శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై ఆరవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 66)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
అరవై ఆరవ సర్గ
కుంభకర్ణుని చూచి పారిపోతున్న వానరులలో వానర ప్రముఖులైన నలుడు, నీలుడు, గవాక్షుడు, కుముదుడు మొదలగువారు ఉన్నారు. ఆ ప్రకారంగా పారిపోతున్న వానర ప్రముఖులను చూచి అంగదుడు ఇలా అన్నాడు.“ఓ వానరవీరులారా! ఒక రాక్షసుని చూచి ఇలా పారిపోవడం ధర్మమా! మీరు ఎంతటి ఉన్నత కుటుంబంలో జన్మించారు. ఒక నీచ రాక్షసునికి భయపడు తున్నారా! అయినా పారిపోయి ఎక్కడికి పోతారు! ఎంత దూరం పోతారు! వెనక్కురండి. ఇతడు రాక్షసుడు కాడు. మనలను భయపెట్టడానికి రాక్షసులు సృష్టించిన పెద్ద విగ్రహము. రండి. మనమందరమూ కలిసి ఈ బొమ్మను తునాతునకలు చేద్దాము.” అని ఎలుగెత్తి అరిచాడు.
అంగదుని మాటలకు వానరులకు ధైర్యము వచ్చింది. పారిపోయిన వాళ్లు తిరిగి వచ్చారు. చేతికి అందిన వృక్షములను, పర్వత శిఖరములను పట్టుకొని యుద్ధమునకు సిద్ధం అయ్యారు. ఆ కుంభకర్ణుని చుట్టూ చేరి వాడిని వృక్షములతో పర్వతశిఖరములతో కొట్టారు. ఆ వానరులు కొట్టే దెబ్బలు కుంభకర్ణునికి చీమకుట్టినట్టయినా లేదు. కుంభకర్ణుని మీదకు విసిరిన వృక్షములు, పర్వతశిఖరములు కుంభకర్ణుని శరీరమునకు తగిలి తునాతునకలై పోతున్నాయి. కుంభకర్ణుడు కోపించి వానరసేనలను తన చేతులతో నలిపేస్తున్నాడు. యుద్ధభూమి అంతా వానరుల శవాలతో నిండిపోయింది. కుంభకర్ణుని చేతిలో పడకుండా తప్పించుకున్న వానరులు కొంతమంది పారిపోయారు. కొంతమంది సముద్రంలో దూకారు. మరి కొంత మంది ఆకాశంలోకి ఎగిరిపోయారు. దొరికిన వారిని దొరికినట్టు చంపుతున్నాడు కుంభకర్ణుడు.
కుంభకర్ణుని ధాటికి తట్టుకోలేక భల్లూకములు కొన్ని చెట్టు ఎక్కాయి. కొన్ని పర్వతముల మీదికి పారిపోయాయి. మరి కొన్ని కొండగుహలలో తలదాచుకున్నాయి. మరి కొంత మంది వానరులు, భల్లూకములు చచ్చినట్టు నేలమీద కదలకుండా పడుకున్నారు. ఇలా ఎవరి దోవన వారు పారిపోతున్న వానరులను చూచి అంగదుడు బిగ్గరగా అరుస్తున్నాడు.
“ఓ వానరవీరులారా! భయపడకండి పారిపోకండి. యుద్ధము చేయండి. ఎక్కడికి పోయి ప్రాణాలు రక్షించుకుంటారు. వెనక్కురండి. యుద్ధమునుండి పారిపోయి వచ్చిన మిమ్మల్ని చూచి మీ భార్యలు పరిహాసం చేస్తారు. ఆ అవమానం కంటే యుద్ధంలో చావడం మేలు కదా! మనమందరమూ ఉత్తమ కులంలో పుట్టాము. సాధారణ వానరుల వలె పారిపోవడం భావ్యమా! అది గౌరవ ప్రతిష్ఠలను తెచ్చిపెడుతుందా! యుద్ధానికి బయలుదేరేముందు మీరు అన్న మాటలు పలికిన వీరాలాపాలు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. ఇప్పుడు ఆ వీరాలాపాలు అన్నీ ఎక్కడికి పోయాయి. యుద్ధము నుండి పారిపోయి, పదిమంది చేత ఛీ అనిపించుకోడం కన్నా, యుద్ధంలో మరణించి వీరస్వర్గం పొందడం మేలు కదా!
ఓ వానరవీరులారా! మనకు ఆయుర్దాయము లేకపోతే ఎక్కడ ఉన్నా చస్తాము. ఆయుర్దాయము ఉంటే యుద్ధములో విజయం సాధిస్తాము. ఒక్కమాట! మనము యుద్ధంలో గెలిస్తే కీర్తిపొందుతాము. మరణిస్తే వీరస్వర్గము పొందుతాము. కాని పారిపోతే దిక్కులేని చావు చస్తాము. కాబట్టి పారి పోకండి. వెనుకకు రండి. రాముడి పరాక్రమము ముందు ఈ రాక్షసుడు ఎంత! క్షణంలో నాశనమై పోతాడు. ఇప్పటి దాకా మనము ఎంతో మంది రాక్షస వీరులను జయించాము. ఈ ఒక్కడికి భయపడి పారిపోతే మనము ఇప్పటిదాకా గడించిన కీర్తి అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. రండి. వెనుదిరగండి. యుద్ధము చేయండి" అని అరుస్తున్నాడు కానీ ఎవరూ అతని అరుపులు పట్టించుకోవడం లేదు.
కాని కొంతమంది వానర వీరులు అంగదునితో ఇలా అన్నాడు. “అంగదా! ఇప్పటిదాకా చేసిన యుద్ధము చాలు. మాకు ఈ యుద్ధము అక్కరలేదు. మా ప్రాణాలే మాకు తీపి. నీవు కావలిస్తే ఆ భయంకరాకారుడితో యుద్ధం చెయ్యి" అని పలికి పారిపోయారు.
కాని అంగదుడు తన ప్రయత్నము మానుకోలేదు. పోయిన వారు పోగా మిగిలిన వారిని బతిమాలి వెనుకకు తీసుకొని వస్తున్నాడు. వెనకకు వచ్చినవారంతా అంగదుని ఆజ్ఞల కొరకు ఎదురు చూస్తున్నారు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము అరవై ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment