శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై ఏడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 67)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
అరవై ఏడవ సర్గ
పారిపోయి తిరిగివచ్చిన వానర వీరులు ప్రాణాలకు తెగించి యుద్ధంచేస్తున్నారు. వారు పెద్ద పెద్ద వృక్షములను, గండ శిలలను, పర్వత శిఖరములను తీసుకొని కుంభకర్ణుని మీదికి విసురుతున్నారు. కుంభకర్ణుడు తన గదను అటు ఇటు ఊపుతూ వానరులను చెదరగొడుతున్నాడు. ఆ చెదర గొట్టడంలో వందలు వేలు వానరులు దూరంగా విసిరివేయబడుతున్నారు. కుంభ కర్ణుడు వందల కొద్దీ వానరులను రెండు చేతులతో పట్టుకొని నోట్లో కుక్కుకొని తింటున్నాడు. అయినా వానరులు కుంభకర్ణుని మీదికి వృక్షములు, రాళ్లు విసురుతూ యుద్ధం చేస్తున్నారు.ఇంతలో ద్వివిదుడు ఒక పర్వత శిఖరమును పెకలించి చేతపట్టుకొని కుంభకర్ణుని వైపుకు పరుగెత్తాడు. ద్వివిదుడు ఆ పర్వతమును తీసుకొని పైకి ఎగిరి దానిని కుంభకర్ణుని మీదికి విసిరాడు. ఆ పర్వత శిఖరము కుంభకర్ణుని మీద పడకుండా రాక్షససేనల మీద పడింది. ఆ పర్వతము కిందపడి వందలకొద్దీ రాక్షసులు మరణించారు. అది చూచిన రాక్షస సైనికులు వానరుల మీద పడి బాణములతో వానరుల శిరస్సులను బంతుల మాదిరి ఎగురగొడుతున్నారు. వానరులు కూడా పెద్ద పెద్దవృక్షములను బండరాళ్లను తీసుకొని రాక్షసులను చంపుతున్నారు.
హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి పైనుండి కుంభకర్ణుని మీదికి బండరాళ్లను, వృక్షములను విసురుతున్నాడు. కుంభకర్ణుడు తన శూలముతో వాటిని అటు ఇటు చెదరగొడుతున్నాడు. హనుమంతుడు పెద్ద పర్వత శిఖరమును చేతబట్టుకొని కుంభకర్ణుని ముందు నిలబడ్డాడు. తన శరీరాన్ని కుంభకర్ణునితో సమానంగా పెంచాడు. ఆ పర్వతశిఖరంతో కుంభకర్ణుని శిరస్సు బద్దలు కొట్టాడు. కుంభకర్ణుని శరీరం అంతా రక్తసిక్తము అయింది. దానికి కోపించిన కుంభకర్ణుడు తన శూలముతో హనుమంతుని గుండెల మీద కొట్టాడు. ఆ దెబ్బకు హనుమంతుని ముఖం నుండి రక్తం స్రవించింది. హనుమంతుడు పెద్దగా అరుస్తున్నాడు. రక్తం కక్కుతున్న హనుమంతుని చూడగానే రాక్షసులు ఆనందంతో కేరింతలు కొట్టారు. హనుమంతుని చూచిన మిగిలిన వానర సేనలు భయంతో పారిపోయారు.
ఇది చూచిన నీలుడు వానర సైన్యమునకు ధైర్యము చెప్పి వారిని వెనక్కు మళ్లించాడు. కుంభకర్ణుని మీదికి ఒక పెద్ద పర్వత శిఖరమును విసిరాడు. అది చూచిన కుంభకర్ణుడు పిడికిలి బిగించి ఆ పర్వత శిఖరమును గట్టిగా గుద్దాడు. ఆ గుద్దుకు పర్వత శిఖరము బద్దలైపోయింది. ఇంతలో ఋషభుడు, శరభుడు, నీలుడు, గవాక్షుడు, గంధమాధనుడు ఒక్కుమ్మడిగా కుంభకర్ణుని మీదికి వెళ్లారు. వారందరూ వృక్షములతోనూ. పర్వతశిఖరములతోనూ కుంభకర్ణుని నలువైపులా మోదారు. ఆ దెబ్బలకు కుంభకర్ణుడు చలించలేదు. ఋషభుడిని కుంభకర్ణుడు గట్టిగా పట్టుకున్నాడు. తన చేతులతో నలిపేసాడు. ఋషభుడు రక్తం కక్కుకుంటూ నేలమీద పడ్డాడు. కుంభకర్ణుడు కోపించి శరభుడిని తన పిడికిలితోనూ, నీలుడిని తన మోకాలితోనూ, గవాక్షుడిని తన అరిచేతితోనూ, గంధమాధనుడిని కాలితోనూ తన్నాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ వానరవీరులు కింద పడి గిలా గిలా కొట్టుకున్నారు.
ఇంక తెగించిన వానరులు వేల కొద్దీ కుంభకర్ణుని మీదికి పరుగెత్తారు. వారందరూ అతని చేతికి కాలికి దొరకకుండా కుంభకర్ణుని మీదికి ఎక్కారు. అతని శరీరం అంతా గోళ్లతోరక్కారు. కొరికారు. పిడికిళ్లు బిగించి కొట్టారు. కుంభకర్ణుడి ఒంటినిండా వానరులు పాకుతున్నారు. కుంభకర్ణుడు ఆ వానరులను చేతికి దొరికిన వారిని దొరికినట్టు నోట్లో పెట్టుకొని తింటున్నాడు. కుంభకర్ణుని నోట్లోకి పోయిన వానరులు కుంభకర్ణుని ముక్కు, చెవి రంద్రములలోనుండి బయటకు వస్తున్నారు. కుంభకర్ణుని కాళ్ల కిందపడి చాలా మంది వానరులు మరణిస్తున్నారు.
కుంభకర్ణుడు ఎంతకూ లొంగడం లేదని వానరులు అందరూ రాముని వద్దకు పరుగెత్తారు. ఇంతలో అంగదుడు ఒక పెద్ద పర్వత శిఖరమును తీసుకొని కుంభకర్ణుని తలమీద మోదాడు. ఆ దెబ్బతిన్న కుంభకర్ణుడు కోపంతో అంగదుని వైపు పరుగెత్తాడు. తన శూలమును అంగదుని మీదికి విసిరాడు. కాని అంగదుడు పక్కకు ఎగిరి ఆ శూలమును తప్పించుకున్నాడు. అంగదుడు పైకి ఎగిరి కుంభకర్ణుని వక్షస్థలము మీద బలంగా చరిచాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుడు కళ్లు బైర్లు కమ్మాయి. తూలిపోయాడు. అంతలోనే తేరుకున్న కుంభకర్ణుడు పిడికిలి బిగించి అంగదుని గుద్దాడు. ఆ దెబ్బకు అంగదుడు నేల మీద పడి మూర్ఛపోయాడు
.
తరువాత కుంభకర్ణుడు తన శూలము తీసుకొని సుగ్రీవుడు ఉన్న వైపుకు వెళ్లాడు. కుంభకర్ణుడు తన వైపుకు రావడం చూచిన సుగ్రీవుడు ఒక పెద్ద పర్వతమును చేత్తో పట్టుకొని పైకి ఎగిరాడు. కుంభకర్ణుని వైపుకు వేగంగా వెళ్లాడు. తన వైపు వస్తున్న సుగ్రీవుని చూచి కుంభకర్ణుడు రొమ్మువిరుచుకొని నిలబడ్డాడు. అప్పుడు కుంభకర్ణుని చూచి సుగ్రీవుడు ఇలా అన్నాడు.
"ఓ కుంభకర్ణా! సాధారణ వానరులను ఎందుకు చంపుతావు. అది ఒక కీర్తి అనుకుంటున్నావా! నేను నీ మీదికి ఈ పర్వతమును విసురుతున్నాను. ఈ దెబ్బకాచుకో!" అన్నాడు సుగ్రీవుడు.
ఆ మాటలు విన్న కుంభకర్ణుడు ఇలా అన్నాడు. "ఓ సుగ్రీవా! నీవు బ్రహ్మదేవుని మనుమడివి. ఋక్షరజస్సు కుమారుడివి. ఊరికే ఎందుకు అరుస్తావు. నీకు చేతనయింది చెయ్యి." అన్నాడు కుంభకర్ణుడు.
అప్పుడు సుగ్రీవుడు తన చేతిలో ఉన్న పర్వతమును కుంభకర్ణుని వక్షస్థలము మీదికి విసిరాడు. ఆ పర్వతము కుంభకర్ణుని గుండెలకు తగిలేలా నుగ్గు నుగ్గు అయిపోయింది. అది చూచి రాక్షసులు పెద్దగా కేకలు పెట్టారు. వానరులు దిగులుతో దిగాలు పడ్డారు. కుంభకర్ణుడు తన శూలమును సుగ్రీవుని మీదికి బలంగా విసిరాడు. ఇంతలో సుగ్రీవుడు పైకి ఎగిరి ఆ శూలమును చేత్తో పట్టుకొని రెండుగా విరిచాడు. అది చూచి వానరులు హర్షధ్వానాలు చేసారు. తన చేతిలో ఉన్న శూలం విరిగిపోవడంతో కుంభకర్ణుడు కలవరపడ్డాడు. కుంభకర్ణుడు ఒక పర్వత శిఖరమును పెకలించి సుగ్రీవుని మీదికి విసిరాడు. ఆ దెబ్బకు సుగ్రీవుడు కిందపడి మూర్ఛపోయాడు. రాక్షసులు పెద్దగా కేకలు పెట్టి కుంభకర్ణుని పొగిడారు.
కుంభకర్ణుడు సుగ్రీవుడిని పైకి ఎత్తుకున్నాడు. అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. “వీడిని చంపితే వానర సైన్యము అంతా పారిపోతుంది.” అని అనుకున్నాడు కుంభకర్ణుడు. సుగ్రీవుడిని కుంభకర్ణుడు మోసుకొని పోవడం, అది చూచి వానర సేనలు పారిపోవడం, చూచాడు హనుమంతుడు. ఇలా ఆలోచించాడు.
“అయ్యో! సుగ్రీవుని కుంభకర్ణుడు తీసుకొని పోతున్నాడు. వానరులు పారిపోతున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి. నా శరీరాన్ని పెంచి కుంభకర్ణుని శరీరాన్ని పిడికిళ్లతో గుద్ది చంపేస్తాను. సుగ్రీవుడిని విడిపిస్తాను. అప్పుడు వానరులు అంతా సంతోషిస్తారు. కుంభకర్ణుడు కొట్టిన దెబ్బకు సుగ్రీవుడు స్పృహ కోల్పోయాడు. లేకపోతే సుగ్రీవుడు దేవతలు, దానవులు, గంధర్వులు పట్టుకున్నా విడిపించుకోగల సమర్ధుడు. సుగ్రీవునికి స్పృహ వస్తే చాలు, తనంత తాను కుంభకర్ణుని నుండి విడిపించుకోగల సమర్ధుడు. ఇప్పుడు నేను సుగ్రీవుని విడిపిస్తే అతనికి అపకీర్తి తెచ్చినవాడిని అవుతాను. నేను విడిపించడం సుగ్రీవునికి రుచించకపోవచ్చు. అందుకని సుగ్రీవునికి స్పృహ వచ్చేవరకూ వేచిఉండక తప్పదు. ఈ లోపల పారిపోతున్న వానరసేనలకు ధైర్యం చెప్పడం అవసరం.” అని అనుకున్నాడు హనుమంతుడు.
