము లను ఏ మాతమూ లెక్క చెయ్యలేదు.
పెద్ద పర్వతము మాదిరి నడుస్తున్న కుంభకర్ణుడు లంకా నగర ప్రాకారమును, చిన్న బండరాయిని దాటినట్టు తన పాదములతో దాటాడు. ప్రాకారము వెలుపల మోహరించి ఉన్న వానరసైన్యము ముందు నిలబడ్డాడు. పెద్ద పర్వతము తమ ముందు నిలబడి ఉందా అని భ్రమపడ్డ వానరులు కుంభకర్ణుని చూడగానే దిక్కులు పట్టిపారిపోయారు. తనను చూచి పారిపోతున్న వానరులను చూచి కుంభకర్ణుడు పెద్దగా వికటాట్టహాసము చేసాడు. మేఘము ఉరిమినట్టు గర్జించాడు. కుంభకర్ణుని వికటాట్టహాసము, గర్జన వల్ల పుట్టిన విపరీతమైన ధ్వనికి వానరులు ఎక్కడి వాళ్లు అక్కడ కూలిపోయారు. చేత శూలము ధరించిన కుంభకర్ణుడు గద ధరించిన యమధర్మరాజు మాదిరి యుద్ధభూమిలో నిలబడ్డాడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము అరవై ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment