శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - అరవై ఎనిమిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 68)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

అరవై ఎనిమిదవ సర్గ

కుంభకర్ణుడు మరణించడం కళ్లారా చూచిన రాక్షసులు పరుగు పరుగున లంకా నగరం వైపు పరుగెత్తారు. రావణునికి ఈ వార్త చెప్పారు. “లంకేశ్వరా! మహావీరుడు కుంభకర్ణుడు ఎంతో మంది వానరులను చంపి, భక్షించి, కాలవశమున వీరగతి పొందాడు. కుంభకర్ణుడు తన పరాక్రమమును ప్రదర్శించి, తుదకు రాముని బాణములకు హతమైనాడు. చేతులు, కాళ్లు తెగి పడి, ముక్కు చెవులు కొరకబడి, శిరస్సు తెగి, మాంసపు ముద్ద వలె పడి ఉన్నాడు. ” అని వివరించారు.

కుంభకర్ణుని మరణ వార్త విని రావణుడు నిర్ఘాంత పోయాడు. నేల మీద పడి మూర్ఛపోయాడు. తమ పినతండ్రి మరణించిన వార్త విన్న త్రిశిరుడు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు రోదించారు. మహోదరుడు, మహాపార్శ్వుడు చింతించారు.

రావణునికి తెలివి వచ్చింది. కుంభకర్ణుని తలచుకుంటూ రోదిస్తున్నాడు. "తమ్ముడా కుంభకర్ణా! నీవు శత్రువులను చంపి నాకు సంతోషము కలిగిస్తావు అని అనుకున్నాను కానీ నన్ను విడిచి యముడిని కలుసుకోడానికి పోతావని అనుకోలేదు. నాకు శత్రువులనుండి విముక్తి కలిగించ కుండానే నన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్లిపోయావు. నీ మరణంతో నా కుడిభుజము పడిపోయి నట్టు అయింది. దేవతలను, దానవులను జయించిన వాడివి, నిన్ను ఒక మానవుడు ఎలా చంపగలిగాడో అర్థం కావడం లేదు. దేవేంద్రుడి వజ్రాయుధము కూడా నిన్ను ఏమీ చేయలేకపోయింది. అటువంటిది ఒక మానవుడైన రాముని బాణములకు బలి అయిపోయావా! నీకు ఇంతబలము ఇంత శౌర్యము ఉండి కూడా దైవ వశమున యమలోకమునకు వెళ్లిపోయావా! హంసతూలికా తల్పము మీద తప్ప శయనించని వాడవు, కటికనేలమీద పడి ఉన్నావా! 

దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు ఆకాశంలో నిలబడి నీ మరణ వార్త విని హర్షధ్వానాలు చేస్తున్నారు. నీవు మరణించగానే ఆ వానరులకు అడ్డు ఆపు లేకుండా పోతుంది. లంకానగర ప్రాకారములు ఎక్కి లంకానగరంలోకి ప్రవేశిస్తారు. నీవులేని నాకు ఈ లంకా రాజ్యము ఎందుకు? ఈ సీత ఎందుకు? ఆ రాక్షస సైన్యము ఎందుకు? నీవులేని నాకు ఈ జీవితము మీద కూడా ఆసక్తి లేదు. నా సోదరుడు కుంభకర్ణుని చంపిన రాముని చంపి పగతీర్చుకుంటాను. లేకపోతే నేను జీవించి ఉండి కూడా వృధా! నేను తక్షణం నా తమ్ముడిని చూడాలి. నేను అక్కడకు వెళ్లాలి. నేను నా తమ్ముడిని విడిచి క్షణకాలం కూడా ఉండలేను. నీ అండలేని నన్ను చూచి దేవతలు నవ్వుతారు. పరిహాసం చేస్తారు. నువ్వు లేకుండా నేను మీదికి ఎలా యుద్ధానికి పోగలను. ఇంద్రుని ఎలా జయించగలను. 

ఆనాడు విభీషణుడు చెప్పిన మాటలు నేను నా అజ్ఞానంతో పెడచెవిని పెట్టాను. ఆ మాటలు ఈనాడు నిజం అయ్యాయి. కుంభకర్ణుడు, ప్రహస్తుడు ప్రాణాలు కోల్పోయారు. విభీషణుని మాటలు ఒక్కొక్కటీ నిజం అవుతున్నాయి. నేను నా తమ్ముని అవమానించిన దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. మహావీరుడైన నా తమ్ముడు కుంభకర్ణుని పోగొట్టుకున్నాను." అలా పరి పరి విధాలుగా విలపిస్తూ రావణుడు మూర్ఛపోయాడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము అరవై ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 4)