వెంటనే హనుమంతుడు పారిపోతున్న వానర సేనలకు ధైర్యము చెప్పి వెనుకకు మళ్లించాడు. ఈ లోగా కుంభకర్ణుడు సుగ్రీవుని తీసుకొని లంకానగరంలోకి వెళ్లిపోయాడు. సుగ్రీవుని బందీగా తీసుకొని వచ్చిన కుంభకర్ణుని మీద లంకా నగర వాసులు పుష్పవర్షము కురిపించారు. చల్లగా పూలు, గంధము నీరు తన మీద పడటంతో సుగ్రీవునికి మెల్లగా స్పృహ వచ్చింది. తాను కుంభకర్ణుని బుజంమీద ఉన్నట్టు తెలుసుకున్నాడు సుగ్రీవుడు. ఇలా అనుకున్నాడు.
“నన్ను కుంభకర్ణుడు బందీగా పట్టుకున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి." అని క్షణకాలం ఆలోచించాడు. ఆలస్యం చేయకుండా తన గోళ్లతోనూ, దంతాలతోనూ కుంభకర్ణుని చెవులను కొరికాడు. పీకాడు. ముక్కును శరీరాన్ని చీల్చాడు. ఆ బాధ తట్టుకోలేక కుంభకర్ణుడు సుగ్రీవుని నేలకేసి కొట్టాడు. వెంటనే సుగ్రీవుడు బంతి మాదిరి ఆకాశంలోకి ఎగిరాడు. లంకా నగరం అవతల సేనల మధ్యలో ఉన్న రాముని దగ్గర పడ్డాడు.
చెవులూ ముక్కు కొరకబడిన కుంభకర్ణుని శరీరం రక్తసిక్తం అయింది. మరలా యుద్ధరంగానికి పరుగెత్తాడు కుంభకర్ణుడు. తన చేతిలో ఒక ముద్గరను తీసుకున్నాడు. మరలా వానరులను పట్టుకొని తినడం మొదలెట్టాడు కుంభకర్ణుడు. వారూ వీరూ అని చూడటం లేదు. దొరికిన వాళ్లను దొరికినట్టు తింటున్నాడు. వానరులను, ఎలుగుబంట్లను, రాక్షసులను కూడా తినేస్తున్నాడు. ఒక పక్కనుండి వానరులు పర్వతశిఖరములతో, వృక్షములతో కొడుతూ ఉంటే మరొక పక్క కుంభకర్ణుడు వానరులను భక్షిస్తూ ఉన్నాడు.
వానరులందరూ గబ గబా రాముని వద్దకు వెళ్లారు. తమను కుంభకర్ణుని బారి నుండి కాపాడమని రాముని శరణువేడారు. ఇదేమీ పట్టని కుంభకర్ణుడు తన ఆకలి తీరేట్టు వానరులను తింటూ ఉన్నాడు. ఒక్కో పట్టుకు పది, ఇరవై, యాభై మంది వానరులను పట్టుకొని నోట్లో కుక్కుకుంటున్నాడు. కుంభకర్ణుని నోటి నుండి దంతముల నుండి వానరుల పేగులు వేలాడుతున్నాయి. అతని శరీరం అంతా వానరుల రక్తంతో తడిసిపోయింది. అది చూచిన లక్ష్మణుడు కుంభకర్ణునితో యుద్ధానికి తలపడ్డాడు. మొదటగా ఏడు బాణములను కుంభకర్ణుని శరీరంలో నాటాడు. ఇంకా పెక్కు బాణములను కుంభకర్ణుని మీద ప్రయోగించాడు. కాని ఆ బాణములు కుంభకర్ణుని ఏమీ చేయలేకపోయాయి. వాటిని చేతితో విదిలించుకున్నాడు కుంభకర్ణుడు. లక్ష్మణునికి కోపం వచ్చింది. కుంభకర్ణుని శరీరం అంతా తన బాణములను నాటాడు. కుంభకర్ణుని శరీరం అంతా బాణములతో నిండిపోయింది.
అది చూచి కుంభకర్ణుడు లక్ష్మణుని తో ఇలా అన్నాడు. “కుమారా! నీ ధైర్యానికి పరాక్రమానికి నాకు చాలా సంతోషంగా ఉంది. యముడు కూడా నా ఎదుట నిలబడ్డానికి భయపడతాడు.
అటువంటిది నువ్వు నా ఎదురుగా ధైర్యం గా నిలబడి నా మీద బాణవర్షము కురిపించావు. నా ఎదుట ధైర్యంగా నిలబడ్డందుకే నిన్ను గౌరవించాలి. ఇంక యుద్ధం కూడా చేసినందుకు చెప్పపనిలేదు. ఇప్పటి దాకా నాతో చేసిన యుద్ధము చాలు. ఇంక నీవు రాముని వద్దకు వెళ్లు. నీ వంటి ధైర్యవంతుడిని, పరాక్రమవంతుడిని చంపడం నాకు ఇష్టం లేదు. నా గురి రాముని మీదనే. రాముని చంపితే అందరినీ చంపినట్టే కదా! ముందు నేను రాముణ్ణి చంపుతాను. తరువాత మా సైనికులు మిగిలిన వాళ్లను చంపుతారు." అని అన్నాడు.
కుంభకర్ణుడు తనను తాను పొగుడుకుంటూ పలికిన మాటలకు లక్ష్మణుడు బిగ్గరగా నవ్వాడు. “ఓ రాక్షస వీరుడా! ఇది యుద్ధ భూమి. పౌరుషము పరాక్రమము చూపించవలసిన సమయము. నీ ముందు ఇంద్రుడు మొదలగు దేవతలు నిలువలేరని పలికావు. అది నిజమే కావచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా నీ పరాక్రమమును కళ్లారా చూచాము. కాని నీ పరాక్రమము, పౌరుషము పర్వతము మాదిరి నిలబడి ఉన్న రాముని ముందు గడ్డిపోచతో సమానము. నీ వీరత్వము రాముని మీద చూపించు.” అని అన్నాడు లక్ష్మణుడు.
ఆ మాటలకు కోపించిన కుంభకర్ణుడు లక్ష్మణుని వదిలి రాముని వైపుకు దూసుకు వెళ్లాడు. తన వంక వస్తున్న కుంభకర్ణుని మీద రాముడు రౌదాస్త్ర అస్త్రమును ప్రయోగించాడు. అది కుంభకర్ణుని వక్షస్థలమును తాకింది. ఆ దెబ్బ తిన్న కుంభకర్ణుని ముఖము నుండి అగ్ని గోళములు వెలువడ్డాయి. రౌద్రాస్త్రము దెబ్బతిన్న కుంభకర్ణుడు పెద్దగా అరుస్తూ రాముని వంకకు పరుగెత్తాడు. రాముడు మరలా వాడి అయిన బాణములను కుంభకర్ణుని వక్షస్థలమునకు గురి చూచి కొట్టాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుని చేతిలోని గదజారిపోయింది. రాముడు కుంభకర్ణుని మీద ఎడతెరిపి లేకుండా బాణవర్షము కురిపిస్తున్నాడు. కుంభకర్ణుని శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. సెలయేరు మాదిరి రక్తం ప్రవహిస్తూ ఉంది. అయినా కుంభకర్ణుడు చేతి కందిన వానరులను, భల్లూకములను తినడం మానలేదు.
కుంభకర్ణుడు ఒక పర్వత శిఖరమును పెకలించి రాముని మీదికి విసిరాడు. రాముడు ఏడు బాణములతో ఆ పర్వతశిఖరమును ఖండించాడు. ఆ శిఖరము కిందపడి రెండు వందల మంది వానరులు చనిపోయారు. అప్పుడు లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు. “రామా! ఇతడికి వానరులు ఎవరో రాక్షసులు ఎవరో తెలియడం లేదు. రాక్షసులను కూడా భక్షిస్తున్నాడు. మన వానరులు అందరూ ఈ కుంభకర్ణుని మీదికి అన్ని వైపుల నుండీ ఎక్కుతారు. మన వానర సేనానాయకులు వీడి చుట్టు చేరి ఇతడికి దిక్కుతోచకుండా చేస్తారు. వానరుల బరువుకు వీడు నిలబడలేక నేల మీద పడిపోతాడు. అప్పుడు వీడు మన వానరులను చంపలేడు." అని అన్నాడు.
ఆ మాటలు విన్న వానరులు సంతోషంతో గంతులు వేసారు. అందరూ అన్ని వైపుల నుండి కుంభకర్ణుని చుట్టు ముట్టి వాడికి మీదికి ఎక్కారు. వాడి శరీరం అంతా వానరులతో నిండి పోయింది. కుంభకర్ణుడు తన మీదకు ఎక్కిన వానరులను చీమలు దులిపినట్టు దులిపేసాడు.
ఈ ఉపాయం కూడా పనిచేయకపోవడంతో రాముడు మరలా తన ధనుస్సును తీసుకున్నాడు. లక్ష్మణుడు వెంట రాగా కుంభకర్ణుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు. వానర వీరులు రామలక్ష్మణులను అనుసరించారు. కుంభకర్ణుని చుట్టూ రాక్షసులు వలయంలా రక్షణ కవచంలా నిలబడ్డారు. వారందరూ వానరులను తరుముతున్నారు. మధ్యలో ఉన్న కుంభకర్ణుడు వానరులను భక్షిస్తూ, తన నాలుకతో పెదాలకు అంటుకున్న రక్తాన్ని నాక్కుంటున్నాడు. రాముడు కుంభకర్ణుని సమీపించి ధనుష్టంకారము చేసాడు. ఆ ధ్వని విన్న కుంభకర్ణుడు తలతిప్పి రాముని వంక చూచాడు. రాముని వైపుకు నడిచాడు.
అప్పుడు రాముడు కుంభకర్ణుని చూచి ఇలా అన్నాడు. “ఓ రాక్షస వీరుడా! నాతో యుద్ధానికిరా. చావబోతున్నానని దిగులుపడకు. నేను ధనుస్సు పట్టుకొని నీ ఎదుట నిలబడ్డాను. నిన్నేకాదు నీ రాక్షస వంశమును పూర్తిగా నాశనం చేస్తాను. ఇంకొద్దిసేపట్లో నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి." అని అన్నాడు రాముడు.
కుంభకర్ణుడు రాముని తేరిపార చూచాడు. అతని వైపు అడుగులు వేసాడు. పెద్దగా వికాటాట్టహాసం చేసాడు. రామునితో ఇలా అన్నాడు. “నువ్వేనా రాముడివి. ఓ రామా! నేను విరాధుడిని,
కబంధుడిని, ఖరుడిని, మారీచుడిని, వాలిని కాను. నన్ను వాళ్ల మాదిరి అనుకోకు. నేను కుంభకర్ణుడను. నీ చేతిలో ధనుస్సు ఉంటే నాచేతిలో ముద్గర ఉంది. దీనితో నేను దేవతలను, దానవులను జయించాను. నాముక్కు చెవులు మీ వానరులు తినేసారు. కాని నాకు ఏ బాధా లేదు. నీకు పరాక్రమము ఉంటే నా శరీరం అంతా కొట్టు. నీ బలపరాక్రమములను చూచిన తరువాత నిన్ను భక్షిస్తాను.” అని గర్వంగా పలికాడు కుంభకర్ణుడు.
రాముడు మారు మాట్లాడకుండా కుంభకర్ణుని మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు. కాని రాముని బాణములు కుంభకర్ణునికి ఏమీ బాధ కలిగించలేదు. కుంభకర్ణుడు తన ముద్గరను వేగంగా తిప్పుతూ ఆ బాణములను మధ్యలోనే తునాతునకలు చేస్తున్నాడు. ఒక పక్క రాముని బాణములను అడ్డుకుంటూ మరొక పక్క ముద్గరతో వానరులను తరుముతున్నాడు కుంభకర్ణుడు. రాముడు వెంటనే వాయవ్యాస్త్రమును సంధించాడు. ముద్గర ఉన్న కుంభకర్ణుని చేతిని భుజము దగ్గర ఖండించాడు. కుంభకర్ణుని చేయి ముద్గరతో సహా ఎగిరి అవతల పడింది. కుంభకర్ణుడు పెద్దగా కేకపెట్టాడు. ఎగిరి పడ్డ కుంభకర్ణుని చేతి కిందపడి వందలకొద్దీ వానరులు మరణించారు. మిగిలిన వానరులు పక్కలకు పరుగెత్తి రాముడు, కుంభకర్ణుని యుద్ధమును ఆసక్తిగా చూస్తున్నారు.
ఒక చేతిని పోగొట్టుకున్న కుంభకర్ణుడు రెండవ చేత్తో ఒక వృక్షమును పెకలించి, దానిని చేతబట్టుకొని, రాముని మీదికి పరుగెత్తాడు. రాముడు ఇంద్ర అస్త్రమును ప్రయోగించి కుంభకర్ణుని రెండవ చేతిని వృక్షముతో సహా ఖండించాడు. కుంభకర్ణుడి చేయి భుజము దాకా తెగి కిందపడింది. రెండు చేతులు లేకపోయినా, కుంభకర్ణుడు రంకెలు వేస్తూ వానర సైన్యము మీదికి పరుగెడు తున్నాడు. రాముడు రెండు అర్ధచంద్రబాణములతో కుంభ కర్ణుని రెండు కాళ్లు ఖండించాడు. మొదలు నరికిన వృక్షము వలె కుంభకర్ణుడు నేలమీద పడిపోయాడు. కుంభకర్ణుని రెండు కాళ్లు రెండు వైపులకు విసిరివేయబడ్డాయి. అయినా కుంభకర్ణుని పౌరుషము చావలేదు. పాక్కుంటూ, దేక్కుంటూ రాముని వైపుకు వెళుతున్నాడు. రాముడు వాడి అయిన బాణములను కుంభకర్ణుని ముఖం నిండా కొట్టాడు. కుంభకర్ణునికి అరవడానికి కూడా వీలులేదు. ఆ స్థితిలో కుంభకర్ణుడు మూర్ఛపోయాడు.
తరువాత రాముడు ఇంద్ర అస్త్రమును తీసుకున్నాడు. అది వాయువేగము కలది. సూర్యుని వలె ప్రకాశవంతమైనది. ఆ అస్త్రమును రాముడు కుంభకర్ణుని మీద ప్రయోగించాడు. ఇంద్రుని వజ్రాయుధమును పోలిన ఆ అస్త్రము కుంభకర్ణుని మీదికి దూసుకొని వెళ్లింది. కుంభకర్ణుని శిరస్సును ఖండించింది. చేతులు కాళ్లు తల లేని కుంభకర్ణుని మొండెము నేల మీద పడిపోయింది. కిరీటముతోనూ కుండలములతోనూ ప్రకాశిస్తున్న కుంభకర్ణుని తల ఎగిరి ప్రాకారము అవతల పడింది. ఆ శిరస్సు దెబ్బకు లంకా ప్రాకారము కూడా విరిగిపోయింది. లోకకంటకుడైన ఒక మహారాక్షసుని మరణానికి దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు, ఆకాశము నుండి రాముని మీద పుష్పములు కురిపించారు. రాముని పరాక్రమమునకు ఎంతో సంతోషించారు. కుంభకర్ణుడు మరణించడం చూచి రాక్షసులు బిగ్గరగా అరిచారు. ఏడిచారు. భయంతో పరుగెట్టారు. వానరులందరూ సంతోషంతో కేరింతలు కొట్టారు. బిగ్గరగా హర్షధ్వానాలు చేసారు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము అరవై ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment